Saturday, February 27, 2010

ఇచ్చినట్టే ఇచ్చి..బడ్జెట్‌పై వివిధ పారిశ్రామిక వర్గాల స్పందన

ఇచ్చినట్టే ఇచ్చి..
బడ్జెట్‌పై వివిధ పారిశ్రామిక వర్గాల స్పందన
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెటు సమతూకంగా, వృద్ధి ప్రధానంగా ఉందని ఇండియా కార్పొరేట్‌ ప్రముఖులు హర్షం వ్యక్తంచేశారు. అయితే అదే సమయంలో కంపెనీలపై కనీస ప్రత్యామ్నాయ పన్నును (మ్యాట్‌) 15 శాతం నుంచి 18 శాతానికి పెంచడం విచారకరమని పేర్కొన్నారు. మరో పక్క వాహన కంపెనీలు, గృహోపకరణాల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఉద్దీపన పథకాలను క్రమంగా ఉపసంహరించడాన్ని చాలా వరకు పరిశ్రమ ప్రముఖులు స్వాగతించగా, ఎక్సైజ్‌ సుంకం పెంపు వంటి అనేక ప్రతిపాదనలు ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయగలవని మరికొందరు ఆందోళన వెలిబుచ్చారు.
సంచి లాభం చిల్లు తీసింది
'ఆర్థిక మంత్రి చక్కని సమతూకమైన పని చేశారు.. ఆయన ఆర్థిక లోటును 6.9 శాతానికి కుదించడానికి కృషి చేస్తామన్నారు. ఇది ఎంతో బాగుంది. అయితే ఒక పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి కూడా లేకపోలేదు; అది.. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్‌). సర్‌ఛార్జి తగ్గింపు సంచి లాభాన్ని మ్యాట్‌ రేటు పెంపు అనే చిల్లు తీసేసింది'.
- హర్ష్‌పతి సింఘానియా, ఫిక్కీ అధ్యక్షుడు
మంత్రికి అభినందనలు
'ఈ బడ్జెట్‌తో వృద్ధి కొనసాగుతుంది. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు స్వాగతించదగ్గవి. ఉద్దీపనలను క్రమంగా ఉపసంహరించే ప్రక్రియను చేపట్టినందుకు మంత్రి ముఖర్జీకి అభినందనలు తెలుపుతున్నా. ఎంఏటీ పెంపు ఒక్కటే బాధిస్తోంది.'
- వి.శ్రీనివాసన్‌, సీఐఐ అధ్యక్షుడు
ఆ ఒక్కటీ లేకపోతే..
'మ్యాట్‌ను పెంచకపోయి ఉంటే మేం మరింత ఆనందించే వాళ్లం. సర్‌ఛార్జి తగ్గింపు భేషైందే కానీ, మ్యాట్‌ పెంపుదలే నిరుత్సాహం కలిగిస్తోంది. ఏమైనా ఇది వృద్ధి ప్రధానమైన బడ్జెట్‌. వస్తు, సేవల పన్ను స్వరూపం గురించిన రూపురేఖలు వెల్లడించటం బాగుంది.'
- రాజన్‌ మిట్టల్‌, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వైస్‌ఛైర్మన్‌
ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాగేసుకొని..
'విత్త మంత్రి మధ్య తరగతి వర్గాలకు ఆదాయపు పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించివేశారు.. మౌలిక సదుపాయాల కల్పన బాండ్లలో పెట్టుబడికి అదనపు తగ్గింపును కూడా ప్రవేశపెట్టారు. అయితే వస్తువులపై, పెట్రోల్‌, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకం పెంపు వల్ల అన్ని తయారీ వస్తువులు ప్రియమైపోతాయి.. అంటే, ఒక చేత్తో ఇచ్చింది మరో చేత్తో తీసేసుకొంటారన్న మాట. కానీ ఎక్కువ మందికి ఈ బడ్జెట్‌ నికరంగా మేలే చేస్తుంది. చమురు, ఎరువుల బాండ్లు జారీ చేయకుండా లోటు విషయంలో పారదర్శకతకు తావు ఇవ్వటం అభినందనీయం'.
- జి.వి.నాగేశ్వర రావు, ఐడీబీఐ ఫోర్టిస్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ అండ్‌ సీఈఓ
ఉన్నత విద్యపై ఏదీ శ్రద్ధ
'మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబులు పెంచటం, ఇ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యం బాగున్నాయి. ఉన్నత విద్యపై శ్రద్ధ తీసుకోలేదు. మ్యాట్‌ పెంపు ప్రభావం ఇన్ఫోసిస్‌పై ఉండదు'.
- ఎస్‌.గోపాలకృష్ణన్‌, ఇన్ఫోసిస్‌ సీఈఓ

సంస్కరణల బాటలో బడ్జెట్‌

సంస్కరణల బాటలో బడ్జెట్‌
ర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ బడ్జెట్‌లో సంస్కరణలకు పెద్దపీట వేశారు. ఆర్థిక లోటును తగ్గించే చర్యలకు శ్రీకారం చుట్టడం ద్వారా దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకురానున్నారు. ఉద్దీపనల ఉపసంహరణకు నడుంకట్టడం సకాలంలో తీసుకున్న సరైన నిర్ణయం. న్యూట్రిషన్‌ ఆధారిత సబ్సిడీ విధానం, ఆయిల్‌, ఎరువుల బాండ్లు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వంపై రుణభారం అధికం కాకుండా ఉంటుంది. బొగ్గు గనుల ప్రైవేటీకరణ, బొగ్గు నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు వల్ల విద్యుత్తు రంగానికి మేలు జరుగుతుంది.

ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే విధంగా బడ్జెట్‌ను రూపొందించినప్పటికీ, పైకి కనిపిస్తున్న కఠిన చర్యల వల్ల ఇది జనానురంజకంగా కనిపించడం లేదు. ఉద్దీపనల ఉపసంహరణలో భాగంగా పన్నులు పెంచిన ప్రభుత్వం, అదే సమయంలో పెట్రోలు/ డీజిల్‌పై పన్ను భారాన్ని మోపకుండా ఉండాల్సింది. దీనివల్ల ద్రవ్యోల్బణం ఇంకా అధికం అయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. ప్రస్తుతం అధిక ధరలతో జనం సతమతం అవుతున్నారు. ఆహార పదార్ధాల సరఫరా పెరిగేందుకు తక్షణం ఏం చర్యలు తీసుకోదలిచారో ఆర్థిక మంత్రి చెప్పలేదు. తక్షణ సమస్యలను ఆయన విస్మరించి, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. దీనివల్ల సామాన్యుడికి తమను ఆర్థిక మంత్రి విస్మరించడమే కాకుండా, తమపై అధిక భారాన్ని మోపారని భావించే అవకాశం ఏర్పడుతోంది.

