Saturday, March 29, 2014

ఇక కంపెనీల్లో కనీసం ఒక మహిళా డెరైక్టర్

Sakshi | Updated: March 29, 2014 02:06 (IST)
ఇక కంపెనీల్లో కనీసం ఒక మహిళా డెరైక్టర్
 న్యూఢిల్లీ: కొత్త కంపెనీల చట్టం-2013లోని మరో 10 చాప్టర్లకు సంబంధించిన నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. ముఖ్యంగా ఇందులో కంపెనీ బోర్డులో డెరైక్టర్ల నియామకం, వాళ్లకుండే అధికారాలు-అర్హతలు, బోర్డు సమావేశాలు, డివిడెండ్‌ల ప్రకటన-చెల్లింపు ఇతరత్రా అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఆరు దశాబ్దాలనాటి పాత చట్టం స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త కంపెనీల చట్టం అమల్లోకి రానుంది. కంపెనీల ఏర్పాటు, సెక్యూరిటీల కేటాయింపు, వాటా మూలధనం, డిబెంచర్లు వంటివాటికి సంబంధించిన చాప్టర్లు కూడా కార్పొరేట్ వ్యవహారాల శాఖ నోటిఫై చేసిన చాప్టర్లలో ఉన్నాయి.

 కాగా, 180కి పైగా సెక్షన్లకు సంబంధించి ఇటీవలే ఉత్తర్వులు వెలువడగా, మొత్తం షెడ్యూళ్లన్నింటినీ ఇప్పటికే నోటిఫై చేయడం తెలిసిందే. ఈ కొత్త చట్టంలో మొత్తం 29 చాప్టర్లు, 7 షెడ్యూళ్లు, 470 సెక్షన్లు ఉన్నాయి. మిగతా నిబంధనలను ఎప్పటికల్లా నోటిఫై చేస్తారు, వాటికి కంపెనీలు పాటించేందుకు ఏదైనా అదనపు గడువు ఇస్తారా అనేది వేచిచూడాల్సి ఉందని కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్ ఇండియా ఎల్‌ఎల్‌పీకి చెందిన యోగేష్ శర్మ అభిప్రాయపడ్డారు. గతేడాది ఆగస్టులో ఈ చట్టానికి పార్లమెంట్ ఆమోదముద్ర పడింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో కొత్త కంపెనీల చట్టానికి సబంధించిన ఉత్తర్వుల జారీకి ఈ నెల 20న ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతించింది.

 కంపెనీ బోర్డుల్లో మహిళా వాణి...
 కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం ఇకపై చాలావరకూ కంపెనీలు తమ డెరైక్టర్ల బోర్డులో కనీసం ఒక మహిళకు స్థానం కల్పించాల్సిందే. అదేవిధంగా ఇద్దరు స్వతంత్ర డెరైక్టర్ల నియామకం కూడా తప్పనిసరి. లిస్టెడ్ కంపెనీల్లో చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా తమతరఫున ఒక డెరైక్టర్ కోసం డిమాండ్ చేస్తే నియమించాల్సి వస్తుంది కూడా. రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ పెయిడ్‌అప్ షేర్ క్యాపిటల్ ఉన్న లిస్టెడ్, పబ్లిక్ సంస్థలన్నీ కూడా ఒక మహిళా డెరైక్టర్‌ను నియమించుకోవాలని కొత్త నిబంధనలు నిర్ధేశిస్తున్నాయి.  కాగా, చిన్న షేర్ హోల్డర్ల తరఫున డెరైక్టర్‌ను నియమించాలంటే కనీసం 1,000 మంది లేదా మొత్తం చిన్న వాటాదార్లలో పదింట ఒకటో వంతు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది.

సౌర విద్యుత్తుకు మోకాలడ్డు

ట్రాన్స్‌కో/డిస్కమ్‌లతో ఇబ్బందులు
ప్రభుత్వ విధానం మాత్రం ఆర్భాటం
అమలులో పూర్తిగా విఫలం
ఘొల్లుమంటున్న 'క్యాప్టివ్' యూనిట్లు
ఏపీఈఆర్‌సీ పైనే ఆశలు

Courtesy : ఈనాడు
మన దేశంలో సౌర విద్యుత్తుకు అవకాశాలు అధికం. దీన్ని గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాలు అందిపుచ్చుకున్నాయి. ఎంతో ముందంజ వేశాయి కూడా. కానీ మన రాష్ట్రం మాత్రం వెనుకబడిపోయింది. విధానాల అమల్లో గందరగోళం, అలసత్వం, విద్యుత్తు విభాగాల్లో సానుకూల వైఖరి లేకపోవటం దీనికి కారణాలు. సౌర విద్యుత్తుకు అండగా నిలుస్తూ 2012, సెప్టెంబరులోనే రాష్ట్ర ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ సౌర విద్యుత్ విధానా'న్ని విడుదల చేసింది. పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం.. ఇది ఎంతో అనుకూలమైన విధానం. కానీ అమలులో ఇది పూర్తిగా విఫలమైంది.
ప్రభుత్వ సౌర విద్యుత్ విధానం చూస్తే.. ఎవరైనా ఆహా, ఓహో అనాల్సిందే...! రాష్ట్రంలోని పలు సంస్థలు ప్రభుత్వ విధానానికి మురిసిపోయి.. సొంత (క్యాప్టివ్) సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పాయి. ఇప్పుడవే సంస్థలు నానా అవస్థలు పడుతున్నాయి. 2012 సెప్టెంబరులో 39, 44 జీవోల ద్వారా ప్రత్యేక సౌర విద్యుత్తు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2017 వరకూ ఇది అమల్లో ఉంటుంది. ఈవిధానం ప్రకారం సౌర విద్యుత్ యూనిట్లకు ట్రాన్స్‌మిషన్-వీలింగ్ (విద్యుత్తు ప్రసార, రవాణా) ఛార్జీలుండవు. ఉత్పత్తి చేసిన విద్యుత్తులో వాడుకోకుండా మిగిలిన దానికి 'బ్యాంకింగ్ సదుపాయం' ఉంటుంది. ఈ విధానాన్ని వినియోగించుకోవడానికి 2 శాతం బ్యాంకింగ్ ఛార్జీల కింద చెల్లిస్తే సరిపోతుంది. థర్డ్ పార్టీ విద్యుత్తు అమ్మకానికి క్రాస్ సబ్సిడీ ఛార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. అన్ని సౌర విద్యుత్తు కేంద్రాలకూ విద్యుత్ పన్ను నుంచి మినహాయింపు ఉంది. వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను వాణిజ్య పన్నుల శాఖ తిరిగి చెల్లిస్తుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పరిశ్రమల శాఖ నుంచి తిరిగి చెల్లిస్తారు. అధిక తరుగుదల సదుపాయం ఉండటం, భవిష్యత్తులో విద్యుత్తు యూనిట్ ధర పెరిగినా ఇబ్బంది లేని పరిస్థితి, పెట్టిన పెట్టుబడి అయిదారేళ్లలో వెనక్కి తిరిగొచ్చే అవకాశం... అదనపు ఆకర్షణలు.

