Tuesday, December 30, 2014

వ్యాపార రంగానికి సరికొత్త జోష్.. (2014 రౌండప్)

  (సాక్షి సౌజన్యంతో)
Sakshi | Updated: December 30, 2014 05:31 (IST)
వ్యాపార రంగానికి సరికొత్త జోష్..
హైదరాబాద్ : ఎన్నో ఆశలు రేపుతున్న వ్యాపార రంగం కొత్త సంవత్సరంలోకి సరికొత్త జోష్ తో అడుగుపెడుతోంది. దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త సర్కారు సంస్కరణల బాట పట్టడం.. స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా ఉండటంతో భారత ఆర్థిక వ్యవస్థపై మళ్లీ విశ్వాసం చిగురించింది. మరోపక్క, అంతర్జాతీయంగా చమురు ధరలు నేలకు దిగి రావడం కూడా మనకు చేదోడుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మరింత పైకి ఎగిసిన చమురు ధరలు.. చివరికొచ్చేసరికి దిగిరావడం సామాన్య ప్రజలకు ఊరటనిచ్చాయి.

తగ్గిన చమురు ధరలు
ఈ ఏడాది జూన్ నుంచీ చమురు ధరలు గణనీయంగా పడిపోవడం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక సానుకూల అంశంగా మారింది. జూన్‌లో 110 డాలర్ల స్థాయిలో ఉన్న బ్రెంట్ క్రూడ్ ధరలు డిసెంబర్ నాటికి 60 డాలర్ల స్థాయికి పడిపోయాయి. పెట్రోల్ డీజిల్, ధరలు డిసెంబర్ లో రెండు సార్లు తగ్గడంతో వినియోగదారులకు వరంగా మారాయి. పెట్రోల్ ధర గత ఆగస్టునుంచి వరుసగా ఎనిమిదో సారి తగ్గగా,  డీజిల్ ధర గత అక్టోబర్‌నుంచి వరుసగా నాలుగోసారి తగ్గడం గమనార్హం. అయితే తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న చమురు ధరలు ఎప్పుడు స్థిరత్వం పొందుతాయనే అంశంపై మాత్రం పూర్తి అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామం దేశీ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తోంది.

ఈ-కామర్స్ జోరు- రిటైల్ బేజారు
ఇండియాలో ఈ కామర్స్ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధిస్తోంది.  2014లో  ఈ-కామర్స్ విజృంభణ ముఖ్యాంశాల్లో ఒకటి.  చైనా దిగ్గజ సంస్థ అలీబాబా సహా పలు దేశాల ఈ కామర్స్ సంస్థల దిగ్గజాలు భారత్‌కు క్యూ కట్టారు. ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలు బిగ్ బిలియన్ డే లాంటి పేర్లతో అత్యంత చవగ్గా వస్తువులు ఇచ్చేయడం లాంటివి ఈ కామర్స్ మరింత పుంజుకోడానికి దోహదపడ్డాయి. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా రూ.1,50,000 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ విజయవంతం కావడం, ఆ సంస్థ చీఫ్ జాక్ మా ఆసియాలోనే అపర కుబేరిడినా అవతరించడం గమనార్హం. దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని ఈ కామర్స్ సంస్థలు హామీ ఇవ్వడంతో రిటైల్ సంస్థల్లో కొంత అనిశ్చితి నెలకొంది. ఈ విభాగం నేరుగా వ్యాపార రంగంలోకి ప్రవేశించడం వల్ల తమ అమ్మకాలు దెబ్బతింటాయని రిటైల్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. తమ అమ్మకాలు భారీ తగ్గుముఖం పట్టేఅవకాశం ఉందని రిటైల్ సంస్థలు బేజారెత్తుతున్నాయి.

దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు
ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు లాభాలతో దుమ్మురేపాయి. ఐదేళ్ల తరువాత మళ్లీ సెన్సెక్స్ ఏకంగా 6,038 పాయింట్లు(29%) ఎగసింది. ఒక దశలో చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో డిసెంబర్ 3న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి రూ. 100 లక్షల కోట్లను (ట్రిలియన్లు) అధిగమించింది.  ఈ ఏడాది 21,140 పాయింట్లతో ఆరంభమైన సెన్సెక్స్.. డిసెంబర్ 24 నాటికి 27,209 పాయింట్లతో కొనసాగుతోంది.  ఇంతక్రితం 2009లో మాత్రమే సెన్సెక్స్ 7,817 పాయింట్లు జమ చేసుకుంది. ఇక ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం దాదాపు 30% పుంజుకోవడం విశేషం.

ఆశాజనకంగా జీడీపీ
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు 5.3 శాతంతో కాస్త కిందికి దిగిజారినా.. గతం కంటే మెరుగ్గా ఉండటం ఆశాజనకంగా మారింది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.7 శాతం వృద్ధితో ఉత్సాహాన్ని ఇచ్చినా.. తరువాత కిందికి జారిపోవడం కాస్త నిరుత్సహాన్ని నింపింది.  గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐదు శాతం దిగువన జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసుకున్నా.. క్రమేపీ ఇది పెరగడం మాత్రం ఉత్సాహాన్ని ఇచ్చింది.   వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.4% వృద్ధిని సాధించగలదని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ తాజాగా అంచనా వేసింది. పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం ఇందుకు సహకరించగలదని ఒక నివేదికలో తెలిపింది.

ఎయిర్ ఏషియా ఇండియా సేవలు
ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్, జెట్‌లైట్‌ల  తరహాలో ఎయిర్ ఏషియా కూడా చౌక విమానయాన  సర్వీసులను అందించడానికి ఈ ఏడాది శ్రీకారం చుట్టింది.  టోనీ ఫెర్నాండెస్ నేతృత్వంలోని మలేసియా విమానయాన సంస్థ,  ఎయిర్ ఏషియా,  టాటా సన్స్, అరుణ్ భాటియాకు చెందిన టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్‌లు కలసి 49:30:21 భాగస్వామ్యంతో ఎయిర్ ఏషియా ఇండియా సంస్థను ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది స్పైస్ జెట్ కష్టాలు కూరుకుపోయింది. విదేశీ, దేశీ సరఫరాదారులు, విమానాశ్రయ నిర్వాహకులు, చమురు కంపెనీలకు బకాయిలు రూ. 1,230 కోట్లకు ఎగబాకడంతో అవి తక్షణం చెల్లింపు జరపాలంటూ పట్టుబట్టాయి. దీంతో ఒకరోజు  సర్వీసుల నిలిపివేత వరకూ పరి స్థితి వెళ్లింది. చివరకు ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇవ్వడంతో మళ్లీ సర్వీసులు కొనసాగుతున్నాయి.

పెను సవాళ్లతో ఆటోమొబైల్ రంగం
అమ్మకాలపరంగా ఆటోమొబైల్ కంపెనీల ప్రయాణం ఈ ఏడాది పెను సవాళ్లను ఎదుర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆటో ఎక్స్‌పోలో ఏకంగా 70 కొంగొత్త మోడల్స్ ఊరించిన మార్కెట్ మాత్రం ఎగుడుదిగుడుగా సాగింది.  మొబీలియో, సియాజ్, జెస్ట్ వంటి వాహనాలతో ఏడాది పొడవునా కొత్త కార్లు సందడి చేశాయి. అయితే, అమ్మకాలు మాత్రం ఒక నెల పెరగడం, మరో నెల తగ్గడం లాగా సాగింది. ఏడాది తొలి 11 నెలల్లో అమ్మకాలు 10 శాతం మేర క్షీణించాయి. కాంపిటీషన్ కమిషన్ 14 కార్ల సంస్థలపై రూ. 2,545 కోట్ల జరిమానా విధించడం మరో చెప్పుకోతగ్గ పరిణామం. అయితే, సవాళ్లెన్ని ఎదురైనప్పటికీ.. ఆటోమొబైల్ కంపెనీలు మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో వెనక్కి తగ్గలేదు. మహీంద్రా, మారుతీ, హీరో మోటోకార్ప్, బజాజ్ తదితర సంస్థలు 5 బిలియన్ డాలర్ల మేర భారీ పెట్టుబడులను ప్రకటించాయి. కొత్త సంవత్సరం సానుకూలంగా ఉండగలదని ఆటోమొబైల్ కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల మధ్య ' వ్యాపార' పోటీ
వ్యాపార రంగంలో తెలుగు రాష్ట్రాలు తమ ఉనికిని చాటి చెప్పేందుకు యత్నిస్తున్నాయి. ఆ రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ  రెట్టించిన ఉత్సాహంతో వ్యాపార కార్యకలాపాల్ని మరింత ముందుకెళ్లేందుకు బాటలు వేసుకుంటున్నాయి. కొత్త ప్రాజెక్టులు, విస్తరణలు,  పెట్టుబడులు ఇలా అన్నింటా రెండు రాష్ట్రాల మధ్య ఒక రకంగా పోటీకి తెరతీసింది. కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి రెండు రాష్ట్రాలు పోటీ పడుతుండటంతో కార్పొరేట్ రంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ దిశగా యత్నాలు ఆరంభించింది. హీరో మోటార్ సైకిల్స్ ప్రాజెక్ట్ గురించి ఇరు రాష్ట్రాలు పోటీ పడగా చివరకు ఆ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. అయితే ప్రపంచ అతిపెద్ద రిటైల్ ఫర్నిచర్ సంస్థ ఐకియూ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అలాగే ఇసుజు, ఏషియన్ పెయింట్స్ వంటి సంస్థలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే తెలంగాణలో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, కోజెంట్ గ్లాస్ యూనిట్, జాన్సన్ అండ్ జాన్సన్, కోకకోలా తదితర కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.

ఐటీ  'విస్తరణ '
తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయికి ఐటీని విస్తృతం చేస్తోంది. హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే తన కార్యాచరణను మరింత విస్తృతం చేసింది. తొలుత హైటెక్‌సిటీ ప్రాంతంలో ఎయిర్‌టెల్‌తో కలిసి పబ్లిక్ వైఫై అందుబాటులోకి తెచ్చింది. టెక్నాలజీ స్టార్టప్‌ల కోసం టి-హబ్ పేరుతో దేశంలో అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఏర్పాటవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ కూడా ఐటీకి విస్తృత ప్రాధాన్యం ఇస్తోంది. ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో డిజిటల్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగానే గూగుల్, విప్రో తదితర సంస్థలతో చేతులు కలిపింది.

ఏరోస్పేస్ కు ప్రత్యేక పాలసీ
తెలంగాణ ప్రభుత్వం ఏరోస్పేస్‌కు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. స్విట్జర్లాండ్ కంపెనీ రువాగ్ ఏవియేషన్ తయారీ డార్నియర్-228 విమానాల కోసం విమాన బాడీ, రెక్కల తయారీ కేంద్రాన్ని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఆదిభట్లలోని ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ సెజ్‌లో నెలకొల్పుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్ సహకారంతో జీఎంఆర్ గ్రూప్ ఏరోస్పేస్ ట్రైనింగ్ హబ్‌ను శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేస్తోంది.

Friday, December 26, 2014

ఐదేళ్ళలో అతిపెద్ద ర్యాలీ-2014 (నమస్తే తెలంగాణ సౌజన్యంతో)


2014 బిజినెస్ రౌండప్ (ఈనాడు సౌజన్యంతో)




(ఈనాడు సౌజన్యంతో)
ఒక పేజీ తిప్పితే.. మరో పేజీ వస్తుంది. ఓ ఏడాది గడిస్తే.. మరో ఏడాది వస్తుంది. అది సహజం. అయితే గతాన్ని నెమరేసుకుంటే వర్తమానానికి, భవిష్యత్‌కు దారి కనిపిస్తుంది. ఆశలు.. అంచనాలూ కనిపిస్తాయి. ఉదాహరణకు బంగారం సంగతే తీసుకుంటే కారణమేమైనా బాగా దిగివచ్చి.. కొనుగోలుదార్లను బాగా ఆకర్షించింది. ఇక వాహన ధరలేమో అలా తగ్గి.. ఇలా పెరిగాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కొనసాగితేనే వినియోగదార్లకు ప్రయోజనం బదిలీ చేస్తామంటున్నాయి వాహన కంపెనీలు. ఇక మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు ఇబ్బందులు ఎదురైనా పెట్టుబడుల్లో 10 శాతం వృద్ధిని సాధించింది. ఉక్కు కంపెనీలు ఈ ఏడాది మందగమనంలో ఉన్నా.. 'మేకిన్ ఇండియా'పై ఆశలతో దృఢంగా ఉన్నాయి. ఎఫ్ఎమ్‌సీజీ కంపెనీలూ తక్కువ గిరాకీ నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొన్నాయి. మొత్తం మీద ఈ ఆరు కీలక రంగాలు.. వచ్చే ఏడాదిపై ఆశలతో ఉన్నాయి. ఎందుకంటే సంస్కరణలు ఒక్కసారి ఫలాలను అందజేయడం మొదలుపెడితే.. ఆర్థిక వ్యవస్థతో పాటూ అన్ని రంగాలూ పట్టాలు ఎక్కుతాయిగా.
'బంగారం'లా దిగివచ్చింది
వరుసగా రెండో ఏడాదీ బంగారం ధరలు దిగి వచ్చాయి. ఈ ఏడాదైతే 10 శాతం పైగా తగ్గి కొనుగోలుదార్లను ఆకర్షించిందీ పచ్చలోహం. బంగారంలో పెట్టుబడులకు దూరంగా ఉండాలని ప్రభుత్వం హితవు పలికి.. దిగుమతిపై ఆంక్షలు విధించింది. అయితే ఇది స్మగ్లింగ్‌ను పెంచింది. మరో పక్క వెండి ఏకంగా 20% మేర చౌకగా మారింది. 2013 చివరకు 10గ్రా. స్వచ్ఛమైన బంగారం రూ.30,000గా ఉంటే.. అది ఇపుడు రూ.26,000 దరిదాపులకు వచ్చి చేరింది.
ధరలు ఎందుకు తగ్గాయంటే..
స్టాక్ మార్కెట్ భారీ స్థాయిలో దూసుకెళ్లింది. దీంతో అందరూ అటువైపే పెట్టుబడులతో నడిచారు. ఇది బులియన్ స్టాకిస్టుల వద్ద విక్రయాల ఒత్తిడికి కారణమైంది. ఇందుకు తోడు అంతర్జాతీయ లోహ మార్కెట్లో బలహీనతలు కనిపించడంతో దేశీయంగా సెంటిమెంటు కుంగి.. ధరలు తగ్గాయి.
రూ.27,000-30,945 మధ్య
ఈ ఏడాది బంగారం ధరలు తొలుత 29,800 స్థాయి వద్ద ప్రారంభమయ్యాయి.స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం(99.9 స్వచ్ఛత) ధర మార్చి 3న రూ.30,945 వద్ద గరిష్ఠానికి చేరినా..తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ నెల్లో రూ.27,000కూ చేరింది. 99.5 స్వచ్ఛత గల పసిడి ధర సైతం ఈ ఏడాది రూ.26,000-30,795 మధ్య కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్లో 2014 మధ్యలో ఔన్సు బంగారం 1300 డాలర్లుగా పలికినా.. చివరకొచ్చేసరికి 1140 డాలర్లకు పరిమితమైంది. ఇక వెండి సంగతికి వస్తే ఈ ఏడాది మొదట్లో కిలో ధర రూ.50,000ను తాకింది. తర్వాత రూ.36,000-37,000 స్థాయికీ వచ్చింది. గతేడాది చివర్లో వెండి కిలో ధర రూ.44,230గా ఉంది.
చాలా వరకు బ్రేకులే..
ఈ ఏడాది వాహన రంగానికి అడుగడుగునా వేగనిరోధకాలే కనిపించాయి. మొత్తం 11 నెలల్లో విక్రయాలు చూసుకున్నా 10 శాతం మేర క్షీణించడం అందుకు నిదర్శనం. వాహన ప్రదర్శన నిర్వహించినా.. కొత్త కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చినా.. అమ్మకాల విషయంలో వెనుకడుగే పడింది. వివిధ కారణాల వల్ల రీకాల్స్ కూడా ఎక్కువయ్యాయి. మారుతీ ఏకంగా 1.7 లక్షల కార్లను వెనక్కి పిలిపించింది. ఇతర కంపెనీలు మోస్తరుగానే రీకాల్స్ చేపట్టాయి.
ఇవీ కొత్త మోడళ్లు: హోండా కొత్త సిటీ, మొబిలియో, స్కార్పియో, సియాజ్, జెస్ట్. (అయితే ఈ ఏడాది హ్యుందాయ్ సాంత్రో; నిస్సాన్ ఎక్స్-ట్రయల్‌లకు మంగళం పాడారు.)
సీసీఐ నుంచి ఎదురుదెబ్బ: ఓ మోస్తరు విక్రయాలతో ఉన్న వాహన కంపెనీలపై సీసీఐ అపరాధ రుసుము కుంగదీసింది. 14 కంపెనీలపై రూ.2545 కోట్ల రుసుము విధించింది. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మారుతీ, మహీంద్రా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఫోక్స్ వ్యాగన్‌లు రూ.20,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మిగతా పెట్టుబడులూ కలుపుకుంటే మొత్తం మీద 5 బిలియన్ డాలర్ల(రూ.30000 కోట్లు) ఈ రంగంలోకి వచ్చాయి.
ఏడాది చివర్లో సానుకూలతలు: ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రభావం ఏడాది చివర్లో కనిపించింది. చివరి త్రైమాసికంలో విక్రయాలు ఫర్వాలేదనిపించాయి. సుంకం తగ్గింపును వినియోగదార్లకు బదలాయించి.. ధరలు తగ్గించడం ఇందుకు కారణం. అయితే ఇటీవల ముడి పదార్థాల వ్యయాలు పెరగడంతో తిరిగి ధరలు పెరిగాయి.
ఏం చేయాలంటే..: కొత్త ఏడాదిపైనే వాహన కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి. ఈ రంగం తిరిగి రాణించాలంటే ప్రభుత్వం నుంచి మద్దతు లభించాలి. భద్రత, పర్యావరణ అంశాల నుంచి ఎదురైన సవాళ్లకు పరిష్కారం చూపించి.. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచాలి. ముఖ్యంగా ఎక్సైజ్ సుంకం తగ్గింపును పొడిగించాలి.
అర లక్ష కోట్ల డాలర్లకు..
లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరే క్రమంలో రిటైల్ పరిశ్రమ ప్రస్తుతానికి అందులో సగం దూరాన్ని అధిగమించింది. ఈ ఏడాది 560 బిలియన్ డాలర్ల(రూ.36,60,000 కోట్లు) స్థాయికి చేరింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 10% వృద్ధి చెందింది. ఈ ఏడాది చిన్న పాటి రిటైల్ సంస్థలు కూడా ఆన్‌లైన్ విక్రయ సంస్థల(ఇ-కామర్స్ పోర్టళ్లు) నుంచి సవాళ్లను ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ ఈ రంగంలో వృద్ధి నమోదు కావడం విశేషం.
క్యారీఫోర్.. ఇంటికి: కొత్త ప్రభుత్వం మే 2014లో పగ్గాలు చేపట్టింది. దీంతో బహుళ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను అనుమతించే విషయం మూలనపడింది. ఈ నేపథ్యంలో వాల్‌మార్ట్ వేచిచూసే ధోరణిలో ఉండగా.. క్యారీఫోర్ మరో అడుగు ముందుకేసి తన అన్ని టోకు స్టోర్లను మూసివేసి భారత్ నుంచి నిష్క్రమించింది. ఇక బ్రిటన్‌కు చెందిన టెస్కో ఒకటే బహుళ బ్రాండ్ రిటైల్‌లో ఉన్న ఏకైక విదేశీ రిటైలర్. టాటా గ్రూపునకు చెందిన ట్రెంట్ హైపర్‌మార్కెట్‌తో ఇది సంయుక్త సంస్థను ఏర్పాటు చేసుకుంది.
2020 కల్లా: రిటైల్ పరిశ్రమ 2020 కల్లా ఒక లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎఫ్‌డీఐని అనుమతిస్తే అంతకంటే ముందే లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తున్న రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ రిటైల్‌లు ఈ ఏడాది తమ స్టోర్లను విస్తరించాయి. ఓ వైపు ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ కంపెనీలు అసలు ధర కంటే తక్కువకు ఉత్పత్తులు విక్రయిస్తున్నాయని ఫిర్యాదు చేస్తూనే.. ఫ్యూచర్ గ్రూపు, రిలయన్స్ రిటైల్‌లు ఆన్‌లైన్‌లోకీ విస్తరించడం మొదలుపెట్టాయి. రిలయన్స్ రిటైల్ ఈ ఏడాది తొలిసారిగా లాభాలను ఆర్జించింది.
మేకిన్ ఇండియాపైనే ఆశలు
ఈ ఏడాది భారత్ అతిపెద్ద నాలుగో ఉక్కు ఉత్పత్తిదారుగా తన పేరును నిలబెట్టుకుంది. అంతర్జాతీయ సగటు ఉత్పత్తి వృద్ధి కంటే ఎక్కువగానే సాధించింది. 76 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. అయితే పెరుగుతున్న దిగుమతులు, ఇతర ఆందోళనల మధ్య 2015లో ఉక్కు రంగానికి కష్టకాలం ఎదురుకావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు.
సానుకూలతలు
చి ఉత్పత్తి అంతర్జాతీయ సగటు కంటే ఎక్కువగానే నమోదైంది. అయితే గిరాకీ మాత్రం స్తబ్దుగా ఉంది. ఇక మేక్ ఇన్ ఇండియాపైనే ఆశలు పెట్టుకున్న ఉక్కు తయారీ కంపెనీలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి.
చి అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి చేరిన ముడి ఇనుము ధరల నుంచి ఈ రంగం ప్రయోజనం పొందనుంది. అంతే కాకుండా తగ్గుతున్న కోకింగ్ కోల్ ధరలూ వీటికి మద్దతు పలకనున్నాయి.
చి అంతర్జాతీయ సగటు కంటే భారత తలసరి ఉక్కు వినియోగం నాలుగో వంతుగానే ఉండడం ఆశలను రేకెత్తిస్తోంది. మరో పక్క కర్ణాటక, గోవాల్లో మూతపడ్డ ముడి ఇనుము గనులు త్వరలోనే మొదలవుతాయన్న ఆశలున్నాయి.
చి మొజాంబిక్‌లో కోకింగ్ కోల్ గనిని ఐవీఆర్‌సీఎల్ కొనుగోలు చేసింది.
చి ముడిపదార్థాల ధరలు సమీప భవిష్యత్‌లో పెరగవన్న అంచనాలున్నాయి.
ప్రతికూలతలు
చి అయితే ఉత్పత్తి వ్యయం అధికంగా ఉండడంతో పాటు వివిధ మార్కెట్లకు ఎగుమతి చేసే విషయాల్లో పరిమితులు ఉండడం(ముఖ్యంగా ప్రభుత్వ రంగ కంపెనీలకు) తదితరాలు ఈ రంగానికి ఇబ్బందులు పలకవచ్చు. మరో పక్క భారత్ సహా ఇతర దేశాలకు చైనా ఎగుమతులను పెంచుతోంది. ఇది కూడా ఉక్కు రంగాలను ఉక్కిరిబిక్కిరి చేసే అంశమే.
చి అధిక దిగుమతుల కారణంగా దేశీయ ఉక్కు తయారీ దార్లు 5-6 శాతం దాకా ధరలను తగ్గించాల్సి వచ్చింది.
ఒక్క ఏడాదిలో రూ.3 లక్షల కోట్లు
నియంత్రణ సంస్థల కఠిన విధానాలు, ఇతరత్రా ఇబ్బందులున్నా.. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రాణించింది. ఈ ఏడాది అదనంగా రూ.3 లక్షల కోట్లను జతచేసుకుని మొత్తం నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎమ్)ను దాదాపు రూ.11 లక్షల కోట్లకు చేర్చుకుంది. అక్టోబరులో ఇవి రూ.10.96 లక్షల కోట్ల వద్ద గరిష్ఠానికి చేరాయి. ఏడాది చివర్లోనూ దాదాపు అంతే స్థాయిలోనే ఉండడం విశేషం. 2013 చివరకు ఫండ్‌ల ఆస్తులు రూ.8.26 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇవి 2012 చివర్లో రూ.8.08 లక్షల కోట్లు; 2011 చివర్లో రూ.6.11 లక్షల కోట్లు; 2010 తుదకు రూ.6.26 లక్షల కోట్లుగా ఉన్నాయి.
భవిష్యత్‌పై ధీమా: 2015లోనూ ఫండ్ పరిశ్రమ పనితీరు మెరుగ్గానే ఉంటుందని ఫండ్ సంస్థలు భావిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో ర్యాలీకి తోడు ఆర్థిక వ్యవస్థ రాణింపు వల్ల ఫండ్‌లలోకి మరిన్ని పెట్టుబడులు తరలివస్తాయన్నది అంచనా. అదీ కాక వచ్చే ఏడాది కొత్త సంస్థ ఏదీ ఈ రంగంలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
ఇవి నిష్క్రమించాయ్: దైవా, ఐఎన్‌జీ, మోర్గాన్‌స్టాన్లీ, ప్రమెరికా, ఫిడిలిటీ, పిన్‌బ్రిడ్జ్ వంటి సంస్థలు భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి వైదొలిగాయి. 