వ్యవసాయ రంగం ప్రాధాన్యంపై మాట్లాడటమే గానీ, అందుకు తగిన చర్యలు బడ్జెట్‌లో కనిపించడం లేదు. వ్యవసాయ రంగంలో 0.2 శాతం వ్యతిరేక అభివృద్ధి ఉన్న ఈ తరుణంలో దీన్ని 2 లేదా 3 శాతం వృద్ధికి తీసుకురావడానికి ఎంతగానో మద్దతు చర్యలు ప్రభుత్వం ప్రకటించాల్సింది. ఆ దిశగా అసలు దృష్టి పెట్టినట్లే కనిపించదు. వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మాట్లాడారు. అందుకు తగిన చర్యలు అయినా బడ్జెట్‌లో లేవు. ఏదైమైనా బడ్జెట్‌ ప్రభావం స్వల్పకాలంలో కష్టంగానే ఉంటుంది. దీర్ఘకాలంలో కొంత సానుకూలత కనిపించవచ్చు.

- కె.నరసింహమూర్తి,
బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవహారాల నిపుణులు

పెట్టుబడి ఆధారిత వృద్ధి బడ్జెట్‌

పెట్టుబడి ఆధారిత వృద్ధి బడ్జెట్‌
చాలా సమతౌల్యంగా, ఆశావహంగా ఉంది. కేటాయింపులు చాలా బాగా ఉన్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి, వినియోగం, ఆహార భద్రతకు బడ్జెట్‌లో పెద్దపీట వేయడం సరైన సమయం, దిశగా తీసుకున్న నిర్ణయం. గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, విద్యా రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల దీర్ఘకాలంలో గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగవడమేకాక గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. వ్యవసాయ, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందందే దీర్ఘకాల అభివృద్ధి కొనసాగించడం కష్టం. పారిశ్రామిక రంగం కూడా ఈ బడ్జెట్‌ నుంచి పెద్దగా ఆశించింది ఏమీ లేదు. ప్రభుత్వం కూడా పారిశ్రామిక రంగంపై భారీ స్థాయిలో ప్రతికూల ప్రభావం పడే నిర్ణయాలు తీసుకోలేదు. కనీస ప్రత్యామ్నాయ పన్ను పెంపు (15 నుంచి 18 శాతానికి) వంటివి మార్పులు ఎప్పుడూ ఉంటాయి. సుంకాలు, ఎక్సైజ్‌ పన్నులు కొన్ని వస్తువులపై పెంచితే కొన్నింటిపై తగ్గించారు. వైద్య పరికరాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి రంగాలను ప్రోత్సహించడానికి పన్నులు తగ్గించడం హర్షణీయం. ఉద్దీపనలను కూడా పరిమితంగా తగ్గించిన విషయాన్ని గమనించాలి. గత ఏడాది వినియోగ ఆధారిత వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వగా.. ఈ సారి పెట్టుబడి ఆధారిత వృద్ధి చర్యలు తీసుకున్నారు.
- కె.హరీశ్‌చంద్ర ప్రసాద్‌, అధ్యక్షుడు, ఫ్యాప్సీ

చిన్న, మధ్యతరహా సంస్థలకు కాస్తంత వూరటే

చిన్న, మధ్యతరహా సంస్థలకు కాస్తంత వూరటే
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెటులో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు రానున్న ఆర్థిక సంవత్సరం (2010-11)లో కేటాయింపును రూ.600 కోట్ల మేర పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విత్త మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారం బడ్జెటు ప్రసంగంలో ఈ సంగతి తెలిపారు. ఇదివరకు ఈ రంగానికి రూ.1,794 కోట్లు కేటాయించారు. ఇపుడు దీనిని రూ.2,400 కోట్లు చేశారు. ఎంఎస్‌ఎంఈలపై ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ సిఫారసుల అమలును ఒక ఉన్నత స్థాయి సమితి (కౌన్సిల్‌) పర్యవేక్షించగలదని ముఖర్జీ వివరించారు. ఎస్‌ఎంఈలకు 2% వడ్డీ రాయితీని (ఇంటరెస్ట్‌ సబ్‌వెన్షన్‌) ఒక ఏడాది పాటు పొడిగించేందుకు ప్రతిపాదించారు. ఈ పథకం గడువు వచ్చే నెల 31తో ముగియనుంది. సమగ్ర ఖాదీ సంస్కరణల కార్యక్రమం అమలుకు ఆసియా అభివృద్ధి బ్యాంకుతో గత డిసెంబరు 22న కేంద్ర ప్రభుత్వం 150 మిలియన్‌ డాలర్ల (రూ.690 కోట్ల) రుణ ఒప్పందాన్ని కుదర్చుకొందని, ఈ కార్యక్రమం ఎంపిక చేసిన 300 ఖాదీ సంస్థలకు వర్తిస్తుందని మంత్రి గుర్తు చేశారు.

ఈసారి రూ.40,000 కోట్లు ... ప్రభుత్వ వాటాల ఉపసంహరణ లక్ష్యం

ఈసారి రూ.40,000 కోట్లు
ప్రభుత్వ వాటాల ఉపసంహరణ లక్ష్యం
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరం (2010-11)లో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో సర్కారు పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా మరింత ఎక్కువ మొత్తాన్ని.. అంటే రూ.40,000 కోట్లను సమీకరించాలని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారం బడ్జెటులో ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరం 2009-10లో ఇదే మార్గంలో రూ.25,000 కోట్లను సమీకరించాలని తలపెట్టిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం నుంచి చూస్తే ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌టీపీసీ, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌లు ఇష్యూలకు వచ్చాయి. ఎన్‌ఎండీసీ, సట్లజ్‌ జల్‌ విద్యుత్‌ నిగమ్‌లలో వాటా విక్రయం ప్రక్రియ ఆరంభం అయింది.

జీఎస్‌టీ 14-16శాతం?

జీఎస్‌టీ 14---- 16శాతం?
న్యూఢిల్లీ: ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ప్రధాన సంస్కరణలుగా పేర్కొనదగిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), ప్రత్యక్ష పన్నుల స్మృతి (డీటీసీ)ని 2011 ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే జీఎస్‌టీ అమలు కావాల్సి ఉంది. * ఆదాయపు పన్ను చట్టానికి ప్రత్యామ్నాయంగా డీటీసీ అమల్లోకి వస్తుంది.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పరోక్ష పన్నులు.. సేవాపన్ను, ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌, ఇతర సుంకాలు, సర్‌ఛార్జీలు, స్థానిక సుంకాలు ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. వీటి స్థానంలో ఏకీకృత జీఎస్‌టీ అమలవుతుంది.
* ప్రస్తుతం సేవలపై 10% పన్ను వసూలు చేస్తున్నారు. వస్తువులపై పరోక్ష పన్నులన్నీ కలిపి 20% వరకు ఉన్నాయి.
* జీఎస్‌టీ 14-16% ఉండవచ్చు. అంటే వినియోగదారుడికి లాభమే

తగ్గిన ఉ'ద్దీప'న వెలుగులు

తగ్గిన ఉ'ద్దీప'న వెలుగులు
న్యూఢిల్లీ:ఉద్దీపనల విషయంలో పూర్తిగా కాకున్నా.. కొంతవరకు అంచనాలు నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లు ఎక్సైజ్‌ సుంకంలో 4 శాతం కాకుండా.. కేవలం రెండు శాతం పెంపునకే ఆర్థిక మంత్రి ప్రణబ్‌ పరిమితమయ్యారు.

