Monday, December 31, 2012

'క్లిఫ్’ అంచున అమెరికా!


ఆఖరి నిమిషంలో డీల్ కోసం చట్టసభల సభ్యుల ముమ్మర యత్నాలు
విఫలమైతే జనవరి 1 నుంచి అమల్లోకి ‘ఫిస్కల్ క్లిఫ్’
భారీగా పన్నుల పెంపు, వ్యయాల్లో కోత భయాలు


వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా... ఇప్పుడు ‘ఫిస్కల్ క్లిఫ్’ అంచున వేలాడుతోంది. 2012 సంవత్సరం కనుమరుగయ్యేందుకు ఇక గంటల వ్యవధే మిగిలి ఉంది. 2013 జనవరి 1 ప్రారంభమవుతూనే అక్కడి ప్రజలు, కంపెనీలపై పన్నుల భారం రూపంలో వడ్డింపు కూడా మొదలవుతుంది. బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నుల పెంపు, భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యయాల్లో కోత అమల్లోకి వచ్చేస్తుంది(దీన్నే ఫిస్కల్ క్లిఫ్‌గా వ్యవహరిస్తున్నారు). గడిచిన కొద్ది వారాలుగా దీన్ని నివారించడం కోసం అక్కడి ప్రభుత్వం, విపక్షాల మధ్య జరుగుతున్న చర్చల్లో ఎలాంటి ఫలితం లేకపోవడంతో... ఇక ఆఖరి నిమిషంలో డీల్‌పైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.

అమెరికా చట్టసభల సభ్యులు(సెనేట్, ప్రతినిధుల సభ) ఆదివారం, సోమవారం 36 గంటల పాటు ప్రత్యేక సెషన్లను నిర్వహిస్తున్నారు. డెమోక్రాట్‌ల ఆధిపత్యం ఉన్న సెనేట్‌లో ఇరు పార్టీలకు చెందిన నాయకులు శనివారం కూడా విస్తృత చర్చల్లో మునిగితేలారు. అటు డెమెక్రాట్‌లకు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)లో మెజారిటీ కలిగిన రిపబ్లికన్‌లకు సైతం ఆమోదనీయమైన ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరు సభల సభ్యులూ ఫిస్కల్ క్లిఫ్ నివారణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చించి, ఒప్పందాన్ని ఆమోదించేందుకు చాలా కొద్ది సమయమే మిగిలిఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

భయాలు ఇవీ: ఫిస్కల్ క్లిఫ్ గనుక అమల్లోకి వస్తే... ప్రజలు, కార్పొరేట్లపై పన్ను భారం పెరిగి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారిపోవచ్చనేది ఆర్థిక వేత్తల ఆందోళన. అమెరికా చరిత్రలోనే ఏకమొత్తంలో అతిపెద్ద పన్నుల పెంపునకు ఈ ఫిస్కల్ క్లిఫ్ కారణమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 500 బిలియన్ డాలర్ల మేర ప్రజలపై భారం పడుతుందని ఆర్థిక వేత్తలు లెక్కకడుతున్నారు.

దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రతికూలత చూపుతుందని వారి వాదన. ఇప్పటికే 2008-09 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి రికవరీ కోసం నానాతంటాలూ పడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది శరాఘాతమేనని స్పష్టం చేస్తున్నారు. మరోపక్క, అమెరికా కాంగ్రెస్(ఇరు సభల ప్రతినిధులు) దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదానిపై ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలోనూ ఆందోళన కనబడుతోంది. ఈ గండం నుంచి అమెరికా ఎలా గట్టెక్కుతుందోనని ఇన్వెస్టర్లు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఫిస్కల్ క్లిఫ్ సంగతిదీ...
అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ల పార్టీకి చెందిన జార్జి బుష్ హయాంలో ప్రజలకు పన్నుల ఉపశమనం కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. వీటిని డెమెక్రాట్‌లకు చెందిన ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా నేతృత్వంలోని ప్రభుత్వం కూడా 2010లో తాత్కాలిక ప్రాతిపదికన పొడిగించింది. ఈ చర్యల గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో తీరిపోతుంది. అంటే... 2013 జనవరి 1 నుంచి ఆటోమేటిక్‌గా పన్నుల పెంపు, ప్రభుత్వ వ్యయాల్లో కోత అమల్లోకి వచ్చేస్తుంది. ఈ పరిణామాన్నే ఫిస్కల్ క్లిఫ్‌గా వ్యవహరిస్తున్నారు. దీన్ని నివారించేందుకే ఇప్పుడు చివరి ప్రయత్నాలు జరుగుతున్నాయి..