అమలు శూన్యం!
రాష్ట్రంలో ఒకటి నుంచి పది మెగావాట్ల వరకూ సామర్థ్యం కల సొంత సౌర విద్యుత్తు యూనిట్లు 30-40 దాకా ఏర్పాటయ్యాయి. సౌర విద్యుత్తుకు ఒక మెగావాట్ సామర్థ్యానికి గతంలో రూ.10-12 కోట్ల వరకూ వెచ్చించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం స్థాపిత వ్యయం రూ.7-7.5 కోట్లకు తగ్గింది. దీంతో పలు సంస్థలు సొంత యూనిట్లు పెట్టుకున్నాయి. ఆ తర్వాత కానీ కష్టాలు తెలిసిరాలేదు. డిస్కమ్/ట్రాన్స్‌కోల నుంచి దీర్ఘకాలిక ఓపెన్ యాక్సెస్ ఒప్పందం (ఎల్‌టీఓఏఏ) ఖరారు కావటానికి యూనిట్ నిర్మాణం పూర్తయి గ్రిడ్‌కు కనెక్ట్ అయిన తర్వాత రెండు మూడు నెలల సమయం పడుతోంది. ఈ లోపు క్యాప్టివ్ యూనిట్లు ఉత్పత్తి చేసే విద్యుత్తు అంతా డిస్కమ్‌ల సొంత ఖాతాలో పడుతోంది. ఆ సంస్థలు వాడుకోవడానికి అవకాశం ఉండట్లేదు. సౌర విద్యుత్తు విధానం ప్రకారం వాడుకోకుండా మిగిలిపోయిన విద్యుత్తుకు 'బ్యాంకింగ్ సదుపాయం' ఇవ్వాలి. దీన్ని ట్రాన్స్‌కో/డిస్కమ్‌లు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ విధానంతో తమకు పనిలేదని, ఏపీఈఆర్‌సీ (ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ సంస్థ) ఆదేశాలనే తాము పాటించాల్సి ఉంటుందని అవి స్పష్టం చేస్తుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిని క్యాప్టివ్ యూనిట్లు ఎదుర్కొంటున్నాయి. ఏదైనా సందర్భంలో గ్రిడ్ నెట్‌వర్క్ పనిచేయక సౌర యూనిట్ల నుంచి విద్యుత్తు తీసుకోలేని పక్షంలో దాన్ని డిస్కమ్‌లు తీసుకున్నట్లుగానే భావించాలని కోరుతుండగా దానికి ఎటువంటి స్పందన లేదు. ఇక వీలింగ్, ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు వసూలు చేయకూడదు. అయినా వసూలు చేస్తున్నారు.

కోట్ల రూపాయల నష్టం
ఓపెన్ యాక్సెస్ ఒప్పందం ఖరారు కావటంలో జరుగుతున్న జాప్యం.. విద్యుత్తు బ్యాంకింగ్ సదుపాయాన్ని అమలు చేయకపోవటం వల్ల సౌర విద్యుత్తు యూనిట్లు కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి. అవి ఉత్పత్తి చేసి వాడుకోగా మిగిలిన విద్యుత్తు అంతా ప్రస్తుతం విద్యుత్తు పంపిణీ సంస్థల ఖాతాల్లోకి వెళ్లిపోతోంది. దీనికి బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించటం పరిష్కారం కాగా.. దాన్ని డిస్కమ్‌లు అమలు చేయటం లేదని ఆయా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సౌరవిద్యుత్తు ప్రతిరోజూ సాయంత్రం వరకు మాత్రమే లభిస్తుంది. ఏదైనా వ్యాపార సంస్థ ఆ తర్వాత విద్యుత్తును వినియోగించుకుంటే దానికి పగలు ఉన్న మిగులు విద్యుత్తును సర్దుబాటు చేయటం లేదు. ఈ విధంగా జరుగుతున్న నష్టం కూడా భారీగా ఉంటోంది. తాము రోజుకు పదివేల యూనిట్లకు పైగా విద్యుత్తును నష్టపోతున్నట్లు ఇటీవల సౌర విద్యుత్తు కేంద్రాన్ని స్థాపించిన సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

