Friday, July 10, 2015

ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ వివిధ పథకాలు

ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ వివిధ పథకాలు

                    గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు పతనమవుతాయో అంచనావేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. ఈక్విటీల్లో నేరుగా పెట్టుబడి పెట్టే కంటే... కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రయోజనం పొందవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇలాంటి హెచ్చుతగ్గుల మార్కెట్లలో చిన్న ఇన్వెస్టర్లకు ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ వివిధ పథకాలతో చక్కని రాబడులను అందిస్తోంది.
                    మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులను దృష్టిలో పెట్టుకొని ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ డైనమిక్ ఫండ్ ను ప్రవేశపెట్టింది.  డైనమిక్ ఫండ్ అనేది పూర్తిగా ఈక్విటీ పథకమే అయినా దీని పనితీరు భిన్నంగా ఉంటుంది. మార్కెట్లు పతనమైనప్పుడల్లా కొనుగోలు చేసి గరిష్టస్థాయికి చేరుకున్నప్పుడల్లా విక్రయిస్తుంటాయి. దీని వలన దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు చక్కని లాభాలు వస్తాయి. 2002 అక్టోబర్ 31న ప్రారంభమైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్.... ప్రస్తుతం 59 స్టాక్స్ ను హోల్డ్ చేస్తోంది. 0.76 కంటే తక్కువగా బీటా ఫండ్ ను కలిగి ఉన్న ఈ ఫండ్ తొలి ఏడాది 7.96 శాతం రిటర్న్స్ ఇచ్చింది. తొలి మూడేళ్ళలో  ఏటా సగటున 19.59 శాతం,  ఐదేళ్ళలో 12.45 శాతం, ఏడేళ్ళలో 15.35 శాతం, పదేళ్ళలో 19.37 శాతం రిటర్న్స్ నిచ్చింది, ఇప్పటి వరకు ఏటా సగటున 25.62శాతం లాభాలను అందించింది. 2002లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్ లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 18 లక్షల 10 వేల 669 రూపాయలకు పెరిగింది.
                     బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈక్విటీ రాబడితో పాటు డెట్  పథకాల రక్షణనూ పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబరిచింది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌‍డ్ అడ్వాంటేజ్ ఫండ్.  2009 డిసెంబర్ లో ప్రారంభమైన ఈ ఫండ్ కూడా ఇన్వెస్టర్లకు చక్కని రిటర్స్ ఇస్తోంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, హెచ్‌‍సీఎల్ టెక్నాలజీస్‌‍తో పాటు మొత్తం 64 కంపెనీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది.  అత్యుత్తమ కంపెనీలపైనే దృష్టి పెడుతోన్న ఈ ఫండ్..  తొలి ఏడాది 15.75 శాతం రాబడినిచ్చింది. తొలి మూడేళ్ళలో ఏటా సగటున 19.87 శాతం, ఐదేళ్ళలో 14.54 శాతం, ఏడేళ్ళలో సగటున 14.59 శాతం రిటర్న్స్ నిచ్చింది. 2006లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌‍డ్ అడ్వాంటేజ్  ఫండ్‌లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 2 లక్షల 58 వేల రూపాయలు. ఈ ఫండ్ ద్వారా వచ్చిన రిటర్న్స్‌కు పన్నుపరంగా కూడా ప్రయోజనం ఉంటుంది.
                     ఇక లార్జ్ క్యాప్ ఫండ్స్ లో చక్కని రిటర్న్స్ ఇస్తోంది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్. 2008లో ప్రారంభమైన ఈ ఫండ్...   HDFC బ్యాంక్,  ICICI  బ్యాంక్,  ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్,  HCL టెక్నాలజీస్ తో పాటు మొత్తం 49 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. మెరుగైన కంపెనీలనే దృష్టి పెడుతోన్న ఈ ఫండ్..  తొలి ఏడాది 15.94 శాతం రాబడినిచ్చింది. తొలి మూడేళ్ళలో ఏటా సగటున 21.57 శాతం, ఐదేళ్ళలో 14.41శాతం, ఏడేళ్ళలో ఏటా సగటున 17.60 శాతం రిటర్న్స్ నిచ్చింది.  2008 నుంచి ఇప్పటి వరకు ఈ ఫండ్ సగటున ఏటా 16.19  శాతం రాబడిని అందించింది. 2008లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఫండ్ లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 2 లక్షల 91 వేల 6 వందల రూపాయలుగా ఉంది.
                    మీ పోర్ట్ ఫోలియోలో తప్పనిసరిగా ఉంచుకోదగ్గ మరో ఫండ్... ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్. ఇది వాల్యూ ఓరియెంటెండ్ ఫండ్. 2004లో ప్రారంభమైన ఈ ఫండ్ చక్కని ట్రాక్ రికార్డ్ ను కలిగి ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో 65 నుంచి 75 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తోంది. ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, విప్రోతో పాటు మొత్తం 61 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. తొలి ఏడాది 27.83 శాతం రాబడినిచ్చిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్... తొలి మూడేళ్ళలో ఏటా సగటున 31.58 శాతం, ఐదేళ్ళలో 19.39శాతం, ఏడేళ్ళలో సగటున 24.58 శాతం రిటర్న్స్ నిచ్చింది. 2004 నుంచి ఇప్పటి వరకు ఈ ఫండ్ సగటున ఏటా 24.95 శాతం రాబడిని అందించింది. 2004లో  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 11 లక్షల 34 వేల ఒక వంద రూపాయలుగా ఉంది.