అన్ని చమురేతర ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని 8 శాతం నుంచి 10 శాతానికి పెంచుతున్నట్లు ప్రణబ్‌ ప్రకటించారు. దీంతో కార్లు, సిగరెట్లు వంటి వినియోగ వస్తువులు ప్రియం కానున్నాయి. మరో పక్క సేవా పన్నులో ఎలాంటి మార్పు లేకుండా 10 శాతంగానే యథాతథంగా ఉంచారు. పెట్రోలు, డీజిల్‌, బంగారం, వెండి, సిమెంటు వంటి వాటిపై సుంకాలు పెంచారు.

ఖజానాకు ఎంత వస్తుందంటే: పాక్షిక ఉద్దీపనల ఉపసంహరణలో భాగంగా పరోక్ష పన్నుల రూపేణా ప్రభుత్వ ఖజానాకు రూ.46,500 కోట్లు సమకూరుతాయి. మరోపక్క ఆదాయ పన్నులో ప్రతిపాదించిన మార్పుల వల్ల ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రూ.26,000 కోట్లు తగ్గిపోతుంది. అంటే మొత్తంమీద నికరంగా రూ.20,100 కోట్లు పన్నుల రూపంలో అదనంగా వస్తాయన్నమాట.

ఎవరికి కష్టం: ఉద్దీపనల ఉపసంహరణ నిర్ణయం వాహన, ఉక్కు, సిమెంటు కంపెనీలపై ప్రతికూలంగా పనిచేస్తుంది.

హోటళ్లకు స్టార్‌!
సారి బడ్జెట్‌లో హోటల్‌ రంగం ఆశించిన 'మౌలిక రంగ' హోదా దక్కకపోయినా, ఏప్రిల్‌ 1 తరవాత కార్యకలాపాలు ఆరంభించే హోటళ్ల నిర్మాణం, గుడ్‌విల్‌ తదితర పెట్టుబడులపై పూర్తి పన్ను మినహాయింపులు లభించాయి.

* 2 స్టార్‌ ఆపై తరగతుల హోటళ్లు దేశంలో ఎక్కడ నిర్మించినా, 'పెట్టుబడులకు అనుగుణంగా' 100% పన్ను రాయితీ ఉంటుంది.
* గ్రూపు వ్యాపారాల్లో భాగంగా, భూమి కొనుగోలు మినహా హోటల్‌ నిర్మాణం, నిర్వహణకు అవసరమైన అన్ని పెట్టుబడులకూ ఈ రాయితీలు వర్తిస్తాయని ఆర్థికశాఖ మంత్రి తెలిపారు.
* ఇప్పటివరకు శీతల గిడ్డంగులు, వ్యవసాయ గోదాములు, నేచురల్‌గ్యాస్‌-ముడిచమురు- పెట్రోల్‌ పైపులైన్ల నిర్వహణ, నిర్వహణకు ఇటువంటి రాయితీలు ఇస్తున్నారు.
*సెక్షన్‌ 80 - 1 ఏ ప్రకారం విమానాశ్రయాలు, నౌకాశ్రయాల మాదిరి మౌలిక వసతుల హోదా కల్పించాలని హోటల్‌ రంగం ఆశించింది.

సిమెంటుపై భారమే

సిమెంటుపై భారమే
డ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నులను చూస్తే సిమెంటు ఉత్పత్తి వ్యయం బస్తాకు రూ.5 నుంచి రూ.7 వరకూ పెరుగుతుందని తేలుతోంది. దీన్ని భారంగానే పరిగణించాలి. సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్నును 2 శాతం పెంచడం, బొగ్గు ధర పెంపు, దిగుమతి చేసుకున్న బొగ్గుపై అధిక దిగుమతి పన్ను, డీజిల్‌ ధర పెరగడం వల్ల సిమెంటు రవాణా వ్యయం పెరగడం, మ్యాట్‌ 15 శాతం నుంచి 18 శాతానికి పెంచడం... ఇవన్నీ కలిపి సిమెంటు ఖర్చును పెంచుతాయి. అయితే ఒక సానుకూలాంశం ఏమిటంటే... మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణబ్‌ ముఖర్జీ పెద్దపీట వేశారు. అందువల్ల సిమెంటు డిమాండ్‌ గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతోంది. ఇది ఆహ్వానించదగిన మార్పు.

పదకొండో పంచవర్ష ప్రణాళికలో మౌలిక సదుపాయాల రంగానికి ప్రాధాన్యం కొనసాగుతుందని మాటల్లో, చేతల్లో ఆర్థిక మంత్రి స్పష్టం చేసినందున సిమెంటు కంపెనీలకు భవిష్యత్తు ఆకర్షణీయంగానే ఉంటుందని ఆశించవచ్చు.

- ఎస్‌.ఆర్‌.బి. రమేష్‌చంద్ర, ఎండీ, భీమా సిమెంట్స్‌

ఫార్మాకు మంచి కబురు

ఫార్మాకు మంచి కబురు
ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్‌ సమ్మిళిత అభివృద్ధిపై దృష్టిని నిలిపి సమతూకంగా వెలువడింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, సామాజిక రంగం, ఇతర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలకు కేటాయింపులు పెరగడం బడ్జెట్‌లో విశేషం. ఆరోగ్య సంరక్షణ సూచీల్లో మన దేశం దిగువన నిలచిన నేపథ్యంలో ఈ రంగానికి మరిన్ని నిధులను ఇవ్వబూనడం ప్రభుత్వ నిబద్ధతను చాటుతోంది. ఇది కచ్చితంగా ఒకటికి పది విధాల ప్రభావాన్ని ప్రసరింపచేయడం ఖాయం. ఔషధ తయారీ రంగం వైపు నుంచి చూస్తే, సంస్థాగత పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై వెచ్చించిన వ్యయాన్ని వెయిటెడ్‌ డిడక్షన్‌ పద్ధతిలో 150% నుంచి 200 శాతానికి పెంచడం సానుకూల, ప్రోత్సాహకర ప్రతిపాదనే. ప్రత్యేక ఆర్థిక మండలాల (సెజ్‌) వృద్ధికి సహకరిస్తామనడం ఇంకొక శుభ వార్త. అలాగే జీఎస్‌టీ, డీటీసీ లను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలు చేయాలన్న లక్ష్యం నిర్దేశించుకోవడం మంచి శకునం. కార్పొరేట్‌ సర్‌చార్జి తగ్గింపు ఒకింత ఊరటను మిగిల్చేటట్లున్నా, మ్యాట్‌ను పెంచకుండా ఉండాల్సింది. జీడీపీలో 6.9 శాతానికి లోటు ఎగబాకడం, రెండంకెలకు చేరిన ఆహార ద్రవ్యోల్బణం పెను సవాళ్లు.
- సతీశ్‌ రెడ్డి, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఎండీ, సీఓఓ

విమాన ప్రయాణమూ భారమే

విమాన ప్రయాణమూ భారమే
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: బడ్జెట్‌లో సేవా పన్నుల పరిధిలోకి విమాన ప్రయాణికులను కూడా తీసుకు రావడంతో విమానయానం భారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మొదటి, వ్యాపార తరగతుల్లో ప్రయాణించే వారికే సేవల పన్ను వరిస్తుండగా.. తాజాగా దేశీయ ప్రయాణికులపైన కూడా సేవల పన్నును విధించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇప్పుడిప్పుడే విమాన ప్రయాణికులు పెరుగుతున్నారని, తాజా నిర్ణయ ప్రభావం కొంత మేరకైన ప్రయాణికులపై ఉండగలదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విమానాశ్రయం ప్రాంగణంలో కల్పించే అన్ని సేవలకు వర్తించే విధంగా 'ఎయిర్‌పోర్ట్‌' సేవలన నిర్వచనాన్ని కూడా మార్చనున్నారు. ఎయిర్‌ ఇండియాను పునరుద్ధరించడానికి ఇటీవల కేబినెట్‌ ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల ఈక్విటీని అందించాలని నిర్ణయించడం ఆహ్వానించతగిన పరిణామమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మొదటిగా ప్రభుత్వం రూ.800 కోట్ల మూలధనాన్ని సమకూరుస్తుంది.

