Monday, May 31, 2010

వీసా స్టీల్‌

ఎందుకు కొనాలి...
సొంత ముడిఖనిజపు గనులు, సొంత విద్యుత్‌ తయారీ భౌగోళికంగా అత్యంత అనుకూలమైన మౌళిక సదుపాయాలు, అత్యంత అధునాతనమైన టెక్నాలజీ, వృత్తి నిపుణుల సారథ్యం, విశ్వవ్యాప్త మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌ అన్నీ కలిపి కార్బన్‌ స్టీల్‌, స్పెషల్‌ స్టీల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ను అత్యంత చౌక ధరల్లో ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతున్నాయి. ఈ అంశాలే మదుపుదారులకు లాభాలను అందుకోవడానికి ఇచ్చే ‘వీసా’.

ఆర్థిక ఫలితాలు: 2010-11 ఆర్థిక సంవత్సరంలో మూడవ త్రైమాసికంలోనే వైర్‌ రాడ్‌ మిల్లును, మెల్టింగ్‌ షాపును మూడవ దశ 25 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్నందు వలన పూర్తి స్థాయి సామర్థ్యం, ఫలితాలు, లాభ నష్టాలు 2011-12 సంవత్సరంలోనే ప్రతి బింబిస్తాయి. ఈ సమీకృత స్టీల్‌ మిల్లులో దశల వారీగా నిర్మాణాన్ని చేపట్టడం వలన 2010-11 సంవత్స రంలో 1,800 కోట్ల టర్నోవర్‌ను, 2011-12 సంవత్సరంలో 2,400 కోట్ల టర్నోవర్‌ను సాధించనుంది.

visa-steel 2010-11 సంవత్సరంలో 100 కోట్ల లాభాన్ని, 2011-12 సంవత్సరంలో 150 కోట్ల లాభాన్ని ఆర్జించనుంది. ఈ విధంగా రూ.10 ఇపియస్‌ మరియు రూ.15 ఇపి యస్‌ను ఆర్జించనున్న ఈ షేరు రూ.34.20 లకు లభించడం అత్యంత చౌకగా లభించినట్లే. 2008-09 లో చవిచూచిన 66.81 కోట్ల నికర నష్టం విదేశీ కరెన్సీ మార్పిడిలో వచ్చిన ఒడిదుడుకుల వలన సంభవించిందే తప్ప వ్యాపార నిర్వహణాపరమైనది కాదు. 2009-10 లో ఆర్జించిన 47.42 కోట్ల పన్ను తర్వాత నికర లాభం ఒక్కొక్క షేరుకు రూ.4.31 ఇపియస్‌ను ఇస్తుంది. ఈ విధంగా కూడా రూ.34 లకు లభిస్తున్న ఈ షేరు చాలా చౌకైనది.

విద్యుత్‌ ఉత్పత్తి జార్ఖండ్‌ ప్లాంట్‌: 2,500 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని స్థాపించడానికి జార్ఖండ్‌ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గుజరాత్‌ ప్లాంట్‌ గుజరాత్‌లోని పిపాయవ్‌ నౌకాశ్రయానికి దగ్గరగా రూ.4,200 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో 1,000 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని స్థాపించడానికి గుజరాత్‌ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2011 జూన్‌ నాటికి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించనుంది.

ఛత్తీస్‌ఘడ్‌ ప్లాంట్‌ ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వంతో ఏర్పరుచుకున్న ఒప్పందం ప్రకారం 5,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌ వ్యయంతో 1,200 (4300) మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని స్థాపించడానికి సన్నాహాలు ప్రారంభిం చింది. ఇందులో మొదటి దశ 2011 వ సంవత్సరంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ విద్యుత్‌ను మర్చంట్‌ బేసిస్‌ ఆధారంగా విక్రయించను న్నందు వలన ఒక్కొక్క (కెడబ్ల్యుహెచ్‌) యూనిట్‌కు రూ.7 పైగానే లభించనున్నది. ఈ ఒక్క ప్లాంటు నుండే కోటాను కోట్ల రూపా యల లాభాన్ని కంపెనీ పొందబోతుంది. ఒరిస్సా ప్లాంట్‌ ఒరిస్సా ప్రభుత్వంతో ఏర్పరు చుకున్న ఒప్పందం ప్రకారం కటక్‌ జిల్లాలో 4,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌ వ్యయంతో 1,000 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పనుంది. 2011 జూన్‌ నాటికి ఈ ప్లాంటు కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. 2012 సంవత్సరం నాటికి ఈ 5,700 మెగావాట్ల సామర్థ్యాన్ని అందు బాటులోకి తీసుకురావడానికి కంపెనీ దాదాపు రూ.25,000 కోట్లను వినియోగించనుంది. ఈ పెట్టుబడులే మదుపు దారులకు లాభాలను అందిస్తాయి.

క్యాపిటివ్‌ పవర్‌:కళింగ నగర్‌లోని స్టీల్‌ ప్లాంటు నుండి విడుదల అవుతున్న వ్యర్థ నీటి ఆవిరి నుండి ప్రస్తుతం 75 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉత్పత్తికి అదనంగా 250 మెగావా ట్లను జతచేసి మొత్తం 325 మెగావాట్ల సామర్థ్యానికి 2012 సంవత్సరానికి చేరుకోనుంది. ఈ సొంత విద్యుత్‌ స్టీల్‌ను చౌకగా తయారుచేయడానికి ఉప యోగపడుతుంది.

స్టీల్‌ ప్లాంట్‌ - రాయఘర్‌: 2.5 మిలియన్‌ టన్నుల సమీకృత స్టీల్‌ ప్లాంటును మరియు క్యాపిటివ్‌ 500 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టును నెలకొల్పడానికి ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఫెర్రో క్రోమ్‌ ప్లాంట్‌ - ఒరిస్సా: అనుబంధ సంస్థ వీసా బావో స్టీల్స్‌ ద్వారా 1 లక్ష టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫెర్రో క్రోమ్‌ ప్లాంటును ఒరిస్సాలో నెలకొల్పనుంది.

కళింగ నగర్‌ కోల్‌ వాషరీ: ప్రస్తుతం కళింగనగర్‌లో ఉన్న 2.5 మిలియన్‌ టన్నుల సమీకృత స్టీల్‌ ప్లాంటుకు అదనంగా కంపెనీ కళింగ నగర్‌లోనే 250 మెగావాట్ల క్యాపిటివ్‌ పవర్‌ ప్లాంట్‌తో కోల్‌వాషరీ, 5 లక్షల టన్నుల స్పెషల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ప్లాంటు, 4,25,000 టన్నుల పిగ్‌ ఐరన్‌ ప్లాంటు, 3లక్షల ట న్నుల స్పాంజ్‌ ఐరన్‌ ప్లాంటు, 10 లక్షల టన్నుల సింటర్‌ ప్లాంటును నెలకొల్పబోతుంది.

డివిడెండ్‌: 2009-10కి కంపెనీ 10% డివిడెండ్‌ను ప్రకటించింది.

పబ్లిక్‌ ఇష్యూ: 2006 మార్చితో అంతమైన ఆర్థిక సంవత్సరంలో రూ.10 ముఖవిలువ కలిగిన 3 కోట్ల 50 లక్షల షేర్లను రూ.47 ప్రీమియంతో కలుపు కొని రూ.57 లకు ప్రజలకు జారీ చేసి రూ.199.5 కోట్ల నిధులను సమీక రిం చింది. 2006 వ సంవత్సరంలోనే రూ.57 లకు జారీ చేయబడిన ఈ షేరు 4సంవత్సరాల తర్వాత వాణిజ్య ఉత్పత్తి అనంతరం లాభాలను ఆర్జిస్తూ డివిడెం డ్‌ను చెల్లిస్తున్న ఈ షేరు రూ.34లకు లభించడం విలు వైన అద్భుత అవకాశం.

ముగింపు :
5,700 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం, 325 మెగావాట్ల క్యాపిటివ్‌ పవర్‌ సామర్థ్యం, 5 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి, 1 లక్ష టన్నుల ఫెర్రో క్రోమ్‌ ఉత్పత్తితో, 2012 సంవత్సరం తర్వాత ఈ కంపెనీ ప్రపంచ స్టీల్‌ రంగంలో ప్రముఖ కంపెనీల జాబితాలో చేర నుంది. సంవత్సర కాలంలో రూ.34 షేరు రూ.65 అవుతుంది.

table-three

వాల్‌మార్ట్‌ దండయాత్ర

వాషింగ్టన్‌: మహ్మద్‌ ఘోరీ దండయాత్రలా భారత్‌లోకి ప్రవేశించేందుకు ఎన్నో ఏళ్ళుగా వాల్‌ మార్ట్‌ సంస్థ ప్రయత్నిస్తూనే ఉంది. బిలియన్‌ డాలర్ల కొద్దీ విలువైన భారతీయ రిటైల్‌ మార్కెట్‌లోకి నేరుగా ప్రవేశించేందుకు ప్రపంచ అతిపెద్ద రిటెయిర్‌ అయిన వాల్‌మార్ట్‌ సంస్థ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ విషయంలో తమకు సహకరించాల్సింది గా అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటి వరకూ భారత్‌లో అమల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబం దనలు దేశంలోకి ఆ సంస్థ ప్రవేశాన్ని అడ్డు కుంటూ వచ్చాయి.

అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌ స్టోర్స్‌ ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాల్లో ఉనికిని కలిగి ఉంది. దీని విక్ర యాలు ఏటా 400 బిలియన్‌ డాలర్ల వరకూ ఉంటా యి. భారత్‌లోకి ప్రవేశించే విషయంలో సహకరిం చాల్సిందిగా ఆ సంస్థ అమెరికా చట్టసభల సభ్యులతో లాబీయింగ్‌ చేస్తోంది. అవసరమైతే రెండు దేశాలకు చెందిన సంబంధిత అధికారులు, సంస్థలతో దె్వైపాక్షిక చర్చలు జరపాల్సిందిగా కూడా కోరుతోంది. అమె రికా కాంగ్రెస్‌ సభ్యులనే గాకుండా ఆ దేశానికి చెందిన వాణిజ్య, ఆర్థిక శాఖల వద్ద కూడా తన పైరవీలు చే స్తోంది. వాల్‌మార్ట్‌ ఇప్పటికే భారతదేశంలోకి దొడ్డి దారిన ప్రవేశించింది. బిజినెస్‌ టు బిజినెస్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌, బ్యాక్‌ఎండ్‌ సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌ల పేరిట ఇది సునీల్‌ మిట్టల్‌ నేతృత్వంలోని భారతి గ్రూప్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

2007లో ఈ కంపెనీ భారతి రిటైల్‌తో కలసి జాయింట్‌ వెంచర్‌ను ఆరంభించింది మొదలుకొని వాల్‌మార్ట్‌ అమెరికాలో తన లాబీయింగ్‌ను తీవ్రతరం చేసింది. నాటి నుంచీ నేటి వరకూ ఈ విధమైన లాబీ యింగ్‌ కోసం ఆ సంస్థ అధికారికంగా రూ. 52 కోట్ల మేరకు వెచ్చించింది. 2010లో మొదటి త్రైమాసికం లో లాబీయింగ్‌ కోసం రూ. 6 కోట్లకు పైబడిన మొత్తా న్ని కేటాయించింది. లాబీయింగ్‌ చేయడం అమెరికాలో చట్టబద్దమే. ఈ పని కోసం వెచ్చించిన మొత్తాలను ఆయా కంపెనీలు ప్రతీ త్రైమాసికానికి తెలియజేయాల్సి ఉంటుంది.

మలీ ్టబ్రాండ్‌ రిటెయిల్‌ రంగంలోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత్‌ అనుమతిం చవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో వాల్‌మార్ట్‌ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది.
వాల్‌మార్ట్‌ అధికారులు ఎప్పటినుంచో కూడా భార త్‌ తమకు వ్యూహాత్మకంగా ఎంతో కీలక మార్కెట్‌గా చెబుతూవచ్చారు. ఈ సంస్థ అంతర్జాతీయంగా మరిం తగా విస్తరించే యోచనలో ఉంది. ఇది తన ఆదా యంలో సగం కంటే ఎక్కువ మొత్తాన్ని విదేశాల ద్వారానే పొందుతోంది. ఫ్రంట్‌ ఎండ్‌ రిటెయిల్‌ మార్కెట్‌లోకి కూడా నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత్‌ అనుమతించగలదన్న ఆశా భావాన్ని భారతి వాల్‌మార్ట్‌ సీఈఓ రాజ్‌జైన్‌ ఇటీవల వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రగతిశీల దృక్ప థాన్ని బట్టి తాను ఈ విధంగా భావిస్తున్నట్లు తెలి పారు.

కాకినాడ రిఫైనరీ కథ కంచికి

హైదరాబాద్‌: ఏళ్ళు గడుస్తున్నా.. రాష్ట్రం లో జిఎమ్‌ఆర్‌ రిఫైనరీ పనులు కార్యరూపం దాల్చడంలేదు. దాదాపుగా గత రెండేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ జిఎమ్‌ ఆర్‌ రిఫైనరీ పలనులు చేపట్టకుండా కాలయాపన చేస్తూ వస్తున్నది. కొంత కాలం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారల్‌ ధరలు క్షీణించడం, అనంతరం ఆర్థిక మాంద్యం సాకుగా చూపి దీర్ఘకాలంగా రిఫైనరీ నాటకాన్ని జిఎమ్‌ఆర్‌ ముందు కు నడిపిస్తూ వచ్చింది. మరోవైపు అధికారులు కూడా జిఎమ్‌ ఆర్‌ రిఫైనరీ ఏర్పాటుపై తమకేమీ తెలియదని, వారినే అడ గండని పరిశ్రమల అధికారులు సమాధానం చెప్పకుండా జారుకోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

దీంతో జిఎమ్‌ఆర్‌ రిఫైనరీ కథ కంచికి చేరినట్లుగానే కనబడుతున్నది.ఈ భూములు ప్రత్యామ్నాయ పనులకు వినియోగించు కోవడానికి జిఎమ్‌ఆర్‌, కెఎస్‌ఇజెడ్‌ యాజమాన్యం సన్నా హాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో కాకినాడ సెజ్‌లో ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్‌జిసి రిఫైనరీ ఏర్పాటుకు ముందు కు వచ్చినప్పటికీ.. అప్పటి సర్కార్‌ పెద్దలు వ్యవహరించిన తీరుతో విస్తుపోయిన ఒఎన్‌జిసి కెఎస్‌ఇజెడ్‌ నుంచి అయిష్టంగానే తప్పుకుంది. మొత్తంగా కాకినాడ సెజ్‌ నుంచి ఒఎన్‌జిసిని వెళ్ళగొట్టడంలో మన పాలకులు విజయం సాధించినా.. రాష్ట్రానికి అత్యంత ప్రయోజనాలు కల్పించే రిఫైనరీ కల మాత్రం నెరవేరలేదు. గతంలో ఒఎన్‌జిసికి కేటాయించిన 2,500 ఎకరాల భూములు రాష్ట్రానికి చెందిన జిఎమ్‌ఆర్‌గ్రూప్‌కు అందచేసినప్పటికీ.. సదరు సంస్థ ఇప్ప టికీ రిఫైనరీ పనులు చేపట్టలేదు. ప్రభుత్వరంగసంస్థ ఒఎన్‌ జిసిని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టి.. తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర పెద్దలు జిఎమ్‌ఆర్‌కు కెఎస్‌ఇజెడ్‌లో భూములు అప్పగించారు.