అనుమతుల కోసం తంటా
ఇక రాష్ట్రంలో సొంత సౌర విద్యుత్ కేంద్రాన్ని స్థాపించాలంటే దానికి అనుమతుల కోసం ట్రాన్స్‌కో/డిస్కమ్‌ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోవలసిందే. దరఖాస్తు చేసిన నాటి నుంచి సాధ్యాసాధ్యాల నివేదిక, ప్లాంట్ నిర్మాణం, ఓపెన్ యాక్సెస్ ఒప్పందం, మీటర్లు నెలకొల్పటం వరకూ వివిధ దశల్లో విద్యుత్తు కార్యాలయాల చుట్టూ తిరగాలని, డిస్కమ్/ట్రాన్స్‌కోలోని వివిధ విభాగాలు/సెక్షన్లలోని అధికారుల నుంచి వందలాది సంతకాలు తీసుకోవాలని సంబంధిత వర్గాలు వాపోతున్నాయి. ఓపెన్ యాక్సెస్ ఒప్పందం ప్రక్రియ ఏదో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఇచ్చినంత పెద్దదిగా ఉందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సౌర యూనిట్లకు ఈ ప్రక్రియను కుదించాల్సిన అవసరం ఉందని సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ సంస్థ అధిపతి ఒకరు అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చేవారు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ఏపీఈఆర్‌సీ ఆదేశాల కోసం ఎదురుచూపులు
ఈ నేపథ్యంలో క్యాప్టివ్ యూనిట్లు ఇప్పుడు ఏపీఈఆర్‌సీ వైపు చూస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం బ్యాంకింగ్ సదుపాయాన్ని వర్తింపజేయాలని, వీలింగ్/ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు వసూలు చేయరాదని డిస్కమ్‌లను ఏపీఈఆర్‌సీ ఆదేశించాలని కోరుతున్నారు. మరోపక్క వాడుకోకుండా మిగిలిన విద్యుత్తుకు (బ్యాంక్‌డ్ ఎనర్జీ), డిస్కమ్‌లు ఆ ఏడాదిలో వివిధ మార్గాల్లో కొనుగోలు చేసిన సగటు విద్యుత్ ధరలో 50 శాతం చొప్పున చెల్లించాలనే ప్రతిపాదన ఒకటి ఉంది. ఈ సగటు ధర రూ.3-3.50 కంటే ఉండదు. దీన్లో 50 శాతం అంటే, రూ.1.50- 1.75 మాత్రమే. మిగులు విద్యుత్తుకు వాణిజ్య ధర చెల్లించాలి కానీ ఇంత తక్కువ ఇస్తే ఎలాగని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అంశాలను ఏపీఈఆర్‌సీ పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నారు.
వెయ్యి మెగావాట్లు హుళక్కే!
రాష్ట్రంలో 1000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి వీలుగా యూనిట్లు ఏర్పాటు చేసే ఆసక్తిగల సంస్థల నుంచి కు ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియ ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో సౌర విద్యుత్తు యూనిట్ల ఏర్పాటుకు వివిధ సంస్థలు ఇతర రాష్ట్రాల వైపు దృష్టి సారిస్తున్నాయి. దీంతో విద్యుత్తు కొరతను ఎంతోకొంత అధిగమించే అవకాశం చేజారిపోతోంది. జవహర్‌లాల్ సోలార్ ఎనర్జీ మిషన్ (జేఎస్ఈఎం) కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు రెండు దశల్లో 95 మెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యాన్ని మంజూరు చేసింది. కానీ ఇందులో నాలుగో వంతు కూడా అమలు కాలేదు. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 1000 మెగావాట్ల సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని ప్రతిపాదించి, అందుకు 2012 సెప్టెంబరులో టెండర్లు పిలిచింది. దీనికి స్పందించి వచ్చిన బిడ్లలో 184 బిడ్లు సాంకేతికంగా అర్హత సంపాదించాయి. కానీ చివరికి 7 సంస్థలు మాత్రమే యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చాయి. అవి నెలకొల్పాలనుకుంటున్న యూనిట్ల మొత్తం సామర్థ్యం 50-60 మెగావాట్లు మాత్రమే. సౌర విద్యుత్తుకు యూనిట్‌కు రూ.6.49 కొనుగోలు ధరను మంత్రుల బృందం నిర్ణయించగా ఇది ఆకర్షణీయ ధర కాదని పలు సంస్థలు వెనక్కి తగ్గాయి. ఇది ఎంతో తక్కువ ధర అని, ఈ ధరకు ఉత్పత్తి ఎక్కడా సాధ్యం కాదని, కాస్త ఎక్కువ ధర ఇచ్చేందుకు సిద్ధపడితే మరింతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తారని పరిశ్రమ ప్రతినిధి ఒకరు వివరించారు. వేసవిలో, ఇతర సందర్భాల్లో విద్యుత్తు లేక రాష్ట్రంలో యూనిట్ విద్యుత్తును రూ.7-12 వరకూ పెట్టి కొనుగోలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మరోపక్క రూ.6.49 ధరకు యూనిట్లు స్ధాపించేందుకు సిద్ధపడిన సంస్థలతో ఇంతవరకూ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదర్చుకోలేదు. ఈ వ్యవహారం ప్రభుత్వం వద్ద, ట్రాన్స్‌కోలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికలు రావటం, ఆతర్వాత రాష్ట్ర విభజన ఉండటంతో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు వేగంగా ముందుకు సాగే అవకాశం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యం ప్రస్తుతానికి కొండెక్కినట్లే భావించాలి.

వాస్తవానికి రాష్ట్రంలో పెద్దఎత్తున సౌర విద్యుత్తు సామర్థ్యం సమకూర్చుకునేందుకు అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో 1500 మెగావాట్ల వరకూ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించేందుకు అవకాశం ఉందని ఆ వర్గాల కథనం. ఇంకా రిటైల్ వినియోగంలోనూ సౌర విద్యుత్తును ప్రోత్సహించవచ్చు. మెదక్, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, నల్గొండ తదితర జిల్లాల్లో సౌర విద్యుత్తు యూనిట్ల స్థాపనకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. దీన్ని ప్రభుత్వం అందిపుచ్చుకోవలసిన అవసరం ఉంది.

Tuesday, March 11, 2014

హైదరాబాద్‌లో మళ్లీ విమానాల పండుగ

12 నుంచి 16 వరకు బేగంపేటలో..
జీఎంఆర్, జీవీకేలు ప్రధాన ఆకర్షణ

విమానాల పండుగ మళ్లీ వచ్చింది. రెండేళ్లకోసారి వచ్చే శోభాయమానమైన 'ఇండియా ఏవియేషన్ షో' మరోసారి హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకూ అయిదు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనకు బేగంపేట విమానాశ్రయం వేదిక. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఉమ్మడిగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాయి. దిగ్గజాలనదగ్గ విమానయాన కంపెనీలెన్నో ఈ ప్రదర్శనలో పాలుపంచుకోనున్నాయి. విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శనతో పాటు వివిధ పౌర విమానయాన అంశాలపై చర్చాగోష్ఠులు, సీఈఓ ఫోరమ్ నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, సంస్థలకు ఇది విశేష అనుభూతి మిగల్చనుంది. ఈసారి ప్రదర్శనలో 250 మంది ఎగ్జిబిటర్లు పాలుపంచుకుంటారని, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సందర్శకులు విచ్చేస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ హాజరు కావచ్చని తెలుస్తోంది.