Saturday, September 27, 2014

అప్పా జంక్షన్‌లో రియల్ బూమ్

(సాక్షి సౌజన్యంతో)

 హైదరాబాద్‌లో సొంతిల్లు అనగానే మోస్తారుగా ఉన్నోళ్లకే అనుకుంటాం. కానీ, సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేస్తోంది అప్పా జంక్షన్. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుల సొంతింటికి దగ్గరి దారిని చూపిస్తోంది. కూతవేటు దూరంలో విద్యా, వైద్య సౌకర్యాలు.. వినోదాలకు సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు.. అంతే దూరంలో ఐటీ కంపెనీలు.. అంతర్జాతీయ విమానాశ్రయం.. ఓఆర్‌ఆర్   ఇలా ఒకటేమిటి నగరం నడిబొడ్డున పొందే సకల సౌకర్యాలూ ఇక్కడ పొందొచ్చు. అందుకే దేశ, విదేశీ కంపెనీలు అప్పా జంక్షన్‌లో రియల్ ప్రాజెక్ట్‌లు, వెంచర్లను వేసేందుకు క్యూ కడుతున్నాయి.

 హైదరాబాద్‌లో రియల్ బూమ్ బంజారాహిల్స్‌తో మొదలై.. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్‌కు, ఆపైన గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌కు విస్తరించింది. ప్రస్తుతం ఈ బూమ్ అప్పా జంక్షన్‌కు పరుగులు పెట్టిందని స్థిరాస్తి నిపుణులు చెబుతుంటారు. దీన్ని రియల్ ఎస్టేట్ పరిభాషలో ‘డెవలప్‌మెంట్ మేకింగ్ షిఫ్ట్’గా పేర్కొంటారు. భాగ్యనగరంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ముందు వరుసలో అప్పా జంక్షన్ ఉంటుంది.

ఇప్పటివరకు హైదరాబాద్‌లోని ధనవంతులకు మొదటి సొంతిల్లు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిల్లో ఉండేది. రెండో ఆస్తి బెంగళూరు, చెన్నై వంటి ఇతర ప్రాంతాల్లో ఉండేది. కానీ, ప్రస్తుతం వీరు కూడా వారి రెండో ఆస్తిని అప్పా జంక్షన్‌లో ఏర్పరుచుకోవడానికి ఇష్టపడుతున్నారని వివరిస్తున్నారు. ఇది చాలు అప్పా జంక్షన్ ఉన్నత శ్రేణి వర్గాలుండే ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందనడానికి.

 అతి దగ్గర్లో ఐటీ హబ్, ఎయిర్‌పోర్ట్: అప్పా జంక్షన్ ప్రాంతం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు, గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలకు అతి దగ్గర్లో ఉండటం కలిసొచ్చే అంశం. 3 కి.మీ. దూరంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌డీ), ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పోలీస్ అకాడమీలుండటంతో నిత్యం జనాలతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంది. అప్పా జంక్షన్‌లో సుమారు 70కి పైగా విద్యా సంస్థలు, ఆసుపత్రులెన్నో ఉన్నాయి.

 ఈ ప్రాంతంలో మిలటరీ ఏరియా, ఎన్‌ఐఆర్డీ, ఎన్జీ రంగా వర్సిటీలుండటంతో పచ్చని ప్రకృతిలో ఆరోగ్యకరంగా జీవించొచ్చు. హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయానికి అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకూ కొదవేలేదని చెప్పొచ్చు.

 సొంతింటితో పాటు కారు కూడా: నగరంలో సొంతిల్లు అనేది ఉన్నత శ్రేణి వర్గాలకే కాదు.. సామాన్య, మధ్యతరగతి ప్రజలకూ ఉండాలి. అప్పుడే ఆ నగరం అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క అని గిరిధారి కన్‌స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. నా దృష్టిలో అఫడబుల్ హౌజింగ్ అంటే.. సిటీకి దూరంగా, రవాణా సదుపాయాలు కూడా సరిగా లేని ప్రాంతాల్లో ఇళ్లుండటం కాదు.. సిటీకి దగ్గర్లో, అందుబాటు ధరల్లో ఇళ్లు లభించాలి.

కుటుంబంతో కలసి సెకండ్ షో సినిమా చూసి సురక్షితంగా ఇంటికి చేరుకునేంత దగ్గర్లో ఉండాలి. అందుకే అప్పా జంక్షన్‌లో మేం నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్ట్‌ల్లో రూ.25 లక్షలకే 2 బీహెచ్‌కే ఫ్లాట్లను అందిస్తున్నామన్నారు. అప్పా జంక్షన్‌లో ఫ్లాటు కొంటే కారు కూడా సొంతమవుతుందనే నిర్ణయానికి కొనుగోలుదారులొచ్చారు. ఎలాగంటే.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఫ్లాటు కొనాలంటే ఎంతలేదన్నా రూ.40 లక్షలకు మించి కావాలి. అదే అప్పా జంక్షన్‌లో అయితే రూ.25 లక్షలకే ఫ్లాటు కొనడంతో పాటు మిగిలిన డబ్బుతో కారూ సొంతమవుతుందన్నమాట.

Thursday, July 10, 2014

బడ్జెట్ ముఖ్యాంశాలు 2014-15

 (ఈనాడు సౌజన్యంతో)
* ప్రణాళికా వ్యయం రూ.17.9 లక్షల కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ.12.20లక్షల కోట్లు
* పన్నుల రేటులో మార్పులు లేవు
* 2018 నాటికి జాతీయ బ్యాంకుల్లో రూ.2.4లక్షల కోట్ల మూలధనం సమీకరణ
* ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి రూ.2లక్షల నుంచి రూ.2.50లక్షలకు పెంపు. సీనియర్ సిటిజన్ల ఆదాయ పన్ను పరిమితి రూ.3లక్షలకు పెంపు. 80సీసీ పరిమితి రూ.లక్షన్నరకు పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటించారు.
* గృహ రుణాలపై పన్ను మినహాయింపు రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షలకు పెంపు
* తపాలాశాఖ పొదుపు పథకాల్లోని నగదు వినియోగంపై దృష్టి
* పీపీఎఫ్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెంపు
పర్యాటక కేంద్రంగా గయ
* హస్తకళల పునరుద్ధరణకు రూ.30కోట్లతో అకాడమీ ఏర్పాటు
* ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014-2015లో రూ.2.4లక్షల కోట్ల పెట్టుబడులు
* ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా గయ నగరం
* పురావస్తు కట్టడాల పరిరక్షణకు రూ.100కోట్లు
* దేశవ్యాప్తంగా మరో 12 వైద్యకళాశాలలు
* జాతీయ స్పోర్ట్స్ అకాడమీలో అన్ని ప్రధాన క్రీడలకు శిక్షణ
* బెంగళూరు, ఫరీదాబాద్‌లో బయోటెక్ క్లస్టర్ల అభివృద్ధి
మినహాయింపులు, ప్రోత్సాహాలు
* 19 అంగుళాల టీవీ తయారు చేసే స్వదేశీ సంస్థలకు పన్ను రాయితీ
* విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలకు పదేళ్లపాటు పన్ను మినహాయింపు
* కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గే అవకాశం.
* సబ్బుల ధరలు తగ్గే అవకాశం.
* గాలిమరల విద్యుత్‌కు పన్ను ప్రోత్సాహకాలు.
* సున్నపురాయి, డోలమైట్‌లపై పన్ను రాయితీ
* ఇనుము ధరలు తగ్గే అవకాశం.
* కెమికల్స్, పెట్రో కెమికల్స్ ఉత్పత్తులపై పన్ను రాయితీ.
* పాదరక్షలపై ఎక్సైజ్ సుంకం 12శాతం నుంచి 6శాతానికి తగ్గింపు.
* స్టెయిన్‌లెస్ స్టీల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు
వీటి పన్నులు పెరిగాయి
* రేడియో టాక్సీలపై సేవాపన్ను విధింపు.
* మ్యూచువల్ ఫండ్స్ బదలాయింపుపై పన్ను పెంపు
* శీతలపానీయాలు, పాన్ మసాలాలు ప్రియం
* బాక్సైట్ ఎగుమతిపై సుంకం 10 నుంచి 20శాతానికి పెంపు
* బ్రాండెడ్ దస్తులు, ప్యాకేజ్‌డ్ ఫుడ్ ధరలు తగ్గే అవకాశం
* పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 16శాతానికి పన్ను పెంపు

ఎఫ్‌డీఐలు 49 శాతం
* రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు 49 శాతానికి పెంపు, ఎఫ్‌డీఐలపై ప్రభుత్వ నియంత్రణ
* సరిహద్దుల భద్రతకు రూ.2,250కోట్లు
* బీమారంగంలోనూ ఎఫ్‌డీఐలు 49 శాతానికి పెంపు
* ప్రతీ ఇంటికి రెండు బ్యాంకు ఖాతాలు ఉండేలా చర్యలు
ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐలు
ఈ-కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. దేశంలో అనూహ్యంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ రంగంలో ఎఫ్‌డీఐలతో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొంటుందని ఆర్థికనిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఎంత శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఏడు పారిశ్రామిక నగరాలు
దేశంలో తయారీ రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తయారీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు దేశవ్యాప్తంగా ఏడు పారిశ్రామిక నగరాలు ఏర్పాటుచేస్తామన్నారు.
* దేశంలో తయారీ రంగం ఇంకా ప్రాథమికదశలోనే వుంది.
* తయారీ సంస్థలు తాము తయారుచేసిన ఉత్పత్తుల్ని రిటైల్ రంగం, ఈ-కామర్స్ విధానాల ద్వారా విక్రయించాల్సివుంది.
* ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ తిరిగి వృద్ధి చెందుతుందని సంకేతాలు వెలువడుతున్నాయి.
* రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో జీడీపీ 7-8 శాతానికి చేరుకుంటుంది.

ఆంధ్రా, తెలంగాణలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఇవే..
ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ఇవాళ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులిలా ఉన్నాయి..

*  ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ ఏర్పాటు
*  వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు
*  దేశవ్యాప్తంగా నెలకొల్పే నాలుగు ఎయిమ్స్ సంస్థల్లో ఒక దానిని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయనున్నారు.
*  ఎయిమ్స్‌సంస్థల ఏర్పాటుకు రూ.500 కోట్ల కేటాయింపు
*  కాకినాడ పోర్టుకు సమీపంలోని ప్రాంతాలను ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా గుర్తించడం
*  కాకినాడలో హార్డ్‌వేర్ పరిశ్రమను నెలకొల్పడంపై ప్రత్యేకదృష్టి
*  విశాఖ-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు
*  హిందూపురంలో నేషనల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ
*  ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీగా కృష్ణపట్నం

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: జైట్లీ
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. 2014-15 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను గురువారం ఆయన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయా మంత్రిత్వశాఖలు, అధికారం యంత్రాంగం సకాలంలో చేపడుతాయి ' అని అన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఉద్యానవన విశ్వవిద్యాలయం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

బాలికల కోసం 'బేటీ పఢావో బేటీ బఢావో'
* బాలికల సంరక్షణ కోసం 'బేటీ పఢావో బేటీ బఢావో' పథకం
* ఈ పథకానికి రూ. 500 కోట్లు కేటాయింపు.
* మహిళల సమస్యల పరిష్కారం కోసం దేశరాజధానిలో ఒక కేంద్రం
లింగవివక్షకు వ్యతిరేకంగా పాఠశాలల్లో విద్యాబోధన జరిగేలా మార్పులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

డిజిటల్ ఇండియాకు రూ. 500 కోట్లు
* గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ సేవలు విస్తృతానికి డిజిటల్ ఇండియాలో భాగంగా రూ. 500 కోట్లు కేటాయింపు.
* స్థానిక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలకు ప్రోత్సాహం
* అన్ని గ్రామాలను బ్రాడ్‌బాండ్‌తో అనుసంధానం చేస్తారు.