ప్రధానంగా కెఎస్‌ఇజెడ్‌ యాజమాన్యం వ్యవహరించిన తీరు...సర్కార్‌ పెద్దలు ఒఎన్‌జిసితో తమ ఆటలుసాగవని, తమ గారాలపట్టి జిఎమ్‌ఆర్‌కు తెరమీదకు తీసుకు రావడం తెలిసిన విషయమే. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యార ల్‌ ధరలు దూసుకుపోతున్నప్పటికీ... జిఎమ్‌ఆర్‌ కాకినాడ సెజ్‌ పరిధిలో రిఫైనరీ పనులు చేపట్టకపోవడం విశేషం. కాకినాడ రిఫైనరీ పనులను ఒఎన్‌జిసి రూ. 30 వేల కోట్లతో ఏటా 20 మిలియన్‌ టన్నుల రిఫైనరీ సామర్థ్యంతో తన ప్రతి పాదనలు ప్రభుత్వానికి సమర్పించింది.

అనంతరం ఒఎన్‌ జిసి భూములు నిబంధనలకు విరుద్ధంగా జిఎమ్‌ఆర్‌కు కాకి నాడ సెజ్‌ యాజమాన్యం కేటాయించినప్పటికీ... రిఫైనరీ పనులు చేపట్టకపోవడం స్థానికంగా తీవ్ర విమర్శలకు తావి స్తున్నది. కెఎస్‌ఇజెడ్‌ యాజమాన్యం ఒఎన్‌జిసి, ఇతర కంపె నీల పేరుతో స్థానికంగా రైతులు నుంచి వేల ఎకరాల భూములు నిబంధనలకు విరుద్ధంగా సేకరించినప్పటికీ.. ఆ మేరకు కంపెనీలు ఉత్పత్తి పనులు చేపట్టకోపోవడం విశే షం. సెజ్‌ భూములు సేకరణ సందర్భంగా లక్షలాది ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రజల నుంచి కారుచౌకగా భూ సేకరణ ప్రక్రియను ప్రభుత్వం ఏపిఐఐసి ద్వారా చేపట్టింది.

ప్రభుత్వం అధికారికంగా 12 వేల ఎకరాలకుపైగా కాకి నాడ సెజ్‌ పరిధిలో భూసేకరణ చేపట్టగా.. ప్రైవేట్‌గా సదరు సెజ్‌ యాజమాన్యం రైతుల నుంచి బలవంతంగా వేలాది ఎకరాల భూములు స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం ప్రక్రి యకు అప్పటి సర్కార్‌ పెద్దల అండదండలు ఉండడంతో సెజ్‌ యాజమాన్యం అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిం దనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. జిఎమ్‌ఆర్‌కు సెజ్‌ భూముల ధర నిర్ణయం సందర్భంలోనూ కెఎస్‌ఇజెడ్‌ యాజ మాన్యంతో వాడివేడి చర్చలే జరిగాయని తెలిసింది. ప్రభుత్వ పెద్దలు స్వప్రయోజనాలతో రాష్ట్ర సంక్షేమాన్ని తాకట్టుపెట్టి..ఒఎన్‌జిసిని మెడపట్టి మరీ రాష్ట్రం నుంచి తరి మేయడం సదరు సంస్థ అధికారులు ఇప్పటికీ జీర్ణించుకో లేకపోతున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు స్థానికంగా మరో ప్రతిష్టాత్మక ప్రభుత్వరంగ కంపెనీ కోల్పోయామని పోతున్నారు.

ఈ మొత్తం కథ అప్పటి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులకు తెలిసినా.. సర్కార్‌ పెద్దల ప్రయో జనాలు కాకినాడ సెజ్‌తో ముడిపడి ఉండడంతో నోరు మెదపలేని పరిస్థితి ఎదుర్కొన్నట్లు మాజీ ఎంఎల్‌ఏ ఒకరు వాపోయారు. కెఎస్‌ఇజెడ్‌ ప్రైవేట్‌ సెజ్‌కావడంతో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని, అదే విధంగా రాష్ట్రంలోని నెల్లూ రు, చిత్తూరు జిల్లాలోని ప్రైవేట్‌ సెజ్‌లోనూ దాదాపు ఇదే పరి స్థితి నెలకొందని పలువురు అంటున్నారు. ప్రజల నుంచి కారుచౌకగా భూములు పొంది... అటు పరిశ్రమలు, ఇటు ఉపాధి అవకాశాలు కల్పించకుండాపోవడంతో అధికారుల కు తాజా పరిస్థితులు మింగుడుపడడంలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రవొదిలి.. ప్రైవేట్‌ సెజ్‌ అక్రమా లపై కొరఢా ఝులిపించి.. సెజ్‌ల నుంచి భూములు వెనక్కి తీసుకుని, బాధిత రైతులకు తిరిగి ఇవ్వాలనే డిమాండ్‌ గట్టి గా వినిపిస్తున్నది.

త్వరలో పరిష్కారం! ...న్యాయస్థానం వెలుపలే ..

సెబీ-ఐఆర్‌డీఏల ఆధిపత్య పోరుపై హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అభిప్రాయం
ముంబయి: భారత సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజి బోర్డు (సెబీ), బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ)ల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరుకు ప్రభుత్వం త్వరలోనే న్యాయస్థానాల పరిధికి వెలుపల ఒక పరిష్కారాన్ని (ఔటాఫ్‌ కోర్ట్‌ సొల్యూషన్‌) కనుగొనే అవకాశం ఉంది. ప్రముఖ బ్యాంకర్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ ఈ విషయం వెల్లడించారు. యూనిట్‌ లింక్డ్‌ ఇన్స్యూరెన్స్‌ ప్లాన్‌ (యులిప్‌)ల న్యాయనిర్వహణ (జ్యూరిస్‌డిక్షన్‌) నాదంటే నాదని ఈ రెండు సంస్థల మధ్య జరుగుతున్న ఘర్షణపై పునరాలోచనే రాగల కొద్ది రోజులలో దీనిని ఒక కొలిక్కి తీసుకురానుందని ఆయన ఆదివారమిక్కడ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కేపిటల్‌ మార్కెట్‌, బీమా వ్యాపారాల నియంత్రణ సంస్థలు న్యాయస్థానం గడప తొక్కేటట్లు చేసినందుకు ప్రభుత్వాన్ని పరేఖ్‌ విమర్శించారు. ఫైనాన్షియల్‌ సేవలు సహా పలు విధానపరమైన అంశాల్లో ప్రభుత్వానికి ఆయన కీలకమైన సలహాదారుగా పనిచేసిన సంగతి తెలిసిందే. 'రెండు నియంత్రణ సంస్థలు కత్తులు దూసుకోవడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా, చెప్పండి.. భారత్‌ నగుబాటు పాలైంది..' అని పరేఖ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో దీనిని పరిష్కరిస్తుందని, కోర్టు కేసులు ఉపసంహరించుకొంటారన్నారు.

పరేఖ్‌ ఆధ్వర్యంలోని హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు అటు బీమా, ఇటు మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారాలు రెంటినీ నిర్వహిస్తోంది. 'మాకు రెండు విభాగాలలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి' అని పరేఖ్‌ చెప్పారు. కోర్టులు ఎక్కువ సమయం తీసుకొంటాయన్న అభిప్రాయం ప్రభుత్వానికి కలిగినట్లు ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఈ అంశం కోర్టుకు వెళ్లి ఉండాల్సింది కాదని ఆయన అన్నారు. తగాదా వెంటనే సమసిపోవాలని ఆకాంక్షించారు.

'సత్యం బోర్డులో నా నియామకం వివాదాస్పదం కానే కాదు'
సత్యం కంప్యూటర్‌ కుంభకోణం దరిమిలా ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డులో తనను సభ్యుడిగా నియమించడంపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ (ఐసీఏఐ) చేసిన విమర్శను దీపక్‌ పరేఖ్‌ తోసిపుచ్చారు. ఆ నియామకంలో సత్యం బోర్డుకు, హెచ్‌డీఎఫ్‌సీకి మధ్య ఎటువంటి వ్యాపార ప్రయోజనాల అంశమూ ముడిపడి లేదు అని ఆయన స్పష్టం చేశారు. సత్యం ప్రహసనంలో ఆ కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఛైర్మన్‌ను ఎందుకు నియమించారో ఐసీఏఐ కమిటీ అర్థం చేసుకోలేకపోయింది అని ఐసీఏఐ గత నెల తన తుది నివేదికలో పేర్కొనడంపై అడిగిన ఒక ప్రశ్నకు పరేఖ్‌ జవాబిస్తూ, 'హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బోర్డులో నేను సభ్యుడిని కాదు. మేం ఆ కంపెనీకి (సత్యంకు) అప్పు ఇవ్వలేదు. బ్యాంకులో వారి కల్పిత ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉండేవి. నిజానికి వాటి ఉనికే లేదు. మేం అప్పు ఇచ్చింది మేటాస్‌కు (ఈ కంపెనీని 'సత్యం' రామలింగ రాజు కుమారుడు ప్రమోట్‌ చేశారు)' అన్నారు. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కొంత విదేశీ మారక ద్రవ్య పెట్టుబడి ఉండేదని పరేఖ్‌ వివరణ ఇచ్చారు. 'వారు (సత్యం) ఫారిన్‌ ఎక్స్ఛేంజి రక్షణ తీసుకున్నారు. ఆమేరకు కొంత కవర్‌ ఉండింది..' అని ఆయన అన్నారు.

నల్లధనంపై పన్ను!

సంబంధిత దేశాలకు సొమ్ము చెల్లిస్తాం
స్విస్‌ బ్యాంకుల ప్రతిపాదన
ఇక ఐటీ చెల్లిస్తేనే స్విస్‌ బ్యాంకుల్లో ఖాతా!
న్యూఢిల్లీ: విదేశీయులు భారీగా కూడబెట్టిన నల్లధనంపై పన్ను విధించేందుకు స్విస్‌ బ్యాంకులు ఎట్టకేలకు అంగీకరించాయి. భారతీయులు సహా పలువురు విదేశీయులు తమ బ్యాంకుల్లో దాచిన డబ్బుపై పన్ను విధించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇలా పన్ను రూపంలో సమకూరిన సొమ్మును తక్షణం సంబంధిత దేశాల ప్రభుత్వాలకు చెల్లిస్తామని ప్రతిపాదించాయి. నల్లధనం దాచిన ఖాతాదారుల వివరాలను వెల్లడించేందుకు మాత్రం నిరాకరించాయి.

ఐటీ అక్రమాలకు బాధ్యత వహించం
ఇకపై ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లించిన ఖాతాదారులకే సొమ్ము దాచుకునే అవకాశం కల్పించటాన్ని స్విస్‌ బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. నల్లధనాన్ని భారీ ఎత్తున స్విస్‌ బ్యాంకుల్లో దాచుకోవటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. అదేసమయంలో ఆదాయపు పన్ను చెల్లింపులో అక్రమాలకు పాల్పడిన ఖాతాదారులకు సంబంధించి తాము ఎలాంటి బాధ్యత వహించబోమని స్పష్టం చేశాయి. 'స్విస్‌ బ్యాంకులు భవిష్యత్తులో ఆదాయపు పన్ను చెల్లించిన వారి ఆస్తులను నిర్వహించటం, తమ ఆధీనంలో ఉంచుకోవటంపై దృష్టి సారిస్తాయి' అని స్విస్‌ బ్యాంకర్ల సంఘం(ఎస్‌బీఏ) ప్రకటించింది. స్విస్‌ బ్యాంకింగ్‌ పరిశ్రమ భవిష్యత్తులో అనుసరించే విధానాన్ని ఎస్‌బీఏ ఇటీవల వెల్లడించింది. 'తనిఖీలు నిర్వహించటం, పన్ను చెల్లింపులో ఖాతాదారుల విశ్వసనీయతకు సంబంధించి బ్యాంకర్లను బాధ్యులుగా చేసే ప్రయత్నాలను మేం ప్రాథమికంగా తిరస్కరిస్తున్నాం' అని తెలిపింది. స్విస్‌ ప్రభుత్వంతో చర్చల అనంతరం బ్యాంకర్లు ఈ విధానాన్ని రూపొందించారు. ప్రపంచ ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) ప్రమాణాలను పాటించటంద్వారా ఆదాయపు పన్ను చెల్లించిన ఖాతాదారుల ఆస్తులను నిర్వహించటం సాధ్యపడుతుందని ఎస్‌బీఏ తెలిపింది. ఓఈసీడీ ధనిక దేశాల సమాఖ్య. పన్ను ఎగవేతదారుల పట్ల అనుసరించాల్సిన విధానాన్ని ఇది సూచించటంతో పాటు అంతర్జాతీయ పన్ను ప్రమాణాలను నిర్దేశిస్తుంది.

జీ-20 అధినేత ఒత్తిడితో దారికి!
స్విస్‌ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం తాలూకు ఖాతాదారుల వివరాలను బహిర్గతం చేయాల్సిందిగా స్విట్జర్లాండ్‌పై ఏడాది నుంచి అంతర్జాతీయ సమాజం తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఖాతాదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచే స్విస్‌ బ్యాంకులు.. నల్లధనం దాచి పెట్టిన వారిపై కఠినంగా వ్యవహరించాలని జీ-20 దేశాధినేతల సమావేశంలో నిర్ణయించటంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఫలితంగా స్విస్‌ బ్యాంకులు ఓ మెట్టు దిగాయి. భారత సార్వత్రిక ఎన్నికల సమయంలో నల్లధనం చర్చనీయాంశంగా మారింది. ఖాతాదారుల వివరాలను పరిశీలించేందుకు భారత్‌ను అనుమతించబోమని గతేడాది స్విస్‌ బ్యాంకర్ల సంఘం పేర్కొంది. అనంతరం పన్ను చెల్లింపుల ఒప్పందాన్ని ఇరు దేశాలు మరోసారి సమీక్షించాయి.

ఏటీఎం నుంచి ఇక రోజుకు లక్ష!