పెద్ద వ్యాపారావకాశం...
మనదేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న విమానయాన సదుపాయాలు, సేవలను పరిగణనలోకి తీసుకుంటే ఇదొక పెద్ద వ్యాపారావకాశమని స్పష్టమవుతోంది. అందుకే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రెండేళ్లకోసారి జరిగే ఏవియేషన్ షోలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నాయి. ఈ ఏడాది జరిగేది నాలుగో ప్రదర్శన కాగా, హౖదరాబాద్‌లో ఇది జరగడం రెండోసారి. మనదేశంలో 2016-17 నాటికి విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య 58 కోట్లకు చేరుతుందని అంచనా. దీనికి తగ్గట్లుగా విమానాశ్రయాల నిర్మాణం, విమాన సర్వీసులు, సేవలు విస్తరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.4,662 కోట్ల అంచనా వ్యయంతో దేశంలోని 35 ద్వితీయ శ్రేణి (నాన్- మెట్రో) నగరాల్లోని విమానాశ్రయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విస్తరించటానికి సంసిద్ధమవుతోంది. ఇదేకాకుండా 10 నూతన విమానాశ్రయాల నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిధుల కొరత ఎదురుకాకుండా ఉండటానికి విమానాశ్రయాల సదుపాయాల కల్పనలో నూరు శాతం విదేశీ పెట్టుబడికి కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం విదితమే. మరోపక్క ఈ రంగానికి అవసరమైన మానవ వనరుల లభ్యతను పెంపొందించేందుకు అనువుగా ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ (ఐజీఆర్‌యూఏ)ని దాదాపు రూ.32 కోట్ల వ్యయంతో విస్తరిస్తున్నారు. అంతేగాక మహారాష్ట్రలోని గోండియాలో అధునాతన పైలెట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే ప్రతిపాదించింది. ఇక ఎంఆర్ఓ (మెయింటెనెన్స్- రిపేర్- ఆపరేషన్స్) విభాగంలోనూ వివిధ విమాన సంస్థలు మనదేశానికి కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. హైదరాబాద్‌లో, దేశంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో ఎంఆర్ఓ కేంద్రాలను నెలకొల్పుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న ఏవియేషన్ షోకు విశేష ప్రాధాన్యం కనిపిస్తోంది. ఎంఆర్ఓ పరిశ్రమ 2010లో ఉన్న రూ.2,250 కోట్ల నుంచి 2020 నాటికి రూ.7,000 కోట్లకు పెరుగుతుందని అంచనా. చిన్న సైజు ఏటీఆర్-72 విమానాలను తిప్పటానికి అనువైన నూతన విమానాశ్రయాలు మనదేశంలోని మూడు రాష్ట్రాల్లో నిర్మించాలని అలయన్స్ ఎయిర్ భావిస్తోంది. ఇటువంటి పలు విమానాల తయారీ, విమానాశ్రయాల నిర్మాణం- నిర్వహణ సంస్థలు, ఎంఆర్ఓ సంస్థలు ఈ ప్రదర్శనలో పాలు పంచుకోనున్నాయి. విమానాశ్రయాల నిర్మాణం-నిర్వహణలో రాష్ట్రానికి చెందిన జీవీకే, జీఎంఆర్ సంస్థలు క్రియాశీలకంగా ఉన్న విషయం విదితమే. ఈ సంస్థలు ఏవియేషన్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

బోయింగ్ నుంచి..
విమానాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన బోయింగ్ ఈసారి హైదరాబాద్‌లో జరిగే ఏవియేషన్ షోలో తన సరికొత్త విమానాలను ప్రదర్శించనుంది. వాణిజ్య పౌర విమానాలైన 737-8 మ్యాక్స్, నూతన 777-9ఎక్స్ శ్రేణి, 777-300 ఈఆర్ (ఎక్స్‌టెండెడ్ రేంజ్), 787-8 విమానాలను ప్రదర్శించనున్నట్లు బోయింగ్ వెల్లడించింది. గత ఏడు దశాబ్దాలుగా భారత్‌లో పౌర విమానయాన రంగం విస్తరించటంలో తాము ఎంతో బహుముఖ పాత్ర పోషించామని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏవియేషన్ షోలో తాము పాల్గొనబోతున్నామని బోయింగ్ ఇండియా అధ్యక్షుడు ప్రత్యూష్ కుమార్ వివరించారు. కేవలం విమానాల సరఫరాకు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలో నిర్వహణ- మరమ్మతులు, ఇంజనీరింగ్, నైపుణ్యాల విస్తరణ, విడిభాగాల తయారీతో కూడిన విమానయాన రంగం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయనున్నామని ఆయన పేర్కొన్నారు.
ఎంబ్రార్ సైతం...
ఈసారి ప్రదర్శనలో ఎంబ్రార్ తన ఎగ్జిక్యూటివ్ విమానాలను ప్రదర్శించబోతోంది. ఇందులోని 'లీనియేజ్ 1000ఇ' ఈసారి ప్రధాన ఆకర్షణ కాబోతోంది. ఇంకా లెగసీ 650, ఫెనామ్ 300, ఫెనామ్ 100 జెట్స్ కూడా ప్రదర్శనలో ఉంటాయి. బిజినెస్ విమానయాన విపణిలో 2000వ సంవత్సరంలో ఎంబ్రార్ ప్రవేశించింది. అక్కడి నుంచి ఎంతోవేగంగా తన విమానాల శ్రేణిని విస్తరించింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో సర్వీసు కేంద్రాలు, విడిభాగాల పంపిణీ కార్యకలాపాలు ఉన్నాయి. ప్రస్తుతం 50 దేశాల్లో 700 ఎంబ్రార్ ఎగ్జిక్యూటివ్ జెట్‌లు విమానయాన సేవలు అందిస్తున్నాయి.
ఎయిర్‌బస్ ఎ380
ఎయిర్‌బస్ నుంచి అందుబాటులో ఉన్న విమానాల్లో ఎ380కి ఉన్న ఆకర్షణే వేరు. ఏవియేషన్ షోలో భాగాంగా స్వయంగా ఎ380 విమానాన్ని పూర్తిగా చూసే సదుపాయాన్ని అగ్రశ్రేణి విమానయాన సేవల సంస్థ అయిన ఎమిరేట్స్ కల్పించనుంది. ఈ లగ్జరీ విమానంలోని కళ్లు చెదిరే రీతిలో అధునాతన సౌకర్యాలు, ఫస్ట్‌క్లాస్ ప్రైవేట్ సూట్లు సందర్శకులకు అరుదైన అనుభూతిని మిగులుస్తాయి. దీన్ని చూసే అవకాశాన్ని సందర్శకులకు కల్పించేందుకు ఎమిరేట్స్, ఎయిర్‌బస్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బంబార్డియర్ 'ఛాలెంజర్ 605'
అటు రైళ్లు, ఇటు విమానాలు తయారు చేసే ఏకైక సంస్థ బంబార్డియర్. ఇది కూడా హైదరాబాద్‌లో జరిగే ఏవియేషన్ షోలో తన 'ఛాలెంజర్ 605' బిజినెస్ జెట్‌ను ప్రదర్శించనుంది. ఛాలెంజర్ 604 తర్వాత వచ్చిన ఆధునిక బిజినెస్ జెట్ విమానం ఇది. 12 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో ఏకబిగిన ఢిల్లీ నుంచి ఏథెన్స్ కు ఎక్కడా ఆగకుండా ప్రయాణించగల సత్తా ఈ విమానం సొంతం. ఇదే కాకుండా ఇంకా భారతీయ మార్కెట్‌కు అనువైన ఇతర వాణిజ్య విమానాలను సైతం ప్రదర్శించనున్నట్లు బంబార్డియర్ ప్రకటించింది. అయితే బిజినెస్ జెట్ విమానాలపై ప్రధానంగా ఈ సంస్థ దృష్టి సారిస్తోంది. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో భారత్, చైనాతో సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 4,740 విమానాల విక్రయానికి అవకాశం ఉన్నట్లు, ఇందులో 1,340 బిజినెస్ జెట్ విమానాలు ఉంటాయని బంబార్డియర్ అంచనా. తేలికపాటి చిన్న బిజినెస్ జెట్ ల నుంచి పెద్దవైన దీర్ఘకాలిక ప్రయాణానికి అనువైన విమానాల తయారీలో నిమగ్నమై ఉన్న బంబార్డియర్ ఇది తనకు అనుకూల పరిణామంగా భావిస్తోంది. ఈ దిశగా మనదేశంలో జరిగే ఏవియేషన్ షోకు అత్యంత ప్రాధాన్యమిస్తూ, తన ఉత్పత్తులు- సేవలను ప్రదర్శించబోతోంది.