మౌలిక రంగానికి
* పారిశ్రామిక కారిడార్లకు సమాంతరంగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం.
* తమిళనాడు, రాజస్థాన్‌లలో సౌర విద్యుత్‌కు రూ.500కోట్లు.
* ఉపాధి హామీకి వ్యవసాయంతో అనుసంధానం.
* ప్రధమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటు.
* జాతీయ వారసత్వ సంపద పరిరక్షణ యోజనకు రూ.200కోట్లు
* మెరైన్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు రూ.115కోట్లు
* నదుల అనుసంధానంపై అధ్యయనానికి రూ.100కోట్లు
* ప్రధానమంత్రి కృషి సీంచాయీ యోజన కింద నీటిపారుదల వసతుల మెరుగుకు వెయ్యి కోట్లు
* దేశవ్యాప్తంగా మరో 60 ఆదాయపన్ను కేంద్రాల ఏర్పాటు
* రూ.200 కోట్లతో జమ్మూకాశ్మీర్‌లో క్రీడా సదుపాయాల పెంపు
* ఈశాన్య రాష్ట్రాల్లో రైలు మార్గాల విస్తరణకు రూ.వెయ్యికోట్లు
* కాశ్మీర్ శరణార్థుల సంక్షేమానికి రూ.500 కోట్లు

Tuesday, July 8, 2014

2014-15 రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు

(ఈనాడు సౌజన్యంతో)
ఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ ఇవాళ పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సదానందగౌడ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మలాంటిదని పేర్కొన్నారు. కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి ఎన్నో విజ్ఞాపనలు అందాయన్నారు. సరుకు రవాణాలో చైనా, రష్యా లాంటి దేశాల తర్వాత మనమే ముందున్నామన్నారు. రైల్వే ప్రతిరోజు 2.30కోట్ల మందిని గమ్య స్థానాలకు చేరుస్తోందని మంత్రి వివరించారు.
రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* రైల్వే సామాజిక బాధ్యతను మరువలేదు, ప్రయాణికుల భద్రతే మా ప్రధానాంశం
* రైల్వేకు వచ్చిన ఆదాయంలో రూపాయికి 90పైసలు ఖర్చుపెడుతున్నాం.
* 359 ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది, పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.1.80లక్షల కోట్లు కావాలి.
* హైస్పీడ్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతాం.
* సరకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామికావడమే లక్ష్యం.
* గత 10ఏళ్లలో రూ.41వేల కోట్లతో 3700 కి.మీ. కొత్త లైన్ల నిర్మాణం జరిగింది.
* ప్రజలపై భారం వేయకుండా ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టిపెడతాం.
* ఏడాదిలోగా రైల్వేని గాడిలో పెడతాం
* రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం.
* ఇప్పటి వరకు 676 రైల్వే ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తయ్యాయి.
* వచ్చే పదేళ్లలో రైల్వే ఆధునికీకరణకు రూ.5లక్షల కోట్ల నిధులు అవసరం.
* 30 ఏళ్లు నుంచి సగంలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి.
* ప్రయాణికులకు మరింత నాణ్యమైన భోజనం అందిస్తాం
* రైల్వే నిర్వహణలో ఎఫ్‌డీఐలను ఆశిస్తున్నాం.
* కేవలం ఛార్జీల పెంపు వల్లే రైల్వే అభివృద్ధి సాధ్యం కాదు
* ఈ ఏడాది రూ.602కోట్లు మిగులు ఆదాయం మా లక్ష్యం
* రైల్వే సదుపాయం లేని కొత్త ప్రాంతాలకు సేవలపై దృష్టి
* గత పదేళ్లలో 3,500 లైన్లకు రూ.41వేల కోట్లు వ్యయం అయింది.
*రైల్వే నిర్వహణలో నిధుల దుర్వినియోగాన్ని నియంత్రించాలి.
* వచ్చే పదేళ్ల వరకు ఏటా రైల్వే అభివృద్ధికి రూ.50వేల కోట్లు అవసరం
* ప్రైవేటు భాగస్వామ్యంతో అన్ని స్టేషన్లలో వంతెనలు, ఎస్కలేటర్లు ఏర్పాటుకు ప్రతిపాదన
* రైల్వే స్టేషనల్లో సీసీ కెమెరాల ద్వారా భద్రత పర్యవేక్షణ.
* ధరల పెంపుపై నిర్ణీత కాలంలో సమీక్ష జరగాలి.
* 2014-15లో రూ.1.64లక్షల కోట్లు రైల్వే టర్నోవర్‌గా అంచనా.
* ఇటీవల పెంచిన ధరల వల్ల రూ.8వేల కోట్ల ఆదాయం.
* డబ్లింగ్, ట్రిప్లింగ్‌లకు మొదటి ప్రాధాన్యం, కొత్తలైన్ల నిర్మాణానికి రెండో ప్రాధాన్యం
* ప్రైవేటు భాగస్వామ్యంతో రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన
* విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయంపై కేబినెట్ అనుమతి కావాలి.
* ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు ప్రతిపాదన
* ప్రధాన రైల్వే స్టేషన్లలో, నిర్దేశించిన రైళ్లలోనూ వైఫై వ్యవస్థ
* పోస్టాఫీసులు, మొబైళ్లలో టికెట్ల కొనుగోలు విధానం విజయవంతమైంది.
* ఈశాన్య భారతంలో విజ్ఞాన యాత్రలకు ప్రణాళికలు.
* రైల్వే సేవలపై ప్రయాణికుల అభిప్రాయం సేకరణ వ్యవస్థ ఏర్పాటు.
* రైల్వే లైన్ల విస్తరణకు ప్రథమ, కొత్త రైళ్లకు ద్వితీయ ప్రాధాన్యం
* వృద్ధులు, వికలాంగులను స్టేషన్‌లోకి తీసుకొచ్చేందకు బ్యాటరీ వాహనాలు.
* 50 రైల్వేస్టేషన్లలో పారిశుద్ధ్య పనులు ఔట్‌సోర్సింగ్‌కు అప్పగింత
* కాపలా లేని 5,400 క్రాసింగ్‌ల వద్ద ప్రత్యేక చర్యలు
* సాంకేతిక, సాంకేతికేతర విద్యతో కూడిన రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు
* ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం.
* చెన్నై-హైదరాబాద్ మధ్య సెమీ బులెట్ రైలు
* మెట్రోనగరాల్లోని 10 ప్రధాన స్టేషన్లలో అంతర్జాతీయ ప్రమాణాల కల్పన
* రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో సమూల మార్పులు
* ఎంపిక చేసిన లైన్లలో 160 నుంచి 200 కి.మీల వేగంతో నడిచే రైళ్లు
* అన్ని రైల్వేస్టేషన్లలో విశ్రాంతి గదులకు ప్రతిపాదన
* హైస్పీడ్ రైళ్లకు రూ.100కోట్లు కేటాయింపు
* మహిళా భద్రత కోసం 4వేలమంది మహిళా కానిస్టేబుళ్లు
* ఈ-టికెటింగ్ ద్వారా నిమిషానికి 7,200 టికెట్లు బుక్ చేసుకునేలా ఏర్పాట్లు
* రైల్వేల్లో పారిశుద్ధ్యానికి గతేడాది 40శాతం అధిక నిధులు
* రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ప్రయాణ సమయం గుర్తు చేసేలా అలర్ట్ మెసేజ్‌లు
* అన్ని మెట్రో నగరాలను కలుపుతూ వజ్ర చతుర్భుజి రైల్వే లైన్
* ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-చంఢీగడ్, ఢిల్లీ-కాన్పూర్‌లకు హైస్పీడ్ రైళ్లు
* కొత్తగా 5 జనసాధారణ్, 5 ప్రీమియం, 27 ఎక్ర్‌ప్రెస్ రైళ్లు
* కొత్తగా 6 ఏసీ, 8 ప్యాసింజర్, 2 మెమూ, 5 డెమూ రైళ్లు

2014-15 రైల్వే బడ్జెట్ హైలెట్స్

2014-15 రైల్వే బడ్జెట్ హైలెట్స్

Courtesy : Sakshi | Updated: July 08, 2014

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి సదానంద గౌడ మంగళవారం లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు:
* సేప్టీ, సెక్యూరిటీ, స్పీడ్ కు ప్రాధాన్యత
* కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రైల్వేలైన్ల అనుసంధానం
*  దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు అత్యంత కీలకం
* భారతీయ రైల్వే ముందు ఎన్నో సవాళ్లు
* రోజుకు 2కోట్ల 30లక్షలమందిని గమ్యానికి చేరుస్తోంది
* భద్రత, సౌకర్యాలపై రాజీ పడేది లేదు
* హైస్పీడ్ నెట్ వర్క్ ను నెలకొల్పుతాం
* గత సంవత్సరం 99 కొత్త లైన్లకు అనుమతిస్తే ఒక్కటే పూర్తి
* 359 ప్రాజెక్టులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది.
* ప్రతిపాదిత ప్రాజెక్టుల పూర్తికి 5 లక్షల కోట్లు అవసరం
* రైల్వేల అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు చాలా అవసరం
* కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి చాలా విజ్ఞాపనలు వచ్చాయి
* ఆదాయంలో ప్రతి రూపాయికి 94 పైసలు ఖర్చు పెడుతున్నాం
* 12,500 రైళ్లలో సురక్షిత ప్రయాణం అందిస్తున్నాం
* ఏడాదిలోగా రైల్వే వ్యవస్థను గాడిలో పెడతాం
* సరకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామి కావటమే లక్ష్యం
* రైల్వే సామాజిక బాధ్యత మరవలేదు
* 30ఏళ్ల నుంచి సగంలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి
* భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మలాంటిది
* ప్రజలపై భారం వేయకుండా ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి
* రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
* ప్రాజెక్టుల ఆమోదం పైనే తప్ప పూర్తిపైన దృష్టి కొరవడింది
* సరుకు రవాణాలో కొంత తగ్గుదల
* పదేళ్లలో 99 కొత్త లైన్లకు రూ. 60 వేల కోట్లు ఖర్చు
* 1,57,888 కోట్లు విలువైన ప్రాజెక్టులు ఆమోదం పొందాయి
* 676 రైల్వే ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తి
* నాణ్యమైన భోజనం అందించేందుకు క్యాటరింగ్ వ్యవస్థ సంస్కరిస్తాం
* రైళ్లలో అందుబాటులో రెడీ టూ ఈట్ ఫుడ్
* అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఫుడ్ కోర్టులు
* అన్ని ప్రధాన స్టేషన్లలో సీనియర్ సిటిజన్లకు బ్యాటరీ కార్లు
* అన్ని స్టేషన్లలో రైల్వే ఆన్ లైన్ రిజర్వేషన్ సౌకర్యం
* నాణ్యత పాటించని వారిపై కఠిన చర్యలు, అవసరమైతే కాంట్రాక్ట్ రద్దు
* రైళ్లలో పరిశుభ్రతకు కేటాయించే నిధులు 40 శాతం పెంపు
* పెండింగ్ ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం ఈ ఏడాది పూర్తి చేసేందుకు యత్నం
* 11,794 కోట్ల లోన్ కోసం ప్రయత్నం
* రైళ్లలో లోపాలు గుర్తించేందుకు అల్ట్రా సోనిక్ రైల్ స్కానింగ్ సిస్టమ్ ఏర్పాటు
* ఆర్ పీఎఫ్ బలగాలకు మొబైల్ ఫోన్లు
* రైల్వే స్టేషన్లు వచ్చాకే తలుపులు తెరుచుకునేలా ఆటోమేటిక్ డోర్ లాకింగ్ సిస్టమ్
* ముంబయి-అహ్మదాబాద్ మధ్య తొలి బులెట్ ట్రయిన్
* అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ 'రైల్వే వజ్ర చతుర్భుజి' హైస్పీడ్ రైళ్లు
* నిమిషానికి 7200 టికెట్లు ఇచ్చేలా ఈ టికెటింగ్ వ్యవస్థ తీర్చిదిద్దుతాం
* 4వేల  మహిళా ఆర్ పీఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం
* ఎంపిక చేసిన 9 మార్గాల్లో రైళ్ల స్పీడ్ 160 కిలోమీటర్లు నుంచి 200 కిలోమీటర్లుకు పెంచుతాం
* అయిదేళ్లలో పేపర్ లెస్ రైల్వే కార్యాలయాలు
* త్వరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు
* అన్ని ఏ కేటగిరి రైళ్లలో ఉచిత వై ఫై సౌకర్యం
* ఈశాన్య రాష్ట్రాలకు ఏకో టూరిజం రైళ్లు, ఎడ్యుకేషన్ రైళ్లు
* రైల్వే కార్యాలయాల్లో సోలార్ పవర్ వినియోగం
* ఈ ఏడాది 602 కోట్ల మిగులు ఆదాయం లక్ష్యం
* రైల్వే రిజర్వేషన్లకు పోస్టాఫీసులు వాడకం
* ఏకో టూరిజానికి ప్రాధాన్యత
* పార్శిల్ రవాణాలో ప్రయివేట్ భాగస్వామ్యం
* రైల్వేకు కేంద్రం రూ.1100 కోట్లు సాయం
* చెన్నై-హైదరాబాద్ మధ్య  బుల్లెట్ రైలు
* ఆన్ లైన్ లో ఫ్లాట్ ఫాం టిక్కెట్
* విద్యార్థులకు ప్రత్యే రాయితీలు
* నాగపూర్-సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ ట్రయిన్
* కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పూర్తి సహకారం
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
* ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు
* ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లు
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.20,680 కోట్లు అవసరం
* టికెట్ల అమ్మకం ద్వారా రూ. 44,645 కోట్లు ఆదాయం
* రైల్వే టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
* త్వరలో రైల్వేబోర్డులో మార్పులు చేర్పులు
* చార్ థామ్, కేదారనాథ్,బద్రీనాథ్ లకు రైల్వే కనెక్టివిటీ
* ఎస్ ఎంఎస్ ద్వారా రైళ్లలో ఫుడ్ ఆర్డర్
* కొత్తగా అయిదు జన సాధారణ్ రైళ్లు
* విజయవాడ-ఢిల్లీ మధ్య  ఏసీ ఎక్స్ ప్రెస్ కొత్తరైలు
* సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య కొత్త రైలు
* విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్
* పారాదీప్-విశాఖ మధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్

Monday, June 2, 2014

ఆశలన్నీ విశాఖ ‘ఐటీ’ పైనే

Sakshi | Updated: June 02, 2014 14:10 (IST)
సాక్షి, విశాఖపట్నం: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక్కడి వనరుల్ని ఉపయోగించుకుని ఐటీ పరిశ్రమ ఎదిగేలా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై విశాఖలోని రుషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ (రిట్పా), విశాఖ అభివృద్ధి మండలి (వీడీసీ) ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. ఈ ప్రణాళికను కాబోయే ముఖ్యమంత్రికి ఇవ్వనున్నట్లు ఈ సంఘాల ఉపాధ్యక్షుడు ఒ.నరేష్‌కుమార్ చెప్పారు.

ఇక్కడ 70 ఐటీ కంపెనీలు, నాలుగు ఎస్‌ఈజెడ్‌లు ఉన్నాయి. 10,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్న విశాఖ ఐటీరంగ వార్షిక వ్యాపారం రూ.1,450 కోట్లు. ఇప్పటివరకు ఇక్కడ ఐటీ రంగం నిర్లక్ష్యానికి గురైంది. ఐటీ కంపెనీలు, ఉద్యోగుల బ్యాంకింగ్, ఇతర సమావేశాల నిర్వహణ కోసం 2012లో ఐటీ మంత్రి పొన్నాల రూ.23 కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి విశాఖలో శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ అది పునాదుల దశ దాటలేదు. రెండో ఇంక్యుబేషన్ సెంటర్‌కు ఎస్‌టీపీఐ రూ.16 కోట్లు ఇచ్చినా ప్రభుత్వం స్థలం ఇవ్వలేదు.

ప్రసుత్తం విశాఖలోని 70 కంపెనీల్లో 20 వరకే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. నాలుగు సెజ్‌లలో రెండే నడుస్తున్నాయి. దీంతో 2014-2015కి రూ.5 వేల కోట్లు దాటాల్సిన టర్నోవర్ రూ.1,450 కోట్ల వద్ద, 70 వేలు దాటాల్సిన ఉద్యోగుల సంఖ్య 10,200 వద్ద ఆగిపోయాయి. ఎస్‌ఈజెడ్‌కు వచ్చిన కంపెనీలు బ్యాంకు రుణాలు తెచ్చుకునేందుకు నిబంధనలు అడ్డంకిగా మారాయి.

విశాఖకు రూ. 50 వేల కోట్లతో ఐటీఐఆర్ ప్రకటించారు. దీనికోసం 10 వేల ఎకరాల భూముల సేకరణకు హడావుడి చేసినా ప్రస్తుతం దాని ఊసే లేదు. అన్నింటికిమించి వేసవిలో అధిక విద్యుత్ వాడకం పేరుతో  ఐటీ కంపెనీల నుంచి యూనిట్‌కు రూ.50 చొప్పున ట్రాన్స్‌కో వసూలు చేయటం మరింత ఇబ్బందిగా మారింది. కొత్త రాష్ట్రంలో అయినా విశాఖలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందని నిపుణులు ఆశిస్తున్నారు.

 రిట్పా, వీడీసీ రూపొందించిన ప్రణాళికలోని కీలకాంశాలు
* ప్రస్తుతమున్న ఐటీ ఎస్‌ఈజెడ్‌లను డీ నోటిఫై చేయాలి. తద్వారా ఖాళీగా ఉన్న సెజ్‌ల్లోకి కొత్త కంపెనీలు వస్తాయి.
 ఠ చాలా ఐటీ కంపెనీలు నిర్మాణాలు పూర్తిచేసి రకరకాల అనుమతుల సమస్యలతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. వాటిల్లో ఏవైనా కొత్త కంపెనీలు ప్రారంభించేలా నిబంధనలు మార్చితే సీమాంధ్రలో 25 నుంచి 40 వరకు వరకు కొత్త ఐటీ కంపెనీలు రావచ్చు.

* వైజాగ్, విజయవాడ, తిరుపతి, కాకినాడ నగరాల్లో 10 లక్షల నుంచి 25 లక్షల ఎస్‌ఎఫ్‌టీతో కూడిన ఐటీ పార్కులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. సత్వరమే అనుమతులు మంజూరయ్యేలా సింగిల్ విండో క్లియరెన్స్ విధానం ప్రవేశపెట్టాలి. ఉన్నతాధికారులను నియమించి పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అండగా నిలబడాలి. కొత్త ఐటీ పార్క్‌లను అభివృద్ధి చేసుకునే వారికి రెండువారాల్లోనే మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి అనుమతులు ఇచ్చేలా చూడాలి.

* కంపెనీలు ప్రారంభించే యాజమాన్యాలు ఆర్థికంగా నిలదొక్కుకునేవరకు మూడేళ్లపాటు మున్సిపల్, ఇతర పన్నులు లేకుండా చూడాలి. ఒక్కో ఐటీ పార్క్‌లో తక్కువ ఖర్చుతో గుజరాత్ తరహాలో ప్రభుత్వం ఉచిత బ్యాండ్‌విడ్త్ సౌకర్యం తీసుకురావాలి.

* సాఫ్ట్‌వేర్ లెసైన్స్‌లు లేకుండా చేసి బదులుగా ఒక్కో కంపెనీ కనీసం 50 మందికిపైగా ఉద్యోగులను అదనంగా చేర్చుకునే విధానం తేవాలి.

* ఐటీ కంపెనీలకు నిరంతర విద్యుత్ అవసరం. ఐటీ ప్రగతిబాటలో పయనించడానికి ప్రభుత్వం 25 శాతం సబ్సిడీతో సోలార్‌పవర్ వాడకానికి అనుమతులు ఇవ్వాలి.