న్యూఢిల్లీ: ఖాతాదారుల సౌలభ్యం కోసం ఏటీఎంల ద్రవ్య పరిమితులను మరింతగా పెంచనున్నారు. ఇక నుంచి ఏటీఎంల నుంచి రోజుకు లక్ష రూపాయలు తీసుకునే వీలు ఉంటుంది. దీంతో పాటు రూ. 1.25 లక్షల వరకూ డెబిట్‌కార్డు ద్వారా ఖరీదు చేసుకోవచ్చు. రోజుకు రూ.3 లక్షలను ఒక్క ఫోన్‌ కాల్‌ సహాయంతో వేరే ఖాతాకు బదిలీ కూడా చేయవచ్చు. చాలా బ్యాంకుల ఏటీఎంల నుంచి ప్రస్తుతం రూ.50 వేలకు మించి తీసుకోవడానికి వీలు లేదు. పెద్ద మొత్తాల్లో ద్రవ్య వినిమయం కోసం ఖాతాదారులు... ముఖ్యంగా బ్యాంకు పనివేళ్లల్లో అటూ ఇటూ తిరగాల్సి వస్తోంది. ఈ శ్రమను తగ్గించేందుకు వీలుగా ఏటీఎంల ద్రవ్య వినిమయ పరిమితిని పెంచాలని బ్యాంకులు భావిస్తున్నాయి. జూన్‌ ఒకటో తేదీ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈ కొత్త పరిమితులను అమల్లోకి తెస్తున్నది. మిగిలిన బ్యాంకులు కూడా హెచ్‌డీఎఫ్‌సీ బాటలో పయనిస్తాయని భావిస్తున్నారు. ఈజీషాప్‌ రెగ్యులర్‌, ఇంటర్నేషనల్‌/మ్యాస్ట్రో/ఎన్‌ఆర్‌ఓ డెబిట్‌ కార్డులకు ఇప్పటి వరకూ ఉన్న రూ.15 వేలు, రూ.25 వేల పరిమితిని రూ.25 వేలు, రూ.40 వేలుగా మార్చారు. బ్యాంకుల మధ్య ఉన్న పోటీ కారణంగా... అన్ని బ్యాంకులూ ఏటీఎం పరిమితులను పెంచుతాయని ఓ బ్యాంకర్‌ తెలిపారు. కిడ్స్‌ అడ్వాంటేజ్‌ డెబిట్‌ కార్డ్‌దారులు రోజుకు ఏటీఎం నుంచి 2,500 తీసుకోవచ్చు. లేదా కార్డు ద్వారా ఖరీదు చేయవచ్చు. ఇంతకు ముందు ఈ పరిమితి రూ.1500, రూ.1000గా ఉండేది. మహిళల డెబిట్‌కార్డు పరిమితిని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు.

Saturday, May 29, 2010

ఇంటా బయట.. రాచబాట

సత్తా చాటితే కనకపు సింహాసనమే
ప్రతిభావంతులకు కంపెనీల పెద్దపీట
ఈ ఏడాది బోలెడు ఉద్యోగావకాశాలు
నుమరుగవుతున్న ఆర్థిక సంక్షోభం.. వృద్ధి బాటలో ఆర్థికరంగం.. సత్తా చాటిన తయారీరంగం.. వెల్లువెత్తుతున్న ఉపాధి అవకాశాలు.. 2010 ఆరంభం నుంచీ గోచరిస్తున్న ఈ సానుకూల పరిణామాలు ఆయా రంగాల నిపుణులు, ఉద్యోగార్థులకు సంతోషం కలిగిస్తున్నాయి. కొత్త కొలువులకు ద్వారాలు తెరుచుకోవడంతో, అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

'భూమ్‌' సమయంలో సంభవించిన కప్పదాట్లు మళ్లీ తప్పవని.. ప్రతిభావంతుల కోసం పోటీ కంపెనీలు డేగకళ్లతో అన్వేషణ సాగిస్తాయని నిశ్చయానికి వచ్చిన యాజమాన్యాలు తగిన వ్యూహాలు రూపొందిస్తున్నాయి.తమ ఉద్యోగుల్లో సమర్థులు, ఉత్తమ పనితీరు కనబరచినవారు చేజారకుండా చూసుకునేందుకు పదోన్నతులు, ప్రోత్సాహకాలు కల్పిస్తున్నాయి. అదే సమయంలో విశ్వాసపాత్రతకూ పెద్దపీట వేస్తున్నాయ్‌!

వ్యక్తిగత పనితీరు, వ్యాపార లక్ష్యాలను ఏకీకరించిన స్థితిలో తమ సిబ్బందిలో సత్తా గల వారిని పోటీ కంపెనీలు ఎగరేసుకు పోకుండా చూసుకోవడంలో వివిధ సంస్థల యాజమానులు, మానవ వనరుల విభాగాధిపతులు తలమునకలవుతున్నారు. కంపెనీ వ్యాపార లావాదేవీలు ఇనుమడించడంలో పాత్ర ఉన్న వారికి పెద్దపీట వేయడంలో సందేహించడం లేదు. ప్రతిభ చాటుతున్న వారిని కాపాడుకోవడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు మానవ వనరుల విభాగానికి అధిక కేటాయింపులు జరుపుతున్నారు. వేతనాల్లో పెంపుదల, ఆకర్షణీయ బోనస్‌లు చెల్లిస్తున్నారు. ప్రతిభావంతులైన సిబ్బందితో నేరుగా సంభాషించి, వారితో అన్యోన్యత పెంపొందించుకోవడంపైనా శ్రద్ధ వహిస్తున్నారు. వస్తు తయారీ, ఐటీ, ఆతిథ్యరంగం, బీపీఓ.. వృద్ధిపథంలోకి వచ్చిన ప్రతి రంగంలోనూ ఇదే స్థితి. అయితే అదనపు చెల్లింపులతోనే 'ప్రతిభ'ను కాపాడుకోలేమన్నది మరికొందరి వాదన.

'ఆరోగ్యవంతమైన పని వాతావరణం, వ్యక్తిగత - కంపెనీ ప్రదర్శనకు అనుగుణమైన ప్రోత్సాహకాలివ్వడం, నైపుణ్యం అభివృద్ధికి చొరవ తీసుకోవడం వంటి ప్రక్రియలు' పాటిస్తే ఉద్యోగులు కంపెనీని వీడరన్నది హెవిట్‌ అసోసియేట్స్‌ ఆగ్నేయాసియా ప్రాక్టీస్‌ లీడర్‌ సందీప్‌ చౌధరి మాట. ప్రతిభావంతుల కోసం అన్వేషణ ఈ ఏడాది అంతా కొనసాగుతుంది కనుక, రిటైల్‌ రంగంలోనూ ఒడిదొడుకులు తప్పవన్న భావనను వ్యక్తపరిచారు రూ.4600 కోట్ల విలువైన గీతాంజలి గ్రూప్‌నకు చెందిన గీతాంజలి లైఫ్‌స్త్టెల్‌ సీఈఓ దేవాశిష్‌ దత్తా. వేతనాల పెంపు ఉన్నా, ఉద్యోగుల్లో అనుచిత ఆకాంక్షలు ప్రబలకుండా చూసుకుంటామంటున్నారు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ వైవి వర్మ. యాజమాన్య బాధ్యతలు నిర్వర్తించేవారికి అయిదేళ్ల ప్రణాళిక రూపొందించి, అత్యధిక భాగస్వామ్యం కలిగేలా చూస్తామన్నారు.

ఇవీ ఉదాహరణలు
చౌకధర విమానయానికి పేరుగాంచిన ఇండిగో సంస్థనే తీసుకుంటే ఆర్థికమాంద్యం సమయంలో ప్రతిశాఖకు మూడునెలల కాలానికి తగిన దృక్పథాన్ని ఏర్పరుస్తూ, మూడేళ్ల వ్యాపార ప్రణాళికను నిర్దేశించింది. ఈ సమయంలో ప్రతిభ చాటిన సిబ్బందికి నగదు ప్రోత్సాహకాలు, విశ్వాసపాత్రతకు అదనపు చెల్లింపులు జరిపింది.

* హ్యూలెట్‌ ప్యాకార్డ్‌కు చెంది, బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఎంఫసిస్‌ ఐటీ సంస్థ తన 34,000 మంది సిబ్బందితో సంబంధాలు నెరపేందుకు ఎస్‌ఎంఎస్‌లు, సోషల్‌ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోంది. సమర్థులైన నాయకత్వశ్రేణిని ఏర్పరచుకోవడమే లక్ష్యంగా సాగుతోంది. 2009 ఆఖరులో 25% వరకు బోనస్‌ చెల్లించారు.

* మాంద్యం సమయంలోనూ తమ సిబ్బంది సంక్షేమంపై తాము చూపిన శ్రద్ధ ఇప్పుడు ఉపకరిస్తుందని ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ సేవల వరకు విస్తరించిన మ్యాక్స్‌ ఇండియా పేర్కొంటోంది.

* నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేసిన తన సిబ్బంది 35 మందిని ఉత్సాహపరిచేలా అమెరికాలోని తమ రిటైల్‌ స్టోర్లకు పంపింది గీతాంజలి గ్రూప్‌.

* హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ మానవ వనరుల విభాగ బడ్జెట్‌ గత మూడేళ్లుగా 25% చొప్పున పెరుగుతోంది. సీనియర్‌ జనరల్‌ మేనేజర్లు, వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టుల సంఖ్యను ఇతోధికం చేసింది.

ఆయా కంపెనీల ఆలోచనాతీరు
* ప్రతిభావంతులను కాపాడుకోవడంలో కంపెనీల దక్షతకు ఈ ఏడాది పరీక్షా సమయమే...
- ఇంటర్‌గ్లోబ్‌
* ఆర్థిక సంక్షోభం సమయంలో తమ ఉద్యోగుల సంక్షేమాన్ని మరువని యాజమాన్యాలకు ఇబ్బందులు రావు...
- మ్యాక్స్‌ ఇండియా
* అత్యుత్తమ ప్రతిభావంతులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. ముందుండి నడిపించే సమర్థ నాయకత్వమే మా లక్ష్యం...
- ఎంఫసిస్‌
* మరింత వేతనం కోసం ఉద్యోగులు బయటకు వెళ్లేలా చేయం. అయితే విధేయతకూ ప్రోత్సాహాన్నిస్తాం...
- రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌
* అన్ని స్థాయిల్లో మేనేజర్లకు సాధికారత కల్పించి, మెరుగైన ఫలితాలు సాధిస్తాం...
- జెన్‌పాక్ట్‌

కొసమెరుపు: ప్రపంచాన్ని ఆర్థికసంక్షోభం చుట్టుముట్టిన సమయంలో తమ సిబ్బందితో సానుకూలంగా వ్యవహరించిన కంపెనీలకు ప్రస్తుత పరిణామాల్లోనూ ఇబ్బంది ఉండదని మానవ వనరుల విభాగాధిపతులు, కంపెనీల సెక్రటరీలు ఏకగ్రీవంగా తేల్చి చెబుతున్నారు.

తెలుగులో ఎస్‌ఎమ్‌ఎస్‌ మరింత సులభం

పాణిని కీ ప్యాడ్‌తో ఇది సాధ్యం
మరో 10 ప్రాంతీయ భాషల్లోనూ లభ్యం
ఉచితంగా సాఫ్ట్‌వేర్‌
వందల కోట్ల మార్కెట్‌ ఇది

లూనా ఎర్గోనమిక్స్‌ సీఈవో అభిజిత్‌
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
మ ప్రాంతీయ భాషల్లో తేలిగ్గా సెల్‌ఫోన్‌ ద్వారా మెసేజ్‌లు పంపాలి. ఆంగ్లం రాని కోట్లాది మంది సులభంగా ఉపయోగించేలా ఉండాలి. ఇందు కోసం అందుబాటులో గల సెల్‌తోనే సాధ్యమయ్యే 'పాణిని కీ ప్యాడ్‌ సాఫ్ట్‌వేర్‌'ని నొయిడాకు చెందిన లూనా ఎర్గోనమిక్స్‌ కంపెనీ రూపొందించింది. అంతర్జాతీయ టెలికాం సదస్సుకు హాజరైన ఈ కంపెనీ సీఈవో అభిజిత్‌ భట్టాఛార్జీ తమ సాఫ్ట్‌వేర్‌ ప్రత్యేకతల్ని... ఈ రంగానికున్న మార్కెట్‌ వివరాల్ని 'న్యూస్‌టుడే'కు చెప్పారు.

న్యూస్‌టుడే: పాణిని కీ ప్యాడ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రత్యేకతేంటి.... దీన్నెలా ఉపయోగించొచ్చు?
అభిజిత్‌: ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తమ ప్రాంతీయ భాషలో తేలిగ్గా మెసేజ్‌లు పంపొచ్చు. 50 కోట్ల మంది సెల్‌ఫోన్‌ వాడుతుంటే 9 కోట్ల మందికే ఆంగ్లంపై అవగాహన ఉంది. మిగతా వారి కోసమే ఈ 'పాణిని' సాఫ్ట్‌వేర్‌ని తయారు చేశాం. తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ, మరాఠీ, కన్నడ...ఇలా పదకొండు ప్రాంతీయ, ఆరు విదేశీ భాషల్లో మెసేజ్‌లు పంపొచ్చు.

? ఈ సాఫ్ట్‌వేర్‌ని ఎలా వాడాలి
ఈ సాఫ్ట్‌వేర్‌ని సెల్‌ఫోన్‌లో లోడ్‌ చేసుకున్నాక ఓపెన్‌ చేస్తే సెల్‌ఫోన్‌ మానిటర్‌ మీద ఆయా భాషలకు చెందిన అక్షరాలు, నెంబర్లతో కూడిన కీ ప్యాడ్‌ వస్తుంది. ఒకవేళ మొదట వచ్చిన కీ ప్యాడ్‌లో అక్షరం లేకపోతే... పక్క పేజ్‌లోకి సులభంగా వెళ్లొచ్చు. అలా మనకి కావాల్సిన అక్షరాలకు సంబంధించిన నంబర్లను ఎంపిక చేసుకోవటం ద్వారా కావాల్సిన సందేశాన్ని తయారు చేసి పంపుకోవచ్చు. చెప్పటం కాస్త క్లిష్టంగా ఉన్నా... వాడటం మాత్రం చాలా సులభం.

? ఒత్తులు, దీర్ఘాల మాటేమిటి
మా సాఫ్ట్‌వేర్‌ కీ ప్యాడ్‌లో అక్షరాలతో పాటు అవసరమైన అన్నీ ఒత్తులు దీర్ఘాల్ని ఏర్పాటు చేశాం. కేవలం అక్షరాలు తెలిసిన ప్రతిఒక్కరూ సులభం టైప్‌ చేసే వీలు ఉంటుంది. ఒక్క తెలుగులోనే కాదు... మేం తయారు చేసిన ప్రతిభాషలోనూ. ఇప్పటికే కొన్ని కీ ప్యాడ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ... వాటన్నింటికీ మించి సులభంగా ఈ కీప్యాడ్‌ను వాడొచ్చు. పాణిని కీ ప్యాడ్‌ని ఇంటెలిజెంట్‌ వర్చువల్‌ కీ ప్యాడ్‌గా చెప్పొచ్చు.

? సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌కి ఛార్జ్‌ చేస్తున్నారా
ఉచితంగానే అందిస్తున్నాం. www.paninikeypad.comవెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరిమిత కాలానికి వినియోగించుకోవచ్చు. గడువు పూర్తయ్యాక మళ్లీ డౌన్‌లౌడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నోకియా జావా సిరీస్‌ ఫోన్లకు మాత్రమే ఈ సాఫ్ట్‌వేర్‌ని వినియోగించుకోవచ్చు. మిగిలిన కంపెనీల సెల్‌ఫోన్లకు సరిపోయేలా తయారుచేసే పనిలో ఉన్నాం. ప్రత్యేకంగా కావాలనుకునే వారికి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నాం.

? ఫలితాలు ఎలా ఉన్నాయి
దీనికి అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయి.నోకియా ఇన్నోవేషన్‌ అవార్డ్‌ 2009ను ఈ సాఫ్ట్‌వేర్‌ గెలుచుకుంది. మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌, గూగుల్‌, నోకియాలు ఆసక్తి చూపాయి. కొందరితో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలో ఫలప్రదం కావచ్చు.