డాలర్ భారం

విమానాల నిర్వహణ వ్యయంలో 70 శాతంపై ప్రభావం
ఈనాడు - హైదరాబాద్ దేశీయంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన పరిశ్రమపై డాలర్ ప్రభావం అధికం. విమానాల కొనుగోలు, నిర్వహణలపై విమానయాన కంపెనీలు చేసే వ్యయంలో సిబ్బందికి వేతనాలు వంటివి మినహా 70 శాతానికి పైగా ఖర్చులు డాలర్‌పైనే ఆధారపడి ఉంటున్నాయి. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ బాగా పెరగడంతో దేశీయంగా విమానయాన సంస్థల నష్టాలకు ఇదీ ఒక కారణం అవుతోంది.

విమానాల కొనుగోలు అనంతరం రోజువారీ కార్యకలాపాలకు వైమానిక ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్.. ఏటీఎఫ్), విడిభాగాల కొనుగోలుకు, కాలక్రమంలో సర్వీసింగ్‌కు డాలర్ రూపేణా చెల్లింపులు జరపవలసి వస్తోంది. విమానయాన సంస్థలు జరిపే చెల్లింపుల్లో 70 శాతం వరకు డాలర్ రూపంలోనే ఉంటాయని పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి అశోక్ కుమార్ 'ఈనాడు'తో చెప్పారు. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ గణనీయంగా పెరగడం, సంస్థలపై అధిక ప్రభావం చూపుతోందని తెలిపారు. ఏటీఎఫ్‌పై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సుంకం కూడా వేర్వేరుగా ఉంటోందని తెలిపారు. ఈ మొత్తాన్ని తగ్గించాలని, ఒకే రకంగా ఉంచాలని సూచిస్తున్నా, తమకు ఆదాయమార్గం కనుక రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కిలోలీటరు ఏటీఎఫ్ ధర కోల్‌కతాలో రూ.87,000 కాగా, బ్యాంకాక్‌లో రూ.50,000 మాత్రమే అవుతోందని చెప్పారు. తమిళనాడులో ఏటీఎఫ్‌పై వ్యాట్ 30 శాతం వరకు, రాష్ట్రంలో 16 శాతం వరకు ఉందని వివరించారు. ఫలితంగా దేశీయ గమ్యస్థానాలకు నడుస్తున్న విమానయాన కంపెనీలపై అధిక భారం పడుతోందని, విదేశాల నుంచి వచ్చేవాటికి తక్కువ వ్యయం అవుతోందని చెప్పారు. విదేశాల్లో పన్నులు తక్కువగా ఉండడం దీనికి కారణం.

విమానాశ్రయాల్లో ఛార్జీలు కూడా భారమే
దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారికి కూడా విమానాశ్రయాల్లో రుసుములు భారంగా మారుతున్నాయని అశోక్‌కుమార్ చెప్పారు. కొన్ని విమానాశ్రయాల్లో ల్యాండింగ్, రాత్రి పార్కింగ్ ఛార్జీలు అధికంగా ఉంటున్నాయని, ఈ భారం ప్రయాణికులపైనే పడుతుందన్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులపై నేరుగా అభివృద్ధి రుసుం, సెక్యూరిటీ వంటి ఇతర రుసుములు ఉంటున్నాయని, ఈ భారం తగ్గితే ప్రయాణికుల సంఖ్య మరింత వేగంగా వృద్ధి చెందుతుందని వివరించారు.
2020 నాటికి మూడో స్థానం!
40కి పైగా విమానాశ్రయాలు, 400కు పైగా విమానాలతో అంతర్జాతీయంగా 9వ స్థానంలో భారత విమానయాన పరిశ్రమ నిలిచింది. ప్రస్తుతం దేశీయ గమ్యస్థానాలకు 12.10 కోట్ల మంది, 4.10 కోట్లమంది విదేశాలకు విమానాల్లో రాకపోకలు సాగిస్తున్నారని అంచనా. 2020 నాటికి ఈ రంగంలో అమెరికా, చైనా తరవాత మూడో స్థానానికి మన దేశం చేరుతుందని అంచనా. 2020 నాటికి విమానాల్లో దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య 33.60 కోట్లకు, విదేశాలకు వెళ్లే వారి సంఖ్య 8.50 కోట్లకు చేరుతుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేస్తోంది. రాబోయే 20 ఏళ్లలో దేశీయ విమానయాన రంగంలో వృద్ధి అత్యంత వేగవంతంగా ఉంటుందని దిగ్గజ సంస్థలన్నీ అంచనా వేస్తున్నాయి.

భవిష్యత్తులో వృద్ధి చిన్న నగరాల నుంచే
ప్రస్తుతం విమాన ప్రయాణికుల్లో 30 శాతం రెండో అంచె నగరాలు, మూడో అంచె నగరాల నుంచీ వస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో మొత్తం ప్రయాణికుల్లో 45 శాతం చిన్న నగరాల నుంచే ఉండవచ్చని అంచనా. ఈ నగరాలకు చిన్నపాటి విమానాలు నిర్వహిస్తేనే లాభదాయకం అని కంపెనీలు భావిస్తున్నాయి. రుసుములు తక్కువగా ఉంటే, టికెట్టు ధరను కూడా తక్కువగా నిర్ణయించవచ్చన్నది విమానయాన సంస్థల ఆలోచన. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా- ఏఏఐ) నేతృత్వంలో చిన్న విమానాశ్రయాలుంటే, వీరికి ఛార్జీల రుసుం తక్కువగా ఉంటుంది. ప్రస్తుత 12వ పంచవర్ష ప్రణాళికలో రూ.1,500 కోట్లతో చిన్న నగరాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఏఏఐ తగిన సన్నాహాలు చేస్తోంది.