* 10 లక్షల ఎస్‌ఎఫ్‌టీతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఐటీ పార్క్ నిర్మించి హైటెక్‌సిటీ తరహాలో కంపెనీలకు కేటాయించాలి. వరుసగా మూడేళ్లు 50 శాతం అద్దె రాయితీ ప్రకటిస్తే కొత్త కంపెనీలను ఆకట్టుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని అనేక కంపెనీలు ఇక్కడకు తొందరగా వచ్చి కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తిచూపుతాయి.

* వీటన్నింటి ద్వారా రూ.1,500 కోట్లకుపైగా ఐటీ వ్యాపారం జరగడమేకాకుండా ప్రత్యక్షంగా 15 వేలమందికి ఐటీ ఉద్యోగాలు, పరోక్షంగా 45 వేలమందికి ఉపాధి కల్పించవచ్చు. భారీగా అనుబంధ రంగాలు వృద్ధిచెందుతాయి.

Saturday, March 29, 2014

ఇక కంపెనీల్లో కనీసం ఒక మహిళా డెరైక్టర్

Sakshi | Updated: March 29, 2014 02:06 (IST)
ఇక కంపెనీల్లో కనీసం ఒక మహిళా డెరైక్టర్
 న్యూఢిల్లీ: కొత్త కంపెనీల చట్టం-2013లోని మరో 10 చాప్టర్లకు సంబంధించిన నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. ముఖ్యంగా ఇందులో కంపెనీ బోర్డులో డెరైక్టర్ల నియామకం, వాళ్లకుండే అధికారాలు-అర్హతలు, బోర్డు సమావేశాలు, డివిడెండ్‌ల ప్రకటన-చెల్లింపు ఇతరత్రా అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఆరు దశాబ్దాలనాటి పాత చట్టం స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త కంపెనీల చట్టం అమల్లోకి రానుంది. కంపెనీల ఏర్పాటు, సెక్యూరిటీల కేటాయింపు, వాటా మూలధనం, డిబెంచర్లు వంటివాటికి సంబంధించిన చాప్టర్లు కూడా కార్పొరేట్ వ్యవహారాల శాఖ నోటిఫై చేసిన చాప్టర్లలో ఉన్నాయి.

 కాగా, 180కి పైగా సెక్షన్లకు సంబంధించి ఇటీవలే ఉత్తర్వులు వెలువడగా, మొత్తం షెడ్యూళ్లన్నింటినీ ఇప్పటికే నోటిఫై చేయడం తెలిసిందే. ఈ కొత్త చట్టంలో మొత్తం 29 చాప్టర్లు, 7 షెడ్యూళ్లు, 470 సెక్షన్లు ఉన్నాయి. మిగతా నిబంధనలను ఎప్పటికల్లా నోటిఫై చేస్తారు, వాటికి కంపెనీలు పాటించేందుకు ఏదైనా అదనపు గడువు ఇస్తారా అనేది వేచిచూడాల్సి ఉందని కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్ ఇండియా ఎల్‌ఎల్‌పీకి చెందిన యోగేష్ శర్మ అభిప్రాయపడ్డారు. గతేడాది ఆగస్టులో ఈ చట్టానికి పార్లమెంట్ ఆమోదముద్ర పడింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో కొత్త కంపెనీల చట్టానికి సబంధించిన ఉత్తర్వుల జారీకి ఈ నెల 20న ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతించింది.

 కంపెనీ బోర్డుల్లో మహిళా వాణి...
 కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం ఇకపై చాలావరకూ కంపెనీలు తమ డెరైక్టర్ల బోర్డులో కనీసం ఒక మహిళకు స్థానం కల్పించాల్సిందే. అదేవిధంగా ఇద్దరు స్వతంత్ర డెరైక్టర్ల నియామకం కూడా తప్పనిసరి. లిస్టెడ్ కంపెనీల్లో చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా తమతరఫున ఒక డెరైక్టర్ కోసం డిమాండ్ చేస్తే నియమించాల్సి వస్తుంది కూడా. రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ పెయిడ్‌అప్ షేర్ క్యాపిటల్ ఉన్న లిస్టెడ్, పబ్లిక్ సంస్థలన్నీ కూడా ఒక మహిళా డెరైక్టర్‌ను నియమించుకోవాలని కొత్త నిబంధనలు నిర్ధేశిస్తున్నాయి.  కాగా, చిన్న షేర్ హోల్డర్ల తరఫున డెరైక్టర్‌ను నియమించాలంటే కనీసం 1,000 మంది లేదా మొత్తం చిన్న వాటాదార్లలో పదింట ఒకటో వంతు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది.

సౌర విద్యుత్తుకు మోకాలడ్డు

ట్రాన్స్‌కో/డిస్కమ్‌లతో ఇబ్బందులు
ప్రభుత్వ విధానం మాత్రం ఆర్భాటం
అమలులో పూర్తిగా విఫలం
ఘొల్లుమంటున్న 'క్యాప్టివ్' యూనిట్లు
ఏపీఈఆర్‌సీ పైనే ఆశలు

Courtesy : ఈనాడు
మన దేశంలో సౌర విద్యుత్తుకు అవకాశాలు అధికం. దీన్ని గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాలు అందిపుచ్చుకున్నాయి. ఎంతో ముందంజ వేశాయి కూడా. కానీ మన రాష్ట్రం మాత్రం వెనుకబడిపోయింది. విధానాల అమల్లో గందరగోళం, అలసత్వం, విద్యుత్తు విభాగాల్లో సానుకూల వైఖరి లేకపోవటం దీనికి కారణాలు. సౌర విద్యుత్తుకు అండగా నిలుస్తూ 2012, సెప్టెంబరులోనే రాష్ట్ర ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ సౌర విద్యుత్ విధానా'న్ని విడుదల చేసింది. పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం.. ఇది ఎంతో అనుకూలమైన విధానం. కానీ అమలులో ఇది పూర్తిగా విఫలమైంది.
ప్రభుత్వ సౌర విద్యుత్ విధానం చూస్తే.. ఎవరైనా ఆహా, ఓహో అనాల్సిందే...! రాష్ట్రంలోని పలు సంస్థలు ప్రభుత్వ విధానానికి మురిసిపోయి.. సొంత (క్యాప్టివ్) సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పాయి. ఇప్పుడవే సంస్థలు నానా అవస్థలు పడుతున్నాయి. 2012 సెప్టెంబరులో 39, 44 జీవోల ద్వారా ప్రత్యేక సౌర విద్యుత్తు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2017 వరకూ ఇది అమల్లో ఉంటుంది. ఈవిధానం ప్రకారం సౌర విద్యుత్ యూనిట్లకు ట్రాన్స్‌మిషన్-వీలింగ్ (విద్యుత్తు ప్రసార, రవాణా) ఛార్జీలుండవు. ఉత్పత్తి చేసిన విద్యుత్తులో వాడుకోకుండా మిగిలిన దానికి 'బ్యాంకింగ్ సదుపాయం' ఉంటుంది. ఈ విధానాన్ని వినియోగించుకోవడానికి 2 శాతం బ్యాంకింగ్ ఛార్జీల కింద చెల్లిస్తే సరిపోతుంది. థర్డ్ పార్టీ విద్యుత్తు అమ్మకానికి క్రాస్ సబ్సిడీ ఛార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. అన్ని సౌర విద్యుత్తు కేంద్రాలకూ విద్యుత్ పన్ను నుంచి మినహాయింపు ఉంది. వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను వాణిజ్య పన్నుల శాఖ తిరిగి చెల్లిస్తుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పరిశ్రమల శాఖ నుంచి తిరిగి చెల్లిస్తారు. అధిక తరుగుదల సదుపాయం ఉండటం, భవిష్యత్తులో విద్యుత్తు యూనిట్ ధర పెరిగినా ఇబ్బంది లేని పరిస్థితి, పెట్టిన పెట్టుబడి అయిదారేళ్లలో వెనక్కి తిరిగొచ్చే అవకాశం... అదనపు ఆకర్షణలు.

అమలు శూన్యం!
రాష్ట్రంలో ఒకటి నుంచి పది మెగావాట్ల వరకూ సామర్థ్యం కల సొంత సౌర విద్యుత్తు యూనిట్లు 30-40 దాకా ఏర్పాటయ్యాయి. సౌర విద్యుత్తుకు ఒక మెగావాట్ సామర్థ్యానికి గతంలో రూ.10-12 కోట్ల వరకూ వెచ్చించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం స్థాపిత వ్యయం రూ.7-7.5 కోట్లకు తగ్గింది. దీంతో పలు సంస్థలు సొంత యూనిట్లు పెట్టుకున్నాయి. ఆ తర్వాత కానీ కష్టాలు తెలిసిరాలేదు. డిస్కమ్/ట్రాన్స్‌కోల నుంచి దీర్ఘకాలిక ఓపెన్ యాక్సెస్ ఒప్పందం (ఎల్‌టీఓఏఏ) ఖరారు కావటానికి యూనిట్ నిర్మాణం పూర్తయి గ్రిడ్‌కు కనెక్ట్ అయిన తర్వాత రెండు మూడు నెలల సమయం పడుతోంది. ఈ లోపు క్యాప్టివ్ యూనిట్లు ఉత్పత్తి చేసే విద్యుత్తు అంతా డిస్కమ్‌ల సొంత ఖాతాలో పడుతోంది. ఆ సంస్థలు వాడుకోవడానికి అవకాశం ఉండట్లేదు. సౌర విద్యుత్తు విధానం ప్రకారం వాడుకోకుండా మిగిలిపోయిన విద్యుత్తుకు 'బ్యాంకింగ్ సదుపాయం' ఇవ్వాలి. దీన్ని ట్రాన్స్‌కో/డిస్కమ్‌లు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ విధానంతో తమకు పనిలేదని, ఏపీఈఆర్‌సీ (ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ సంస్థ) ఆదేశాలనే తాము పాటించాల్సి ఉంటుందని అవి స్పష్టం చేస్తుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిని క్యాప్టివ్ యూనిట్లు ఎదుర్కొంటున్నాయి. ఏదైనా సందర్భంలో గ్రిడ్ నెట్‌వర్క్ పనిచేయక సౌర యూనిట్ల నుంచి విద్యుత్తు తీసుకోలేని పక్షంలో దాన్ని డిస్కమ్‌లు తీసుకున్నట్లుగానే భావించాలని కోరుతుండగా దానికి ఎటువంటి స్పందన లేదు. ఇక వీలింగ్, ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు వసూలు చేయకూడదు. అయినా వసూలు చేస్తున్నారు.

కోట్ల రూపాయల నష్టం
ఓపెన్ యాక్సెస్ ఒప్పందం ఖరారు కావటంలో జరుగుతున్న జాప్యం.. విద్యుత్తు బ్యాంకింగ్ సదుపాయాన్ని అమలు చేయకపోవటం వల్ల సౌర విద్యుత్తు యూనిట్లు కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి. అవి ఉత్పత్తి చేసి వాడుకోగా మిగిలిన విద్యుత్తు అంతా ప్రస్తుతం విద్యుత్తు పంపిణీ సంస్థల ఖాతాల్లోకి వెళ్లిపోతోంది. దీనికి బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించటం పరిష్కారం కాగా.. దాన్ని డిస్కమ్‌లు అమలు చేయటం లేదని ఆయా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సౌరవిద్యుత్తు ప్రతిరోజూ సాయంత్రం వరకు మాత్రమే లభిస్తుంది. ఏదైనా వ్యాపార సంస్థ ఆ తర్వాత విద్యుత్తును వినియోగించుకుంటే దానికి పగలు ఉన్న మిగులు విద్యుత్తును సర్దుబాటు చేయటం లేదు. ఈ విధంగా జరుగుతున్న నష్టం కూడా భారీగా ఉంటోంది. తాము రోజుకు పదివేల యూనిట్లకు పైగా విద్యుత్తును నష్టపోతున్నట్లు ఇటీవల సౌర విద్యుత్తు కేంద్రాన్ని స్థాపించిన సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

అనుమతుల కోసం తంటా
ఇక రాష్ట్రంలో సొంత సౌర విద్యుత్ కేంద్రాన్ని స్థాపించాలంటే దానికి అనుమతుల కోసం ట్రాన్స్‌కో/డిస్కమ్‌ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోవలసిందే. దరఖాస్తు చేసిన నాటి నుంచి సాధ్యాసాధ్యాల నివేదిక, ప్లాంట్ నిర్మాణం, ఓపెన్ యాక్సెస్ ఒప్పందం, మీటర్లు నెలకొల్పటం వరకూ వివిధ దశల్లో విద్యుత్తు కార్యాలయాల చుట్టూ తిరగాలని, డిస్కమ్/ట్రాన్స్‌కోలోని వివిధ విభాగాలు/సెక్షన్లలోని అధికారుల నుంచి వందలాది సంతకాలు తీసుకోవాలని సంబంధిత వర్గాలు వాపోతున్నాయి. ఓపెన్ యాక్సెస్ ఒప్పందం ప్రక్రియ ఏదో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఇచ్చినంత పెద్దదిగా ఉందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సౌర యూనిట్లకు ఈ ప్రక్రియను కుదించాల్సిన అవసరం ఉందని సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ సంస్థ అధిపతి ఒకరు అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చేవారు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ఏపీఈఆర్‌సీ ఆదేశాల కోసం ఎదురుచూపులు
ఈ నేపథ్యంలో క్యాప్టివ్ యూనిట్లు ఇప్పుడు ఏపీఈఆర్‌సీ వైపు చూస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం బ్యాంకింగ్ సదుపాయాన్ని వర్తింపజేయాలని, వీలింగ్/ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు వసూలు చేయరాదని డిస్కమ్‌లను ఏపీఈఆర్‌సీ ఆదేశించాలని కోరుతున్నారు. మరోపక్క వాడుకోకుండా మిగిలిన విద్యుత్తుకు (బ్యాంక్‌డ్ ఎనర్జీ), డిస్కమ్‌లు ఆ ఏడాదిలో వివిధ మార్గాల్లో కొనుగోలు చేసిన సగటు విద్యుత్ ధరలో 50 శాతం చొప్పున చెల్లించాలనే ప్రతిపాదన ఒకటి ఉంది. ఈ సగటు ధర రూ.3-3.50 కంటే ఉండదు. దీన్లో 50 శాతం అంటే, రూ.1.50- 1.75 మాత్రమే. మిగులు విద్యుత్తుకు వాణిజ్య ధర చెల్లించాలి కానీ ఇంత తక్కువ ఇస్తే ఎలాగని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అంశాలను ఏపీఈఆర్‌సీ పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నారు.
వెయ్యి మెగావాట్లు హుళక్కే!
రాష్ట్రంలో 1000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి వీలుగా యూనిట్లు ఏర్పాటు చేసే ఆసక్తిగల సంస్థల నుంచి కు ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియ ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో సౌర విద్యుత్తు యూనిట్ల ఏర్పాటుకు వివిధ సంస్థలు ఇతర రాష్ట్రాల వైపు దృష్టి సారిస్తున్నాయి. దీంతో విద్యుత్తు కొరతను ఎంతోకొంత అధిగమించే అవకాశం చేజారిపోతోంది. జవహర్‌లాల్ సోలార్ ఎనర్జీ మిషన్ (జేఎస్ఈఎం) కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు రెండు దశల్లో 95 మెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యాన్ని మంజూరు చేసింది. కానీ ఇందులో నాలుగో వంతు కూడా అమలు కాలేదు. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 1000 మెగావాట్ల సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని ప్రతిపాదించి, అందుకు 2012 సెప్టెంబరులో టెండర్లు పిలిచింది. దీనికి స్పందించి వచ్చిన బిడ్లలో 184 బిడ్లు సాంకేతికంగా అర్హత సంపాదించాయి. కానీ చివరికి 7 సంస్థలు మాత్రమే యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చాయి. అవి నెలకొల్పాలనుకుంటున్న యూనిట్ల మొత్తం సామర్థ్యం 50-60 మెగావాట్లు మాత్రమే. సౌర విద్యుత్తుకు యూనిట్‌కు రూ.6.49 కొనుగోలు ధరను మంత్రుల బృందం నిర్ణయించగా ఇది ఆకర్షణీయ ధర కాదని పలు సంస్థలు వెనక్కి తగ్గాయి. ఇది ఎంతో తక్కువ ధర అని, ఈ ధరకు ఉత్పత్తి ఎక్కడా సాధ్యం కాదని, కాస్త ఎక్కువ ధర ఇచ్చేందుకు సిద్ధపడితే మరింతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తారని పరిశ్రమ ప్రతినిధి ఒకరు వివరించారు. వేసవిలో, ఇతర సందర్భాల్లో విద్యుత్తు లేక రాష్ట్రంలో యూనిట్ విద్యుత్తును రూ.7-12 వరకూ పెట్టి కొనుగోలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మరోపక్క రూ.6.49 ధరకు యూనిట్లు స్ధాపించేందుకు సిద్ధపడిన సంస్థలతో ఇంతవరకూ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదర్చుకోలేదు. ఈ వ్యవహారం ప్రభుత్వం వద్ద, ట్రాన్స్‌కోలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికలు రావటం, ఆతర్వాత రాష్ట్ర విభజన ఉండటంతో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు వేగంగా ముందుకు సాగే అవకాశం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యం ప్రస్తుతానికి కొండెక్కినట్లే భావించాలి.

వాస్తవానికి రాష్ట్రంలో పెద్దఎత్తున సౌర విద్యుత్తు సామర్థ్యం సమకూర్చుకునేందుకు అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో 1500 మెగావాట్ల వరకూ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించేందుకు అవకాశం ఉందని ఆ వర్గాల కథనం. ఇంకా రిటైల్ వినియోగంలోనూ సౌర విద్యుత్తును ప్రోత్సహించవచ్చు. మెదక్, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, నల్గొండ తదితర జిల్లాల్లో సౌర విద్యుత్తు యూనిట్ల స్థాపనకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. దీన్ని ప్రభుత్వం అందిపుచ్చుకోవలసిన అవసరం ఉంది.

Tuesday, March 11, 2014

హైదరాబాద్‌లో మళ్లీ విమానాల పండుగ

12 నుంచి 16 వరకు బేగంపేటలో..
జీఎంఆర్, జీవీకేలు ప్రధాన ఆకర్షణ

విమానాల పండుగ మళ్లీ వచ్చింది. రెండేళ్లకోసారి వచ్చే శోభాయమానమైన 'ఇండియా ఏవియేషన్ షో' మరోసారి హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకూ అయిదు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనకు బేగంపేట విమానాశ్రయం వేదిక. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఉమ్మడిగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాయి. దిగ్గజాలనదగ్గ విమానయాన కంపెనీలెన్నో ఈ ప్రదర్శనలో పాలుపంచుకోనున్నాయి. విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శనతో పాటు వివిధ పౌర విమానయాన అంశాలపై చర్చాగోష్ఠులు, సీఈఓ ఫోరమ్ నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, సంస్థలకు ఇది విశేష అనుభూతి మిగల్చనుంది. ఈసారి ప్రదర్శనలో 250 మంది ఎగ్జిబిటర్లు పాలుపంచుకుంటారని, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సందర్శకులు విచ్చేస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ హాజరు కావచ్చని తెలుస్తోంది.