కార్ల ధరలు ప్రియం

కార్ల ధరలు ప్రియం
ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు ఉపసంహరణ ఫలితం
న్యూఢిల్లీ: విక్రయాల సందడితో కళకళలాడుతున్న వాహన రంగానికి ప్రణబ్‌ బడ్జెట్‌ పగ్గం వేయనే వేసింది. ఈ రంగం ఊహించినట్లుగా ఎక్సైజ్‌ సుంకంలో 2 శాతం మంత్రి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా గత బడ్జెట్‌లో పెద్ద కార్లకు ఇచ్చిన రాయితీని పాక్షికంగా వెనుకకు తీసుకొంటున్నట్లు కూడా ప్రతిపాదించారు. దీనిపై వాహన పరిశ్రమ ప్రతినిధులు పెదవివిరిచారు. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని విభాగాల కార్లు ధరలు రెక్కలు తొడుక్కోవడం ఖాయమని సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. పెట్రోలియమ్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ లెవీని లీటర్‌ ఒక్కింటికి రూపాయి మేరకు పెంచినట్లు విత్త మంత్రి ప్రకటన చేయడం వాహన రంగానికి గోరు చుట్టుపై రోకటిపోటులా పరిణమించింది.

రూ.3,000 - 41,000 వరకుపెరగనున్న ధరలు: వాహన పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ సాయంత్రం ఒక ప్రకటన చేస్తూ, తమ కంపెనీ కార్ల శ్రేణి ధరలు కనీసం రూ.3,000 నుంచి గరిష్ఠంగా రూ.13,000 వరకు వెంటనే ఎగబాకనున్నట్లు తెలిపింది. జనరల్‌ మోటర్స్‌ ఇండియా కంపెనీ తమ కార్ల ధరలను రూ.7,500 నుంచి రూ.26,000 వరకు, హ్యుందాయ్‌ రూ.6,500 నుంచి రూ.25,000 వరకు ధరలను పెంచనున్నట్లు పేర్కొన్నాయి. హోండా సియల్‌ కార్స్‌ ఇండియా కూడా ఇదే దారిలో నడచి, తమ ఉత్పత్తులకు రూ.13,000 నుంచి రూ.41,000 వరకు ప్రియం అవుతాయని వెల్లడించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో మేలైన బడ్జెట్‌

ప్రస్తుత పరిస్థితుల్లో మేలైన బడ్జెట్‌
న్నుల మోత, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచడం వంటి కఠిన నిర్ణయాలు ప్రతిపాదించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించిన మంచి బడ్జెట్‌ను ఆశించడం కష్టం. ద్రవ్య లోటును 5.5 శాతానికి పరిమితం చేయాలనుకోవడం సానుకూలాంశం. కొన్ని దేశాల్లో ఇది 10- 12 శాతం వరకూ ప్రమాదకరమైన స్థాయిలో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధి పట్టాలు తప్పకుండా, దానికి తప్పనిసరి ఇంధనమైన వినియోగం దెబ్బతినకుండా బడ్జెట్‌ను తయారు చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఏ, భారత్‌ నిర్మాణ్‌, విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి రుణవితరణ పెంచడం సానుకూలమైన నిర్ణయాలు. ఎక్సైజ్‌ పన్ను భారం పెంచారనే బాధ ఒకపక్క ఉన్నప్పటికీ, ఆర్థిక లోటును తగ్గించుకోవడానికి ప్రస్తుతానికి ఇంతకంటే దారిలేదు. ద్రవ్యోల్బణం పెరిగిపోతుందనే ఆందోళన కొన్ని వర్గాల్లో ఉంది. కానీ ఇప్పుడు మనదేశం ఉన్న పరిస్థితుల్లో అధిక ద్రవ్యోల్బణం వల్ల ఇబ్బందేమీ లేదు. బ్యాంకుల మూలధన అవసరాలకు రూ. 16,500 కోట్లు కేటాయించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థను ఈ నిర్ణయం బలోపేతం చేస్తుంది. వ్యవసాయదార్లకు ఇచ్చిన రుణాల తిరిగి చెల్లింపు గడువును వచ్చే ఏడాది జూన్‌ వరకూ పొడిగించినందున, ఈ రుణ మొత్తం బ్యాంకుల ఖాతాల్లో ఎన్‌పీఏ (నిరర్ధక ఆస్తి) గా కనిపించదు. బ్యాంకింగ్‌ రంగానికి ఇది అనుకూలం.

చమురు సబ్సిడీ ప్రభుత్వ ఆదాయం మీద ఎంతోకాలంగా ఒత్తిడి పెంచుతున్న విషయం విదితమే. దీన్ని ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ ద్వారా తగ్గించే యత్నం చేశారు. పెట్రోలు, డీజిల్‌ మీద ఎక్సైజ్‌ పన్నును ఒక రూ. 1 చొప్పున పెంచడం వల్ల ఈ భారం కొంతమేరకైనా తగ్గుతోంది. పెట్రోలియం సబ్సిడీ మీద ప్రభుత్వం ఏటా రూ.2.80 లక్షల కోట్లు భరించాల్సి వస్తోంది. ఆదాయపు పన్ను స్లాబులు మార్చడం ద్వారా పన్ను చెల్లింపుదార్లకు ఆర్థిక మంత్రి మేలు చేశారు. అంతేగాకుండా అదనంగా రూ. 20,000 దీర్ఘకాలిక ఇన్‌ఫ్రా బాండ్లలో పెట్టుబడి పెట్టి పన్ను రాయితీ పొందే అవకాశాన్ని కల్పించారు. దీనివల్ల పన్ను చెల్లింపుదార్లకు మేలు కలగడంతో పాటు మౌలిక సదుపాయాల రంగానికి నిధుల లభ్యత పెరుగుతుంది.