ఎవరి వాదనలు ఏంటి...
రిపబ్లికన్ పార్టీ సభ్యులు పన్నుల పెంపునకు మొదటి నుంచీ ససేమిరా అంటున్నారు. దీనికి బదులు పన్నుల వసూళ్లలో ఇప్పుడున్న లోటుపాట్లను పూడ్చుకొని ఆదాయాన్ని పెంచుకోనేలా మార్గాలు అన్వేషించాలనేది వారి సూచన. మరోపక్క, సామాజిక భద్రత ఇతరత్రా పథకాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న వ్యయాల్లో భారీగా కోత విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా, ఒబామా మాత్రం ఆదాయ పెంపునకు వీలుగా ధనికులపై పన్నులు పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు.

గడువు లోగా ఒకవేళ ఇరు పార్టీలు గనుక ఒక ఒప్పందానికి వచ్చి.. రాజీ నిర్ణయం తీసుకోనిపక్షంలో పన్ను చెలిపుదార్లందరికీ ఈ తప్పనిసరిగా పెరుగుదల అమల్లోకి వచ్చేస్తుంది. కాగా, ఒబామా ప్రతిపాదిత డీల్ కుదిరినప్పటికీ, ఇది ఇరు సభల్లోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక్కడే సమస్య నెలకొంది. రిపబ్లికన్లలో డెమోక్రాట్ వ్యతిరేకులు దీనికి అంగీకరిస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. కాగా, సమయం ఇక మించిపోతుండటంతో డిసెంబర్ 31 డెడ్‌లైన్ అమలులోకి రాకుండా, ప్రత్యామ్నాయంగా జనవరిలో దీనికి పూర్తి పరిష్కారం కోసం అంగీకారం కుదరవచ్చని కూడా మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. పన్నుల పెంపులో కొంత తగ్గింపు, ఏ స్థాయి ఆదాయలకు వర్తింపజేయాలి, ఇతరత్రా ప్రతిపాదనలను జనవరి 1 నుంచే పాత తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేలా ఒప్పందం ఉండొచ్చని కూడా వారు చెబుతున్నారు.

Saturday, December 29, 2012

3G ఫోన్సు అంటే ఏమిటి?