పెద్ద వ్యాపారావకాశం...
మనదేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న విమానయాన సదుపాయాలు, సేవలను పరిగణనలోకి తీసుకుంటే ఇదొక పెద్ద వ్యాపారావకాశమని స్పష్టమవుతోంది. అందుకే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రెండేళ్లకోసారి జరిగే ఏవియేషన్ షోలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నాయి. ఈ ఏడాది జరిగేది నాలుగో ప్రదర్శన కాగా, హౖదరాబాద్‌లో ఇది జరగడం రెండోసారి. మనదేశంలో 2016-17 నాటికి విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య 58 కోట్లకు చేరుతుందని అంచనా. దీనికి తగ్గట్లుగా విమానాశ్రయాల నిర్మాణం, విమాన సర్వీసులు, సేవలు విస్తరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.4,662 కోట్ల అంచనా వ్యయంతో దేశంలోని 35 ద్వితీయ శ్రేణి (నాన్- మెట్రో) నగరాల్లోని విమానాశ్రయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విస్తరించటానికి సంసిద్ధమవుతోంది. ఇదేకాకుండా 10 నూతన విమానాశ్రయాల నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిధుల కొరత ఎదురుకాకుండా ఉండటానికి విమానాశ్రయాల సదుపాయాల కల్పనలో నూరు శాతం విదేశీ పెట్టుబడికి కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం విదితమే. మరోపక్క ఈ రంగానికి అవసరమైన మానవ వనరుల లభ్యతను పెంపొందించేందుకు అనువుగా ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ (ఐజీఆర్‌యూఏ)ని దాదాపు రూ.32 కోట్ల వ్యయంతో విస్తరిస్తున్నారు. అంతేగాక మహారాష్ట్రలోని గోండియాలో అధునాతన పైలెట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే ప్రతిపాదించింది. ఇక ఎంఆర్ఓ (మెయింటెనెన్స్- రిపేర్- ఆపరేషన్స్) విభాగంలోనూ వివిధ విమాన సంస్థలు మనదేశానికి కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. హైదరాబాద్‌లో, దేశంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో ఎంఆర్ఓ కేంద్రాలను నెలకొల్పుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న ఏవియేషన్ షోకు విశేష ప్రాధాన్యం కనిపిస్తోంది. ఎంఆర్ఓ పరిశ్రమ 2010లో ఉన్న రూ.2,250 కోట్ల నుంచి 2020 నాటికి రూ.7,000 కోట్లకు పెరుగుతుందని అంచనా. చిన్న సైజు ఏటీఆర్-72 విమానాలను తిప్పటానికి అనువైన నూతన విమానాశ్రయాలు మనదేశంలోని మూడు రాష్ట్రాల్లో నిర్మించాలని అలయన్స్ ఎయిర్ భావిస్తోంది. ఇటువంటి పలు విమానాల తయారీ, విమానాశ్రయాల నిర్మాణం- నిర్వహణ సంస్థలు, ఎంఆర్ఓ సంస్థలు ఈ ప్రదర్శనలో పాలు పంచుకోనున్నాయి. విమానాశ్రయాల నిర్మాణం-నిర్వహణలో రాష్ట్రానికి చెందిన జీవీకే, జీఎంఆర్ సంస్థలు క్రియాశీలకంగా ఉన్న విషయం విదితమే. ఈ సంస్థలు ఏవియేషన్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

బోయింగ్ నుంచి..
విమానాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన బోయింగ్ ఈసారి హైదరాబాద్‌లో జరిగే ఏవియేషన్ షోలో తన సరికొత్త విమానాలను ప్రదర్శించనుంది. వాణిజ్య పౌర విమానాలైన 737-8 మ్యాక్స్, నూతన 777-9ఎక్స్ శ్రేణి, 777-300 ఈఆర్ (ఎక్స్‌టెండెడ్ రేంజ్), 787-8 విమానాలను ప్రదర్శించనున్నట్లు బోయింగ్ వెల్లడించింది. గత ఏడు దశాబ్దాలుగా భారత్‌లో పౌర విమానయాన రంగం విస్తరించటంలో తాము ఎంతో బహుముఖ పాత్ర పోషించామని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏవియేషన్ షోలో తాము పాల్గొనబోతున్నామని బోయింగ్ ఇండియా అధ్యక్షుడు ప్రత్యూష్ కుమార్ వివరించారు. కేవలం విమానాల సరఫరాకు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలో నిర్వహణ- మరమ్మతులు, ఇంజనీరింగ్, నైపుణ్యాల విస్తరణ, విడిభాగాల తయారీతో కూడిన విమానయాన రంగం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయనున్నామని ఆయన పేర్కొన్నారు.
ఎంబ్రార్ సైతం...
ఈసారి ప్రదర్శనలో ఎంబ్రార్ తన ఎగ్జిక్యూటివ్ విమానాలను ప్రదర్శించబోతోంది. ఇందులోని 'లీనియేజ్ 1000ఇ' ఈసారి ప్రధాన ఆకర్షణ కాబోతోంది. ఇంకా లెగసీ 650, ఫెనామ్ 300, ఫెనామ్ 100 జెట్స్ కూడా ప్రదర్శనలో ఉంటాయి. బిజినెస్ విమానయాన విపణిలో 2000వ సంవత్సరంలో ఎంబ్రార్ ప్రవేశించింది. అక్కడి నుంచి ఎంతోవేగంగా తన విమానాల శ్రేణిని విస్తరించింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో సర్వీసు కేంద్రాలు, విడిభాగాల పంపిణీ కార్యకలాపాలు ఉన్నాయి. ప్రస్తుతం 50 దేశాల్లో 700 ఎంబ్రార్ ఎగ్జిక్యూటివ్ జెట్‌లు విమానయాన సేవలు అందిస్తున్నాయి.
ఎయిర్‌బస్ ఎ380
ఎయిర్‌బస్ నుంచి అందుబాటులో ఉన్న విమానాల్లో ఎ380కి ఉన్న ఆకర్షణే వేరు. ఏవియేషన్ షోలో భాగాంగా స్వయంగా ఎ380 విమానాన్ని పూర్తిగా చూసే సదుపాయాన్ని అగ్రశ్రేణి విమానయాన సేవల సంస్థ అయిన ఎమిరేట్స్ కల్పించనుంది. ఈ లగ్జరీ విమానంలోని కళ్లు చెదిరే రీతిలో అధునాతన సౌకర్యాలు, ఫస్ట్‌క్లాస్ ప్రైవేట్ సూట్లు సందర్శకులకు అరుదైన అనుభూతిని మిగులుస్తాయి. దీన్ని చూసే అవకాశాన్ని సందర్శకులకు కల్పించేందుకు ఎమిరేట్స్, ఎయిర్‌బస్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బంబార్డియర్ 'ఛాలెంజర్ 605'
అటు రైళ్లు, ఇటు విమానాలు తయారు చేసే ఏకైక సంస్థ బంబార్డియర్. ఇది కూడా హైదరాబాద్‌లో జరిగే ఏవియేషన్ షోలో తన 'ఛాలెంజర్ 605' బిజినెస్ జెట్‌ను ప్రదర్శించనుంది. ఛాలెంజర్ 604 తర్వాత వచ్చిన ఆధునిక బిజినెస్ జెట్ విమానం ఇది. 12 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో ఏకబిగిన ఢిల్లీ నుంచి ఏథెన్స్ కు ఎక్కడా ఆగకుండా ప్రయాణించగల సత్తా ఈ విమానం సొంతం. ఇదే కాకుండా ఇంకా భారతీయ మార్కెట్‌కు అనువైన ఇతర వాణిజ్య విమానాలను సైతం ప్రదర్శించనున్నట్లు బంబార్డియర్ ప్రకటించింది. అయితే బిజినెస్ జెట్ విమానాలపై ప్రధానంగా ఈ సంస్థ దృష్టి సారిస్తోంది. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో భారత్, చైనాతో సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 4,740 విమానాల విక్రయానికి అవకాశం ఉన్నట్లు, ఇందులో 1,340 బిజినెస్ జెట్ విమానాలు ఉంటాయని బంబార్డియర్ అంచనా. తేలికపాటి చిన్న బిజినెస్ జెట్ ల నుంచి పెద్దవైన దీర్ఘకాలిక ప్రయాణానికి అనువైన విమానాల తయారీలో నిమగ్నమై ఉన్న బంబార్డియర్ ఇది తనకు అనుకూల పరిణామంగా భావిస్తోంది. ఈ దిశగా మనదేశంలో జరిగే ఏవియేషన్ షోకు అత్యంత ప్రాధాన్యమిస్తూ, తన ఉత్పత్తులు- సేవలను ప్రదర్శించబోతోంది.

డాలర్ భారం

విమానాల నిర్వహణ వ్యయంలో 70 శాతంపై ప్రభావం
ఈనాడు - హైదరాబాద్ దేశీయంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన పరిశ్రమపై డాలర్ ప్రభావం అధికం. విమానాల కొనుగోలు, నిర్వహణలపై విమానయాన కంపెనీలు చేసే వ్యయంలో సిబ్బందికి వేతనాలు వంటివి మినహా 70 శాతానికి పైగా ఖర్చులు డాలర్‌పైనే ఆధారపడి ఉంటున్నాయి. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ బాగా పెరగడంతో దేశీయంగా విమానయాన సంస్థల నష్టాలకు ఇదీ ఒక కారణం అవుతోంది.

విమానాల కొనుగోలు అనంతరం రోజువారీ కార్యకలాపాలకు వైమానిక ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్.. ఏటీఎఫ్), విడిభాగాల కొనుగోలుకు, కాలక్రమంలో సర్వీసింగ్‌కు డాలర్ రూపేణా చెల్లింపులు జరపవలసి వస్తోంది. విమానయాన సంస్థలు జరిపే చెల్లింపుల్లో 70 శాతం వరకు డాలర్ రూపంలోనే ఉంటాయని పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి అశోక్ కుమార్ 'ఈనాడు'తో చెప్పారు. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ గణనీయంగా పెరగడం, సంస్థలపై అధిక ప్రభావం చూపుతోందని తెలిపారు. ఏటీఎఫ్‌పై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సుంకం కూడా వేర్వేరుగా ఉంటోందని తెలిపారు. ఈ మొత్తాన్ని తగ్గించాలని, ఒకే రకంగా ఉంచాలని సూచిస్తున్నా, తమకు ఆదాయమార్గం కనుక రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కిలోలీటరు ఏటీఎఫ్ ధర కోల్‌కతాలో రూ.87,000 కాగా, బ్యాంకాక్‌లో రూ.50,000 మాత్రమే అవుతోందని చెప్పారు. తమిళనాడులో ఏటీఎఫ్‌పై వ్యాట్ 30 శాతం వరకు, రాష్ట్రంలో 16 శాతం వరకు ఉందని వివరించారు. ఫలితంగా దేశీయ గమ్యస్థానాలకు నడుస్తున్న విమానయాన కంపెనీలపై అధిక భారం పడుతోందని, విదేశాల నుంచి వచ్చేవాటికి తక్కువ వ్యయం అవుతోందని చెప్పారు. విదేశాల్లో పన్నులు తక్కువగా ఉండడం దీనికి కారణం.

విమానాశ్రయాల్లో ఛార్జీలు కూడా భారమే
దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారికి కూడా విమానాశ్రయాల్లో రుసుములు భారంగా మారుతున్నాయని అశోక్‌కుమార్ చెప్పారు. కొన్ని విమానాశ్రయాల్లో ల్యాండింగ్, రాత్రి పార్కింగ్ ఛార్జీలు అధికంగా ఉంటున్నాయని, ఈ భారం ప్రయాణికులపైనే పడుతుందన్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులపై నేరుగా అభివృద్ధి రుసుం, సెక్యూరిటీ వంటి ఇతర రుసుములు ఉంటున్నాయని, ఈ భారం తగ్గితే ప్రయాణికుల సంఖ్య మరింత వేగంగా వృద్ధి చెందుతుందని వివరించారు.
2020 నాటికి మూడో స్థానం!
40కి పైగా విమానాశ్రయాలు, 400కు పైగా విమానాలతో అంతర్జాతీయంగా 9వ స్థానంలో భారత విమానయాన పరిశ్రమ నిలిచింది. ప్రస్తుతం దేశీయ గమ్యస్థానాలకు 12.10 కోట్ల మంది, 4.10 కోట్లమంది విదేశాలకు విమానాల్లో రాకపోకలు సాగిస్తున్నారని అంచనా. 2020 నాటికి ఈ రంగంలో అమెరికా, చైనా తరవాత మూడో స్థానానికి మన దేశం చేరుతుందని అంచనా. 2020 నాటికి విమానాల్లో దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య 33.60 కోట్లకు, విదేశాలకు వెళ్లే వారి సంఖ్య 8.50 కోట్లకు చేరుతుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేస్తోంది. రాబోయే 20 ఏళ్లలో దేశీయ విమానయాన రంగంలో వృద్ధి అత్యంత వేగవంతంగా ఉంటుందని దిగ్గజ సంస్థలన్నీ అంచనా వేస్తున్నాయి.

భవిష్యత్తులో వృద్ధి చిన్న నగరాల నుంచే
ప్రస్తుతం విమాన ప్రయాణికుల్లో 30 శాతం రెండో అంచె నగరాలు, మూడో అంచె నగరాల నుంచీ వస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో మొత్తం ప్రయాణికుల్లో 45 శాతం చిన్న నగరాల నుంచే ఉండవచ్చని అంచనా. ఈ నగరాలకు చిన్నపాటి విమానాలు నిర్వహిస్తేనే లాభదాయకం అని కంపెనీలు భావిస్తున్నాయి. రుసుములు తక్కువగా ఉంటే, టికెట్టు ధరను కూడా తక్కువగా నిర్ణయించవచ్చన్నది విమానయాన సంస్థల ఆలోచన. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా- ఏఏఐ) నేతృత్వంలో చిన్న విమానాశ్రయాలుంటే, వీరికి ఛార్జీల రుసుం తక్కువగా ఉంటుంది. ప్రస్తుత 12వ పంచవర్ష ప్రణాళికలో రూ.1,500 కోట్లతో చిన్న నగరాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఏఏఐ తగిన సన్నాహాలు చేస్తోంది.

Saturday, March 8, 2014

మూడేళ్లకే బైక్ మార్చేస్తున్నారు!

Sakshi | Updated: March 08, 2014 01:12 (IST)
మూడేళ్లకే బైక్ మార్చేస్తున్నారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘వ్యూహం అంటూ లేకుండా వాహన రంగంలో నిలదొక్కుకోలేం. బజాజ్ ఆటో భారతీయ కంపెనీయే. కానీ మేం ఇక్కడితో పరిమితం కాలేదు. 30కి పైగా దేశాలకు వాహనాలను సరఫరా చేస్తున్నాం. మా దృష్టి భారత్‌తోసహా అన్ని మార్కెట్లపైనా ఉంటుంది. ఒక దేశం కోసం అంటూ వాహనాలను తయారు చేయం’ అని అంటున్నారు బజాజ్ ఆటో కంపెనీ, మోటార్ సైకిల్  విభాగపు ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్. సరికొత్త డిస్కవర్ 125 బైక్‌ను ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. కస్టమర్ల అభిరుచులు, కంపెనీ భవిష్యత్ కార్యాచరణ, మార్కెట్ తీరుతెన్నులు ఆయన మాటల్లోనే..
 మూడేళ్లయితే చాలు..
 దక్షిణాదివారైనా, ఉత్తరాదివారైనా మోటార్ సైకిళ్ల విషయంలో భారతీయ కస్టమర్ల అభిరుచులు దాదాపు ఒకేలా ఉన్నాయి. స్టైల్, మంచి పవర్ ఉన్న బైక్‌లపై మక్కువ పెరుగుతోంది. గతంలో ఒకసారి బైక్ కొంటే ఏడెనిమిదేళ్లు వాడేవారు. ఐదేళ్ల క్రితం వరకు ఈ ట్రెండ్ ఉండేది. ఇప్పుడు మూడు నాలుగేళ్లకే వాహనం మారుస్తున్నారు. రెండేళ్లుగా సెంటిమెంట్ బాగోలేదు. ఉద్యోగం ఉంటుందో లేదో అన్న ఆందోళనలో ఉంటే కొత్త బైక్ కొనలేరుగా. అందుకే ద్విచక్ర వాహన పరిశ్రమ స్తబ్దుగా ఉంది. వచ్చే ఏడాది వృద్ధి ఖాయం. ఎక్సైజ్ డ్యూటీని 12 నుంచి 8 శాతానికి కుదించడం మంచి పరిణామం. కొత్త ప్రభుత్వం ఈ తగ్గింపు సుంకాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం. మా వాహనాల ధరను రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు తగ్గించాం.

 స్కూటర్ తెచ్చే ఆలోచనే లేదు..
 ప్రపంచంలో అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో 80 శాతం మోటార్ సైకిళ్లే. ప్రపంచ వ్యాప్తంగా మోటార్ సైకిళ్ల విభాగంలో బ జాజ్‌కు 10 శాతం వాటా ఉంది. అందుకే మోటార్ సైకిల్ కంపెనీగా మాత్రమే మేం కొనసాగుతాం. స్కూటర్ తయారు చేసే ఆలోచన ఏ మాత్రం లేదు. ఏటా 48 లక్షల బైక్‌లను తయారు చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది. ప్లాంట్ల యుటిలైజేషన్ 85 శాతం. ఇందులో ఎగుమతుల వాటా 33 శాతం. దేశంలో మోటార్ సైకిళ్లలో 22 శాతం వాటా బజాజ్‌కు ఉంది. కొత్త డిస్కవర్ 125 రాకతో ఇది 30 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం.

 ఆ మూడింటిపైనే..
 క్రూయిజర్ బైక్ అయిన అవెంజర్ 220 హోట్ కేక్‌లా అమ్ముడుపోతోంది. ప్రస్తుతానికి అవెంజర్ బ్రాండ్‌లో ఈ ఒక్క మోడల్‌నే కొనసాగిస్తాం. కొత్త వేరియంట్లు ఏవైనా పల్సర్, ప్లాటినా, డిస్కవర్.. ఈ మూడు బ్రాండ్లలో మాత్రమే విడుదల చేస్తాం.