- కె. కృష్ణంరాజు, సీఎండీ, క్రిసాని వెల్త్‌ మేనేజ్‌మెంట్‌

ఆశించాం... నిరాశే మిగిలింది

ఆశించాం... నిరాశే మిగిలింది
ప్ర
త్యేకంగా భారం, అదనపు ప్రోత్సహకాలు ప్రకటించనప్పటికీ.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమను బడ్జెట్‌ కొంత మేరకు నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) పథకం ప్రకారం ఆదాయపు పన్ను చట్టంలోని 10ఎ, 10బి సెక్షన్ల కింద ఐటీ కంపెనీలకు లభిస్తున్న పన్ను రాయితీలను బడ్జెట్‌లో పొడిగిస్తారని ఆశించాం. ఇదే పరిశ్రమ ప్రధాన కోరిక. కానీ అలా జరగలేదు. ఇది 2011 మార్చితో రద్దవుతుంది. ఈ పథకం ప్రయోజనాలు లభించకపోతే ప్రత్యేక ఆర్థిక మండలాలలో కార్యకలాపాలు నిర్వహించే పెద్ద కంపెనీలు, బయట ఉండే చిన్న కంపెనీల మధ్య వ్యత్యాసం బాగా పెరుగుతుంది. అయితే.. ఎస్‌టీపీఐ పథకానికి ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కనీస ప్రత్యమ్నాయ పన్నును 18 శాతానికి పెంచడం కూడా ఐటీ కంపెనీలపై ప్రభావాన్ని చూపుతుంది.
కాగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఐటీ అమలుపై చేయనున్న వ్యయం ఐటీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రత్యేక గుర్తింపు కార్డుల ప్రాజెక్టుకు రూ.1900 కోట్ల కేటాయింపు, నందన్‌ నిలేకని ఆధ్వర్యంలో టెక్నాలజీ సలహా బృందం ఏర్పాటు ఐటీ పరిశ్రమకు మేలు చేసే అవకాశం ఉంది. ఐటీ పరిశ్రమపై సేవల పన్ను మదింపు నిబంధనలను సరళీకరించినందున కంపెనీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రిఫండ్‌లు త్వరగా లభిస్తాయి.
-బి.వి.ఆర్‌.మోహన్‌ రెడ్డి,
సీఎండీ ఇన్ఫోటెక్‌ ఎంటర్‌ప్రైజెస్‌

ఉద్దీపనలు ఇంకొన్నాళ్లు ఉంచాల్సింది

ఉద్దీపనలు ఇంకొన్నాళ్లు ఉంచాల్సింది
డ్జెట్‌ బాగానే ఉంది. పదికి ఏడు పాయింట్లు ఇవ్వవచ్చు. కొన్ని సానుకూలతలు, మరికొన్ని వ్యతిరేకాంశాలు ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ బడ్జెట్‌లో కనిపిస్తున్నాయి.

ద్రవ్య లోటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతానికి మించదని చెప్పారు. ఇది ఎంతో అనుకూలించే అంశం. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. లోటు 7 శాతానికి మించిపోతుందని భయపడ్డాం. అదే సమయంలో వచ్చే రెండేళ్లలో 4.1 శాతానికి తగ్గించుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇది ముదావహం.

*దేశీయంగా వివిధ రంగాల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వినియోగాన్ని పెంపొందించే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు.

*టెండరింగ్‌ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా బొగ్గు గనులను విద్యుదుత్పత్తి సంస్థలకు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది విద్యుత్తు రంగానికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా పర్యావరణానుకూల విద్యుదుత్పత్తికి ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు.

నిరుత్సాహకర అంశాలు: ఉద్దీపన పథకాలను మరికొన్నాళ్లు, అంటే కనీసం మరో ఆరు నెలల పాటైనా కొనసాగించాల్సింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది కాబట్టి, పూర్తి స్థిరీకరణ వచ్చేవరకూ ఆగుతారని ఆశించాం.

*మ్యాట్‌ను 15 శాతం నుంచి 18 శాతానికి పెంచడం పరిశ్రమలకు నష్టం చేసే చర్య.
*జీఎస్‌టీ ఆలస్యం కూడా నష్టదాయకమే.
*కొన్ని ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక పథకాలు ప్రకటించిన ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్‌ను విస్మరించారు. రాష్ట్రానికి చెందిన కొన్ని నీటిపారుదల పథకాలు జాతీయ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నాం. అదేవిధంగా 'వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌' కింద రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులకు నిధులు ఇచ్చి ఉంటే బాగుండేది. అటువంటివేమీ లేకపోవడం నిరుత్సాహాన్ని కలిగించింది.

- వై.హరీశ్‌చంద్ర ప్రసాద్‌,
మాలక్ష్మీ ఇన్‌ఫ్రావెంచర్స్‌ ఛైర్మన్‌, సీఐఐ-ఏపీ ఛైర్మన్‌

బోషాణానికి 8,000 కోట్ల చిల్లు

బోషాణానికి 8,000 కోట్ల చిల్లు
న్యూఢిల్లీ: ఉద్దీపనల చర్యలు, తగ్గిన ఆర్థిక వృద్ధి కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో రూ.8,000 కోట్ల వరకూ గండి పడనుంది. ప్రభుత్వం అంతక్రితం రూ.6.41 లక్షల కోట్ల వసూళ్లను అంచనా వేయగా.. సవరించిన అంచనాల ప్రకారం ఇవి రూ.6.33 లక్షల కోట్లకే పరిమితం కానుంది. అయితే తాజా ఉద్దీపనల ఉపసంహరణ చర్యల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తం పన్ను వసూళ్లు 16.46 శాతం పెరిగి రూ.7.46 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా. మరో పక్క ఆదాయ శ్లాబుల మార్పిడి వల్ల వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లువచ్చే ఆర్థిక సంవత్సరం చిక్కిపోనున్నాయి. ఈ ఏడాది అంచనా(రూ.1,12,850 కోట్లు) కంటే 10.75 శాతం ఎక్కువగా వ్యక్తిగత ఐటీ వసూళ్లు రూ.1,24,989 కోట్లకు చేరనున్నట్లు సవరించిన అంచనాలు తెలుపుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం ఇవి 6.83% మేర కుంగి రూ.1,20,566 కోట్లకే పరిమితమవుతాయని అంచనా.

ద్రవ్యలోటు 5.5 శాతానికి
2010-11 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు జీడీపీలో 5.5 శాతంగా నమోదు కాగలదని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. మొత్తం వ్యయం రూ.11.09 లక్షల కోట్లుగా అంచనా వేయగా.. మొత్తం పన్ను, పన్నేతర ఆదాయం రూ.6.82 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు అంచనా 6.8 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. లోటును అధిగమించేందుకు ప్రభుత్వం 2010-11 ఏడాదికి రూ.3.81 లక్షల కోట్లను రుణాలు చేయనుంది. ఇక 2011-12కు 4.8%; 2012-13కు 4.1%గా ద్రవ్యలోటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రణబ్‌ పేర్కొన్నారు.

మూడో త్రైమాసికంలో తగ్గిన జీడీపీ: మూడో త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6 శాతానికే పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 6.2 శాతంగా ఉంది. కాగా, రెండో త్రైమాసికంలో ఇది 7.9 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.

మౌలిక రంగానికి రూ.1.73 లక్షల కోట్లు

మౌలిక రంగానికి రూ.1.73 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థికశాఖ మంత్రి తన బడ్జెట్‌లో అమిత ప్రాధాన్యమిచ్చారు. 2010-11 ప్రణాళికాపద్దుల్లో రూ.1,73,552 కోట్లను రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వేలు, ఇతర మౌలిక వనరులకు కేటాయించారు.