Saturday, March 8, 2014

మూడేళ్లకే బైక్ మార్చేస్తున్నారు!

Sakshi | Updated: March 08, 2014 01:12 (IST)
మూడేళ్లకే బైక్ మార్చేస్తున్నారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘వ్యూహం అంటూ లేకుండా వాహన రంగంలో నిలదొక్కుకోలేం. బజాజ్ ఆటో భారతీయ కంపెనీయే. కానీ మేం ఇక్కడితో పరిమితం కాలేదు. 30కి పైగా దేశాలకు వాహనాలను సరఫరా చేస్తున్నాం. మా దృష్టి భారత్‌తోసహా అన్ని మార్కెట్లపైనా ఉంటుంది. ఒక దేశం కోసం అంటూ వాహనాలను తయారు చేయం’ అని అంటున్నారు బజాజ్ ఆటో కంపెనీ, మోటార్ సైకిల్  విభాగపు ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్. సరికొత్త డిస్కవర్ 125 బైక్‌ను ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. కస్టమర్ల అభిరుచులు, కంపెనీ భవిష్యత్ కార్యాచరణ, మార్కెట్ తీరుతెన్నులు ఆయన మాటల్లోనే..
 మూడేళ్లయితే చాలు..
 దక్షిణాదివారైనా, ఉత్తరాదివారైనా మోటార్ సైకిళ్ల విషయంలో భారతీయ కస్టమర్ల అభిరుచులు దాదాపు ఒకేలా ఉన్నాయి. స్టైల్, మంచి పవర్ ఉన్న బైక్‌లపై మక్కువ పెరుగుతోంది. గతంలో ఒకసారి బైక్ కొంటే ఏడెనిమిదేళ్లు వాడేవారు. ఐదేళ్ల క్రితం వరకు ఈ ట్రెండ్ ఉండేది. ఇప్పుడు మూడు నాలుగేళ్లకే వాహనం మారుస్తున్నారు. రెండేళ్లుగా సెంటిమెంట్ బాగోలేదు. ఉద్యోగం ఉంటుందో లేదో అన్న ఆందోళనలో ఉంటే కొత్త బైక్ కొనలేరుగా. అందుకే ద్విచక్ర వాహన పరిశ్రమ స్తబ్దుగా ఉంది. వచ్చే ఏడాది వృద్ధి ఖాయం. ఎక్సైజ్ డ్యూటీని 12 నుంచి 8 శాతానికి కుదించడం మంచి పరిణామం. కొత్త ప్రభుత్వం ఈ తగ్గింపు సుంకాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం. మా వాహనాల ధరను రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు తగ్గించాం.

 స్కూటర్ తెచ్చే ఆలోచనే లేదు..
 ప్రపంచంలో అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో 80 శాతం మోటార్ సైకిళ్లే. ప్రపంచ వ్యాప్తంగా మోటార్ సైకిళ్ల విభాగంలో బ జాజ్‌కు 10 శాతం వాటా ఉంది. అందుకే మోటార్ సైకిల్ కంపెనీగా మాత్రమే మేం కొనసాగుతాం. స్కూటర్ తయారు చేసే ఆలోచన ఏ మాత్రం లేదు. ఏటా 48 లక్షల బైక్‌లను తయారు చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది. ప్లాంట్ల యుటిలైజేషన్ 85 శాతం. ఇందులో ఎగుమతుల వాటా 33 శాతం. దేశంలో మోటార్ సైకిళ్లలో 22 శాతం వాటా బజాజ్‌కు ఉంది. కొత్త డిస్కవర్ 125 రాకతో ఇది 30 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం.

 ఆ మూడింటిపైనే..
 క్రూయిజర్ బైక్ అయిన అవెంజర్ 220 హోట్ కేక్‌లా అమ్ముడుపోతోంది. ప్రస్తుతానికి అవెంజర్ బ్రాండ్‌లో ఈ ఒక్క మోడల్‌నే కొనసాగిస్తాం. కొత్త వేరియంట్లు ఏవైనా పల్సర్, ప్లాటినా, డిస్కవర్.. ఈ మూడు బ్రాండ్లలో మాత్రమే విడుదల చేస్తాం.

 ఏపీలో ఎక్కువ కాబట్టే..
 దేశంలో నెలకు 1.6 లక్షల బైక్‌లు 125 సీసీ సామర్థ్యం గలవి అమ్ముడవుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 17 శాతముంది. ఈ కారణంగానే భారత్‌లో తొలిసారిగా కొత్త డిస్కవర్ 125ని హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించాం. 100 సీసీ బైక్‌లు కేవలం మైలేజీకే పరిమితం. 7.5-8 హార్స్‌పవర్‌ను ఇవి మించడం లేదు. మైలేజీ మినహా మరే ఇతర ప్రయోజనం లేదు. 20 ఏళ్లుగా ఈ విభాగంలో పెద్దగా సాంకేతిక అభివృద్ధి జరగలేదు. అధిక సామర్థ్యం గల బైక్ కొనాలని ఉన్నా ఖర్చు ఎక్కువని, మైలేజీ రాదని కస్టమర్లు మిన్నకుండి పోతారు. వీరికోసమే స్టైల్, పవర్, మైలేజీ కలిగిన కొత్త డిస్కవర్ 125ను పరిచయం చేశాం. 11.5 పీఎస్ పవర్, మైలేజీ 76 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ 100 కిలోమీటర్లు. డ్రమ్ బ్రేక్ మోడల్ ధర హైదరాబాద్ ఎక్స్ షోరూంలో రూ.49,075. డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంది. ఆరు రకాల ఆకర్షణీయ రంగుల్లో ఇది లభిస్తుంది.

విండోస్ ‘దేశీ’ మొబైల్స్!

Sakshi | Updated: March 07, 2014 00:58 (IST)
విండోస్ ‘దేశీ’ మొబైల్స్!
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విండోస్ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకు దేశీయ మొబైల్ ఫోన్ కంపెనీలు సైతం రంగంలోకి దిగాయి. అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లను అందించి భారత మొబైల్ ఫోన్ రంగంలో దూసుకెళ్తున్న ఈ కంపెనీలు.. ఇక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) ఆధారిత స్మార్ట్‌ఫోన్లపై దృష్టిపెట్టాయి. దిగ్గజ కంపెనీ నోకియాను సైతం ఆన్‌డ్రాయిడ్ మార్కెట్లోకి దింపిన భారతీయ బ్రాండ్లు కొత్త సంచలనాలకు రెడీ అవుతున్నాయి. కస్టమర్ల ముంగిటకు కొత్త కొత్త విండోస్ ఫోన్లు అదీ రూ.10 వేల లోపే తేబోతున్నాయి.