3జీ అంటే సంక్షిప్తంగా 'థర్డ్ జెనెరేషన్ మొబైల్ టెలిఫోనీ'. వేగంగా సమాచార మార్పిడి చేసుకొనేలా మొబైల్ నెట్‌వర్కులనీ , మొబైల్‌ఫోన్లలనీ రూపొందించారు. ప్రస్తుతం వాడుతున్న టెక్నాలజీని 2G అంటున్నారు.ఇందులో వేగాన్ని ఈ స్థాయి తర్వాత పెంచలేము. ఎక్కువగా వాయిస్ మరియు టెక్స్టు డాటాని మాత్రమే మార్పిడి చేసుకోగలుగుతున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవల్ని మొబైల్ లో వినియోగించుకునేలా రూపొందించిందే ఈ 3జీ. అరచేతిలో టీవీ! సినిమాలు, పాటలు, వార్తలు, ఓ మాదిరి సైజున్న వీడియో ఫైల్స్ ఏవైనా సరే చిటికలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
రానున్న కాలంలో మొబైల్ ఫోన్లోనే టివీలూ చూడగలుగుతారు. దానికి ఎక్కువ రిజల్యూషన్ తో కూడిన డిస్ప్లే సిస్టం, అధిక డాటాని వేగంగా రిసీవ్ చేసుకోగలగటం లాంటి ఎక్కువ సౌకర్యలతో మొబైల్ ఫోన్లూ వస్తాయి. టీవీ ప్రోగ్రాములను ప్రసారం చేయడానికి ఉన్న ఛానల్స్ సిద్ధం ఔతాయి. కొత్త ఛానెల్సూ , వెబ్‌సైట్లూ పుట్టుకొస్తాయి. నచ్చిన ప్రోగ్రాంలను రికార్డ్ చేసుకొని ఫోన్ లో భద్రపరచుకోవచ్చు కూడా. ఫ్రస్తుతం మనం వినియోగిస్తున్న 2జీ ద్వారా వాయిస్ కమ్యూనికేషన్ ను పూర్తిస్థాయిలో ఏ విధంగా వినియోగించగలిగామో వీడియో ఫైల్స్ ని ౩జీ లో అంతే సులువుగా యాక్సెస్ చేసుకొనేలా ఈ నెట్‌వర్క్‌లన్, ఫోన్లనీ రూపొందిస్తున్నారు.
వెబ్ కెమేరా ద్వారా కంప్యూటర్‌లో ఆన్‌లైన్ వీడియో ఛాటింగ్ ఎలా చేస్తున్నారో అదే విధంగా ఫోన్‌లో కూడా మీరు కనిపిస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. దీన్నే 'వీడియో కాలింగ్' అని పిలుస్తున్నారు. ఇలా కనిపిస్తూ మాట్లాడాలంటే ఇరువురి ఫోన్లలో కెమేరా కచ్చితంగా వుండాలి. దీనికోసం ఫోన్ కు ముందు భాగంలో కెమేరాను ఏర్పాటు చేసిన 3జీ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నారు.
మూడు నిమిషాలున్న ఎంపీ3 పాటను 2జీ తో డౌన్ లోడ్ చేస్తే సుమారు 31 నుండి 40 నిమిషాలు తీసుకుంటుంది. అదే వీడియో ను 3జీ తో 11 సెకన్ల నుంచి 1.5 సెకన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కార్లో వెళుతున్నప్పుడు కూడా 384 కేబీపీఎస్ వేగంతో డాటా ను డౌన్ లోడ్ చేసుకునేలా 3జీ పనిచేస్తుంది. 2జీ నెట్ వర్క్ 10kb/sec వేగంతో సమాచార మార్పిడి చేస్తే, 3జీ 2mb/sec స్పీడ్ తో చేస్తుంది. కంప్యూటర్‌లో పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ బ్రౌసింగ్ చేసుకోవచ్చు. వివిధ రకాల మల్టీమీడియా గ్రాఫిక్స్‌తో కూడిన ఎటాచ్‌మెంట్లతో ఈ-మెయిల్స్ ని చిటికెలో పంపేయొచ్చు.
వీడియో కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్‌తోనూ, కొత్త వాళ్ళతోనూ ఆన్‌లైన‌ గేమ్స్‌లాగా, ఇక వీడియో గేమ్‌లూ అవలీలగా ఆడేయవచ్చు. మల్టీప్లేయర్ గేమ్‌లు కూడా మొబైల్ లో అందుబాటులోకి రానున్నాయి. తక్కువ సమయంలోనే గేమ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పోలీసు, రక్షణ వ్యవస్థలు ఈ నెట్‌వర్క్ ద్వారా సీసీటీవీలను యాక్సెస్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. మొబైల్ టూరిజం, మొబైల్ వాణిజ్యం, ఈ-లెర్నింగ్, స్టాక్‌ఎక్స్చేంజ్, టెలీ‌మెడిసిన్, మొబైల్ వాణిజ్య ప్రకటనలు సమస్త ప్రపంచం ఇక మీ అరచేతిలోనే - అరచేతిలో వైకుఠం తెలీదు గానీ, మీ ప్రపంచం మొత్తం మీ అరచేతిలోనే!
ఈ సేవల్ని పొందాలంటే ప్రస్తుతం మనం వినియోగిస్తున్న సేవలకంటే ఎక్కువ ఛార్జ్ చేసే అవకాశమే ఉంది. కాకపోతే ప్రభుత్వ నియంత్రణల వల్ల, ఇవన్నీ రావడానికి మాత్రం ఇంకా కొద్ది కాలం పడుతుంది. ప్రస్తుతానికి MTNL, BSNL మాత్రమే ఈ సదుపాయాలని కొన్ని చోట్ల అందిస్తున్నారు. సేవలందంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధం ఔతున్నాయి. మార్కెట్ళో ఈ 3G టెలిఫోన్లూ లభ్య మౌతున్నాయి. కాస్త ధరే రూ 15,000 పైగా ఉన్నా, వేచి చూడండి. అన్ని కంపెనీలు మొదలెట్టాగా, వీటీ రేట్లు కొద్దిగా నైనా తగ్గొచ్చు.

Monday, December 24, 2012

వేతనజీవులకు మరింత ఊరటనివ్వాలి


ఆదాయ పన్ను గరిష్ట శ్లాబ్‌ను రెట్టింపు చేయాలి
ప్రస్తుతం ఉన్న రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలి
80సి కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2 లక్షలకు చేర్చాలి
ప్రి-బడ్జెట్ మెమొరాండంలో ఫిక్కీ


న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్‌లో వేతనజీవులకు మరింత ఊరటనిచ్చే చర్యలు చేపట్టాలనే డిమాండ్‌లు జోరందుకుంటున్నాయి. ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లింపునకు సంబంధించి... సెక్షన్ 80సి కింద పన్ను ఆదాయంలో మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. లక్ష నుంచి కనీసం రూ. 2 లక్షల స్థాయికి పెంచాలని పరిశ్రమ చాంబర్ ఫిక్కీ పేర్కొంది. ఆర్థిక శాఖకు సమర్పించిన ప్రి-బడ్జెట్ మెమొరాండంలో ఈ మేరకు పలు విజ్ఞప్తులు చేసింది. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదార్లు పన్ను ఆదా పథకాలపై మరింత దృష్టిసారించడం, అదేవిధంగా పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ చర్యలు అవసరమని తెలిపింది.