2009-10లో రోడ్లకు రూ.17,520 కోట్లు ఇవ్వగా, ఈసారి 13% పెంచి రూ.19,894 కోట్లు కేటాయించారు. జాతీయ రహదారులను రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున నిర్మించేందుకు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) నిబంధనల్లో మార్పులు చేశారు. రవాణాకు ప్రత్యేకంగా ఢిల్లీ-ముంబయి ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటుచేస్తారు. రైల్వేలకు రూ.950 కోట్లు జతచేసి, రూ.16,752 కోట్లు ఇచ్చారు. 'భారత మౌలికరంగ ఆర్థికసంస్థ' (ఐఐఎఫ్‌సీఎల్‌) నుంచి ఈ మార్చి నాటికి రూ.9,000 కోట్లు, 2011 మార్చినాటికి రూ.20,000 కోట్లు పంపిణీ అవుతాయి. ఈ సంస్థ రూ.3,000 కోట్ల మేర బ్యాంకు రుణాల రీఫైనాన్స్‌ చేసింది. వచ్చే మూడేళ్లలో మౌలికరంగ ప్రాజెక్టులకు ఐఐఎఫ్‌సీఎల్‌ ద్వారా బ్యాంకులు రూ.25,000 కోట్లు రుణాలిస్తాయి. గ్రామీణ రహదారులు, వంతెనలకు ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కింద రూ.12,000 కోట్లు కేటాయించారు. 1.67 లక్షల నివాస ప్రాంతాలను కలుపుతూ, 3,65,279 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మిస్తారు. జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధికి నిర్మించు-నిర్వహించు-బదలాయింపు (బీఓటీ) విధానానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అవసరమైన పరికరాల దిగుమతిపై సుంకాలను రద్దుచేశారు. కనీస ప్రత్యామ్నాయ పన్ను ఉపసంహరించకపోగా, 15% నుంచి 18 శాతానికి పెంచారు.

పన్ను పరిధిలోకి మరో 8 సేవలు

పన్ను పరిధిలోకి మరో 8 సేవలు
న్యూఢిల్లీ: సేవాపన్ను 10% లో మార్పు చేయకపోయినా, పరిధి విస్తరిస్తోంది. ఇప్పటివరకు పన్ను పరిధిలోకిరాని 8 అంశాలు కొత్తగా చేరుతున్నాయి.
కొత్తగా చేర్చినవి: వస్తువులు, సేవలు, కార్యక్రమాల బ్రాండ్‌ ప్రమోషన్‌, వ్యాపార హక్కులపైనా సేవాపన్ను చెల్లించాల్సి ఉంటుంది.

* స్థిరాస్తి అద్దెపైనా సేవా పన్ను చెల్లించాలి. 2007 జూన్‌ 1 నుంచే ఇది అమల్లో ఉన్నట్లు పరిగణిస్తారు.
* ప్రమోషన్‌, మార్కెటింగ్‌, లాటరీతో పాటు లక్కీఛాన్స్‌ ఆటలను ప్రత్యేక సేవ పరిధిలోకి తెచ్చారు.
* బీమా పథకాల కింద అందించే ఆరోగ్య సేవలు, ఒక వ్యాపార సంస్థలోని ఉద్యోగుల కోసం ఆసుపత్రులు లేక ఔషధ సంస్థలు నిర్వహించే వైద్య పరీక్షా శిబిరాలపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
* దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు (అన్ని తరగతులపైనా) సేవాపన్ను వసూలు చేస్తారు.
* సినిమాటోగ్రఫీ ఫిల్మ్‌లు, శబ్ద గ్రాహణంపై కాపీరైట్‌ హక్కుకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే రచన, డ్రామా, సంగీతం, కళానిపుణతపై కాపీరైట్‌ హక్కుకు పన్ను లేదు.
* భవన నిర్మాణదారులు కొనుగోలుదార్లకు కల్పించే ప్రత్యేక సదుపాయాలు, అదనపు చెల్లింపులపై జరిపే అంతర్గత - బాహ్య అభివృద్ధి పనులపైనా పన్ను చెల్లించాల్సిందే. వాహన పార్కింగుకు మాత్రం పన్ను వర్తించదు.
* వ్యక్తి లేదా సంస్థ నిర్వహించే ఏదైనా వాణిజ్య కార్యక్రమానికీ పన్ను వసూలు చేస్తారు. ఒక వ్యాపార సంస్థ ఉద్యోగుల మెడికల్‌ రికార్డుల నిర్వహణ సేవలు, విద్యుత్తు ఎక్స్ఛేంజీలు కూడా పన్నుల పరిధిలోకి వస్తాయి.
* 2009లో ప్రవేశపెట్టిన రైల్వేలో సరకు రవాణాపై సేవా పన్ను

2010-11లో అమలుకానుంది.
ఈసారి మినహాయింపులు: విత్తనాలు, న్యూస్‌ ఏజెన్సీలు
వసూళ్లు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేవాపన్ను వసూళ్లు రూ.58,000 కోట్లు. 2010-11లో ఈ మొత్తం రూ.68,000 కోట్లకు చేరుతుందని అంచనా. ఇది జీడీపీలో 1 శాతానికి సమానం.

నచ్చావులే.. !