 తక్కువ ధరకే విండోస్ ఫోన్లు..
 ఓపెన్ సోర్స్ వేదిక కావడంతో చాలా కంపెనీలు ఆండ్రాయిడ్  ఓఎస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అందుకే మొత్తం స్మార్ట్‌ఫోన్లలో వీటి వాటా  78.9% ఉంది. విండోస్ ఓఎస్ లెసైన్సు రుసుమును మైక్రోసాఫ్ట్ గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయని  కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజ సాక్షికి చెప్పారు. అదే జరిగితే మరిన్ని కంపెనీలు ఈ రంగంలోకి అడుగు పెట్టడం ఖాయం. అంతేకాదు రూ.10 వేల లోపే విండోస్ ఫోన్లు లభించవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ప్రస్తుతం విండోస్ వాటా 3.9 శాతమే. 2018కల్లా ఇది 7 శాతానికి చేరుతుందని పరిశోధనా సంస్థ ఐడీసీ అంచనా వేస్తోంది. ఆన్‌డ్రాయిడ్ మార్కెట్ ప్రస్తుతమున్న 78.9 నుంచి 76 శాతానికి చేరుతుందని వెల్లడించింది. ఆపిల్ ఐఓఎస్ 14.9 నుంచి 14.4 శాతానికి తగ్గుతుందని వివరించింది.

 జోలో బ్రాండ్ ఇటీవలే విండోస్ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించి ఈ విభాగంలోకి ప్రవేశించిన తొలి భారతీయ బ్రాండ్‌గా నిలిచింది. కొద్ది రోజుల్లో విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా తేబోతోంది. మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్‌కాన్‌లు కూడా కొద్ది రోజుల్లో విండోస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నాయి. కొద్ది రోజుల క్రితం మైక్రోసాఫ్ట్‌తో చైనా కంపెనీ జియోనీ చేతులు కలిపింది. ఆన్‌డ్రాయిడ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ రెండూ కలిగిన స్మార్ట్‌ఫోన్లను కార్బన్ మొబైల్స్ జూన్‌కల్లా ప్రవేశపెడుతోంది.

 రూ.6 వేలకే సెల్‌కాన్ విండోస్ ఫోన్లు..
 తొలుత 4, 5 అంగుళాల్లో విండోస్ ఫోన్లను సెల్‌కాన్ తేనుంది. వీటిని రూ.6-7 వేలకే పరిచయం చేయాలని భావిస్తున్నట్టు సెల్‌కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. మే నాటికి ఇవి మార్కెట్లో ఉంటాయని చెప్పారు. ఈ నెలలోనే మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు వివరించారు. ఆన్‌డ్రాయిడ్, విండోస్ డ్యూయల్ ఓఎస్ ఫోన్లు పరిశోధన, అభివృద్ధి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మంచి ఫీచర్లతో మోడళ్లకు రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు.

అందుబాటు గృహాలకు ఇదీ మార్గం!

Sakshi | Updated: March 08, 2014 01:28 (IST)
అందుబాటు గృహాలకు ఇదీ మార్గం!
 సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ, ఆ కల సాకారం కావాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. మరి సామాన్య, మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్‌లో సొంతిల్లు  కొనుక్కోవటం కష్టమా? పోనీ.. అందుబాటు గృహాలను అందించేందుకు ముందుకొచ్చే నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందా అంటే అదీ ఉండదంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇంకా ఏమంటున్నారంటే..
  కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ లెక్కల ప్రకారం.. మన దేశంలో దాదాపు 2.65 కోట్ల ఇళ్ల కొరత ఉంది. 2020 నాటికి ఇది మూడు కోట్లకు చేరుకునే అవకాశముందని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. దశాబ్దం నుంచి పెరిగే జనాభా కారణంగా నగరాల్లో స్థల లభ్యత దారుణంగా తగ్గింది. ఫలి తంగా ఇళ్ల కొరత రోజురోజుకూ పెరుగుతోంది. మంచినీరు, విద్యు త్తు, ఖాళీ స్థలాలూ లేని మురికివాడలు అధికంగా వెలుస్తున్నాయి.

  ఆర్థిక నియంత్రణ, నగరీకరణ వంటి అంశాల్లో ఎదురయ్యే అవాంతరాలతో.. చౌక గృహాల నిర్మాణం పుంజుకోవట్లేదు. ఒకవైపు భూముల ధరలు ఆకాశాన్నంటాయి. మరోవైపు నిర్మాణ వ్యయమూ  పెరిగింది. ఈ రెండింటి ప్రభావం అందుబాటు గృహాల నిర్మాణం మీద పడుతోంది. దీంతో పలు నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించడానికీ ముందుకు రావట్లేదు. శివారు ప్రాంతాల్లో తక్కువ ధరకే ఫ్లాట్లను అందించాలని మొదలుపెట్టినవారూ అయిష్టంగానే ధరలు పెంచాల్సిన దుస్థితి నెలకొంది.

  సామాన్యులకు బ్యాంకు ఖాతాలుండవు. ఒకవేళ ఉన్నా క్రమం తప్పకుండా లావాదేవీలను నిర్వహించరు. కొందరికేమో పాన్ కార్డులుండవు. చిన్నాచితకా ఉద్యోగాలు చేయడంతో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయరు. దీంతో బ్యాంకులు గృహరుణాల్ని మంజూరు చేయవు. కాబట్టి ఆర్‌బీఐ ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరముంద ని నిపుణులు సూచిస్తున్నారు.
  మనకంటే చిన్నదేశాలైన సింగపూర్, హాంకాంగ్, మలేసియా వంటివి ముందంజలో ఉన్నాయి. స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్స్ తదితర దేశాలు అందుబాటు గృహాల్ని నిర్మించడంలో స్పష్టమైన ప్రణాళికల్ని పాటిస్తున్నాయి.

అక్కడి నిర్మాణ సంస్థల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త విధానాల్ని రూపొందిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలకు మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. అదే మన దేశంలో చూస్తే.. ‘ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి’ అన్న చందంగా ఉంది. దేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర సంస్థలకు స్థలాలున్నాయి. మరి, ఈ సంస్థలేం చేస్తున్నాయంటే.. వేలం ద్వారా ఆయా స్థలాల్ని విక్రయిస్తున్నాయి. మార్కెట్లో కృత్రిమ గిరాకీని సృష్టిస్తున్నాయి.