?ఈ రంగంలో వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయి
రెండేళ్ల క్రితం కంపెనీని ప్రారంభించాం. ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతున్నాం. మా దృష్టి అంతా పరిశోధనలపైనే. భాషా సాఫ్ట్‌వేర్‌ మార్కెట్‌ చాలా పెద్దది. ఎన్నో కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఒక్కో సాఫ్ట్‌వేర్‌కు వందల మిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.

ఐఐటీల్లో 'కార్పొరేట్‌' పాగా!

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఒకప్పుడు దుర్లభమనుకున్న ఐఐటీ ప్రవేశం క్రమంగా మన రాష్ట్ర విద్యార్థులకు వశమవుతూ వచ్చి, ఈ ఏడాది ఏకంగా పరీక్షలో ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసమయ్యాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థల రంగప్రవేశంతో కొద్ది సంవత్సరాలుగా ఐఐటీ-జేఈఈలో ర్యాంకుల సంఖ్య వందల నుంచి వేలకు పెరిగింది. ఆ రకంగా ఐఐటీ-జేఈఈ ర్యాంకులు సాధించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. గత రెండేళ్ళలో విజయ శాతం 33 నుంచి దాదాపు 37-40కి పెరిగింది. తాజాగా అత్యుత్తమ ర్యాంకులు సాధించటం మేలిమలుపుగా చెప్పవచ్చు! ఐఐటీ-జేఈఈలో ఉత్తర భారతదేశ విద్యార్థులు ర్యాంకుల సంఖ్యలో వెనుకబడుతున్నా ఏటా అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తూ వస్తున్నారు. వారి హవాకు ఈ సంవత్సరం బ్రేకు పడింది. ఐఐటీ-జేఈఈ2010లో గణితశాస్త్ర ప్రశ్నపత్రం కఠినంగా ఇచ్చారు. ఈ సబ్జెక్టులో మన విద్యార్థులకు ఉన్న పట్టు మూలంగా ఆంధ్రప్రదేశ్‌కు అత్యుత్తమ ర్యాంకులు సాధ్యమై ఉండొచ్చని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. 10లోపు ర్యాంకుల్లో 80%లభించాయి.

అపశ్రుతులు: ఈ ఏడాది జేఈఈ నిర్వహణలో అనూహ్యంగా తప్పులు జరిగాయి. సూచనలపరంగా, ఒ.ఎం.ఆర్‌. షీట్ల పరంగా కూడా పొరపాట్లు చోటుచేసుకున్నాయి. గణిత ప్రశ్నపత్రం కఠినంగా, నిడివి ఎక్కువగా ఉంది. దాదాపు 50శాతం మార్కులకు నెగిటివ్‌ మార్కులు లేవు. దీంతో ప్రతిభ లేనివారు కూడా అదృష్టం ఉంటే ర్యాంకర్లయ్యే అవకాశాలు పెరిగాయి. ఏఐఈఈఈయే దీనికంటే కఠినంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

సీట్ల సంఖ్య వరకూ చూస్తే- బాంబే (3145 సీట్లు), చెన్నై (2619 సీట్లు), ఢిల్లీ (2264 సీట్లు) జోన్‌ల పరిధిలోని విద్యార్థులు కిందటి సంవత్సరం మాదిరే ఈ ఏడాది కూడా తమ ఆధిక్యం ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు భాగంగా ఉన్న చెన్నై జోన్‌ విద్యార్థులు కిందటి ఏడాది (2426 సీట్లు)తో పోలిస్తే ఈ ఏడాది 193 సీట్లు అదనంగా సాధించారు.

పరీక్షావిధానంలో కీలక మార్పు: 2006లో ఐఐటీ-జేఈఈ పరీక్షా విధానంలో కీలకమైన మార్పు జరిగింది. 1982 వరకూ పూర్తిస్థాయి నాన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షగా ఉన్న జేఈఈ తర్వాత ఎన్నో విధాలుగా మారుతూ వచ్చింది. కొంతకాలం 20 శాతం ఆబ్జెక్టివ్‌ + 80 శాతం నాన్‌ ఆబ్జెక్టివ్‌ టైపు పరీక్షగా, తర్వాత రెండంచెల్లో స్క్రీనింగ్‌ + మెయిన్స్‌ పరీక్షగా ఉండేది. 2006 నుంచీ పూర్తి ఆబ్జెక్టివ్‌ విధానంలోకి మారింది. వేగానికి కూడా ప్రాధాన్యం పెరిగింది. దీనితో సాంప్రదాయిక శిక్షణలో మార్పులు అవసరమయ్యాయి. దాదాపు ఇదే సమయంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఐఐటీ-జేఈఈ శిక్షణలో ప్రవేశించాయి. 150కు మించి ర్యాంకులు రాకపోయే పరిస్థితి నుంచి మన రాష్ట్రానికి 1,500- 2,000 ర్యాంకులు రావటం మొదలైంది!

ర్యాంకుల సంఖ్య పెరగటానికి మరికొన్ని కారణాలు తోడయ్యాయి.
*ఐఐటీలపై విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో అవగాహన పెరుగుతూ వచ్చింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 18.3 శాతం మంది విద్యార్థులు అదనంగా రాశారు.

*కొత్త ఐఐటీలు రావటం, మొత్తం సీట్ల సంఖ్య పెరగటం మరో హేతువు. 2007 వరకూ దేశంలో ఏడు ఐఐటీలే ఉండేవి. 2008లో ఆరు ఐఐటీలూ (హైదరాబాద్‌ ఐఐటీతో కలిపి), 2009లో రెండు ఐఐటీలూ కొత్తగా వచ్చాయి.

*మరో ముఖ్యమైన అంశం- మన రాష్ట్ర సిలబస్‌కూ, సీబీఎస్‌ఈ సిలబస్‌కూ అంతరం బాగా తగ్గటం.

ఏమిటి ప్రత్యేకత?:ప్లస్‌ టూ (ఇంటర్మీడియట్‌) సిలబస్‌పై ఆధారపడి నిర్వహించే ఐఐటీ-జేఈఈ మిగిలిన ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షల్లాంటిది కాదు. ఇది విద్యార్థుల సహజ నైపుణ్యాలకు సవాలు విసురుతుంది. వారిలో దాగివున్న శక్తిని బయటకు లాగుతుంది. ప్రాథమిక పరిజ్ఞానంపై అవగాహన, తార్కికశక్తి, విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షించేలా దీనిలో ప్రశ్నలుంటాయి. ప్రశ్నల్లోని చిక్కుముడి విప్పటమే సమస్య!

జేఈఈలో 3 గంటల వ్యవధి చొప్పున ఉండే 2 పేపర్లుంటాయి. రసాయన, భౌతిక శాస్త్రాల్లో, గణితంలో ప్రశ్నలుంటాయి. మొదటి పేపర్‌కూ, రెండో పేపర్‌కూ మధ్య రెండు గంటల వ్యవధి ఇస్తారు. పరీక్షావిధానంలో ప్రధానమైన మార్పు వచ్చిన దగ్గర్నుంచీ ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్న విద్యార్థులను గమనిస్తే... ప్రతిభ ఉన్నవారి కంటే ప్రణాళికాబద్ధంగా చదివినవారినే విజయం వరిస్తోందని స్పష్టమౌతోంది. ఐఐటీ-జేఈఈపై మన విద్యార్థుల్లో ఇంకా అపోహలున్నాయి. ఇది క్లిష్టమైన పరీక్ష అనే భయం తొలగించుకోగలిగితే ఈ విజయం కచ్చితంగా 40 శాతం నుంచి 50 శాతంగా మారుతుందని విద్యావేత్తల అభిప్రాయం!

ఈ శ్రీమంతుడి జీతం రూ.15 కోట్లే..

ఆదర్శప్రాయంగా నిలవాలనే: రిలయన్స్‌
ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ వరుసగా రెండో ఏడాదీ 15 కోట్ల రూపాయల జీతంతోనే సరిపెట్టుకున్నారు.. వాస్తవానికి కంపెనీ వాటాదార్ల నుంచి లభించిన ఆమోదం ప్రకారం.. 2009-10 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సీఎండీగా రూ.39.36 కోట్ల (2008-09 జీతం రూ.15 కోట్ల కంటే రెండింతలకు పైగా) జీతాన్ని పొందేందుకు ఆయన అర్హులు. ఎక్కువ పారితోషికాన్ని మూటకట్టుకునే అవకాశం ముందున్నప్పటికీ ఆయన అలా చేయలేదు. 'మేనేజ్‌మెంట్‌ విభాగంలోని ఉన్నతాధికారులకు జీతాల చెల్లింపులో ఓ పరిమితిని పాటించే విషయంలో ఇతరులకు ఆదర్శ ప్రాయంగా నిలవాలనే ఆయన కాంక్షకు తాజా నిర్ణయం అద్దం పడుతోంద'ని ఆర్‌ఐఎల్‌ మంగళవారం తమ వాటాదార్లకు తెలిపింది. దాదాపు 29 బిలియన్‌ డాలర్ల నికర విలువ(నెట్‌ వర్త్‌)తో దేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ముకేశ్‌ అంబానీ చోటు సంపాదించిన సంగతి తెలిసిందే.

పీఎంఎస్‌ ప్రసాద్‌ జీతంలో పెరుగుదల: అనిల్‌ అంబానీ గ్రూప్‌తో కోర్టు వివాదంలో ఆర్‌ఐఎల్‌ తరఫున కీలక భూమిక పోషించిన సంస్థ ఉన్నతాధికారి పీఎంఎస్‌ ప్రసాద్‌ గత ఆగస్టులో కార్యనిర్వాహక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన జీతం రూ.1.53 కోట్లకు పెరిగింది. 2008-09 సంవత్సరంతో పోల్చుకుంటే గతసారి ఆర్‌ఐఎల్‌లోని ఇతర కార్యనిర్వాహక డైరెక్టర్ల(ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్స్‌) చెల్లింపు ప్యాకేజీల్లో మంచి పెరుగుదల నమోదైంది.

విద్యుత్తుకు 'విదేశీ' వెలుగు

రూ.1100 కోట్లతో 49 శాతం వాటా కొనుగోలు చేసిన సెమ్‌కార్ప్‌
రెండుదశల్లో కృష్ణపట్నంలో 2640 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మౌలిక సదుపాయాల కంపెనీ గాయత్రీ ప్రాజెక్ట్స్‌కు చెందిన అనుబంధ విద్యుత్తు కంపెనీ థర్మల్‌ పవర్‌టెక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (టిపిసిఐఎల్‌) లో సింగపూర్‌కు చెందిన సెమ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ రూ.1100 కోట్ల పెట్టుబడితో 49 శాతం వాటా కొనుగోలు చేసింది. విద్యుదుత్పత్తి రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించాక, ఒక ప్రాజెక్టుకు ఇంత భారీ పెట్టుబడి రావడం ఇదే ప్రధమం. ఒక సింగపూర్‌ కంపెనీ మనదేశంలో పెడుతున్న అతిపెద్ద పెట్టుబడుల్లో ఇదొకటి అవుతోంది. గాయత్రీ ఎనర్జీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సెమ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధులు టి.వి.సందీప్‌ రెడ్డి, టాన్‌ చెంగ్‌ గ్వాన్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు.

గాయత్రీ ప్రాజెక్ట్స్‌ అనుబంధ కంపెనీ గాయత్రీ ఎనర్జీ వెంచర్స్‌ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 2640 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ ధర్మల్‌ విద్యుత్క్రేందాన్ని చేపట్టింది. దీనికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీ (ఎస్‌పీవీ) యే థర్మల్‌ పవర్‌టెక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (టిపిసిఐఎల్‌). కృష్ణపట్నంలో ఏపీఐఐసీ నుంచి 1400 ఎకరాల స్థలాన్ని తీసుకుని, తొలిదశలో 1320 మెగావాట్ల ధర్మల్‌ విద్యుత్కేంద్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనికి అవసరమైన అనుమతులు రావడంతో పాటు, నిధుల సేకరణ కూడా పూర్త్తె, పనులు మొదలయ్యాయి. తొలిదశ ప్రాజెక్టులో సెమ్‌కార్ప్‌ 49 శాతం వాటాతో భాగస్వామి అయ్యింది. 40 నెలల వ్యవధిలో మొదటి దశ, ఆ తర్వాత ఏడాది వ్యవధిలో రెండో దశను పూర్తిచేస్తామని సందీప్‌రెడ్డి మంగళవారం ఇక్కడ వెల్లడించారు. మొదటి దశ ప్రాజెక్టు వ్యయం రూ. 6869 కోట్లు కాగా, ఇందులో రూ. 5151 కోట్ల అప్పు. రూ. 1718 కోట్ల మొత్తాన్ని ఈక్విటీ రూపంలో సమకూర్చుతారు. రుణ మొత్తాన్ని ఆర్‌ఇసి, పిఎఫ్‌సి, పిఎన్‌బి, ఎల్‌ఐసి, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర సంస్థలు కలిసి సంయుక్తంగా అందజేస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే విద్యుత్తులో 25 శాతం 'మర్చంట్‌ పవర్‌' కింద విక్రయిస్తామని సందీప్‌ తెలిపారు.మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో మరికొన్ని విద్యుత్తు ప్రాజెక్టులు చేపట్టే యోచన గాయత్రీ గ్రూపునకు ఉన్నట్లు సందీప్‌రెడ్డి తెలిపారు. గాయత్రీ ఎనర్జీ వెంచర్స్‌ కిందే వీటిని చేపట్టాలని లేదని ఆయన చెప్పారు. కృష్ణపట్నం పవర్‌ ప్రాజెక్టు రెండో దశకు ఇంథన సరఫరా కోసం దరఖాస్తు చేసినట్లు, ఒక ఏడాది వ్యవధిలో అనుమతి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఓ అండ్‌ ఎం కంపెనీ: కృష్ణపట్నం విద్యుత్తు ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రత్యేక ఓ అండ్‌ ఎం కంపెనీని గాయత్రీ ఎనర్జీ వెంచర్స్‌, సెమ్‌కార్ప్‌ సంయుక్తంగా నెలకొల్పుతున్నాయి. ఇందులో 70 శాతం వాటా సెమ్‌కార్ప్‌నకు, 30 శాతం గాయత్రీ ఎనర్జీ వెంచర్స్‌కు ఉంటాయి. విద్యుత్తు ప్రాజెక్టుల నిర్వహణలో సెమ్‌కార్ప్‌కు అనుభవం ఉన్న దృష్ట్యా ఓ అండ్‌ ఎం కంపెనీలో ఆ కంపెనీ ఎక్కువ వాటా తీసుకున్నట్లు సందీప్‌రెడ్డి వివరించారు.

నూరుశాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం
మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే
విద్యుదుత్పత్తి రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశమున్నా ఎవరూ ముందుకు రావడంలేదని, మరింతగా ప్రయత్నించాలని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగిన టీపీసీఐఎల్‌, సెమ్‌కార్ప్‌ ఒప్పంద కార్యక్రమంలో షిండే మాట్లాడారు. పదో పంచవర్ష ప్రణాళిక లక్ష్యమైన 42వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిలో 21 వేల మెగావాట్లే సాధించగలిగామని పేర్కొన్నారు. 11వ పంచవర్ష ప్రణాళికలో 78,700 మెగావాట్ల సాధన లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్‌ వనరులున్నందున, ఇక్కడి వారే విద్యుత్తు ప్రాజెక్టుల స్థాపనపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే అల్ట్రా మెగా విద్యుత్తు ప్రాజెక్టును రూ.16వేల కోట్లతో నిర్మిస్తారని వెల్లడించారు.
త్వరితగతిన అనుమతులు ఇప్పించండి
రోశయ్య
రాష్ట్రంలో చేపట్టే విద్యుత్తు ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇప్పించాలని షిండేకు ముఖ్యమంత్రి రోశయ్య విజ్ఞప్తి చేశారు. గ్యాస్‌, బొగ్గు కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ ఎంతో అనువైన రాష్ట్రమని సెమ్‌కార్ప్‌ ఛైర్మన్‌, సీఈవో టాంగ్‌కిన్‌ అభివర్ణించారు. కార్యక్రమానికి గాయత్రీ ప్రాజెక్ట్స్‌ ఛైర్మన్‌, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి అధ్యక్షత వహించారు. జీవీకే సంస్థల ఛైర్మన్‌ జీవీ కృష్ణారెడ్డి, తితిదే ఛైర్మన్‌ ఆదికేశవులు నాయుడు, ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎయిరిండియా సిబ్బంది మెరుపు సమ్మె

18 విమానాలు రద్దు
పలు సర్వీసులు ఆలస్యం
పరిస్థితిని సమీక్షించిన ప్రఫుల్‌
న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై: ఆలస్యంగా జీతాలు చెల్లించడాన్ని నిరసిస్తూ ఎయిరిండియాలో పనిచేస్తున్న ఇంజినీర్లు సహా ఓ విభాగం ఉద్యోగులు మంగళవారం మెరుపు సమ్మెకు దిగారు. మొత్తం 16,000 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో 7 అంతర్జాతీయ సర్వీసులు సహా మొత్తం 18 విమానాలు రద్దయ్యాయి. పలు సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. వీటిలో చాలామటుకు గంటకుపైగా ఆలస్యంగా తిరిగాయి. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఇంజినీర్లు, గ్రౌండ్‌ సిబ్బంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో ఢిల్లీ నుంచి జోర్డాన్‌, అబుదాబీ, దుబాయ్‌ (రెండు సర్వీసులు), అమృత్‌సర్‌ నుంచి లండన్‌, చెన్నై నుంచి కొలంబో, సింగపూర్‌ వెళ్లే సర్వీసులు రద్దయ్యాయి. కోల్‌కతా, ముంబయి, హైదరాబాద్‌, చెన్నైల నుంచి తిరిగే పలు దేశీయ సర్వీసులు కూడా రద్దయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి సమ్మె సెగ తాకింది. ఆయన ప్రయాణించాల్సిన కోయంబత్తూరు-చెన్నై విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. పౌరవిమానయాన మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ మంగళవారం ఢిల్లీలో ఎయిరిండియా సీఎండీ అరవింద్‌ జాధవ్‌తో అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సమ్మె నేపథ్యంలో బుధవారం నుంచి కార్యకలాపాలను తగ్గించాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వివరించాయి. ఎయిర్‌ కార్పొరేషన్‌ ఉద్యోగుల సంఘాన్ని చర్చలకు ఆహ్వానించినట్లు ఓ అధికారి వెల్లడించారు. అయితే, ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జేబీ కాడియన్‌ మాత్రం యాజమాన్యం నుంచి తమకెలాంటి ఆహ్వానం అందలేదని మంగళవారం సాయంత్రం విలేకర్లకు తెలిపారు. ''జీతాల చెల్లింపుల్లో ఆలస్యాన్ని నిరసిస్తూ, సిబ్బంది ఇబ్బందులను తెలియజేసేందుకే మేం సమ్మెకు దిగాం. మా డిమాండ్లపై యాజమాన్యం దృష్టిపెట్టకపోవడంతోనే ఈ చర్యకు పూనుకున్నాం'' అని ఆయన స్పష్టం చేశారు. ఎయిరిండియాలోని అన్ని సంఘాల నేతలపై యాజమాన్యం 'కట్టడిచేస్తూ ఉత్తర్వు' (గ్యాగ్‌ ఆర్డర్‌) జారీచేసిందని, తమ సమస్యల విషయమై మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని ఆదేశించిందని కాడియన్‌ వివరించారు. ఇది 'అప్రజాస్వామికం' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వుని ఉపసంహరించే వరకు విధుల్లో చేరే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా సంఘం నేతలు స్పష్టం చేశారు. మే నెల జీతాలను ఓ వారం ఆలస్యంగా చెల్లించాలని ఎయిరిండియా ఇటీవల నిర్ణయించింది. ఎయిరిండియా ఉద్యోగుల సంఘం అంతర్జాతీయ విభాగం మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి సమ్మెకు దిగలేదు. ఎయిర్‌ కార్పొరేషన్‌ ఉద్యోగుల సంఘంతోపాటు అఖిల భారత విమాన ఇంజినీర్ల సంఘం కూడా సమ్మెలో పాల్గొంది.

విధుల్లో చేరండి: యాజమాన్యం
158 ప్రయాణికులను పొట్టనపెట్టుకున్న మంగళూరు విమాన ప్రమాద విషాదం నుంచి తేరుకోని ప్రస్తుత విపత్కర పరిస్థితిలో సమ్మెకు దిగడం సరికాదని ఎయిరిండియా యాజమాన్యం వ్యాఖ్యానించింది. సిబ్బంది తక్షణం విధుల్లో చేరాలని అభ్యర్థించింది.ఈ మేరకు ఎయిరిండియా యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విమాన సర్వీసులను రద్దుచేసినట్లు, ఆలస్యంగా నడుపుతున్నట్లు అంగీకరించింది. విమాన సర్వీసుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. సమ్మె కారణంగా ఇబ్బందిపడ్డ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.

భగ్గుమంటున్న ధర


10 గ్రాములు రూ.18,620
పెళ్లిళ్ల సీజన్‌ తోడై మరింత పైపైకి
రూ.20 వేలకు చేరొచ్చన్న అంచనాలు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
ంగారం ధర భగ్గుమంటోంది. ఎర్రటి ఎండల్లాగానే 'కనక'ణ మండుతోంది. నగ నట్రా కొందామని షాపుకెళ్లినవారు పుత్తడి ధర విని చిత్తడై పోతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ తోడుకావడంతో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. దీనివల్ల అమ్మకాలు కూడా తగ్గాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల ఆభరణాల తయారీ బంగారం(22 కేరట్లు) రూ.18,620 పలికింది. 24 కేరట్ల ధర రూ.18,200పలికింది. రానున్న ఒకటి రెండు నెలల్లో 10 గ్రాముల ధర రూ.20,000కు చేరినా ఆశ్చర్యం లేదన్న ఊహాగానాలు సాగుతున్నాయి.

ధరలు ఎందుకు పెరిగాయంటే...
గ్రీస్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, ఉత్తర-దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త వాతావరణం బంగారు ధరల పెరుగుదలకు ముఖ్య కారణాలుగా చెబుతున్నారు. గ్రీస్‌ సంక్షోభం క్రమంగాభారత్‌, చైనాల పైనా ప్రభావం చూపవచ్చునని అంటున్నారు. కొద్ది రోజులుగా రూపాయి బలహీనపడటం, డాలర్‌ బలపడటం దీనికి మరింత ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో పసిడి మరింత మిడిసిపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రుణ సంక్షోభంలో చిక్కుకున్న గ్రీస్‌ను గట్టెక్కించడానికి యూరోపియన్‌ యూనియన్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌)లు కలసి లక్ష కోట్ల డాలర్ల విలువైన బెయిల్‌-అవుట్‌ ప్యాకేజీని ఈ నెల 10న ప్రకటించిన విషయం విదితమే. ఈ సహాయాన్ని అందుకోవాలంటే గ్రీస్‌ ద్రవ్యలోటును గణనీయంగా కుదించుకోవాలని, అందుకు మిత వ్యయ చర్యలు చేపట్టాలని షరతులు విధించారు. దీనిని గ్రీస్‌ తలొగ్గింది కూడా. ఏతావతా యూరో జోన్‌లో కరెన్సీల విలువ పడిపోవచ్చన్న భయాలు మదుపరులలో గూడు కట్టుకొన్నాయి. వారు తమ వద్ద ఉన్న నిధుల్ని బులియన్‌ వైపు మళ్లిస్తుండటంతో... కాంచనం ధరలు అమాంతం పెరిగిపోయాయి.

పాత బంగారం అమ్మకాల జోరు
మంచి ధర వస్తుండడంతో... బీరువాల్లో దాచిన పాత బంగారాన్ని బయటికి తీసి అమ్మేస్తున్నారు. వీరి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. బంగారం అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును భూముల కొనుగోలు, ఇతరత్రా వాటికి వెచ్చిస్తున్నారు.

ఢిల్లీ, ముంబయిల్లోనూ...
దేశరాజధాని ఢిల్లీలో,ఆర్థికరాజధాని ముంబయిలో కూడా బంగారం ధర ఉన్న పళంగా పెరిగిపోయింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం పదిగ్రాముల ధర రూ.18,660 పలికింది. అంతక్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ.260 ఎక్కువ. ముంబయిలో 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం రూ.18,475, 99.9స్వచ్ఛత కలిగిన బంగారం రూ.18,560 పలికింది.

అంతర్జాతీయంగా భారీ డిమాండు
అంతర్జాతీయంగా వ్యాపారులు, వినియోగదారులు బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం కొనుగోళ్లలో ప్రముఖులైన కోటీశ్వరుడు జార్జి సోరస్‌, మరో కోట్లాధిపతి న్యూయార్క్‌కు చెందిన జాన్‌ పాల్సన్‌ సారథ్యంలోని పాల్సన్‌లు ఈ నెల 21 నాటికి రికార్డు స్థాయిలో మదుపు చేశారని తెలుస్తోంది.

ఈ నెల మొదటి నుంచీ పెరుగుదల
*ఏప్రిల్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.16,262- రూ.17,140 మధ్య కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే, కనిష్ఠంగా ఔన్సు పుత్తడి(28.34 గ్రాములు) 1,111 డాలర్లు, గరిష్ఠం 1,182 డాలర్లు పలికింది.

*ఈ నెల 2వారంలో పసిడి ధరలు అమాంతంగా ఎగబాకాయి. మే12న దేశీయ విపణిలో 10గ్రాములు రూ.18,550పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఒక ఔన్సు 1,245డాలర్లు అమ్మింది. అదే అత్యధిక ధర కావడం విశేషం.

*మల్టి కమోడిటీ ఎక్స్ఛేంజి(ఎంసీఎక్స్‌)లో జూన్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులలో సువర్ణం ధర 10 గ్రాములకు రూ.18,390కి చేరుకొంది. మరో పక్క అంతర్జాతీయ మార్కెట్‌లలో ఔన్సు 1,189 డాలర్లను తాకింది.

*ఎంసీఎక్స్‌లోనే ఆగస్టు కాంట్రాక్టు ధర 0.27% అధికంగా పది గ్రాములకు రూ.18,125 పలికింది.

జులై వరకు భారత్‌లో అధిక గిరాకీ
*భారతదేశంలో ఏప్రిల్‌-జులై మధ్య బంగారానికి గిరాకీ ఎక్కువ. పండుగలు, పెళ్లిళ్ల కాలం కావడమే ఇందుకు కారణం. ఈ కాలంలో విక్రయాల కోసం వ్యాపారులు తమ వద్ద బంగారు నిల్వలను అధికంగా ఉంచుకోవాలని చూస్తారు.

*మన దేశంలోకి పసిడి దిగుమతులు గత నెల 71 శాతం మేర పెరిగాయి. ఏప్రిల్‌లో 34.2 టన్నుల స్వర్ణం దిగుమతి అయింది. మార్చిలో 27.8 టన్నులు, ఫిబ్రవరిలో 28.8 టన్నులు, జనవరిలో 34 టన్నుల పుత్తడిని భారత్‌ దిగుమతి చేసుకొంది.

మున్ముందు మరింత ప్రియం
బంగారం ధరలు మున్ముందు మరింతగా భగ్గుమనే అవకాశాలున్నాయని ఓ వార్తాసంస్థ ఈ నెల మొదట్లో జరిపిన అభిప్రాయ సేకరణలో వెల్లడయింది. అభిప్రాయ సేకరణలో పాల్గొన్న వారిలో నాలుగింట మూడొంతుల మందికి పైగా బంగారం ఈ సంవత్సరం ఆఖరుకల్లా రికార్డు స్థాయిలో ఔన్సుకు 1,250 డాలర్లను తాకవచ్చని అంచనావేశారు. మరొక అభిప్రాయ సేకరణలో పాల్గొన్నవారు ఈ ఏడాది చివరికి బంగారం 1,500 డాలర్ల స్థాయిని అందుకొంటుందని చెప్పడానికీ వెనుకాడలేదు!

*అమెరికాలో రెండు ప్రధాన బ్యాంకులు గోల్డ్‌మన్‌ శాక్స్‌, జేపీ మోర్గాన్‌లు కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తంచేశాయి. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా-మెరిల్‌ లించ్‌ అయితే 1,300 స్థాయిని కూడా అందుకోగలదని ఊహించాయి.

*బ్రిటన్‌కు చెందిన ఆర్‌బీఎస్‌ మాత్రం జూన్‌ నెలాఖరుకు కనకం 1,100- 1,150 డాలర్ల మధ్య కదలాడుతుందని భావిస్తోంది.

*ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు సడలిపోయేవిగా కనపడడం లేదని, అదే బంగారం ధరలకు ఊతం అందిస్తోందని విశ్లేషిస్తున్నారు.

తరణోపాయం లేదా!
వడ్డీరేట్ల పెరుగుదల బంగారం పట్ల ఆకర్షణను కొంత తగ్గించగలదంటున్నారు. అదే సమయంలో సమీప భవిష్యత్తులో ఇటువంటి వడ్డీరేట్ల పెంపును ఊహించజాలమని కూడా చెబుతున్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌(ఆర్‌బీఐ లాగే ఇది అమెరికాలో కేంద్ర బ్యాంకు) వచ్చే సంవత్సరం వరకు వడ్డీ రేట్లను పెంచే ఆలోచన చేయకపోవచ్చని పరిశ్రమ ప్రముఖుడు ఒకరు అంచనావేశారు.