ప్రస్తుతం జీవిత బీమా ప్రీమియంలు, పిల్లల చదువులకు సంబంధించిన ఫీజులు, ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్), ఇన్‌ఫ్రా బ్రాండ్‌లు, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌ల వంటి వాటిలో రూ. లక్ష వరకూ వెచ్చిస్తున్న వ్యయానికి పన్ను ఆదాయం నుంచి మినహాయింపు లభిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఉద్యోగుల్లో వ్యయాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా గరిష్ట ఐటీ శ్లాబ్‌ను రెట్టింపు చేయాలని కూడా ఫిక్కీ కోరింది. ప్రస్తుతం రూ.10 లక్షల పైబడిన ఆదాయంపై 30%(విద్యా సెస్సుతో కలిపి 30.9%)గా ఉన్న పన్నును... వచ్చే ఆర్థిక సంవత్సరం(2013-14) నుంచి రూ.20 లక్షల పైబడిన ఆదాయంపై వర్తింపజేయాలనేది ఫిక్కీ విజ్ఞప్తి. రూ.2 లక్షల వరకూ ఆదాయంపై ప్రస్తుతం పన్ను లేదు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఆదాయంపై 10%... రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయంపై 20% పన్ను రేట్లు అమల్లో ఉన్నాయి.

ఇతర విజ్ఞప్తులు ఇవీ...
* ఉద్యోగులకు పన్ను ఆదాయంలో కనీసం రూ.50 వేల మినహాయింపు లభించేలా స్టాండర్డ్ డిడక్షన్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలి.
* ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఊరట కల్పించాలి. గృహ రుణాలపై వార్షికంగా రూ. 1.5 లక్షల వరకూ చెల్లిస్తున్న వడ్డీని పన్ను ఆదాయం నుంచి మినహాయింపునిస్తుండగా... దీన్ని రూ.2.5 లక్షలకు పెంచాలి.
* విద్యకు సంబంధించిన వ్యయాన్ని సెక్షన్ 80సీ నుంచి వేరుచేయాలి. వైద్య బీమా కోసం ఇప్పుడున్న సెక్షన్ 80డీ తరహాలో ప్రత్యేకంగా మినహాయింపు పరిమితి లభించేలా విభజించాలి.
* వైద్య చికిత్సలకు చేసే వ్యయాలకు కల్పిస్తున్న మినహాయింపు పరిమితిని కూడా వచ్చే బడ్జెట్‌లో పెంచాలి. ప్రస్తుతం వార్షికంగా రూ.15,000గా ఉన్న ఈ మినహాయింపు పరిమితిని రూ.50,000కు చేర్చాలి.
 
Source : Sakshi Telugu Daily

Friday, December 7, 2012

కొత్త సంవత్సరంలో కార్ల ధరలకు రెక్కలు


రూ.20 వేల వరకూ పెంచుతున్నట్లు ప్రకటించిన మారుతీ సుజుకీ...


3 శాతం వరకూ జీఎం పెంపు..
ఇదే బాటలో మరిన్ని కంపెనీలు


న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలో కార్ల ధరలు పెరగనున్నాయి. జనవరిలో కార్ల ధరలను రూ.20,000 వరకూ పెంచాలని మారుతీ సుజుకీ ఇప్పటికే నిర్ణయించింది. 1-2% ధరలను పెంచనున్నామని టయోటా పేర్కొం ది. జనరల్ మోటార్స్ 3% వరకూ ధరలను పెంచుతోంది. హోండా కార్స్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయని, డాలర్‌తో రూపాయి మారకం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతుండటంతో మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడుతోందని, అందుకే ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీలంటున్నాయి.

మోడళ్లను బట్టి కార్ల ధరలను రూ.20,000 వరకూ పెంచుతున్నామని మారుతీ సుజుకి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పరీక్ చెప్పారు. మారుతీ సుజుకి కంపెనీ ఎం800 నుంచి కైజాషి మోడళ్లను రూ.2.09 లక్షల నుంచి రూ.17.52 లక్షల రేంజ్‌లో విక్రయిస్తోంది. ఇక వచ్చే నెల 1 నుంచే అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నామని టయోటా కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ ఇటియోస్ లివా నుంచి ల్యాండ్ క్రూయిజర్ వరకూ మోడళ్లను రూ.4.44 లక్షల నుంచి రూ.99.27 లక్షల రేంజ్‌లో కార్లను విక్రయిస్తోంది. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ధరలు పెంచక తప్పడం లేదని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. జనవరి నుంచే తాము కూడా మోడళ్లను బట్టి ధరలను 1-3 శాతం వరకూ పెంచనున్నామని జనరల్ మోటార్స్ పేర్కొంది. రూ.3.32 లక్షల స్పార్క్ కారు నుంచి రూ.24.59 లక్షల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ క్యాప్టివా వరకూ వివిధ మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది.