  అందుబాటు గృహాల విస్తీర్ణం తక్కువుండేలా చూడటం, క్రాస్ సబ్సిడీలను అందించడం, ప్రోత్సాహకాల్ని ప్రకటించడం, ఇళ్ల సరఫరా, గిరాకీకి అనుగుణంగా రాయితీల్ని ఇవ్వడం వంటి పథకాల్ని ప్రకటించాలి. అప్పుడే నిర్మాణ సంస్థలు ముందుకొస్తాయి. ప్రభుత్వ స్థలాల్లో అందుబాటు గృహాల్ని నిర్మించి నామమాత్రపు ధరకే విక్రయిస్తే సామాన్యులెందరో కొనుగోలు చేస్తారు. కనీసం ఇలాగైనా ఇళ్ల కొరత తీరుతుందని నిపుణులంటున్నారు.

మన్నికగా కడితేనే.. మార్కెట్లో గిరాకీ!

Sakshi | Updated: March 08, 2014 01:32 (IST)
సాక్షి, హైదరాబాద్: పైసా పైసా కూడబెట్టుకొని సొంతింటిని కొనేందుకు ముందుకొస్తారు సామాన్యులు. అలాంటి వారికి నాణ్యమైన ఇళ్లను అందించడం బిల్డర్ల బాధ్యత. అందుకే ఎక్కడ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినా నిర్మాణంలో ఎలాంటి రాజీపడకుండా నాణ్యమైన నిర్మాణ సామగ్రినే వినియోగిస్తాం అంటున్నారు ట్రాన్స్‌కాన్ లైఫ్‌స్పేసెస్ ప్రై.లి. ఎండీ శ్రీధర్‌రెడ్డి.

  ఫిర్జాదిగూడలో ఎకరం విస్తీర్ణంలో ‘ప్రగతి అవెన్యూ’ పేరుతో ప్రీమియం అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 70. అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ఎందుకంటే కొనుగోలుదారులందరి జీవన శైలి ఒకేలా ఉండాలి. భవిష్యత్తులో నిర్వహణ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులుండొద్దు.

  రూ. 15 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఏసీ జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, 270 గజాల్లో ల్యాడ్ స్కేపింగ్, అంపి థియేటర్, 4 వేల చ.అ. విస్తీర ్ణంలో క్లబ్ హౌస్, విశాలమైన పార్కింగ్, కార్ డ్రైవర్లకు ప్రత్యేకమైన రెస్ట్ రూములు వంటి సౌకర్యాలెన్నో కల్పిస్తున్నాం. చ.అ. ధర రూ. 2,650గా చెబుతున్నాం. 2015 మే కల్లా నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం.

  భువనగిరిలో ఏరియా ఆసుపత్రి పక్కనే ‘ట్రాన్స్‌కాన్ లక్ష్మీ నరసింహా రెసిడెన్సీ’ పేరుతో మరో ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నాం. 2 వేల గజాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 35 ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ. 2,250.

  చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ల్యాడ్ స్కేపింగ్‌లతో నివాసితులకు గాలి, వెలుతురు విశాలంగా వచ్చేందుకు వీలుగా ఫ్లాట్ల గోడకు గోడకు మధ్య ఆరున్నర ఫీట్ల స్థలాన్ని వదులుతున్నాం. టైల్స్, రంగులు, లిఫ్ట్, సిమెంట్, బాత్ రూమ్ ఫిట్టింగ్స్.. ఇలా నిర్మాణ సామగ్రి అంతా నాణ్యమైనవే వినియోగిస్తున్నాం.

నవతరానికి నయా ఫ్లాట్లు

Sakshi | Updated: March 08, 2014 04:21 (IST)
నవతరానికి నయా ఫ్లాట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతికూల పరిస్థితుల్లో కూడా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతున్న ప్రాంతాల్లో ఉప్పల్ ఒకటి. అందుకే ఇక్కడ  అందుబాటు ధరల్లో నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ‘సాయి సత్య నిలయం’కు శ్రీకారం చుట్టినట్లు వినాయక బిల్డర్స్, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. పద్మా రెడ్డి చెప్పారు.

ఇంకాఏమన్నారంటే..
- శంకర్‌నగర్‌లో 2,400 గజాల్లో ‘సాయి సత్య నిలయం’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 50 ఫ్లాట్లొస్తాయి. 2 బీహెచ్‌కే:45, 3 బీహెచ్‌కే:5 ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ. 2,450.

- ఇప్పటికే ఉప్పల్ ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్‌లతో కిటకిటలాడుతోంది. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో మరిన్ని ఐటీ కంపెనీలు ఇక్కడికి రానున్నాయి. దీనికితోడు ఉప్పల్ ప్రాంతంలో త్వరలోనే మెట్రో రైల్ ప్రారంభం కానున్నందున సమీప భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

- మొత్తం స్థలంలో 30 శాతం స్థలాన్ని పచ్చదనం, ఇతరత్రా సదుపాయాలకు కేటాయించాం. ఆర్‌ఓ ప్లాంట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మల్టీపర్పస్ హాల్ (ఏసీ), ల్యాడ్‌స్కేప్, 24 గంటలూ సీసీ కెమెరాలతో నిఘా, చుట్టూ సోలార్ ఫెన్సింగ్, అత్యాధునిక జిమ్, వాకింగ్ ట్రాక్ వంటి ఆధునిక వసతులెన్నో కల్పిస్తున్నాం. 2015 చివరినాటికి కొనుగోలుదారుల చేతికి ఇంటి తాళాలందిస్తాం.

సీఐఐ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్‌గా సురేష్ రాయుడు

వైస్‌ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన వనితా దాట్ల

ఈనాడు, హైదరాబాద్: భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆంధ్ర ప్రదేశ్ ఛైర్మన్‌గా 2014-15 సంవత్సరానికి సురేష్ రాయుడు చిట్టూరి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన సీిఐఐ- ఏపీ వార్షిక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. వైస్-ఛైర్‌పర్సన్‌గా వనితా దాట్లను ఎన్నుకున్నారు. సురేష్ రాయుడు చిట్టూరి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న శ్రీనివాసా హ్యాచరీస్ గ్రూపు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. బెంగుళూరు ఆర్‌వీ కాలేజీలో ఇంజినీరింగ్ చదివిన ఆయన అనంతరం అమెరికా వెళ్లి అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌లలో కొన్ని స్వల్పకాలిక కోర్సులు కూడా చేశారు. వైస్-చైర్‌పర్సన్‌గా ఎన్నికైన వనితా దాట్ల హైదరాబాద్‌కు చెందిన ఎలికో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్ఓగా ఉన్నారు. ఆమె సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బి.ఏ. అభ్యసించారు. కొన్ని కంప్యూటర్ కోర్సులు చేశారు. అంజనీ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్, రాశి ఫైనాన్స్ తదితర సంస్థల్లో డైరెక్టరుగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.