డాలర్‌ బలపడటమే కారణం
జూన్‌, జులైలలో పెళ్లిళ్లు అధికంగా ఉండటంతో పసిడి మార్కెట్‌ ఫర్వాలేదు. రాబోయే రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందనే ఊహాగానాలతో అమ్మకాలు పెరగొచ్చు. డాలర్‌ బలపడటం, రూపాయి బలహీనం కావటమే ధరల పెరుగుదలకు కారణం. 10 గ్రాముల బంగారం రూ.20 వేలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈసారి 'అక్షయ తృతీయ'వేళ గత ఏడాది కన్నా రెట్టింపు వ్యాపారం జరిగింది. 5-10 తులాలు కొనేవారు 3-4 తులాలు కొంటున్నారు. అంతే తేడా.. మరో వారంలో మార్కెట్‌ మరింత పుంజుకోవచ్చు.
- రామారావు, చందన బ్రదర్స్‌
వెయ్యి తగ్గితే వ్యాపారం
అక్షయ తృతీయ సందర్భంగా బంగారం మార్కెట్‌ కళకళలాడింది. ఊహించిన దాని కన్నా అధికంగా వ్యాపారం జరిగింది. ప్రస్తుతం మార్కెట్‌ చాలా బలహీనంగా ఉంది. 10-15 శాతం కూడా వ్యాపారం జరగట్లేదు. ఎగుడుదిగుడులు ఉండటంతో వినియోగదారులలో కొందామా వద్దా అనే మీమాంస నెలకొంది. పది గ్రాములకు కనీసం రూ.1000 తగ్గితే కానీ మళ్లీ మార్కెట్‌ అందుకోదు. వచ్చే రెండు నెలలు మంచి ముహూర్తాలు ఉండటంతో కొనుగోళ్లు పెరగొచ్చు.
- ప్రవీణ్‌కుమార్‌, శ్రీ బాలాజీ జ్యుయలరీస్‌

వీరి ఎత్తుగడలు ఏమిటో..!

అన్నదమ్ముల సయోధ్యతో కొత్త సమీకరణాలు
ఆర్‌ఐఎల్‌ ముంగిట బోలెడు విస్తరణావకాశాలు
అడాగ్‌కు విలీనాలు చక్కటి వూతం?
న్నదమ్ములు ముకేశ్‌, అనిల్‌ అంబానీల ఆధ్వర్యంలోని పారిశ్రామిక గ్రూపులు.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌), రిలయన్స్‌- అనిల్‌ ధీరుభాయ్‌ అంబానీ గ్రూపు (ఆర్‌-అడాగ్‌).. ఒకటి నడుపుతున్న వ్యాపార కార్యకలాపాలకు మరొకటి పోటీపడకూడదన్న ఒప్పందాన్ని (నాన్‌-కంపీట్‌ అగ్రిమెంట్‌) రద్దు చేసుకోవడంతో ఇకపై ఇవి తమకు నచ్చిన వ్యాపారాలకు విస్తరించే వీలు చిక్కుతుంది. దేశంలోనే అత్యంత అధిక మార్కెట్‌ విలువ ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ పరిణామం దరిమిలా ఎలాంటి అవకాశాలను పరిశీలించవచ్చనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే ఆర్‌-అడాగ్‌ ఇకమీద ఎటువంటి ప్రణాళికను అనుసరిస్తుందనేది కూడా పరిశీలించదగ్గదే. మార్కెట్‌ వర్గాలు, విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ రెండు గ్రూపుల ఎదుట ఉన్న అవకాశాలలో కొన్ని ఇవి:

* ఆర్‌ఐఎల్‌ ప్రస్తుతం ఆకర్షణీయమైన ఆర్థిక సేవల వ్యాపారంతో పాటు టెలికమ్యూనికేషన్‌ల వ్యాపారంపై కూడా దృష్టిని సారించవచ్చు. ఇప్పటికే ఆర్‌ఐఎల్‌ నిర్వహిస్తున్న రిలయన్స్‌ రిటైల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అనే వ్యాపార విభాగానికి, ఆర్థిక సేవలకు విడదీయలేని ముడి పడిపోయి ఉంది. రిటైల్‌ ఖాతాదారు సంస్థలకు వినియోగదారు రుణాలు ఇప్పించేందుకు బ్యాంకింగేతర ఫైనాన్స్‌ కంపెనీలతో ఆర్‌ఐఎల్‌ ఏర్పాట్లు చేసుకొంది. అదీ కాక ఆర్థిక సేవల రంగం జోరు మీద ఉన్నదని ముకేశ్‌ భావిస్తున్నారని వినవస్తోంది. నిజానికి రిలయన్స్‌ గ్రూపు విభజన కన్నా ముందే రిలయన్స్‌ కేపిటల్‌ లిమిటెడ్‌ను ప్రారంభించడం, విభజనలో భాగంగా ఆ సంస్థ అనిల్‌కు దక్కడం తెలిసిందే. బ్యాంకింగ్‌ రంగంలో కొత్త గా లైసెన్సుల జారీని ఆర్‌బీఐ పరిశీలిస్తుందని కేంద్రం ఈ సంవత్సర బడ్జెట్‌లో ప్రస్తావించింది. ఈ నేపథ్యం ఆర్‌ఐఎల్‌ ఒకవేళ బ్యాంకింగ్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకొంటే గనక అందుకు వాతావరణం అనువుగానే ఉందని సూచిస్తున్నట్లే!

* టెలికమ్యూనికేషన్‌ల రంగం జోష్‌ ఉన్న మరో వ్యాపారంగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన 3జీ రేడియో తరంగాల వేలంపాట నుంచి ప్రభుత్వం రూ.35,000 కోట్ల ఆదాయం రావచ్చని ఆశించగా రూ.67,700 కోట్ల పైచిలుకు ఆదాయం లభించడం ఇందుకు ఒక ఉదాహరణ. టెలికం రంగంలో పోటీ పెచ్చుపెరిగిపోతోంది. ఇదివరకు రిలయన్స్‌ ఇన్ఫోకామ్‌ అనే కంపెనీ రిలయన్స్‌ గ్రూపులో ఉన్నా, అది ప్రస్తుతం అడాగ్‌ కంపెనీగా నడుస్తోంది. అయితే ఆర్‌ఐఎల్‌కు ఈసరికే తాను తన సొంత అవసరాల కోసం నిర్మించుకొన్న ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వ్యవస్థను కొద్ది మార్పు చేర్పులతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను వినియోగదారులకు అందించడానికి ఉపయోగించుకొనే సౌలభ్యం ఉండటం ఈ గ్రూపునకు సానుకూలంగా మారగల మరొక అంశం. అదీ గాక, ఇప్పటికే ఈ రంగంలో కాలూనిన మరొక కంపెనీని దేనినైనా కొనుగోలు చేయడం ఆర్‌ఐఎల్‌కు శక్తికి మించిన పని ఏమీ కాదు కూడా. వేరే కంపెనీని కొనుగోలు చేయాలనే ఆలోచనే ఆర్‌ఐఎల్‌ చేసే పక్షంలో.. అడాగ్‌ కంపెనీ ఆర్‌కామ్‌ను పూర్తిగానో, లేక పాక్షిక వాటా (స్టేక్‌)నో కొనుగోలు చేసే యోచన కూడా ఒక ప్రత్యామ్నాయం కావచ్చు. అందుకు ఆర్‌కామ్‌ అధినేత (అనిల్‌) అంగీకరిస్తారా అంగీకరించరా అనేది వేరే విషయం. మునుపు దక్షిణాఫ్రికాకు చెందిన ఎంటీఎన్‌ కంపెనీని అనిల్‌ కొనుగోలు చేయాలనుకున్నపుడు నాన్‌-కంపీట్‌ అగ్రిమెంట్‌లో భాగమైన తొలి తిరస్కరణ హక్కును గురించి ముకేశ్‌ ప్రస్తావించడంతో ఆర్‌కామ్‌-ఎంటీఎన్‌ ఒప్పందం అప్పట్లో విఫలం అయింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ పారిశ్రామిక గ్రూపుల వ్యూహాలలో ప్రాధాన్యాలు మారనూవచ్చు, మారకనూపోవచ్చు. ఏమైనా జరగవచ్చు. అలా జరగబోదని తోసిపుచ్చడానికి లేదని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. అయితే టెలికం రంగంలో సేవల రేట్ల (వాయిస్‌ టారిఫ్స్‌) స్పర్థ నానాటికీ పెరిగిపోతుండడం, లాభ శాతం క్షీణిస్తుండటం, భారీ పెట్టుబడులు.. ఇవి ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి. కాబట్టి బహుశా ఆర్‌ఐఎల్‌ తొందరపాటుతో కాకుండా అన్నీ ఆలోచించి ఆచి తూచి ఒక నిర్ణయం తీసుకొంటుందని భావిస్తున్నారు.

* ఆర్‌ఐఎల్‌తో పోలిస్తే.. ఆర్‌-అడాగ్‌ శిబిరంలో పెద్ద సంచలనాలకు ఆస్కారం లేదని, ఏదైనా భారీ విలీనం లేదా కొనుగోలు తటస్థిస్తే తప్ప ఈ గ్రూపు కార్యకలాపాలు యథాపూర్వంగా కొనసాగుతాయని పరిశీలకులు చెప్తున్నారు. ఆర్‌ఐఎల్‌కు ఉన్నంత నగదు నిల్వలు ఆర్‌-అడాగ్‌కు లేకపోవడం కూడా ఈ పరిస్థితులకు కారణం కావచ్చని వారు గుర్తు చేస్తున్నారు.

కేజీ గ్యాస్‌తో దేశానికి రూ.4,000 కోట్లు ఆదా
వాటాదార్ల వార్షిక నివేదికలో ముకేశ్‌ వెల్లడి
న్యూఢిల్లీ: కృష్ణా-గోదావరి(కేజీ) గ్యాస్‌ వల్ల ఎరువుల సబ్సిడీలో రూ.4,000 కోట్ల మేర దేశం ఆదా చేయగలిగిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. 'ప్రారంభమైన ఏడాది లోపే మేం 512 బిలియన్ల ఘనపు అడుగుల సహజవాయువును దేశానికి సరఫరా చేశామ'ని వాటాదార్లను ఉద్దేశిస్తూ 2009-10 కంపెనీ వార్షిక నివేదికలో ఆయన పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్‌లో కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించిన రిలయన్స్‌ ప్రస్తుతం రోజుకు 63-64 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల ఉత్పత్తిని సాధిస్తోంది. ఇది మొత్తం దేశవ్యాప్త గ్యాస్‌ ఉత్పత్తిలో 40 శాతానికి సమానం. '365 రోజులూ ఎలాంటి అవరోధాలూ లేకుండా జరిగిన కార్యకలాపాల వల్ల ఉత్పత్తి స్థాయి ప్రస్తుతం 60 ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీ సహజవాయువు; రోజుకు 35,000 బారెళ్లకు పైగా ముడి చమురుకు చేరుకుంద'ని ముకేశ్‌ ఆ నివేదికలో పేర్కొన్నారు. పెరిగిన సహజవాయువు లభ్యత కారణంగా ఎరువులను అధిక పరిణామంలోనూ, చౌకగానూ ఉత్పత్తి చేయడానికి వీలైంది. దీంతో దేశం సబ్సిడీల రూపంలో రూ.4,000 కోట్ల దాకా ఆదా చేయగలిగిందని ఆయన వివరించారు.

మొబైల్‌ ఏదైనా.. ఛార్జర్‌ ఒకటే

త్వరలో అందుబాటులోకి
50 శాతం విద్యుత్‌ ఆదా
'న్యూస్‌టుడే'తో టీఎస్‌బీ డైరెక్టర్‌ మాల్కం జాన్సన్‌
క రకాల మొబైల్‌ ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. వీటికి రకరకాల ఛార్జర్లు అవసరం అవుతున్నాయి. దీనికి భిన్నంగా ఒకే ఛార్జర్‌తో అన్ని మొబైల్‌ ఫోన్లను రీఛార్జి చేయగలిగేతే అనే ఆలోచన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) వచ్చింది. దీంతో ఛార్జర్‌కు సార్వత్రిక (యూనివర్సల్‌) ప్రమాణాలను సిద్ధం చేసింది. ఈ ప్రమాణాలతో త్వరలో మొబైల్‌ ఛార్జర్‌ అందుబాటులోకి రానుందని ఐటీయూకు చెందిన టెలికమ్యూనికేషన్‌ స్టాండర్త్డెజేషన్‌ బ్యూరో (టీఎస్‌బీ) డైరెక్టర్‌ మాల్కం జాన్సన్‌ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. దీని వల్ల ఎక్కువ ఛార్జర్లను వినియోగించాల్సిన అవసరం ఉండదని, పర్యావరణానికి మేలు జరుగుతుందని వివరించారు. ఇ-వ్యర్థాలు తగ్గుతాయి. విద్యుత్‌ ఆదా అవుతుందని అన్నారు. ఆయన వెల్లడించిన మరిన్ని అంశాలు:

?మొబైల్‌ ఛార్జర్‌కు సార్వత్రిక ప్రామాణికాలను నిర్ణయించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరతాయి
ఇంధన ఖర్చు దాదాపు 50 శాతం తగ్గుతుంది. ప్రతి ఏడాది పనికి రాకుండా పోయే 51 వేల టన్నుల ఛార్జర్లను నివారించవచ్చు. ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా 1.36 కోట్ల టన్నుల పర్యావరణానికి హాని కలిగించే వాయువులను తగ్గించవచ్చు.

?సార్వత్రిక ప్రమాణాలను రూపొందించాలన్న ఆలోచన ఎలా కలిగింది
కొపెన్‌హగెన్‌ పర్యావరణ సదస్సుకు అనుగుణంగా పర్యావరణానికి మేలు చేసే ఛార్జర్‌ను రూపొందించాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఐటీయూకు చెందిన పర్యావరణ అధ్యయన కమిటీ సార్వత్రిక ప్రమాణాలను రూపొందించింది. వీటిని గత అక్టోబరులో ఐటీయూ ఆమోదం తెలిపింది. జీఎస్‌ఎమ్‌ ఆపరేటర్ల సంఘం సలహాలు, సూచనలు మేరకు ప్రమాణాలను రూపొందించారు. టెలికం రంగంలోని 700 కంపెనీల అభిప్రాయాలను సేకరించాం. మైక్రో-యూఎస్‌బీ ఇంటర్‌ఫేస్‌ సహా 4 నక్షత్రాల రేటింగ్‌ ఈ ఛార్జర్‌కు ఉంటుంది.

?కొత్త సార్వత్రిక ఛార్జర్‌ వల్ల భారత్‌లో ఎంత విద్యుత్‌ ఆదా అవుతుంది
భారత్‌ టెలికాం రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి నెల కొత్తగా కోటికి పైగా వినియోగదారులు మొబైల్‌ చందాదారుల జాబితాలో వచ్చి చేరుతున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే కొత్త ఛార్జర్‌ వల్ల భారీగా విద్యుత్‌ అదా అవుతుంది. కచ్చితంగా ఎంత ఆదా అవుతుందనేది చెప్పలేను.

?ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు కూడా ఇటువంటి సార్వత్రిక ప్రమాణాలను రూపొందించే వీలుందా
ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు కూడా ఇటువంటి సార్వత్రిక ప్రమాణాలను రూపొందించే యోచన ఉంది. పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రమాణాలు రూపొందించే ప్రక్రియ చివరి దశలో ఉంది. అయితే.. ఐటీయూ సభ్య దేశాలు వీటికి ఆమోద ముద్ర వేయాలి.