ఇక ఫియట్ జీప్‌లు

ముంబై: జీప్‌మార్కెట్లో మళ్లీ ప్రవేశిస్తున్నామని ఫియట్ ఇండియా గురువారం తెలిపింది. వచ్చే ఏడాది చివరి కల్లా తమ జీప్ మోడళ్లు- గ్రాండ్ చెరోకీ, రాంగ్లర్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తామని పేర్కొంది. 2016 కల్లా తొమ్మిది కొత్త వాహనాలను భారత మార్కెట్లో అం దించే వ్యూహంలో భాగంగా ఈ జీప్‌లను తెస్తున్నామని వివరించింది. 25 నగరాల్లో ఉన్న 32 డీలర్ల ద్వారా ఈ జీప్‌లను విక్రయిస్తామని తెలిపింది. ప్రస్తుతం 120 దేశాల్లో ఈ జీప్‌లను అమ్ముతున్నామని వివరించింది. ఇక ఈ జీప్‌లతో పాటు వచ్చే ఏడాది తమ రేసింగ్ కార్డ్ బ్రాండ్ అబర్త్‌ను, 2014లో కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది.

మాలె జిఎంఆర్ చేజారుతుందా?

సింగపూర్ - మాలె , డిసెంబర్ 6 : మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు విషయంలో సింగపూర్ హైకోర్టు తీర్పు తమకే అనుకూలంగా ఉందన్న ధీమాతో ఉన్న జిఎంఆర్ గ్రూప్‌నకు హఠాత్తుగా మరో ఎదురుదెబ్బ తగిలింది. జిఎంఆర్ చేతుల్లోంచి మాలె విమానాశ్రయాన్ని మాల్దీవుల ప్రభు త్వం వెనక్కి తీసుకోవచ్చని సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ (సుప్రీం కోర్టు) తీర్పు చెప్పినట్టుగా మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు. ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించిన విమానాశ్రయాన్ని అవసరమైతే వెనక్కి తీసుకునే అధికారం మాల్దీవుల ప్రభుత్వానికి ఉంటుందని సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ తీర్పు చెప్పినట్టు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ప్రకటించినట్టుగానే శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఏక్షణమైనా మాలె విమానాశ్రయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మాల్దీవుల అధ్యక్షుని ప్రెస్ సెక్రటరీ మసూద్ ఇమాద్ తెలిపారు.

సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ గురువారం నాడు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జిఎంఆర్ పరిస్థితి అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన వ్యూహం ఏమిటన్న విషయం జిఎంఆర్ ఇంకా బయటపెట్టలేదు. మరోవైపు ఈ తీర్పు నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా కనిపిస్తోంది. సింగపూర్ సుప్రీం కోర్టు తీర్పును తమ విదేశాంగ శాఖ, మాలెలోని భారత హైకమిషన్ అధ్యయనం చేస్తున్నాయని భారత్ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు.

ఎయిర్‌పోర్టు కాంట్రాక్టుకు సంబంధించిన చట్టపరమైన నియమనిబంధనలు, పరిహారానికి సంబంధించిన కాంట్రాక్టులోని ఒప్పందాలను మాల్దీవుల ప్రభుత్వం అక్షరాల అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ కేసులో రెండు అంశాలున్నాయనీ ఒకటి మాల్దీవుల ప్రభుత్వ సార్వభౌమా«ధికారానికి సంబంధించినది కాగా మరొకటి ప్రాజెక్టు ఒప్పందానికి సంబంధించిన చట్టబద్ధత అని ఆయన చెప్పారు.

సింగపూర్ కోర్టు గురువారం నాడు ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలే తప్ప ఒప్పందం చట్టబద్దతకు సంబం«ధించిన అంశాల ప్రస్తావన లేదని ఆయన వివరించారు. కోర్టు ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించనందున, ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు, కాంట్రాక్టులో పేర్కొన్న ఒప్పందాలు అన్నింటినీ పొల్లుబోకుండా అమలు చేయాల్సి ఉంటుందని సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. మాల్దీవుల ధీమా....

అంతర్జాతీయ బిడ్డింగ్‌లో రెండేళ్ల క్రితం జిఎంఆర్ గ్రూప్ మొహమ్మద్ నషీద్ ప్రభుత్వ హయాంలో మాలె విమానాశ్రయ ప్రాజెక్టును గెలుచుకుంది. అయితే గత ఫిబ్రవరీలో అధికారంలోకి వచ్చిన మొహమ్మద్ వహీద్ ప్రభు త్వం ఈ ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వచ్చింది. నవంబర్ 27న హఠాత్తుగా ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జిఎంఆర్ సింగపూర్ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. అయితే సింగపూర్ కోర్టు ఉత్తర్వులను లెక్కచేసేది లేదని, జిఎంఆర్‌ను మాలె ఎయిర్‌పోర్టు నుంచి ఖాళీ చేసి తీరుతామని మాల్దీవుల ప్రభుత్వం మొండికేయడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. భారత ప్రభుత్వం కల్పించుకుని నిరసన తెలిపినప్పటికీ మాల్దీవులు వెనక్కి తగ్గలేదు. గురువారం నాడు సింగపూర్ అత్యున్నత న్యాయస్థానంలో కోర్టులో తీర్పు అనుకూలంగా రావడంతో మాల్దీవుల ప్రభుత్వం తన పట్టుకు మరింత బిగిస్తోంది.