బడ్జెట్‌ వేళ 420 పాయింట్లు పైకి
చివర్లో లాభాల స్వీకరణ
175 పాయింట్ల లాభంతో ముగింపు
బ్బు తెరలు వీడాయి. ఉద్దీపన దీపాలు ఆరిపోతే మార్కెట్లో చీకటి కమ్ముకుంటుందన్న భయాలు విడిపోయాయి. 'పాక్షిక గ్రహణమే' ఉండడంతో మార్కెట్లో వెలుగులు తొంగి చూశాయి. ప్రణబ్‌ ప్రసంగ పాఠం మార్కెట్‌ను లాభాల వల్లె వేయించేలా చేసింది. ఓ మోస్తరు లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ ఓ దశలో 400 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. తర్వాత లాభాల స్వీకరణతో కాస్త తగ్గినా చివరకు బలమైన సెంటిమెంటునే కనబరచింది. మదపర్లకు నవ్వుల్నే పంచింది. భవిష్యత్‌లోనూ లాభాలు కొనసాగగలవన్న భరోసాను ఇచ్చింది
ద్దీపనల పథకాలను మొత్తం మీద ఎత్తివేయరన్న అంచనాలతో మార్కెట్‌ 79 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా పెద్ద మార్పుల్లేకుండా అక్కడక్కడే తచ్చట్లాడింది. ప్రణబ్‌ ప్రసంగం వరకూ వేచిచూసింది.
ద్రవ్యలోటు ప్రకటనతో జోరు: ప్రణబ్‌ ముఖర్జీ గొంతు సవరించుకుని ప్రసంగాన్ని మొదలు పెట్టారు. వడ్డీ రాయితీలు, ప్రోత్సాహాకాలు, లైసెన్సు అనుమతులు.. ఇలా చెప్పుకుంటూ పోతున్నా మార్కెట్‌ పెద్దగా చలించలేదు. ఉద్దీపనల ఉపసంహరణ వల్ల ద్రవ్యలోటు 5.5 శాతానికి తగ్గుతుందని ప్రకటించిన కొద్ది క్షణాల్లోనే జోరందుకుంది. 70 పాయింట్ల లాభం కాస్తా.. క్రమంగా 200.. 250.. 300.. 380.. ఇలా పెరుగుతూ ఒక దశలో 420 పాయింట్ల మేర దూసుకెళ్లి ఐదు వారాల గరిష్ఠ స్థాయి 16,669.25 పాయింట్లను తాకింది. కార్పొరేట్‌ పన్నుపై సర్‌ఛార్జి తగ్గింపు కూడా ఈ జోరుకు కారణమే. తర్వాత ఎక్సైజ్‌ సుంకం 2 శాతం పెంపు నిర్ణయం; పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.1 పన్ను విధింపుతో క్రమంగా తగ్గుతూ వచ్చింది. విశ్లేషకుల అంచనా ప్రకారం వరస మూడు రోజులు సెలవు దినాలు కావడంతో(హోలి సందర్భంగా సోమ వారం సెలవు) లాభాల స్వీకరణ జరిగింది. దీంతో మార్కెట్‌ తుదకు 175.35 పాయింట్ల లాభంతో 16,429.55 వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి నిఫ్టీ సైతం ఇదే తీరును ప్రదర్శించింది. ఒక దశలో 4985 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 62.55 పాయింట్ల లాభంతో 4922.30 వద్ద స్థిరపడింది.
ముఖ్యాంశాలు
* మ్యాట్‌లో పెంపు ఐటీ రంగం తేలిగ్గా తీసుకుంది. విప్రో తప్ప అన్ని ఐటీ కంపెనీలూ అనుకూలంగానే ముగిశాయి.
* వాహన, లోహ, బ్యాంకింగ్‌, ఆరోగ్య సంరక్షణ, స్థిరాస్తి సూచీలు అధికంగా లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ సూచీలు మాత్రమే స్వల్పంగా నష్టపోయాయి.
* మార్కెట్‌ పరిమాణం ఒక్క ఉదుటన రూ.3,111.32 కోట్ల(గురువారం) నుంచి రూ.5,384.54 కోట్లకు పెరిగింది.
* 1848 స్క్రిప్‌లు లాభాలను పొందగా.. 942 స్క్రిప్‌లు నష్టాలను అనుభవించాయి.
* బ్యాంకింగ్‌ రంగంలోకి అడుగుపెట్టవచ్చన్న అంచనాలతో రిలయన్స్‌ క్యాపిటల్‌ రూ.304.85 కోట్లతో అత్యధిక లావాదేవీలను నమోదు చేసుకుంది.
* టాటా మోటార్స్‌ అత్యధికంగా 6.33% పెరిగింది. హిందాల్కో, ఎం&ఎం, హీరోహోండా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, మారుతీ సుజుకీ, స్టెరిలైట్‌, ఎస్‌బీఐ, డీఎల్‌ఎఫ్‌, ఐసీఐసీఐ బ్యాంకు, జైప్రకాశ్‌ అసోసియేట్స్‌లు 2.20-5.39% మేర లాభాలను ఆర్జించాయి.
* ఐటీసీ, టాటా పవర్‌ మాత్రం స్వల్పంగా నష్టపోయాయి.

అభివృద్ధి సాధ్యమేనా?

అభివృద్ధి సాధ్యమేనా?
క్ష్యాలైతే ఘనంగా నిర్దేశించుకున్నారు.. కానీ వాటిని చేరుకునే మార్గం మీదే ఆర్థిక మంత్రి దృష్టి సారించలేదు. ఐదేళ్లలో మురికివాడల్లేకుండా దేశాన్ని తీర్చిదిద్దుతామని అట్టహాసంగా ఆరంభించిన 'రాజీవ్‌ ఆవాస్‌ యోజన' పథకానికి నిధులు పెద్దగా కేటాయించలేదు. 2012 నాటికి కోటి ఇరవై లక్షల మందికి సరిపడా మౌలిక వసతుల్ని కల్పించడం.. కోటి వరకూ పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం.. ఇవీ రాజీవ్‌ ఆవాస్‌ యోజన లక్ష్యాలు. ఈ పథకం పూర్తవ్వాలంటే కనీసం రూ. 2,25,000 కోట్లు అవుతుందని అంచనా! గతేడాది ఈ పథకానికి రూ.150 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ.1,270 కోట్లతో సరిపెట్టేశారు. రాజీవ్‌ ఆవాస్‌ యోజన విజయవంతం అవ్వాలంటే ప్రభుత్వ సంస్థలు ఇళ్లను కడితే సరిపోదు. ఇందులో నిర్మాణ సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలి. ముందుకొచ్చే బిల్డర్లు, డెవలపర్లకు పన్ను రాయితీలివ్వాలి. ఇళ్ల గరిష్ఠ సంఖ్యపై నిబంధన విధించి.. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేవారికి పెద్దపీట వేయాలి.
* దేశవ్యాప్తంగా నగరాల అభివృద్ధికి సుమారు రూ. 5,400 కోట్లు కేటాయించారు. వీటితో నగరాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారముంది. ఫ్త్లెఓవర్లు, డ్రైనేజీ, రోడ్లకు పెద్దపీట వేస్తారు.
* ఇందిరా ఆవాస్‌ యోజన కింద బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా నిర్మించే ఇళ్ల యూనిట్‌ ధరను పెంచారు. సాధారణ స్థలాల్లో కట్టే ఒక్కో ఇంటికి రూ.45 వేల చొప్పున అందజేస్తారు. అదే కొండ ప్రాంతాల్లో కట్టే ఇంటికి రూ.48,500 చెల్లిస్తారు. ఇంటి యూనిట్‌ ధరను పెంచడం స్వాగతించాల్సిన నిర్ణయమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

మైనారిటీ బతుకు బాగు ఎలా..?

మైనారిటీ బతుకు బాగు ఎలా..?
దేశంలో అతిపెద్ద మైనారిటీ వర్గం ముస్లింలు. వీరి సంఖ్య 17 కోట్ల పైచిలుకు! ఆర్థికంగా, సామాజికంగా వీరెంతటి వెనకబాటుతనాన్నిఅనుభవిస్తున్నారన్నది గోపాల్‌ సింగ్‌ కమిషన్‌(1983), సచార్‌ కమిటీ(2006), రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌(2007)లు ఎత్తిచూపాయి. ముస్లింలు చాలా అంశాల్లో దళితుల కంటే కూడా వెనకబడ్డారని సచార్‌ కమిటీ నిగ్గుతేల్చింది. ప్రభుత్వపరంగా, ముఖ్యంగా బడ్జెట్‌పరంగా ప్రత్యేక చర్యలతోనే తమ అభ్యున్నతి సాధ్యమని ముస్లిం వర్గాలు భావిస్తున్నాయి.
సామాన్యుడి విన్నపమేంటి?
* సగటు ముస్లింలు.. విద్యా, ఉపాధి రంగాల్లో ముందడుగు వేసేందుకు ప్రభుత్వ సహాయం అందించాలి.
* సరైన విద్య, ఉపాధి అవకాశాలు లభించక ఎంతోమంది.. మెకానిక్‌లుగా, చిన్నచిన్న వ్యాపారులుగా, కూలీలుగా అల్పాదాయ వర్గంగా ఉండిపోతున్నారు. వీరు నివసించే ప్రాంతాలు మురికివాడలకు నకళ్లుగా ఉంటున్నాయి.మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలి. ఆడపిల్లల చదువులు, వారికోసం హాస్టళ్లు, గృహ రంగంలో ప్రాధాన్యం వంటివి ఇవ్వాలి.
* ప్రభుత్వం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న 90 జిల్లాల్లో 'బహుళ రంగ అభివృద్ధి పథకాలు' చేపట్టిందిగానీ.. అక్కడి వెనకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుంటే కేటాయింపులు చాలా తక్కువ.
*రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ విద్య, ఉపాధి తదితర రంగాలన్నింటిలోనూ 15% (ముస్లింలకు 10%, ఇతర మైనారిటీలకు 5%) రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. వెనుకబాటుతనానికి గురైన తమకు విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పలువురు ముస్లింలు కోరుతున్నారు.
బడ్జెట్‌ ఏమిచ్చింది?
మైనారిటీ వ్యవహారాల శాఖకు కేటాయింపులు 50శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది రూ.2,600కోట్లు ఇచ్చారు. గతేడాది ఈ మొత్తం రూ.1,740 కోట్లుగా ఉంది. మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో అమలు చేసే 'బహుళ రంగ అభివృద్ధి పథకాల'కు ఈ ఏడాది రూ.1,204.20 కోట్లు కేటాయించారు. ఉపకారవేతనాల కేటాయింపులు రెట్టింపు అయ్యాయి. గత సంవత్సరం ప్రీ మెట్రిక్‌లో రూ.180 కోట్లుగా ఉన్న కేటాయింపులు రూ.405 కోట్లకు పెరిగాయి. పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలు రూ.135.79 నుంచి రూ.238.50 కోట్లకు పెరిగాయి.