?ఇ-వ్యర్థాల సమస్య ఎలా ఉంది
ఇ- వ్యర్థాల సమస్య చాలా ఆందోళన కలిగిస్తోంది. వీటిని తగ్గించడానికి ఐటీయూ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే సార్వత్రిక ప్రమాణాలను రూపొందించాం. ఇ-వ్యర్థాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు తరలిస్తున్నారు. దీన్ని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. సౌర శక్తి వంటి సంప్రదాయేతర ఇంధనాలతో పని చేసే మొబైల్‌ ఫోన్లు, ఇతర పరికరాలను అభివృద్ధి చేయడాన్ని యూనియన్‌ ప్రోత్సహిస్తోంది.

ప్రపంచ టెలికాం సదస్సు షురూ
విదేశీ ప్రతినిధులతో కళకళ
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
బిµన్న దేశాలు... విభిన్న సంస్కృతులు... వైరుధ్య నేపధ్యాలు... టెలికాం రంగానికి చెందిన ప్రముఖులు భారీగా ఒకే చోట చేరితే... కచ్ఛితంగా సందడిగానే ఉంటుంది. నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచ టెలికమ్యూనికేషన్‌ అభివృద్ధి సమావేశం (డబ్ల్యూటీడీసీ) సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. సుమారు 120కి పైగా దేశాలకు చెందిన 650 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సోమవారం ప్రారంభమైన సదస్సు జూన్‌ నాలుగో తేదీ వరకు జరుగుతుందని అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) సెక్రటరీ జనరల్‌ హెచ్‌.ఇ. డాక్టర్‌ హమదౌన్‌ టోర్‌ తెలిపారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో సదస్సు నిర్వహిస్తున్న సభాస్థలి వద్దకు ఉదయం తొమ్మిది గంటలకే ప్రతినిధులు చేరుకోవటంతో సందడి మొదలైంది. పెద్ద సంఖ్యలో విదేశీ ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మాదాపూర్‌ నుంచి హెచ్‌ఐసీసీ వెళ్లే రహదారిలో ప్రత్యేక పోలీస్‌ పోస్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హజరయ్యేందుకు వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

పలు సేవలు: విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సదస్సులో ప్రత్యేకంగా సమాచార కేంద్రాన్ని, విదేశీ మారక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విదేశీ, స్వదేశీ మీడియా ప్రతినిధుల కోసం ఇంటర్నెట్‌ కేంద్రాన్ని సిద్ధం చేశారు. సదస్సులో పాల్గొనేందుకు వచ్చే వారి రిజిస్ట్రేషన్ల కోసం జెనీవా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం నిర్విరామంగా పని చేస్తోంది.

ప్రపంచంలో 500 కోట్ల మంది
మొబైల్‌ వినియోగదారులు!
* మిలీనియం అభివృద్ధి లక్ష్యాల (ఎండీజీ) సాధనకు మరింత మెరుగైన విజ్ఞాన భరిత సమాజాన్ని రూపొందించడానికే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ అత్యధిక ప్రాధాన్యమిస్తుంది.
* 2006లో దోహా సమావేశం తరువాత టెలికం రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
* నాలుగేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 220 కోట్ల మంది మొబైల్‌ చందాదారులు ఉంటే.. ఈ ఏడాదిలో ఈ సంఖ్య 500 కోట్లకు చేరనుంది.
* మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు 7.1 కోట్ల నుంచి 67 కోట్లకు పెరిగారు.
* సాధారణ (ఫిక్స్‌డ్‌) బ్రాడ్‌బ్యాండ్‌ చందాదారులు రెట్టింపునకు పైగా పెరిగి, 21.2 కోట్ల నుంచి 52.7 కోట్లకు చేరారు.
* టెలికం రంగ చరిత్రలోనే తొలిసారిగా సాధారణ ఫోన్ల చందాదారుల సంఖ్య క్షీణిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 3.6 కోట్ల మంది మాత్రమే ఈ ఫోన్లను వినియోగిస్తున్నారు.
* గత నాలుగేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొబైల్‌ ఫోన్ల వాడకం 270 శాతం పెరిగింది. ఈ దేశాల్లో మొత్తం 250 కోట్ల మంది చందాదారులు ఉంటే.. 200 కోట్ల మంది 2006 ప్రారంభం నుంచి ఈ ఏడాది ప్రారంభం నాటికి చందాదారులుగా మారిన వారే.
* గత నాలుగేళ్లలో కొత్తగా 77.7 కోట్ల మంది అంతర్జాలం (ఇంటర్నెట్‌) చందాదారులుగా మారితే.. అందులో 60 కోట్ల మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారే.
* దోహాలో జరిగిన సమావేశం నాటికి ఫేస్‌బుక్‌ వినియోగదారులు కొద్ది మందే ఉంటే.. ఈ నాలుగేళ్లలో సామాజిక వెబ్‌సైట్లకు విపరీతంగా ఆదరణ పెరిగింది. ప్రస్తుతం ప్రతి రోజూ 5 కోట్ల మంది ట్వీట్స్‌ పంపుతున్నారు. 40 కోట్ల మంది ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు.
* పారిశ్రామిక దేశాల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి అంతర్జాలం అందుబాటులో ఉంటే (ఇంటర్‌నెట్‌ యాక్సెస్‌), అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి అయిదుగురిలో నలుగురికి ఇంకా ఈ సదుపాయం లేదు.
* వర్థమాన దేశాల్లో సాధారణ, మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విస్తృతి (పెనిట్రేషన్‌) వరుసగా 3.5 %, 3.3 % మాత్రమే ఉంది.

హైదరాబాద్‌లో ప్రపంచ టెలికాం సదస్సు

వచ్చే నెల 4 వరకు
భారత్‌లో ఇదే తొలి సారి
టెలికాం అభివృద్ధికి ప్రణాళిక ..
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రతి నాలుగు సంవత్సరాలకు జరిగే ప్రపంచ టెలికమ్యూనికేషన్‌ అభివృద్ధి సమావేశానికి (డబ్ల్యూటీడీసీ) ఈ సారి హైదరాబాద్‌ వేదిక కానుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సమావేశం భారత్‌లో జరగడం ఇదే ప్రథమం. దేశీయ టెలికమ్యూనికేషన్స్‌ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు అయిదో డబ్ల్యూటీడీసీని అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) ఇక్కడ నిర్వహిస్తోంది. బ్యూనస్‌ ఎయిర్స్‌లో తొలి సమావేశం 1994లో జరిగింది. ఐటీయూ ఐక్యరాజ్య సమితికి చెందింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్‌ అంశాలను పర్యవేక్షిస్తుంది. దాదాపు 50 దేశాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులు హైదరాబాద్‌ సమావేశానికి వచ్చే వీలు ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 500 ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో ప్రభుత్వం అధికారులు, మంత్రులు, రాయబారులు, టెలికాం కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. భారత టెలికాం విభాగం తరఫున కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి ఎ.రాజా విచ్చేయనున్నారు. టెలికాం శాఖ, టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు.

వేదిక: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని అంతర్జాతీయ సమావేశ మందిరం (హెచ్‌ఐసీసీ). సోమవారం (24 తేదీ) నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశం జూన్‌ 4 వరకు 12 రోజుల పాటు కొనసాగుతుంది.

లక్ష్యాలు: సమాచార సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీలు (ఐసీటీ) అభివృద్ధికి ప్రాధామ్యాలను గుర్తించడం. సభ్య దేశాల సలహాలు తీసుకోవడం. వచ్చే నాలుగేళ్లకు కార్యచరణ ప్రణాళికలను రూపొందించడం.

* 2006లో దోహాలో ప్రకటించిన కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుతెన్నులను పరిశీలించడం.
* 25న ప్రపంచ టెలికాం అభివృద్ధి నివేదిక విడుదల.
* 26న మూడు ఐటీయూ నివేదికల విడుదల.

చర్చించే అంశాలు
* విధాన, నియంత్రణల్లో వస్తున్న సంస్కరణలు.
* సాంకేతిక, నిర్వహణ సమస్యలు, అధిగమించే మార్గాలు
* స్పెక్ట్రమ్‌ నిర్వహణ, డిజిటల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌
* టెలికమ్యూనికేషన్స్‌ అభివృద్ధికి ప్రాంతీయంగా చేపడుతున్న చర్యలు, ప్రాజెక్టులు. * ఇ-ఆరోగ్యం* ఐసీటీ అభివృద్ధికి నిధుల సమీకరణ మార్గాలు, భాగస్వామ్యాలు.

సయోధ్యకు సై

విభేదాలు కట్టిపెడతాం
గ్యాస్‌ సరఫరా కోసం
సంప్రదింపులు కొనసాగిస్తాం
ముకేశ్‌, అనిల్‌ వర్గాల సామరస్య ప్రకటనలు
ముంబయి: దేశంలో అతి పెద్ద పారిశ్రామిక గ్రూపులైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అనిల్‌ ధీరుభాయ్‌ అంబానీ గ్రూపు (అడాగ్‌)లు వాటి మధ్య అయిదేళ్ల కిందట కుదిరిన పోటీ రహిత ఒప్పందాన్ని (నాన్‌-కంపీట్‌ అగ్రిమెంట్‌) రద్దు చేసుకొన్నట్లు ఆదివారం దేనికదే ప్రకటించాయి. దీంతో సోదర ద్వయం ముకేశ్‌ అంబానీ, అనిల్‌ అంబానీలు వారి మధ్య విభేదాలను ఇక కట్టిపెట్టి, పరస్పర వ్యాపార సంస్థలను గణనీయంగా విస్తరించుకొనేందుకు మార్గం సుగమం అయినట్లే. వారు ఇరువురు తమ తండ్రి ధీరుభాయ్‌ అంబానీ నెలకొల్పిన అవిభక్త రిలయన్స్‌ వ్యాపార సామ్రాజ్యాన్ని పంచుకొన్న దరిమిలా, 2006లో ఈ ఒప్పందాలను కుదుర్చుకొన్న సంగతి తెలిసిందే. ఆనాటి ఒప్పందం ప్రకారం ఒప్పంద గడువు 10 సంవత్సరాలు.

గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తికి
దూరంగా ఉంటాం: ఆర్‌ఐఎల్‌
తాజాగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో తగవులకు ఎలాంటి ఆస్కారం ఉండబోదని అన్నదమ్ములకు చెందిన గ్రూపులు వేరువేరుగా ప్రకటనలు చేశాయి. దీంతో తమ్ముడు అనిల్‌ నేతృత్వంలోని ఏడీఏ గ్రూపు (అడాగ్‌) చమురు, గ్యాస్‌, రిటైల్‌, పెట్రోరసాయనాల వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి వీలు ఏర్పడనుంది. అలాగే, అన్నయ్య ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) టెలికం, విద్యుత్తు, ఫైనాన్షియల్‌ రంగాలలోకి ప్రవేశించగలుగుతుంది. అయితే, సౌహార్దపూర్వక చొరవలో భాగంగా 2022వ సంవత్సరం మార్చి 31 వరకు ఒక్క తమ సంస్థ (రిలయన్స్‌)కే చెందిన కేప్టివ్‌ గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు ప్లాంట్ల వ్యాపారం మినహా గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టబోనని ఆర్‌ఐఎల్‌ ప్రకటించడం విశేషం. తూర్పు కోస్తా తీరంలోని కృష్ణా-గోదావరి (కేజీ) డీ6 క్షేత్రం నుంచి ఆర్‌ఐఎల్‌ వెలికితీస్తున్న సహజవాయువును అడాగ్‌ కంపెనీ ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌కు సరఫరా చేసే అంశంపై ''సంప్రదింపులను సత్వరమే ముగించగలమని ఆశిస్తున్న''ట్లు కూడా ప్రకటనలలో తెలిపాయి.

తండ్రి కలలు పండించేందుకు ప్రతిన
సోదరులిరువురూ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ను, కేంద్ర మంత్రులను కలుసుకొన్న కొద్ది రోజుల వ్యవధిలో ఈ మేరకు ప్రకటనలు వెలువరించడం విశేషం. వీటిని ఆర్‌ఐఎల్‌, అడాగ్‌ గ్రూపు కంపెనీల బోర్డులు ఆమోదించాయి. ముకేశ్‌, అనిల్‌లు చర్చించుకొన్న పర్యవసానంగానే ఈ ఒప్పందం కుదిరినట్లు ఊహాగానాలు వ్యాపించినా ఒప్పందం ఎలా కుదిరిందనే దానిపై ఏ పక్షం నుంచి కూడా ఎటువంటి వివరణ రాలేదు. కేజీ బేసిన్‌లోని డీ6 క్షేత్రం నుంచి గ్యాస్‌ను అడాగ్‌ కంపెనీ ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌కు సరఫరా చేయాలన్న అంశంలో దీర్ఘ కాలం పాటు కొనసాగిన న్యాయ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అంబానీలు ముంబయిలో ఇష్టాగోష్టిగా చర్చలు సాగించినట్లు సమాచారం. ఆరు వారాలలోగా గ్యాస్‌ విక్రయానికి సంబంధించి మళ్లీ సంప్రదింపులు మొదలుపెట్టేందుకు ఇరు పక్షాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం విదితమే. తమ తాజా ప్రయత్నం రెండు గ్రూపుల మధ్య సామరస్య వాతావరణాన్ని ఏర్పరచగలదని, తత్ఫలితంగా ఉభయ గ్రూపు కంపెనీల వాటాదారుల పెట్టుబడికి విలువను ఇనుమడింపచేసేందుకు దారి ఏర్పడుతుందని ఈ గ్రూపులు విడుదల చేసిన ప్రకటనల్లో పేర్కొన్నాయి. తండ్రి ధీరుభాయ్‌ అంబానీ కలలను సాకారం చేయడానికి ప్రతిన బూనినట్లు ముకేశ్‌, అనిల్‌ సారథ్యాలలోని గ్రూపులు స్పష్టం చేశాయి.

ఇది ఉభయ పక్షాలకూ మేలు చేస్తుంది
'ఇది సానుకూలమైన పరిణామం. అన్నదమ్ములిద్దరూ ఒక ఒప్పందానికి రావడం శుభసూచకం. ఇది ఆరోగ్యకరమైన పోటీకి బాట పరుస్తుంది. భారత కార్పొరేట్‌ ప్రపంచానికి కూడా ఇది నిజమైన మేలును చేకూర్చేదే. ఇపుడు వీరి మధ్య వైరం అంతమైంది కాబట్టి ఇతర కంపెనీలు కూడా వీరిని చూసి విశ్వాసం పెంపొందించుకోగలవు.'
- ప్రణబ్‌ ముఖర్జీ, కేంద్ర ఆర్థిక మంత్రి

అరచేతిలో అనుబంధం

సామాజిక సంబంధాలకు వూతం
'టీవీ'క్షణానికి మొబైల్‌ మంత్రం
3జీతో అంతా స'చిత్రం'
ఆర్థిక వ్యవస్థకూ ఆలంబన
రూ.67,719 కోట్లు.. ఇది తక్కువ మొత్తమేమీ కాదు.. 3జీ వేలంలో టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించబోయే మొత్తమిది. 3జీపై ఎందుకింత ఆసక్తి..? 3జీ కోసం కంపెనీలు ఎందుకంతగా ఎగబడ్డాయి...? మొబైల్‌ వినియోగదార్లకు మరిన్ని అద్భుతమైన సేవలు అందుబాటులోకి వస్తాయా..? సేవలు ఇప్పటికన్నా చౌకగా మారతాయా..? అన్నవి ప్రధాన ప్రశ్నలు. ఈనేపథ్యంలో 3జీ సేవలపై సమగ్ర సమాచారాన్ని తెలిపే 'ఈనాడు బిజినెస్‌' ప్రత్యేక కథనం.
మొబైల్‌ రంగంలో ఇప్పుడిప్పుడే మొదలైన 3జీ విశ్వరూపం చూపించనుంది. సామాజిక సంబంధాల నుంచి టీవీల వీక్షణం దాకా.. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నుంచి సినిమాల డౌన్‌లోడ్‌దాకా అన్ని రంగాల్లోనూ ఆకాశమే హద్దుగా విజృంభించనుంది. సమాచార వ్యవస్థను సమూలంగా మార్చేయగల ఈ 3జీ వచ్చే త్వరలోనే మన దేశంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారానే అందుబాటులో ఉన్న ఈ సేవలను ఇక నుంచీ ప్రైవేటు రంగంలోని సెల్‌ కంపెనీలూ అందించనున్నాయి. దీంతో మొబైల్‌ విప్లవం కొత్త పుంతలు తొక్కనుంది.