జిఎంఆర్‌ను బలవంతంగా బయటకు గెంటినా చట్టపరంగా ఇక తమపై తప్పు ఉండదని ధీమా వ్యక్తం చేస్తోంది. ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు కాంట్రాక్టు ప్రకారం, వివాదం ఏదైనా తలెత్తితే సింగపూర్ లేదా బ్రిటన్ చట్టాల ప్రకారం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సింగపూర్ హైకోర్టులో తీర్పు జిఎంఆర్‌కు అనుకూలంగా వచ్చింది. దానిపై మాల్దీవులు దాఖలు చేసుకున్న అప్పీల్‌లో తీర్పు ఇప్పుడు తమకు అనుకూలంగా వచ్చినట్టు మాల్దీవుల ప్రతినిధి ప్రకటించారు.

జిఎంఆర్‌కు పొగబెట్టిందెవరు ? మాలె ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు నుంచి జిఎంఆర్ గ్రూప్‌ను పక్కకు తప్పించేందుకు జరిగిన కుట్రలో మాల్దీవుల అధ్యక్షుడు వహీద్ ప్రత్యేక సలహాదారు హసన్ సయీద్ పాత్ర ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే దీనిని మాల్దీవుల ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్టు నుంచి జిఎంఆర్‌కు ఉద్వాసన చెప్పాల్సిందిగా దేశ అధ్యక్షునికి హసన్ సయీద్ సలహా ఇచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Thursday, December 6, 2012

మాలె ప్రాజెక్టు పరిణామాలు

మాలె సంక్షొభంలో విదేశీ హస్తం

న్యూఢిల్లీ : మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు నుంచి తమను బలవంతంగా బయటకు పంపడం వెనుక పరదేశ ప్రమేయం ఉన్నట్టు జిఎంఆర్ గ్రూప్ అనుమానిస్తోంది. మాల్దీవుల రాజకీయ పరిస్థితిని, అక్కడి రాజకీయ చట్రాన్ని దృష్టిలో ఉంచుకుంటే.. మాలె ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు వ్యవహారంలో విదేశీ హస్తం ఉందన్న అనుమానాలను తోసిపుచ్చలేమని సంస్థ సిఎఫ్ ఒ సిద్ధార్థ కపూర్ చెప్పారు. 50 కోట్ల డాలర్ల మాలె ఎయిర్‌పోర్ట్ ఆధునీకరణ ప్రాజెక్టు నుంచి జిఎంఆర్‌ను బయటకు పంపాలన్న మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయం వెనక చైనా హస్తం ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. జిఎంఆర్ ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడేందుకు నిరాకరించినప్పటికీ అనుమానాలను మాత్రం తోసిపుచ్చలేదు.

మాలె ఎయిర్‌పోర్ట్ సంక్షోభం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో... వాస్తవాలను వెల్లడించడానికి జిఎంఆర్ సిఎఫ్ఒ సిద్ధార్ధ కపూర్ బుధవారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయక్రీడాంగణంలో మాలె ఎయిర్‌పోర్టు ఫుట్‌బాల్‌గా మారిందని కపూర్ వ్యాఖ్యానిం చారు. టూరిజంను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసేందుకు ఒక పక్క విదేశీ పెట్టుబడులను కోరుతూ.. మరో పక్క మాలె ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు రద్దు వంటి నిర్ణయాలను తీసుకోవడాన్ని కపూర్ తప్పుబట్టారు. మాల్దీవుల ప్రభుత్వ వైఖరికి బయట ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రారని ఆయన చెప్పారు. మాలె ప్రాజెక్టును వదులుకోవాల్సి వస్తే నష్టం ఏమేరకు ఉంటుందనే విషయంలో లెక్కలు వేయలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

బల ప్రయోగం వద్దు
మాలె ఎయిర్‌పోర్టు నుంచి జిఎంఆర్‌ను ఖాళీ చేయించేందుకు బలప్రయోగానికి దిగే ప్రయత్నం చేయవద్దని సిద్ధార్థకపూర్ మాలె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బలప్రయోగానికి దిగితే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని ఆయన అన్నారు. ఇది భారత దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. మాలె ఎయిర్‌పోర్టులో 140 మంది విదేశీయులు పనిచేస్తున్నారని చెప్పారు. మాలె ఎయిర్‌పోర్టును శుక్రవారం ఆర్ధరాత్రికల్లా ఖాళీ చేసి తమకు అప్పగించాలని మాలె ప్రభుత్వం జిఎంఆర్‌ను హెచ్చరించింది. అయితే జిఎంఆర్ మాత్రం ససేమిరా ప్రాజెక్టును వదిలేది లేదని అంటున్నది.