 ఏపీలో ఎక్కువ కాబట్టే..
 దేశంలో నెలకు 1.6 లక్షల బైక్‌లు 125 సీసీ సామర్థ్యం గలవి అమ్ముడవుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 17 శాతముంది. ఈ కారణంగానే భారత్‌లో తొలిసారిగా కొత్త డిస్కవర్ 125ని హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించాం. 100 సీసీ బైక్‌లు కేవలం మైలేజీకే పరిమితం. 7.5-8 హార్స్‌పవర్‌ను ఇవి మించడం లేదు. మైలేజీ మినహా మరే ఇతర ప్రయోజనం లేదు. 20 ఏళ్లుగా ఈ విభాగంలో పెద్దగా సాంకేతిక అభివృద్ధి జరగలేదు. అధిక సామర్థ్యం గల బైక్ కొనాలని ఉన్నా ఖర్చు ఎక్కువని, మైలేజీ రాదని కస్టమర్లు మిన్నకుండి పోతారు. వీరికోసమే స్టైల్, పవర్, మైలేజీ కలిగిన కొత్త డిస్కవర్ 125ను పరిచయం చేశాం. 11.5 పీఎస్ పవర్, మైలేజీ 76 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ 100 కిలోమీటర్లు. డ్రమ్ బ్రేక్ మోడల్ ధర హైదరాబాద్ ఎక్స్ షోరూంలో రూ.49,075. డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంది. ఆరు రకాల ఆకర్షణీయ రంగుల్లో ఇది లభిస్తుంది.

విండోస్ ‘దేశీ’ మొబైల్స్!

Sakshi | Updated: March 07, 2014 00:58 (IST)
విండోస్ ‘దేశీ’ మొబైల్స్!
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విండోస్ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకు దేశీయ మొబైల్ ఫోన్ కంపెనీలు సైతం రంగంలోకి దిగాయి. అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లను అందించి భారత మొబైల్ ఫోన్ రంగంలో దూసుకెళ్తున్న ఈ కంపెనీలు.. ఇక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) ఆధారిత స్మార్ట్‌ఫోన్లపై దృష్టిపెట్టాయి. దిగ్గజ కంపెనీ నోకియాను సైతం ఆన్‌డ్రాయిడ్ మార్కెట్లోకి దింపిన భారతీయ బ్రాండ్లు కొత్త సంచలనాలకు రెడీ అవుతున్నాయి. కస్టమర్ల ముంగిటకు కొత్త కొత్త విండోస్ ఫోన్లు అదీ రూ.10 వేల లోపే తేబోతున్నాయి.

 తక్కువ ధరకే విండోస్ ఫోన్లు..
 ఓపెన్ సోర్స్ వేదిక కావడంతో చాలా కంపెనీలు ఆండ్రాయిడ్  ఓఎస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అందుకే మొత్తం స్మార్ట్‌ఫోన్లలో వీటి వాటా  78.9% ఉంది. విండోస్ ఓఎస్ లెసైన్సు రుసుమును మైక్రోసాఫ్ట్ గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయని  కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజ సాక్షికి చెప్పారు. అదే జరిగితే మరిన్ని కంపెనీలు ఈ రంగంలోకి అడుగు పెట్టడం ఖాయం. అంతేకాదు రూ.10 వేల లోపే విండోస్ ఫోన్లు లభించవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ప్రస్తుతం విండోస్ వాటా 3.9 శాతమే. 2018కల్లా ఇది 7 శాతానికి చేరుతుందని పరిశోధనా సంస్థ ఐడీసీ అంచనా వేస్తోంది. ఆన్‌డ్రాయిడ్ మార్కెట్ ప్రస్తుతమున్న 78.9 నుంచి 76 శాతానికి చేరుతుందని వెల్లడించింది. ఆపిల్ ఐఓఎస్ 14.9 నుంచి 14.4 శాతానికి తగ్గుతుందని వివరించింది.

 జోలో బ్రాండ్ ఇటీవలే విండోస్ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించి ఈ విభాగంలోకి ప్రవేశించిన తొలి భారతీయ బ్రాండ్‌గా నిలిచింది. కొద్ది రోజుల్లో విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా తేబోతోంది. మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్‌కాన్‌లు కూడా కొద్ది రోజుల్లో విండోస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నాయి. కొద్ది రోజుల క్రితం మైక్రోసాఫ్ట్‌తో చైనా కంపెనీ జియోనీ చేతులు కలిపింది. ఆన్‌డ్రాయిడ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ రెండూ కలిగిన స్మార్ట్‌ఫోన్లను కార్బన్ మొబైల్స్ జూన్‌కల్లా ప్రవేశపెడుతోంది.

 రూ.6 వేలకే సెల్‌కాన్ విండోస్ ఫోన్లు..
 తొలుత 4, 5 అంగుళాల్లో విండోస్ ఫోన్లను సెల్‌కాన్ తేనుంది. వీటిని రూ.6-7 వేలకే పరిచయం చేయాలని భావిస్తున్నట్టు సెల్‌కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. మే నాటికి ఇవి మార్కెట్లో ఉంటాయని చెప్పారు. ఈ నెలలోనే మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు వివరించారు. ఆన్‌డ్రాయిడ్, విండోస్ డ్యూయల్ ఓఎస్ ఫోన్లు పరిశోధన, అభివృద్ధి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మంచి ఫీచర్లతో మోడళ్లకు రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు.

అందుబాటు గృహాలకు ఇదీ మార్గం!

Sakshi | Updated: March 08, 2014 01:28 (IST)
అందుబాటు గృహాలకు ఇదీ మార్గం!
 సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ, ఆ కల సాకారం కావాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. మరి సామాన్య, మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్‌లో సొంతిల్లు  కొనుక్కోవటం కష్టమా? పోనీ.. అందుబాటు గృహాలను అందించేందుకు ముందుకొచ్చే నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందా అంటే అదీ ఉండదంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇంకా ఏమంటున్నారంటే..
  కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ లెక్కల ప్రకారం.. మన దేశంలో దాదాపు 2.65 కోట్ల ఇళ్ల కొరత ఉంది. 2020 నాటికి ఇది మూడు కోట్లకు చేరుకునే అవకాశముందని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. దశాబ్దం నుంచి పెరిగే జనాభా కారణంగా నగరాల్లో స్థల లభ్యత దారుణంగా తగ్గింది. ఫలి తంగా ఇళ్ల కొరత రోజురోజుకూ పెరుగుతోంది. మంచినీరు, విద్యు త్తు, ఖాళీ స్థలాలూ లేని మురికివాడలు అధికంగా వెలుస్తున్నాయి.

  ఆర్థిక నియంత్రణ, నగరీకరణ వంటి అంశాల్లో ఎదురయ్యే అవాంతరాలతో.. చౌక గృహాల నిర్మాణం పుంజుకోవట్లేదు. ఒకవైపు భూముల ధరలు ఆకాశాన్నంటాయి. మరోవైపు నిర్మాణ వ్యయమూ  పెరిగింది. ఈ రెండింటి ప్రభావం అందుబాటు గృహాల నిర్మాణం మీద పడుతోంది. దీంతో పలు నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించడానికీ ముందుకు రావట్లేదు. శివారు ప్రాంతాల్లో తక్కువ ధరకే ఫ్లాట్లను అందించాలని మొదలుపెట్టినవారూ అయిష్టంగానే ధరలు పెంచాల్సిన దుస్థితి నెలకొంది.

  సామాన్యులకు బ్యాంకు ఖాతాలుండవు. ఒకవేళ ఉన్నా క్రమం తప్పకుండా లావాదేవీలను నిర్వహించరు. కొందరికేమో పాన్ కార్డులుండవు. చిన్నాచితకా ఉద్యోగాలు చేయడంతో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయరు. దీంతో బ్యాంకులు గృహరుణాల్ని మంజూరు చేయవు. కాబట్టి ఆర్‌బీఐ ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరముంద ని నిపుణులు సూచిస్తున్నారు.
  మనకంటే చిన్నదేశాలైన సింగపూర్, హాంకాంగ్, మలేసియా వంటివి ముందంజలో ఉన్నాయి. స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్స్ తదితర దేశాలు అందుబాటు గృహాల్ని నిర్మించడంలో స్పష్టమైన ప్రణాళికల్ని పాటిస్తున్నాయి.

అక్కడి నిర్మాణ సంస్థల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త విధానాల్ని రూపొందిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలకు మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. అదే మన దేశంలో చూస్తే.. ‘ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి’ అన్న చందంగా ఉంది. దేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర సంస్థలకు స్థలాలున్నాయి. మరి, ఈ సంస్థలేం చేస్తున్నాయంటే.. వేలం ద్వారా ఆయా స్థలాల్ని విక్రయిస్తున్నాయి. మార్కెట్లో కృత్రిమ గిరాకీని సృష్టిస్తున్నాయి.

  అందుబాటు గృహాల విస్తీర్ణం తక్కువుండేలా చూడటం, క్రాస్ సబ్సిడీలను అందించడం, ప్రోత్సాహకాల్ని ప్రకటించడం, ఇళ్ల సరఫరా, గిరాకీకి అనుగుణంగా రాయితీల్ని ఇవ్వడం వంటి పథకాల్ని ప్రకటించాలి. అప్పుడే నిర్మాణ సంస్థలు ముందుకొస్తాయి. ప్రభుత్వ స్థలాల్లో అందుబాటు గృహాల్ని నిర్మించి నామమాత్రపు ధరకే విక్రయిస్తే సామాన్యులెందరో కొనుగోలు చేస్తారు. కనీసం ఇలాగైనా ఇళ్ల కొరత తీరుతుందని నిపుణులంటున్నారు.

మన్నికగా కడితేనే.. మార్కెట్లో గిరాకీ!

Sakshi | Updated: March 08, 2014 01:32 (IST)
సాక్షి, హైదరాబాద్: పైసా పైసా కూడబెట్టుకొని సొంతింటిని కొనేందుకు ముందుకొస్తారు సామాన్యులు. అలాంటి వారికి నాణ్యమైన ఇళ్లను అందించడం బిల్డర్ల బాధ్యత. అందుకే ఎక్కడ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినా నిర్మాణంలో ఎలాంటి రాజీపడకుండా నాణ్యమైన నిర్మాణ సామగ్రినే వినియోగిస్తాం అంటున్నారు ట్రాన్స్‌కాన్ లైఫ్‌స్పేసెస్ ప్రై.లి. ఎండీ శ్రీధర్‌రెడ్డి.

  ఫిర్జాదిగూడలో ఎకరం విస్తీర్ణంలో ‘ప్రగతి అవెన్యూ’ పేరుతో ప్రీమియం అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 70. అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ఎందుకంటే కొనుగోలుదారులందరి జీవన శైలి ఒకేలా ఉండాలి. భవిష్యత్తులో నిర్వహణ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులుండొద్దు.

  రూ. 15 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఏసీ జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, 270 గజాల్లో ల్యాడ్ స్కేపింగ్, అంపి థియేటర్, 4 వేల చ.అ. విస్తీర ్ణంలో క్లబ్ హౌస్, విశాలమైన పార్కింగ్, కార్ డ్రైవర్లకు ప్రత్యేకమైన రెస్ట్ రూములు వంటి సౌకర్యాలెన్నో కల్పిస్తున్నాం. చ.అ. ధర రూ. 2,650గా చెబుతున్నాం. 2015 మే కల్లా నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం.

  భువనగిరిలో ఏరియా ఆసుపత్రి పక్కనే ‘ట్రాన్స్‌కాన్ లక్ష్మీ నరసింహా రెసిడెన్సీ’ పేరుతో మరో ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నాం. 2 వేల గజాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 35 ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ. 2,250.

  చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ల్యాడ్ స్కేపింగ్‌లతో నివాసితులకు గాలి, వెలుతురు విశాలంగా వచ్చేందుకు వీలుగా ఫ్లాట్ల గోడకు గోడకు మధ్య ఆరున్నర ఫీట్ల స్థలాన్ని వదులుతున్నాం. టైల్స్, రంగులు, లిఫ్ట్, సిమెంట్, బాత్ రూమ్ ఫిట్టింగ్స్.. ఇలా నిర్మాణ సామగ్రి అంతా నాణ్యమైనవే వినియోగిస్తున్నాం.

నవతరానికి నయా ఫ్లాట్లు

Sakshi | Updated: March 08, 2014 04:21 (IST)
నవతరానికి నయా ఫ్లాట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతికూల పరిస్థితుల్లో కూడా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతున్న ప్రాంతాల్లో ఉప్పల్ ఒకటి. అందుకే ఇక్కడ  అందుబాటు ధరల్లో నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ‘సాయి సత్య నిలయం’కు శ్రీకారం చుట్టినట్లు వినాయక బిల్డర్స్, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. పద్మా రెడ్డి చెప్పారు.

ఇంకాఏమన్నారంటే..
- శంకర్‌నగర్‌లో 2,400 గజాల్లో ‘సాయి సత్య నిలయం’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 50 ఫ్లాట్లొస్తాయి. 2 బీహెచ్‌కే:45, 3 బీహెచ్‌కే:5 ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ. 2,450.

- ఇప్పటికే ఉప్పల్ ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్‌లతో కిటకిటలాడుతోంది. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో మరిన్ని ఐటీ కంపెనీలు ఇక్కడికి రానున్నాయి. దీనికితోడు ఉప్పల్ ప్రాంతంలో త్వరలోనే మెట్రో రైల్ ప్రారంభం కానున్నందున సమీప భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

- మొత్తం స్థలంలో 30 శాతం స్థలాన్ని పచ్చదనం, ఇతరత్రా సదుపాయాలకు కేటాయించాం. ఆర్‌ఓ ప్లాంట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మల్టీపర్పస్ హాల్ (ఏసీ), ల్యాడ్‌స్కేప్, 24 గంటలూ సీసీ కెమెరాలతో నిఘా, చుట్టూ సోలార్ ఫెన్సింగ్, అత్యాధునిక జిమ్, వాకింగ్ ట్రాక్ వంటి ఆధునిక వసతులెన్నో కల్పిస్తున్నాం. 2015 చివరినాటికి కొనుగోలుదారుల చేతికి ఇంటి తాళాలందిస్తాం.

సీఐఐ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్‌గా సురేష్ రాయుడు

వైస్‌ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన వనితా దాట్ల

ఈనాడు, హైదరాబాద్: భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆంధ్ర ప్రదేశ్ ఛైర్మన్‌గా 2014-15 సంవత్సరానికి సురేష్ రాయుడు చిట్టూరి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన సీిఐఐ- ఏపీ వార్షిక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. వైస్-ఛైర్‌పర్సన్‌గా వనితా దాట్లను ఎన్నుకున్నారు. సురేష్ రాయుడు చిట్టూరి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న శ్రీనివాసా హ్యాచరీస్ గ్రూపు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. బెంగుళూరు ఆర్‌వీ కాలేజీలో ఇంజినీరింగ్ చదివిన ఆయన అనంతరం అమెరికా వెళ్లి అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌లలో కొన్ని స్వల్పకాలిక కోర్సులు కూడా చేశారు. వైస్-చైర్‌పర్సన్‌గా ఎన్నికైన వనితా దాట్ల హైదరాబాద్‌కు చెందిన ఎలికో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్ఓగా ఉన్నారు. ఆమె సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బి.ఏ. అభ్యసించారు. కొన్ని కంప్యూటర్ కోర్సులు చేశారు. అంజనీ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్, రాశి ఫైనాన్స్ తదితర సంస్థల్లో డైరెక్టరుగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.

Friday, February 28, 2014

చిన్న సిమెంటు కంపెనీలపై కన్నేస్తున్న పెద్ద కంపెనీలు

విపణిలో సుస్థిర స్థానమే లక్ష్యం

సిమెంటు పరిశ్రమలో కొనుగోళ్లు- విలీనాల సీజను మొదలైంది. ప్రస్తుత గడ్డు కాలాన్ని అతి కష్టం మీద తట్టుకుంటున్న చిన్న, మధ్య స్థాయి కంపెనీల ముందు బడా కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు పెట్టి, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మన రాష్ట్రంతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని ఒకటి రెండు యూనిట్ల కొనుగోలుకు ఒక బహుళ జాతి సిమెంటు సంస్థ, మరొక దేశీయ సిమెంటు కంపెనీ కసరత్తు మొదలుపెట్టాయని పరిశ్రమ వర్గాల సమాచారం.

నిజానికి సిమెంటు పరిశ్రమకు ఉత్థాన పతనాలు మామూలే. ఆయిదారేళ్లకోసారి అనూహ్యమైన అవకాశాన్ని, ఆ తరువాత తట్టుకోలేనంత కష్టకాలాన్ని ఈ పరిశ్రమ చవిచూస్తోంది. ఇలా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే. అయితే కష్టకాలంలో తట్టుకునే శక్తి ఉన్న కంపెనీలు మనుగడ సాధించగలుగుతున్నాయి. లేకపోతే అటువంటి వాటిని ఏదో ఒక పెద్ద కంపెనీ కొనుగోలు చేస్తూ వస్తోంది. 2004-05 వరకూ సిమెంటు పరిశ్రమ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కానీ తరువాత కలిసొచ్చిన అవకాశాలతో పరిశ్రమ బాగా కోలుకుంది. అనూహ్యమైన డిమాండును సంపాదించింది. దీన్ని అవకాశంగా తీసుకొని పెద్దఎత్తున విస్తరణ సామర్థ్యాన్ని పరిశ్రమ వర్గాలు విస్తరించాయి. అక్కడే తేడా వచ్చింది. 2008 తరువాత ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రతరమై సిమెంటు కంపెనీలు లెక్కలు తప్పయ్యాయి. డిమాండు క్షీణించింది. అధిక డిమాండును ఆశించి అప్పులు చేసి మరీ సామర్థ్యాన్ని పెంచుకున్న సంస్థలకు కష్టకాలం మొదలైంది. ఈ పరిస్థితిని పెద్ద కంపెనీలు ఎలాగో నెట్టుకొస్తున్నప్పటికీ, చిన్న- మధ్యస్థాయి సిమెంటు కంపెనీలు తట్టుకోలేకపోతున్నాయి. పైగా అప్పుల భారం ఉన్న కంపెనీలకు అయితే అసలే కుదరడం లేదు. దీన్ని గుర్తించిన పెద్ద సంస్థలు వాటి విస్తరణ వ్యూహాలను అమల్లో పెడుతున్నాయి. తమకు అనుకూలంగా, తమ విస్తరణ వ్యూహాలకు అనువైన సిమెంటు యూనిట్లను గుర్తించి, కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

వినియోగానికి మించిన ఉత్పత్తి సామర్థ్యం
ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ సమస్య అధికంగా ఉంది. ఉత్పత్తి సామర్థ´్యం గత అయిదేళ్ల కాలంలో దక్షిణాదిలో అనూహ్యంగా పెరిగిపోయింది. ఆంధ్ర ప్రదేశ్‌లో సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 30 మిలియన్ టన్నుల నుంచి 75 మి. ట.కు పెరిగింది. తమిళనాడులో దాదాపు 10 మి. ట. సామర్థ్యం కాస్తా 27 మి. ట.కు చేరింది. ఇక కర్ణాటకలోనూ ఉత్పత్తి సామర్థ´్యం 40 మిలియన్ టన్నులకు చేరుకుంటోంది. ముఖ్యంగా కర్ణాటకలోని గుల్బర్గా క్లస్టర్‌లో కొత్త యూనిట్లు ఎంతో అధికంగా వచ్చాయి. సాగర్ వికా, దాల్మియా భారత్ తదితర సంస్థలు గుల్బర్గా క్లస్టర్‌లో కొత్త యూనిట్లు స్థాపించాయి. గుల్బర్గా నుంచి ఉత్తర కర్ణాటక ప్రాంతంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లకు సిమెంటును అందించే అవకాశం ఉండడంతో పలు సంస్థలు వ్యూహాత్మకంగా అక్కడ కొత్త యూనిట్లను స్థాపిస్తున్నాయి. ఇంకా మరికొన్ని యూనిట్లు కూడా అక్కడ వస్తున్నాయి. దీంతో కర్ణాటకలోనూ సామర్థ్యం పెరుగుతోంది. చిన్న రాష్ట్రమైన కేరళలో ఒక మిలియన్ టన్నుల వరకూ మాత్రమే సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మొత్తంమీద నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో వినియోగానికి మించిన ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు ఉంది. ఈ పరిస్థితి కూడా కొనుగోళ్లు- విలీనాల ప్రక్రియకు వీలు కల్పిస్తోంది.