3జీతో..
* ప్రస్తుతం మనం వాడుతున్న మొబైల్‌ ఫోన్ల పనివేగంకన్నా మరింత వేగం సొంతమవుతుంది.
* ఇంటర్నెట్‌ను మన అరచేతిలోని మొబైల్‌లోకి తీసుకొస్తుంది. అదీ అత్యంత వేగంతో..
* ఇపుడున్న డిజిటల్‌ నెట్‌వర్కుల కన్నా 3జీ వ్యవస్థలో సమాచారం దాదాపు 40 రెట్ల అధిక వేగంతో బదిలీ అవుతుంది.

* సెకనుకు కనీసం 3 మెగాబైట్ల సమాచారాన్ని సరఫరా చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. అంటే 3 నిమిషాల ఎంపీ3 పాటను కేవలం 15 సెకన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం వాడుతున్న 2జీలో అయితే 8-9 నిమిషాల సమయం పడుతోంది.

* అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్‌ సంఘం(ఐటీయూ) అధ్యయనం ప్రకారం మొబైల్‌ వ్యాప్తి 1 శాతం పెరిగితే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) దాదాపు 5 శాతం వృద్ధి చెందుతుంది.

* ఈ లెక్కన మొబైల్‌, ఇంటర్నెట్ల సమాహారమైన 3జీ సేవలు అందుబాటులోకి వస్తే మన దేశం మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశముంది
* తగ్గుతోంది.. ఉద్యోగాలు పెరుగుతాయ్‌
* 3జీ స్పెక్ట్రమ్‌ వేలం కారణంగా ప్రభుత్వానికి లభించిన అదనపు ఆదాయం ద్రవ్యలోటును తగ్గించేందుకు సహకరిస్తుంది.

* బడ్జెట్‌లో ద్రవ్యలోటును జీడీపీలో 5.5 శాతంగా అంచనా వేశారు. ఇది కాస్తా తాజా పరిణామంతో 5 శాతానికి పరిమితం కావొచ్చు.
* రెవెన్యూ లోటు కూడా 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గొచ్చు.
* ఈ సేవలు అందుబాటులోకి వస్తే రానున్న మూడేళ్లలో కొత్తగా సుమారు 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.

* 3జీ స్పెక్ట్రమ్‌ దక్కించుకున్న సంస్థలు సేవలు మొదలు పెట్టేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుపై సుంకాలు, 3జీ హ్యాండ్‌సెట్లు, ప్రకటలనపై పన్నులు.. తదితరాల ద్వారా ప్రభుత్వానికి మరో రూ.2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

* తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌లు స్పెక్ట్రమ్‌ ఫీజు నుంచి మినహాయింపును కోరబోమని తెలపడంతో ప్రభుత్వానికి మరో రూ.16,500 కోట్లు రానున్నాయి. ఇందులో రూ.6,500 కోట్లు ఎమ్‌టీఎన్‌ఎల్‌ చెల్లించనుండగా.. మిగతాది బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి వస్తుంది.

కార్పొరేట్‌లకు లాభమే
* కంప్యూటరు, మోడెం, ల్యాన్‌ వంటి నెట్‌వర్కింగ్‌ సదుపాయాలు లేకపోయినా నేరుగా చేతిలోని మొబైల్‌ నుంచే ఇంటర్నెట్‌కు అనుసంధానం కావచ్చు. ఫలితంగా విద్యుత్‌ ఆదాతో పాటు ఐటీ మౌలిక వసతుల ఏర్పాటు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

* కార్పొరేట్‌ల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు మొబైల్‌లోనే లేఖలు, ఆర్డర్లను టైప్‌చేసి ఉన్నచోట నుంచే మెయిల్‌, ఫ్యాక్స్‌ చేసేందుకు వీలుంటుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ టారిఫ్‌ ఇలా!
రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ 3జీ సర్వీసులు ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేకంగా సిమ్‌ కార్డులు రూపొందించారు. వీటి సామర్థ్యం 256 కిలోబైట్లు. కొత్త కనెక్షన్‌ కింద ఈ 3జీ సిమ్‌ కార్డును రూ.59గా నిర్ణయించారు. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు పొందుతున్న వినియోగదారులుM3G120 అని టైప్‌ చేసి 53733 నంబరుకు ఎస్‌ఎమ్‌ఎస్‌ పంపాలి. వెంటనే ఆ కనెక్షన్‌ 3జీ కిందకు మారిపోతుంది. రూ.120 చెల్లించి రీఛార్జి చేసుకుంటే 180 రోజుల కాలపరిమితి లభిస్తుంది. రూ.20 టాక్‌టైమ్‌ పొందవచ్చు.
వీడియో కాల్‌
ప్రమోషనల్‌ ఆఫర్‌ కింద కొత్త వినియోగదారులకు నిమిషానికి లోకల్‌ కాల్‌కు 30 పైసలు, ఎస్‌టీడీ కాల్‌కు 50 పైసల చొప్పున వసూలు చేస్తారు. ఇప్పటికే 2జీ వినియోగిస్తూ.. 3జీకి మారిన వారికి లోకల్‌ కాల్‌ టారిఫ్‌ 70 పైసలు, ఎస్‌టీడీ అయితే రూపాయి ఉంటుంది.

డేటా వినియోగం: 3జీలో డేటా వినియోగానికి 10 కేబీలకు పైసా చొప్పున వసూలు చేస్తారు.

స్పెక్ట్రమ్‌ అంటే
ది రేడియో తరంగాల పౌనఃపున్యాల శ్రేణి. వివరంగా చెప్పుకోవాలంటే మనిషి గొంతు తరంగాల కనీస పౌనఃపున్యం 200 హెర్ట్జ్‌. గరిష్ఠం 3,000 హెర్ట్జ్‌. వీటి తేడా 2800 హెర్ట్జ్‌. దీనినే స్పెక్ట్రమ్‌ అంటారు. ఇక 3జీ సేవలకు కావలసిన స్పెక్ట్రమ్‌ 15-20 మెగా హెర్ట్జ్‌లుగా ఉంటుంది. అదే 2జీ సేవలకైతే 30-200 కిలోహెర్ట్జ్‌గా ఉంటుంది. అంటే 3జీకి భారీ స్పెక్ట్రమ్‌ అవసరమన్నమాట.
2జీకి, 3జీకి తేడా..
2జీ అంటే రెండో తరపు టెలికాం టెక్నాలజీ. తొలి తరంలో అనలాగ్‌ సంకేతాలను.. రెండో తరం(2జీ)లో డిజిటల్‌ సాంకేతికతనూ ఉపయోగిస్తారు. ఇక 3జీలో అయితే మరిన్ని ప్రమాణాలతో డిజిటల్‌ పరిజ్ఞానాన్ని వాడతారు. 3జీతో ఒకేసారి శబ్ద సమాచారం (టెలిఫోన్‌ కాల్‌)తో పాటు ఇతర (సమాచారం డౌన్‌లోడింగ్‌, ఇమెయిల్‌ పంపడం; సందేశాలను ఇచ్చిపుచ్చుకోవడం వంటి) సమాచారాన్నీ పంపుకొనే వీలుంటుంది.
ఛార్జీలు చౌక!
3జీ వస్తే ఛార్జీలు మరింత తక్కువ కావొచ్చు. ఎందుకంటే ఏ ఒక్క ఆపరేటరుకూ దేశవ్యాప్తంగా సేవలందించడానికి బిడ్‌ దక్కలేదు. కాబట్టి టెలికాం కంపెనీల మధ్య రోమింగ్‌ ఒప్పందాలు ఎక్కువగా జరగడం సహజం. తద్వారా ఛార్జీలు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. సీడీఎమ్‌ఏ, 3జీ స్పెక్ట్రమ్‌ కలిగి ఉన్న టాటా టెలీసర్వీసెస్‌ వంటి కంపెనీలు రెండు సాంకేతిక పరిజ్ఞానాలనూ కలిపి దేశవ్యాప్త సేవలనందించడానికి ప్రయత్నించొచ్చు. వీటివల్ల సేవల ధరలు కిందికి దిగిరావచ్చు. మిగతా ఆపరేటర్లు సైతం పోటీ కారణంగానైనా చౌక ధరల మంత్రాన్ని పఠించొచ్చు.
రూ.4000కే 3జీ ఫోన్‌
3జీ సేవలు ఇంకా ప్రారంభం కాకమునుపే మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ తయారీ కంపెనీలు రంగంలోకి దిగాయి. దాదాపు రూ.4000 స్థాయిలో 3జీ ఫోన్లను విక్రయించేందుకు ఈ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. వచ్చే 6 నెలల్లో 7 కొత్త మోడళ్లను తెచ్చేందుకు శామ్‌సంగ్‌ యత్నిస్తోంది. మిగతా కంపెనీలూ ఇదే బాట పట్టొచ్చు. ఆయా కంపెనీలు టీవీ సీరియళ్లు, వినోద క్లిప్పింగ్‌లను అందించడానికీ యత్నాలు జరుగుతున్నాయి. వివిధ బ్రాండెడ్‌ సంస్థల 3జీ ఫోన్లు ఎంతకి దొరుకుతున్నాయంటే...

* నోకియా: రూ.4,119(మోడల్‌ 2730) ఆపైన
* సోనీ ఎరిక్‌సన్‌: రూ.6000, ఆపైన
* బ్లాక్‌బెర్రీ: రూ.17,000, ఆపైన
*యాపిల్‌ ఐఫోన్‌: రూ.30,000, ఆ పైన

3జీ... కొన్ని విశేషాలు
* 3జీ సేవలు తొలుత ప్రారంభించిన దేశం జపాన్‌.
* ఇపుడు 132 దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి
* ప్రపంచంలోని 470 కోట్ల మంది మొబైల్‌ వాడకం దార్లలో 13 శాతం మంది అంటే 62 కోట్ల మందే 3జీ సేవలు వినియోగించుకుంటున్నారు. దీనికి కారణం అధిక ధరలే.
* 2013 నాటికి 3జీ వినియోగదార్ల సంఖ్య 57 కోట్లకు చేరనుంది. ఇందులో 6 శాతం మంది భారత్‌లోనే ఉండనున్నారు.
వినోదమే వినోదం
* 3జీ నేరుగా అందుబాటులోకి వస్తే ఇద్దరు వ్యక్తులు నేరుగా ఫోన్‌లో ఒకరిని ఒకరు తెరపై చూసుకుంటూ సంభాషించుకోవచ్చు. తద్వారా ఆప్తులు దూరంగా ఉన్నారన్నలోటు కొంత వరకు తీరుతుంది.

* ఆడియో, గ్రాఫిక్స్‌, సమాచారంతో పాటు ఫోన్‌లో వీడియోలను చిత్రీకరించి వెనువెంటనే మన ఆప్తులకు, బంధుమిత్రులకు వాటిని పంపించుకోవచ్చు.

* టీవీ కార్యక్రమాలను నేరుగా మొబైల్‌ తెరపైనే వీక్షించవచ్చు. దీని వల్ల ఇష్టమైన టీవీ కార్యక్రమాలను చూడలేకపోయామన్న బాధే ఉండదు. ఎక్కడున్నా ఆ సమయానికి ఫోన్‌లోనే చూడొచ్చు.

* నచ్చిన వీడియో దృశ్యాలను నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని చూడవచ్చు.
* కొత్త సినిమా పాటలను, దృశ్యాలను అడిగి వీక్షించే(ఆన్‌ డిమాండు) వీలుంటుంది.
* కంప్యూటరు, ల్యాప్‌టాప్‌ లేకుండానే ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక నెట్‌వర్క్‌లతో వేగంగా అనుసంధానం కావొచ్చు.

రైతన్నల సేవలోనూ
* గ్రామీణ ప్రాంత ప్రజలు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
* వరదలు, అకాల వర్షాల వంటి సమాచారాన్ని మరింత వేగంగా అందించి వారిని అప్రమత్తం చేసేందుకు ఉపకరిస్తుంది.
* పొలాల్లో చీడల గురించి నేరుగా దృశ్యరూపంలో వ్యవసాయ శాస్త్రవేత్తలకు సమస్యలను వివరించవచ్చు.
* అధికారుల నుంచి సస్యరక్షణతో పాటు లాభసాటి మార్కెటింగ్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
వైద్య సేవలకూ..
* పల్లెల నుంచే ప్రజలు తమ ఈసీజీ, ఎక్స్‌రేల నివేదికలను పట్టణాల్లోని వైద్యులకు చూపించి వైద్య సలహాలు పొందవచ్చు.
* టెలీ మెడిసిన్‌ వ్యవస్థ వృద్ధి చెందుతుంది.
* గర్భిణీలు, క్షయ, ఎయిడ్స్‌ రోగులు రోగ తీవ్రతను బట్టి పాటించాల్సిన సూచనలను దృశ్యరూపంలో అందించవచ్చు.
బ్యాంకింగ్‌, ట్రాఫిక్‌..
* 3జీ రక్షణాత్మక మొబైల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
* బ్యాంకులు అందుబాటులో లేని పల్లెల్లోని ప్రజలు నేరుగా మొబైల్‌ ద్వారా బ్యాంకింగ్‌ వ్యవహారాలు జరపవచ్చు.
* పట్టణాల్లో ట్రాఫిక్‌ జామ్‌ల గురించిన సమాచారాన్ని, ప్రత్యామ్నాయ మార్గాలను 3జీ ఆపరేటర్‌ వినియోగదార్లుకు ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌, ఎంఎంఎస్‌, జీపీఎస్‌ మ్యాప్‌ క్లిప్‌ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది.
తగ్గనున్న దుబారా
* సరికొత్త టెలికాం పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే ప్రజా పంపిణీ, ప్రభుత్వ పథకాల్లో దుబారాకు చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చు.
* మధ్యవర్తుల అవసరం లేకుండా ప్రభుత్వ పథకాల తీరుతెన్నుల గురించి సామాన్య ప్రజలకు వీడియో క్లిప్పింగుల రూపంలో అర్థమయ్యేలా చెప్పేందుకు వీలవుతుంది.