ఈ నేప«థ్యంలో బలప్రయోగంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిందిగా మాల్దీవుల ప్రభుత్వానికి తాము విజ్ఞప్తి చేస్తున్నట్టు కపూర్ చెప్పారు. ఈ సంక్షోభానికి అందరికీ అమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్టు ఆయన చెప్పారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం అండగా నిలబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవుల ప్రభుత్వ అధినేతతో సంప్రదించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. సమస్య పరిష్కారానికి మాల్దీవుల ప్రధాన ప్రతిపక్షంతో సహా అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుత్నుట్టుగా వెల్లడించారు.

ఎవరికి లాభం...
కాంట్రాక్టును బలవంతంగా రద్దుచేస్తే మాల్దీవుల ప్రభుత్వం పరిహారం కింద జిఎంఆర్‌కు కనీసం 70 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా. అంతకంటే ఎక్కువే ఉండవచ్చు కూడా. ఈ భారాన్ని మాల్దీవుల ప్రజలే మోయాలి. ప్రాజెక్టు కొనసాగితే వచ్చే పాతికేళ్ల కాలంలో మాల్దీవుల ప్రభుత్వానికి 250 కోట్ల డాలర్లు లభిస్తాయి. అవి కాకుండా ఇతరత్రా ఆదాయం మరో 100 కోట్ల డాలర్లు ఉంటుంది.

మాలె పరిణామాలపై ప్రపంచబ్యాంకు కన్ను
నిజానికి మాలె ఎయిర్‌పోర్టు బిడ్డింగ్ ప్రక్రియ అంతా ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ ఐఎఫ్‌సి కనుసన్నల్లో జరిగింది. అందువల్ల ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పరిణామాలను ప్రపంచ బ్యాంకు నిశితంగా గమనిస్తోంది. ఈ విషయం జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావుకు రాసిన లేఖలో ప్రపంచబ్యాంకు ప్రెసిడెంట్ జిమ్‌యాంగ్ కిమ్ స్వయంగా తెలిపారు. ప్రాజెక్టు బిడ్డింగ్ జరిగిన సమయంలో మాల్దీవుల ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న ఐఎఫ్‌సి, కన్సిషన్ అగ్రిమెంట్ రూపకల్పన, బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. మాల్దీవుల చట్టాలు, అంతర్జాతీయ ఉత్తమ సంప్రయాలాకు అనుగుణంగా బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించారు.

ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఐఎఫ్‌సిని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మాల్దీవులు కోరింది. ఐఎఫ్‌సి ప్రతినిధి బృందం అవసరమైన మొత్తం సమాచారాన్ని మాల్దీవుల ప్రభుత్వానికి అందించినట్టు జిమ్‌యాంగ్ కిమ్ జిఎంఆర్‌కు రాసిన లేఖలో వెల్లడించారు. పైగా ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్ ఇసాబెల్ గురెరో మాల్దీవుల అధ్యక్షున్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా కలుసుకున్నారు. ఐఎఫ్‌సి వైస్‌ప్రెసిడెంట్ కరిన్ ఫిన్‌కెల్‌స్టన్ కూడా మాల్దీవుల ఆర్థికమంత్రితో త్వరలో సమావేశం కానున్నారని వెల్లడించారు. ప్రపంచబ్యాంకు కూడా ప్రాజెక్టు విషయంలో సీరియస్‌గా ఉన్నందున మాల్దీవుల ప్రభుత్వం ఆఖరు క్షణంలోనైనా దారికి రావచ్చని అంటున్నారు. . 


మాలె ప్రాజెక్టు పరిణామాలు..

2010లో జరిగిన అంతర్జాతీయ బిడ్డింగ్‌లో 50 కోట్ల డాలర్లకు ఈ ప్రాజెక్టును జిఎంఆర్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ ఐఎఫ్‌సి సార«ధ్యంలో బిడ్డింగ్‌ను నిర్వహించారు.ఆ ప్రాజెక్టు కన్సీషన్ కాలవ్యవధి 25 ఏళ్లు. ప్రాజెక్టు బిడ్డింగ్ జరిగిన సమయంలో మాల్దీవుల్లో మహమమ్మద్ నషీద్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మాల్దీవుల చరిత్రలో స్వేచ్ఛ గా జరిగిన ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రభుత్వంగా నషీద్ ప్రభుత్వాన్ని చెబుతారు.