ముందుముందు మరిన్ని..?!
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం గుల్బర్గాలోని సిమెంటు యూనిట్‌ను పూర్తిగా సొంతం చేసుకునేందుకు ఒక బహుళ జాతి సిమెంటు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ యూనిట్లో పాక్షికంగా వాటా ఉన్న ఈ సంస్థ మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసి, ఆ యూనిట్‌ను సొంతం చేసుకోబోతోందని చెబుతున్నారు. తద్వారా దక్షిణాది విపణిలో తన స్థానాన్ని సుస్థి´రం చేసుకొనే అవకాశం కలుగుతుందని ఈ బహుళ జాతి సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విధంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏదైనా మధ్య స్థాయి సిమెంటు కంపెనీని కొనుగోలు చేయాలని కూడా ఒక అగ్రశ్రేణి దేశీయ సిమెంటు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. సిమెంటు రంగంలో ఈ విధమైన స్ధిరీకరణ ఒకటి రెండు కొనుగోళ్లు- విలీనాలకే పరిమితం కాకుండా ముందుముందు కూడా కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
- ఈనాడు, హైదరాబాద్

టెలికం సంస్థలకు వాట్స్‌యాప్ డేంజర్ రింగ్

Sakshi | Updated: February 28, 2014 00:45 (IST)
టెలికం సంస్థలకు  వాట్స్‌యాప్ డేంజర్ రింగ్
 ఆదాయానికి గండి కొడుతున్న వాట్స్ యాప్
  త్వరలో వాయిస్ కాల్ సేవలకూ రెడీ!
  ఇప్పటికే మెసేజింగ్ వల్ల రూ.2 వేల కోట్ల దాకా గండి
  మరింత నష్టపోతామంటున్న టెలికం కంపెనీలు
  వాయిస్ నుంచి డేటాకు మారాలని సూచిస్తున్న నిపుణులు


 వాట్స్ యాప్. ఇంటర్నెట్ ఉంటే చాలు. దీంతో ఏదైనా చేసేయొచ్చు. ఫ్రీగా మెసేజ్‌లు పంపుకోవచ్చు. వీడియోల్ని సెకన్లలో పంపేయొచ్చు. ఆడియో ఫైల్స్‌ను కూడా క్షణాల్లో కోరుకున్న వారికి పంపేయొచ్చు. వాట్స్ యాప్ వాడని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కానే కాదు. అలాంటి వాట్స్ యాప్... ఇపుడు వాయిస్ కాల్స్‌ను కూడా అందించేందుకు శ్రీకారం చుడుతోంది. అదే గనక ఆరంభమైతే ఫ్రీగా కాల్స్ కూడా చేసేసుకోవచ్చు. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్... ఎక్కడి నుంచి ఎక్కడికైనా! మరి అదే జరిగితే టెలికం సంస్థల సంగతేంటి? వస్తున్న ఆదాయాల్లో 85 శాతం వాయిస్ కాల్స్ ద్వారానే పొందుతున్న టెలికం సంస్థల భవిష్యత్తేంటి?                                 - సాక్షి, బిజినెస్ డెస్క్

 నలభై ఐదు కోట్ల మంది వాడకందార్లతో ప్రపంచంలోనే అతి పెద్ద మెసేజింగ్ సర్వీస్‌గా మారిన వాట్స్ యాప్‌ను అతి పెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్... ఈ మధ్యే 19 బిలియన్ డాలర్లు (రూ.1.18 లక్షల కోట్లు) పెట్టి కొనేసింది. ఫేస్‌బుక్, వాట్స్ యాప్ కలిస్తే ఇంకేముంది! రెండూ కలిసి కొత్త వ్యూహాలను ప్రక టిస్తుండటంతో పోటీ సంస్థలతో పాటు టెలికం కంపెనీలూ కలవరపడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం టెలికం ఆపరేటర్లకు ఎస్సెమ్మెస్, వాయిస్, డేటాతో పాటు వాల్యూ యాడెడ్ సర్వీసుల వంటి నాలుగు ఆదాయ వనరులున్నాయి. వీటిలో అగ్రస్థానం వాయిస్ కాలింగ్ సర్వీసులదే. ఇపుడు 3జీ రావటంతో డేటా సేవలను మరింత పెంచేందుకు కసరత్తు చేస్తున్నాయి. అవి ఆ ప్రయత్నాల్లో ఉండగానే... సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు, మెసేజింగ్ సర్వీసుల సంస్థలు చాప కింద నీరులాగా చుట్టబెట్టేస్తున్నాయి. స్కైపీ, వైబర్ లాంటి వాటితో పాటు దాదాపు అయిదేళ్ల క్రితం ప్రారంభమైన వాట్స్ యాప్ కూడా ఇందులో దూసుకెళ్లిపోతోంది. గతేడాది మెసేజ్‌ల మార్కెట్ విలువ దాదాపు రూ.6,000 కోట్లు ఉండగా.. వాట్స్‌యాప్ లాంటి మెసేజింగ్ యాప్స్ కంపెనీలు సుమారు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల దాకా ఆదాయానికి గండికొట్టాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా వాల్యూ యాడెడ్ సర్వీసుల ద్వారా టెలికం కంపెనీలు లక్షల కోట్లు ఆర్జిస్తుండగా.. గూగుల్ వంటి వెబ్‌సైట్లు అందులో 6-7 శాతం వాటాను దక్కించుకుంటున్నాయి. ఇవి తమ సర్వీసులను విస్తరిస్తున్న కొద్దీ టెల్కోల ఆదాయానికి మరింత గండిపడుతూనే ఉంటుందని దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మాజీ సీఈవో సంజయ్ కపూర్ పేర్కొన్నారు.


 ఈ దాడిని ఎదుర్కోవడానికి టెలికం కంపెనీలు మల్లగుల్లాలు పడుతుండగానే తాము వాయిస్ కాల్స్‌ని కూడా ప్రవేశపెట్టబోతున్నామంటూ వాట్స్‌యాప్ సహవ్యవస్థాపకుడు జాన్ కూమ్ బాంబు పేల్చారు. ఇప్పటికే ఒకదానితో మరొకటి పోటీపడి కాల్‌చార్జీలను తగ్గించుకుంటూ పోయిన టెల్కోలకు ఇది ఊహించని ఎదురుదెబ్బే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 45 కోట్లకు మందికి పైగా యూజర్లు ప్రస్తుతం వాట్స్ యాప్‌ను వాడుతున్నారు. వచ్చే కొన్నేళ్లలో ఈ సంఖ్య 100 కోట్లకు చేరుతుందనేది నిపుణుల అంచనా.  ప్రస్తుత యూజర్లందరూ పెయిడ్ యూజర్లుగా మారితే కేవలం మెసేజింగ్ సర్వీసులతోనే (ఏడాదికి ఒక డాలర్) వాట్స్‌యాప్‌కి వార్షికంగా రూ.3,000 కోట్ల పైచిలుకు ఆదాయం వస్తుందని అంచనా. ఇక వంద కోట్ల మంది యూజర్లు ఇటు మెసేజింగ్, కాల్ సర్వీసులను వాడటం మొదలుపెడితే అనేక రెట్లు ఆదాయం వస్తుంది. టెల్కోలకు కూడా డేటా వాడకం రూపంలో కొంత ఆదాయం వచ్చినా.. వాటి సర్వీసులను వాట్స్‌యాప్ ఎగరేసుకుపోవడం వల్ల ఆ ప్రభావం మిగతా ఆదాయాలపై తీవ్రంగానే ఉంటుంది.

 ఇప్పటికిప్పుడు కాకపోయినా కొన్నాళ్లు పోయాక ఈ ప్రభావం టెలికం సంస్థల ఆదాయంపై తీవ్రంగా పడుతుందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీకి చెందిన జైదీప్ ఘోష్ అభిప్రాయపడ్డారు. స్మార్ట్‌ఫోన్లు ఇంకా పూర్తి స్థాయిలో మెజార్టీ ప్రజల చేతుల్లోకి చేరలేదు కనుక, ఇంటర్నెట్ సేవలు మారుమూల గ్రామాల్లో విస్తృతంగా లేవు కాబట్టి ప్రస్తుతానికి ఈ ప్రభావం తక్కువగానే ఉంటుందన్నారు.

 వాట్స్‌యాప్‌కి సానుకూలాంశాలు..
 స్కైపీ వంటి యాప్స్‌తో పోలిస్తే వాట్స్‌యాప్‌కి అనేక అనుకూలాంశాలున్నాయని సైబర్ మీడియా ఎడిటోరియల్ అడ్వైజర్ ప్రశాంతో రాయ్ చెప్పారు. ప్రత్యేకంగా పీసీతో పని ఉండదు. వాట్స్‌యాప్‌ను ఉపయోగించడం చాలా సులువు. వీటికితోడు యూజర్ల సంఖ్య భారీ స్థాయిలో ఉండటం దానికి లాభిస్తుందని తెలిపారాయన. పైగా ఇతర యాప్స్‌తో పోల్చినప్పుడు వాట్స్‌యాప్ ఆడియో, వీడియో మెసేజిల్లో మరింత స్పష్టత ఉంటుందని తెలియజేశారు. కొంగొత్త సేవలను విస్తరించేందుకు సానుకూలాంశాలు ఉన్నందునే ఫేస్‌బుక్ భారీ మొత్తం వెచ్చించి వాట్స్‌యాప్‌ని కొనుగోలు చేసిందనేది సంజయ్ కపూర్ అభిప్రాయం. మొబైల్ కామర్స్‌లోనూ ఇది చొచ్చుకుపోయే అవకాశముందన్నారు.

 ఈజీ సేవల వాట్స్‌యాప్..
     ఇన్‌స్టంట్ మెసేజింగ్ సేవలకు సంబంధించి ఇదో అప్లికేషన్(యాప్). దీనిద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులు చాలా సులువుగా టెక్స్ట్, వాయిస్ మెసేజ్‌లతో పాటు వీడియోలు, ఫొటోలు ఏవైనా సరే వేరొకరికి లేదా గ్రూపునకు పంపొచ్చు.

     వేరొకరు పంపిన వీడియోలు, ఫోటోలు, మెసేజ్‌లు ఇతరులతో షేర్ చేసుకోవచ్చు కూడా.

     దీనికి టెలిఫోన్ ఆపరేటర్ల నుంచి ఎలాంటి చార్జీలు ఉండవు. స్మార్ట్, ఫీచర్ ఫోన్లు అన్నింటిలోనూ (గూగుల్ ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ ఓఎస్, యాపిల్ ఐఓఎస్; నోకియా ఆశా, విండోస్ ఫోన్ ఇతరత్రా) ఈ యాప్ అందుబాటులో ఉంది.

     ప్రపంచంలో ఏ మూలనుంచైనా ఈ యాప్‌ను ఉపయోగించొచ్చు. ఫోన్ లేదా ట్యాబ్‌లో కేవలం ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు. యూజర్ల మొబైల్ నంబర్ల ఆధారంగా ఇది అనుసంధానం అవుతుంది.

     డౌన్‌లోడ్ చేసుకున్న తొలి ఏడాది పాటు ఈ యాప్‌ను ఉచితంగానే వాడుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ఏడాదికి ఒక డాలరు (దాదాపు రూ.62) చొప్పున ఫీజు చెల్లించాలని వాట్స్‌యాప్ చెబుతోంది.

 ప్రసుత్తం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా యూజర్లు వాట్స్‌యాప్‌ను వినియోగిస్తున్నారు. రోజుకు 10 లక్షల మంది కొత్త యూజర్లు జతవుతున్నట్లు అంచనా. అంతేకాదు వాట్స్‌యాప్ యూజర్లలో 70 శాతం మంది యాక్టివ్‌గా (రోజులో కనీసం ఒకసారైనా వాడేవారు) ఉంటున్నారు.

     స్వల్పకాలంలోనే వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 100 కోట్ల మైలురాయిని అధిగమించగలదని అంచనా.

     రోజుకు 50 కోట్లకు పైగా ఫోటోలు, 1,000 కోట్లకు పైగా మెసేజ్‌లు దీనిద్వారా షేర్ అవుతున్నట్లు అంచనా.

 టెల్కోల వ్యూహాలు..
 కన్సల్టెన్సీ సంస్థ ఓవమ్ అంచనాల ప్రకారం కస్టమర్లు డేటా నెట్‌వర్క్ ద్వారా వాయిస్ కాల్స్‌ని వాడటం మొదలుపెడితే 2018 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా టెల్కోల ఆదాయాల్లో 386 బిలియన్ డాలర్ల మేర గండిపడుతుంది. ప్రస్తుతం టెల్కోల ఆదాయంలో సగటున 85 శాతం వాటా వాయిస్ కాల్స్‌దే ఉంటోంది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీవోఐపీ) రూపంలో ఇప్పటికే ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇది వచ్చినప్పుడు కూడా దేశీయంగా వీఎస్‌ఎన్‌ఎల్ ఆదాయం 40-50 శాతం పడిపోయింది.

  వీవోఐపీతో దేశీయంగా వీఎస్‌ఎన్‌ఎల్, అటు అమెరికాలో ఏటీఅండ్‌టీ వంటి దిగ్గజాలు పోరాడినప్పటికీ... వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే, ఇప్పటికే టెలికం స్పెక్ట్రం, లెసైన్సులు, నెట్‌వర్క్ ఏర్పాటు కోసం వేల కోట్లు కుమ్మరించిన టెల్కోలు వాట్స్‌యాప్ దాడిని చూస్తూ ఊరుకోకపోవచ్చు. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవి నియంత్రణ సంస్థను ఆశ్రయించవచ్చు. ఆపరేటర్ల ఆందోళనలపై కూడా తాము దృష్టిపెడతామని ఈ మధ్యే టెలికం శాఖ కూడా హామీ ఇచ్చింది. ఏది ఏమైనా... ఇప్పటిదాకా ఏదో రకంగా లాగించిన టెలికం కంపెనీలు ఇప్పటికైనా పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి సత్వర చర్యలకు దిగాలని, లేదంటే కష్టమేనని కపూర్ వ్యాఖ్యానించారు.
 

Tuesday, February 25, 2014

ఏటీఎంలకు మరో రూ.1,800 కోట్లు వెచ్చించేందుకు బ్యాంకులు సన్నద్ధం

రద్దీ లేని చోట్ల రాత్రిళ్లు మూసివేత..!
ఈనాడు -
ప్రతి బ్యాంకు శాఖలోనూ ఏటీఎం తప్పసరి చేయాలన్న భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఆదేశాలను అమలు చేసేందుకు బ్యాంకులు సన్నద్ధం అవుతున్నాయి. విస్తరిస్తున్న జనావాసాలకు అనుగుణంగా, మరిన్ని ఏటీఎం కేంద్రాలనూ ఏర్పాటు చేస్తున్నాయి. గత ఏడాది ఆఖరుకు దేశంలోని బ్యాంకులన్నీ కలిపి 1.41 లక్షల ఏటీఎంలను నెలకొల్పగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా దేశంలో మరో 30,000 ఏర్పాటవుతాయని అంచనా. ఇందుకు బ్యాంకులు కనీసం రూ.1,800 కోట్లు వెచ్చించాల్సి ఉంది.
ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరాన్ని, బ్యాంకు పనివేళల్లోనే ఆర్థిక లావాదేవీలు జరుపుకోవాల్సిన అవస్థను తప్పించిన ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్)లు మరిన్ని ఏర్పాటు కాబోతున్నాయి. ప్రారంభంలో నగదు ఉపసంహరణ, ఖాతాలో నిల్వ పరిశీలన, లావాదేవీల పరిశీలన (మినీ స్టేట్‌మెంట్)కు ఏటీఎంలను ఎక్కువగా వినియోగించే వారు. ఇప్పుడు నగదు జమ, వేరే ఖాతాలకు నగదు బదిలీ, బీమా- బిల్లుల చెల్లింపు, రుణానికి అభ్యర్థన, టికెట్ల కొనుగోలుల వంటి వాటికీ వాడుతున్నారు. బ్యాంకు శాఖల ఆవరణల్లో అద్దె అదనంగా లేకున్నా, ఏటీఎం నెలకొల్పేందుకు గదిని తీర్చిదిద్ది, భద్రతా ఏర్పాట్లు చేసేందుకు బ్యాంకులకు అదనపు ఖర్చు తప్పదు.

ఇదీ లెక్క: దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని వాణిజ్య బ్యాంకులు 1.08 లక్షల బ్యాంకు శాఖలను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభంలో 1,14,014 ఏటీఎంలు ఉంటే, గత డిసెంబరు ఆఖరుకు కొత్తగా 27,501 జత చేరి, వీటి సంఖ్య 1,41,515కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే ప్రతి బ్యాంకు శాఖలోనూ ఒక ఏటీఎం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. దీనికి తోడు విస్తరిస్తున్న జనావాసాల్లో కొత్తగా ఏటీఎం కేంద్రాలను బ్యాంకులు నెలకొల్పుతున్నాయి. మార్చి లోపు మరో 30,000 వరకు కొత్తగా ఏటీఎంలు ఏర్పాటు చేయవచ్చని ఒక జాతీయ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. అత్యధిక కేంద్రాల్లో ఒక ఏటీఎం ఏర్పాటు చేస్తున్నా, రద్దీకి అనుగుణంగా కొన్ని కేంద్రాల్లో 2-5 వరకు కూడా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నాయి. ఒక ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించేందుకు బ్యాంకులకు సగటున రూ.6 లక్షల వరకు ఖర్చవుతోంది. అంటే 30,000 ఏటీఎంలు నెలకొల్పేందుకు బ్యాంకులు మరో రూ.1,800 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ఒక్కో కేంద్రంలో 2-3 ఏటీఎంలను నెలకొల్పినప్పటికీ, ఇందుకు పెద్ద ప్రాంగణాలు అద్దెకు తీసుకోవడం వల్ల అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఫలితంగా కేంద్రాల సంఖ్య తగ్గినా, బ్యాంకుల పెట్టుబడి ఒకే మాదిరి ఉంటోంది. ప్రస్తుతం ఏటీఎంలపై సగటు లావాదేవీలు రోజుకు 180 వరకు ఉన్నాయి. నిర్వహణ ఖర్చులన్నీ కలుపుకొంటే, ఒక్కొక్క లావాదేవీకి రూ.12-15 వ్యయం అవుతున్నట్లు అంచనా.

నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు..
ఒకవైపు ఏటీఎం కేంద్రాలు పెంచుతూనే, మరో వైపు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకొనేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. బెంగళూరులో ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి జరిగాక, భద్రతా ఏర్పాట్లు పెంచాలంటూ బ్యాంకులపై ఒత్తిడి పెరిగింది. 24 గంటలూ భద్రత కల్పించేందుకు మూడు షిఫ్టులలో ముగ్గురేసి సెక్యూరిటీ గార్డుల జీతభత్యాలు అదనపు భారం అవుతుంది. ఇందుకోసం అన్ని బ్యాంకులపై కలిపి ఏడాదికి రూ.4,000 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. అంటే ప్రతి లావాదేవీకి అదనంగా రూ.5 వరకు పడుతుందని భావిస్తున్నారు.
చి అవకాశం ఉన్న- లావాదేవీలు తక్కువగా ఉన్న సమయాల్లో ఏటీఎం కేంద్రాల మూసివేతను బ్యాంకులు చేపడుతున్నాయి.
చి అత్యధిక ఏటీఎం కేంద్రాల్లో ఎయిర్‌కండీషన్ సదుపాయం ఉంది. వీటితో పాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. కాబట్టి ఏటీఎం తక్కువ గంటలు పనిచేస్తే విద్యుత్తు బిల్లు భారం కూడా తగ్గుతుందనేది బ్యాంకుల ఆలోచన.
చి ప్రస్తుతం ఒక బ్యాంకు ఖాతాదారు, సొంత బ్యాంకు ఏటీఎంలలో ఎన్ని లావాదేవీలైనా ఉచితంగా నిర్వహించుకుంటున్నారు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే, నెలకు 5 లావాదేవీలు ఉచితం. అవి దాటితే ఛార్జీ పడుతుంది. వాస్తవానికి వేరే బ్యాంకు ఏటీఎంలో నగదు ఉపసంహరిస్తే, ఖాతాదారు తరఫున బ్యాంకు రూ.15 (ఇంటర్‌ఛేంజ్ రేట్), నగదు నిల్వ పరిశీలనకు రూ.5 చొప్పున చొప్పున మొదటి లావాదేవీ నుంచే చెల్లిస్తున్నాయి. 5 లావాదేవీలు దాటాకే ఈ మొత్తాన్ని ఖాతాదారు నుంచి వసూలు చేస్తున్నాయి. ఇకపై సొంత బ్యాంకు ఏటీఏంలలోనూ నెలకు 5 లావాదేవీలు దాటితే, ఇలానే చార్జీ వసూలు చేయాలన్నది బ్యాంకర్ల ప్రతిపాదనగా ఉంది.
చి లావాదేవీలు అధికంగా జరిగే కేంద్రాలను మాత్రమే 24 గంటలూ తెరచి ఉంచి, మిగిలిన వాటికి విరామం ఇవ్వనున్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6/8 గంటల వరకు లావాదేవీల సంఖ్య 5-10 దాటని ప్రాంతాల్లో ఏటీఎంల మూసివేతను ఇప్పటికే కొన్ని బ్యాంకులు ప్రారంభించాయి కూడా.
మార్చి లోపు కొత్తగా 1600 ఏటీఎంలు
ఒక ఏటీఎం ధర రూ.3.25 లక్షల వరకు ఉంది. స్థిరాస్తి (గది లీజు), విద్యుత్తు సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు, అలంకరణ.. ఇవన్నీ కల్పించేందుకు ఒక్కో కేంద్రంపై రూ.6 లక్షల వరకు వెచ్చిస్తున్నాం. మా బ్యాంకుకు 1,400 ఏటీఎంలున్నాయి. మార్చి 31లోపు మరో 1600 ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నాం. బ్యాంకుకు ఖాతాదారు వచ్చి, నగదు లావాదేవీలు జరుపుకునేందుకు అయ్యే వ్యయం ఏటీఎంతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ అనేది వాస్తవమే. అందుకే 5 లావాదేవీల పరిమితిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు అన్ని బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి.
- ఎం.ఆంజనేయ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిండికేట్ బ్యాంకు

వాట్స్‌యాప్‌ను 'లైక్' చేసిన ఫేస్‌బుక్

రూ.1,14,000 కోట్లతో సొంతం!
అతిపెద్ద మొబైల్ ఐటీ కొనుగోలు ఇదే
లాటిన్ అమెరికా, ఆసియాల్లో మరింత విస్తరణకు వూతం

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ సర్వీస్ అయిన వాట్స్‌యాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేయనుంది. 19 బిలియన్ డాలర్ల(డాలరుకు రూ.60 చొప్పున లెక్కగడితే రూ.1,14,000 కోట్లు)కు ఒప్పందం కుదరనుంది. ఇందులో భాగంగా 12 బిలియన్ డాలర్ల విలువైన ఫేస్‌బుక్ షేర్లను; 4 బిలియన్ డాలర్ల నగదును; మిగిలిన 3 బిలియన్ డాలర్లను బదిలీ చేయడానికి వీలులేని షేర్ల రూపంలోనూ చెల్లించనున్నారు. తద్వారా ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక నెట్‌వర్కింగ్ సైట్‌గా ఉన్న ఫేస్‌బుక్.. వాట్స్‌యాప్‌నకున్న 45 కోట్ల వినియోగదార్లను జతచేసుకుని మరింత బలోపేతం కానుంది. 'ప్రపంచానికి మరింత అనుసంధానాన్ని అందించాలన్న ఫేస్‌బుక్, వాట్స్‌యాప్్‌ల ధ్యేయానికి ఈ కొనుగోలు ఉపయుక్తంగా ఉండగలద'ని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాదిలోగా ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాలని సంస్థ భావిస్తోంది.

బ్రాండ్ మారదు: కంపెనీ చేస్తున్న అతిపెద్ద కొనుగోలు ఇదేనంటున్న ఫేస్‌బుక్.. దీని ద్వారా వాట్స్‌యాప్ బ్రాండ్‌పై ప్రభావం ఉండదని అదే విధంగా కంపెనీ ప్రధాన కార్యాలయం సైతం కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోనే ఉండబోతుందని స్పష్టం చేసింది. 2012లో పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ 16 బిలియన్ డాలర్లను సమీకరించిన సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం కౌమ్.. ఫేస్‌బుక్ బోర్డులో చేరుతారు. అదే సమయంలో వాట్స్‌యాప్ వ్యవస్థాపకులు, ఉద్యోగులకు 3 బిలియన్ డాలర్ల(4,59,66,444 షేర్లు) విలువైన పరిమిత స్టాక్ యూనిట్లను అందజేస్తారు. ఒప్పందం అనంతరం కూడా వాట్స్‌యాప్ స్వతంత్రంగానే కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఒప్పందం ముగిసిన తర్వాత వాట్స్‌యాప్‌నకు చెందిన అన్ని షేర్లు, ఆప్షన్లు ఎక్స్ఛేంజీల్లో రద్దవుతాయి.
చి ఒక వేళ నియంత్రణ సంస్థలు ఈ విలీనానికి ఒప్పుకోకపోతే వాట్స్‌యాప్‌నకు ఫేస్‌బుక్ 1 బిలియన్ డాలర్లను నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో అంతే విలువైన ఫేస్‌బుక్ క్లాస్ కామన్ స్టాక్‌ను సైతం ఇవ్వాల్సి ఉంటుంది. రద్దయిన తేదీకి ముందు పదిరోజుల సగటు షేరు ధరను ఇందుకు పరిగణనలోకి తీసుకుంటారు.
చి గతేడాది జుకర్‌బర్గ్ 3 బిలియన్ డాలర్లకు మరో మెసేజింగ్ సంస్థ స్నాప్‌చాట్‌ను కొనుగోలుకు యత్నించి విఫలమయ్యారు.

ఎందుకీ కొనుగోలు
ప్రపంచంలో ఇప్పటికీ మూడింట రెండొంతుల మంది ఇంటర్నెట్‌ను వినియోగించని వారే. వీరికి అంతర్జాలాన్ని దరిచేయాలన్నదే ఫేస్‌బుక్‌కు చెందిన ఇంటర్నెట్.ఓఆర్‌జీ ప్రాజక్టు లక్ష్యం. ఎక్కువ శాతం వృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే జరగనుందనేది సుస్పష్టం. ఆ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందిన వాట్స్‌యాప్‌ను చేజిక్కించుకోవడం ఫేస్‌బుక్ వ్యూహంలో కీలకంగా మారింది. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ప్రస్తుతం వాట్స్‌యాప్‌కున్న ప్రతి యాక్టివ్ వినియోగదారూ.. చెల్లించే వినియోగదారుగా మారితే వాట్స్‌యాప్్‌కు 450 మిలియన్ డాలర్లు వస్తాయి.
ఏమిటీ వాట్స్‌యాప్
ఇదో అంతర్జాల ఆధారిత క్రాస్-ఫ్లాట్‌ఫాం మొబైల్ అప్లికేషన్. వివరంగా చెప్పాలంటే.. ఎలాంటి టెలికాం ఛార్జీలు చెల్లించకుండానే సంక్షిప్త సందేశాలను (ఫొటోలు, వీడియోలు సైతం) వినియోగదారులు ఒకరికొకరు చేరవేసుకునే, పంచుకునే అప్లికేషన్. దీనిని 2009లో యాహూ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు అయిన జాన్ కౌమ్(ఉక్రేనియా), బ్రియాన్ ఆక్టన్(అమెరికా)లు స్థాపించారు. దాదాపు ప్రతీ నెలా 45 కోట్ల మంది ఈ మెసేజింగ్ సర్వీసును ఉపయోగించుకుంటుండగా.. ఇందులో 70 శాతం మంది యాక్టివ్‌గా ఉంటున్నారు. అంతే కాదు రోజుకు 10 లక్షల మంది కొత్త వినియోగదారులు ఇందులో చేరుతున్నారు. ఒప్పందం అనంతరం కూడా కేవలం నామమాత్రపు ఫీజుతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఏ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నా.. ఈ అప్లికేషన్ సాయంతో సందేశాలు పంపించుకోవచ్చని స్వయనా కౌమ్ చెప్పారు. మధ్యలో ఎలాంటి ప్రకటనలూ బాధించబోవని హామీ ఇచ్చారు.
భారత్‌లో విస్తరణకు వూతం
తాజా కొనుగోలుతో లాటిన్ అమెరికా, ఆసియా (ముఖ్యంగా భారత్‌లో) ఫేస్‌బుక్ విస్తరణకు వూతం లభిస్తుంది. ఎందుకంటే భారత్ సహా ఐరోపా, లాటిన్ అమెరికా దేశాల్లోని యువత వాట్స్‌యాప్్‌కు బాగా దగ్గరయ్యారు. ఇక్కడ అది స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని జుకర్ బర్గే స్వయంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఆ మార్కెట్‌ను సొంతం చేసుకుంటే భవిష్యత్‌కు ఢోకా ఉండదన్న అంచనాతోనే ఈ కొనుగోలు జరగనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
భారీ ఒప్పందం ఇదే..
ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద మొబైల్ ఐటీ ఒప్పందం ఇదే. 2011లో స్కైప్‌ను మైక్రోసాఫ్ట్‌ను కొనుగోలు చేసిన 8.5 బిలియన్ డాలర్ల కంటే దీని విలువ రెట్టింపు కావడం గమనర్హం. ఇక గూగుల్ నుంచి మోటరోలాను కొనుగోలు చేయడానికి లెనోవో పెట్టిన 2.9 బిలియన్ డాలర్లతో పోలిస్తే తాజా ఒప్పందం అయిదు రెట్లు పెద్దది.

టీసీఎస్‌కు నాలుగో అతి పెద్ద కేంద్రంగా హైదరాబాద్

25,000 దాటిన నిపుణులు 6,000 మందికి శిక్షణ
డొమైన్ వ్యూహాలూ ఇక్కడే: కంపెనీ ప్రాంతీయ అధిపతి వి.రాజన్న

(ఈనాడు)
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు నాలుగో అతి పెద్ద సేవా కేంద్రంగా హైదరాబాద్ అవతరించింది. 2007 జనవరిలో 4,500 మంది నిపుణులుండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 25,000 దాటింది. చెన్నై, బెంగళూరు, ముంబయి ప్రాంతాలలో 50,000 మందికి పైగా నిపుణులు ఉండగా, వాటి తరువాత స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ప్రాంగణాల్లో ఎంపిక చేసిన వారిలో 6,000 మందికి ఇక్కడే శిక్షణ ఇస్తున్నారు. విభిన్న రంగాలకు అవసరమైన నిపుణుల తయారీకి వ్యూహాలను కూడా హైదరాబాద్‌లోనే సిద్ధం చేస్తున్నట్లు టీసీఎస్ ప్రాంతీయ అధిపతి వి.రాజన్న 'ఈనాడు'తో చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభాన్ని 50 శాతం పెంచుకున్న సంస్థ వ్యవహారాల్లో హైదరాబాద్ కీలక పాత్రను ఆయన వివరించారు.

అన్ని విభాగాలకు సేవలు
బ్యాంకింగ్- ఆర్థిక సేవలు- బీమా రంగాలు, టెలికాం, ఇంజినీరింగ్, రిటైల్, తయారీ, వినియోగ విభాగాలు, ప్రసార మాధ్యమాలు, వినోద రంగం, మొబిలిటీ, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్లు.. ఇలా అన్ని విభాగాలకు సేవలు విస్తరించాం. బిజినెస్ ఇంటెలిజెన్స్, టెస్టింగ్, ఎంబెడెడ్ సిస్టమ్‌ల సేవలూ అందిస్తున్నాం. 4జీ వంటి అధునాతన సాంకేతికతపై ప్రయోగాలు, అవగాహన కోసం సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ నెలకొల్పాం. ఆయా విభాగాల్లో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సిబ్బందికి శిక్షణ, సూచనలు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగం ఉంది. విభిన్న రంగాలు- విభాగాల (డొమైన్)లపై అవగాహన ఉంటేనే వారికి అవసరమైన సాంకేతిక సొల్యూషన్లు ఇవ్వగలం. టీసీఎస్‌కు ఈ వ్యూహాలు రచించే కీలక బృందం 'బిజినెస్ డొమైన్ అకాడమీ' పేరిట హైదరాబాద్‌లోనే ఉంది. సామాజిక మాధ్యమాలు, మొబిలిటీ, అనలిటిక్స్, క్లౌడ్ విభాగాలలో (స్మాక్) డిజిటల్ సొల్యూషన్ల కోసం 500 మందికి పైగా పనిచేస్తున్నారు. దూర ప్రాంతాల్లోని వ్యవస్థలను నియంత్రించే రిమ్ (రిమోట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్) సేవలను ప్రారంభించాం.

సినర్జీ పార్కులో మరో భవనం
ప్రభుత్వ, దేశీయ సేవల కోసం ప్రత్యేకించిన ఒక టీసీఎస్ కేంద్రం సచివాలయ సమీపంలో ఉండగా, మిగిలిన 5 కేంద్రాలు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో ఉన్నాయి. గచ్చిబౌలిలోని సినర్జీ కేంద్రంలో 13,500 మంది నిపుణులు ఉండగా, ఇక్కడ నిర్మిస్తున్న మరో భవనం ఫిబ్రవరిలో పూర్తి కానుంది. మాదాపూర్‌లోని డెక్కన్ పార్కులో 2,500 మంది పనిచేస్తున్నారు. ఈ రెండు సొంతవి. మిగిలిన 4 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఆదిభట్లలో అతి పెద్ద కేంద్రం సిద్ధం అవుతున్నా, ఈ ఏడాదికి మాత్రం ప్రస్తుత కార్యాలయాల్లో మార్పులేమీ ఉండవు.

వలసలు ఇక్కడే తక్కువ ఎందుకంటే..
టీసీఎస్‌లో వలసలు 10.5 శాతానికి తగ్గాయి. హైదరాబాద్‌లో ఇది మరింత తక్కువగా 8.5 శాతమే ఉంది. దాదాపు అన్ని రంగాలకు సేవలు అందిస్తున్నందున, నిపుణులకు కూడా విభిన్న సాంకేతికతలపై పనిచేసే అవకాశం వస్తుంది. ఇందుకు అవసరమైన శిక్షణ కూడా ఇప్పిస్తున్నాం. ఉద్యోగుల మానసిక ఆహ్లాదం, ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. సినర్జీ పార్కులో పెద్ద ఫిట్‌నెస్ కేంద్రాన్ని నెలకొల్పాం. మహిళా ఉద్యోగులకు కరాటే క్లబ్బుల వంటివీ ఉన్నాయి.

మార్చి కల్లా 3,400 నూతన నియామకాలు
2012-13 విద్యా సంవత్సరంలో ప్రాంగణాల్లో 3,400 మందిని ఎంపిక చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దశలవారీగా వీరు చేరుతున్నారు. వచ్చే మార్చి కల్లా అందరూ చేరుతారు. గత అక్టోబరు నుంచీ ప్రాంగణాల్లో ఇప్పటికి 3,000 మందిని ఎంపిక చేశాం. ప్రాజెక్టుల అవసరార్థం ప్రాంగణం బయట (ఆఫ్ క్యాంపస్) ఎంపికలూ నిర్వహించనున్నాం. మొత్తంమీద గత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనూ ఈసారీ ఎంపికలు (3,400) ఉంటాయి. వీరంతా వచ్చే జూన్/జులై తరువాత సంస్థలో విడతలుగా చేరతారు.

ఉద్యోగానికి సిద్ధం చేసుకుంటున్నాం
ప్రాంగణ ఎంపికలతో పాటు ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు కాగానే ఉద్యోగానికి సిద్ధం అయ్యేలా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు 50కి పైగా విద్యాలయాలతో కలసి పనిచేస్తున్నాం. చివరి సంవత్సరంలో బీటెక్‌తో పాటు ఎమ్‌టెక్, ఎమ్‌సీఏ విద్యార్థులకూ ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం కల్పిస్తున్నాం. వీరికి 6- 8 నెలల ప్రాజెక్టు ఇస్తున్నాం. గూగుల్ మ్యాప్స్, జీపీఎస్‌లకు సంబంధించిన జియో స్పేషియల్ సాంకేతికతపై ఆయా కళాశాలల అధ్యాపకులకూ తరగతులు నిర్వహించాం. గిరాకీ అధికంగా ఉన్న క్లౌడ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భద్రత వ్యవహారాల పైనా తర్ఫీదు ఇస్తున్నాం. అనంతపురం, వరంగల్, జగిత్యాల, విజయనగరం, కాకినాడ, భీమవరం, రాజమండ్రి వంటి రెండో అంచె నగరాల కళాశాలలకూ వెళ్తున్నాం. దేశంలో 500 మంది అధ్యాపకులు పీహెచ్‌డీ చేసేందుకు ఆర్థిక సహకారం ఇవ్వాలన్న టీసీఎస్ ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో 18 మందికి సాయం చేస్తున్నాం.