ఈ ఏడాది ప్రారంభంలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల్లో నషీద్ ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మాలె ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును టార్గెట్‌గా పెట్టుకుంది. గతవారం హఠాత్తుగా జిఎంఆర్ కాంట్రాక్టును రద్దు చేస్తూ.. వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సింగపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ మాల్దీవుల ప్రభుత్వం తన పట్టు వీడటం లేదు. భారత ప్రభుత్వం నిరసన తెలిపినప్పటికీ మాల్దీవుల ప్రభుత్వం దిగిరాలేదు. మాలె ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులో అక్రమాలు,అవినీతి చోటుచేసుకున్నట్టుగా కొత్త ప్రభుత్వం వాదిస్తోంది.

2010
జూలై : 10 నెలలు సాగిన సుదీర్ఘ బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత 50 కోట్ల డాలర్ల మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణ, నిర్వహణ ప్రాజెక్టును జిఎంఆర్ గెలుచుకుంది.
అక్టోబర్ : ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ ఏర్పాట్లను పూర్తి చేసినట్టుగా జిఎంఆర్ వెల్లడించింది. 50 కోట్ల డాలర్ల ప్రాజెక్టులో 70 శాతం రుణాలు కాగా 30 శాతం ఈక్విటీ.
నవంబర్ : మాల్దీవుల ఎయిర్‌పోర్టు కంపెనీ అధికారికంగా మాలె ఎయిర్‌పోర్టు అభివృద్ధి, అధునీకరణకు లైసెన్స్‌ను జిఎంఆర్‌కు అందజేసింది.

2011
జనవరి : 2014-15కల్లా ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టుగా జిఎంఆర్ ప్రకటన.
మార్చి : పనులు వేగం అందుకున్నట్టుగా వెల్లడి

జూన్ : నాన్ ఎయిరో స్పేస్‌ను వాణిజ్య పరంగా అభివృద్ధి చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక రాజకీయ నాయకులు ఆందోళన ప్రారంభించడంతో జిఎంఆర్ కార్యకలాపాలకు విఘాతం కలిగింది.
సెప్టెంబర్ : ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకుని డెవలప్‌మెంట్‌ను జిఎంఆర్ ప్రారంభించింది.
డిసెంబర్ : జనవరి నుంచి మాలె ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నుంచి ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ చార్జీల కింద 25 డాలర్లు, బీమా చార్జీ కింద 2 డాలర్ల చొప్పున వసూలు చేస్తున్నట్టుగా జిఎంఆర్ ప్రకటన. ఈ నిర్ణయంపై కోర్టుల్లోనూ జిఎంఆర్‌కు అనుకూలంగా తీర్పువచ్చింది.

2012
జనవరి: ఎయిర్‌పోర్టు చార్జీల వసూలుకు ప్రభుత్వం అడ్డుపడటంపై జిఎంఆర్ అసంతృప్తి.
మార్చి : నషీద్ ప్రభుత్వం కూలిపోయింది. మహమద్ వహీద్ సారధ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే, మాలె ప్రాజెక్టును జిఎంఆర్ అక్రమ పద్ధతుల్లో చేజిక్కించుకుందని, అందువల్ల ప్రాజెక్టు చెల్లదని ప్రకటించింది. జిఎంఆర్ కష్టాలు అప్పటి నుంచే మొదలయ్యాయి.
జూన్ : ప్రపంచబ్యాంక్ అనుబంధ సంస్థ ఐఎఫ్‌సి సారధ్యంలో అత్యంత పారదర్శకంగా జరిగిన బిడ్డింగ్‌లో మాలె ప్రాజెక్టును తాము గెలుచుకున్నామని జిఎంఆర్ మాల్దీవుల కొత్త ప్రభుత్వానికి విన్నవించుకుంది. జూలై : మాల్దీవుల ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును జిఎంఆర్ వదులుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

సెప్టెంబర్ : మాలె ఎయిర్ పోర్టు ప్రాజెక్టు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 304.3 కోట్ల రూపాయల రాబడిపై 44 కోట్ల రూపాయల లాభం సాధించినట్టు జిఎంఆర్ ప్రకటన. ఢిల్లీ ఎయిర్‌పోర్టుతో పోలిస్తే మాలె ప్రాజెక్టులో భారీ లాభాలున్న విషయం కూడా జిఎంఆర్ వెల్లడించింది.
అక్టోబర్ : ముంబైలో జరిగిన ఒక సమావేశంలో మాల్దీవుల ప్రభుత్వం మాలె ప్రాజెక్టు విషయంలో నాన్చకుండా తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది.
నవంబర్ : కాంట్రాక్టు రద్దు చేస్తూ అధికార ప్రకటన.
డిసెంబర్ : మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయంపై సింగపూర్ కోర్టులో జిఎంఆర్ పిటిషన్. అనుకూలంగా తీర్పు. తీర్పును లెక్కించమని మాల్దీవుల ప్రకటన.