* మౌలానా అజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ మొత్తం రూ.13.50 నుంచి రూ.27కోట్లకు వృద్ధి చెందాయి. మైనారిటీ మహిళల్లో నాయకత్వం అభివృద్ధి చేసే కార్యక్రమానికి నిధులు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం రూ.7.2 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది రూ.13.50 కోట్లకు చేరాయి.

రాష్ట్రానికేం ఒరిగింది?
మైనారిటీ విద్యార్థులకు కేంద్రం నేరుగా ఇచ్చే ఉపకార వేతనాలు రెట్టింపు కానున్నాయి. వక్ఫ్‌ ఆస్తుల కంప్యూటరీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇది భారాన్ని తగ్గిస్తుంది.

బడుగుకు గొడుగేదీ?

బడుగుకు గొడుగేదీ?
దేశంలో షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), షెడ్యూల్డు తరగతులు (ఎస్టీ) సమాజంలో అందరికన్నా ఎంతో వెనకబడి ఉన్నాయి. మానవాభివృద్ధి సూచికలు, నివేదికలన్నీ కూడా ఇదే విషయాన్ని ఘోషిస్తున్నాయి. స్వతంత్య్రానంతరం ప్రభుత్వాలన్నీ కూడా వీరి అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు, ప్రణాళికలు చేపడుతూనే ఉన్నాయిగానీ అవేవీ లక్ష్యాలు చేరుకున్న దాఖలాల్లేవు. ఉన్న పథకాలను చిత్తశుద్ధితో అమలు చేసినా చాలు, తమ జీవితాల్లో అనూహ్య మార్పులొస్తాయంటన్నారు ఎస్సీ, ఎస్టీలు.
సామాన్యుడి విన్నపమేంటి?
* వెనకబడిన తరగతుల అభ్యున్నతి కోసం- జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో కేటాయింపులుండాలని నిర్ణయించారు. వీటినే షెడ్యూల్డ్‌ కులాల సబ్‌ ప్లాన్‌-ఎస్సీఎస్పీ(16%), ట్రైబల్‌ ఏరియా సబ్‌ప్లాన్‌-టీఎస్‌పీ(8%) అంటారు. అయితే ఏనాడూ బడ్జెట్‌ కేటాయింపులు దీనికి దగ్గరగా కూడా లేవు. కేంద్ర బడ్జెట్‌లోని ప్రణాళిక కేటాయింపులన్నింట్లో ఎస్సీలకు 16.2%, ఎస్టీలకు 8.2% కచ్చితంగా ఉండాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. కేటాయించిన నిధులు కచ్చితంగా వ్యయమయ్యేలా చూడాలన్నది ప్రధానమైన ఆకాంక్ష.

* రైతు కూలీలుగా, సాగుభూమి లేని పేదలుగా జీవిస్తున్న తమకు భూసంస్కరణల ద్వారా వనరుల పంపిణీలో సామాజిక న్యాయం జరగాలని కోరుతున్నారు. ముఖ్యంగా దళితులకు చెందిన భూములను సాగుకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు బోర్లు, కరెంటు వంటివన్నీ సమకూర్చేందుకు జాతీయ స్థాయిలో ఒక 'సమీకృత భూమి అభివృద్ధి పథకం' ఉండాలి.

* చేతులతో మలాన్ని ఎత్తి పనిచేస్తున్న సఫాయీ వృత్తిని నిషేధిస్తూ వారికి వృత్తి శిక్షణ, రుణాల కల్పన ద్వారా పునరావాసం చూపటం, పొడి మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్ధృతంగా చేపట్టటం, సఫాయీ వృత్తిలో ఉన్నవారి పిల్లల చదువులకు ఉపకారవేతనాలు పెంచటం వంటి పథకాలను చిత్తశుద్ధితో అమలు చెయ్యాలని కోరుతున్నారు. సఫాయీ, దేవదాశీల వంటివారి పునరావాసం కోసం రూ.2 లక్షలతో పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి.

* విద్యా, ఉపాధి అవకాశాల్లో జనరల్‌ కేటగిరీతో సమానంగా పోటీ పడేందుకు ఎస్సీ, ఎస్టీలకు శిక్షణావకాశాలు పెంచాలి.

* దళితులకు రుణాల మంజూరు విషయంలో- హామీలు, పూచీల్లాంటి చిక్కుల్లేకుండా సాఫీగా జరిగేలా చూడాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఉపాధి కల్పనలో ఎస్సీ, ఎస్టీలకు తోడ్పడేందుకు నాబార్డు తరహాలో ఒక బ్యాంకును నెలకొల్పాలన్న డిమాండూ ఉంది.

* ఎస్టీలు తీవ్రమైన పేదరికంలో కూరుకుని ఉన్న నేపథ్యంలో పేదరిక నిర్మూలన కోసం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను కల్పించాలి.

బడ్జెట్‌ ఏమిచ్చింది?
షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనుకబడిన తరగతులు, వికలాంగుల సంక్షేమానికి కృషి చేసే సామాజిక న్యాయం, సాధికారికత శాఖకు రూ.4,500 కోట్లు కేటాయించారు. 2009-10లో ఇచ్చిన రూ.2,585 కోట్లు కన్నా 80శాతం ఎక్కువ.

* వినికిడి సమస్యతో బాధపడేవారికి లబ్ధి చేకూర్చేందుకు భారత సంకేత భాషా పరిశోధన, శిక్షణా కేంద్రాలు నెలకొల్పేందుకు ఈ కేటాయింపులు తోడ్పడతాయి.

రాష్ట్రానికేం ఒరిగింది?
సామాజిక న్యాయశాఖకు కేటాయింపులు భారీగా పెరిగాయి. రాష్ట్రానికీ ఆ మేరకు మేలు జరగనుంది. ఎస్సీ ఉపకార వేతనాల్లో వాటా రూ.250 కోట్ల నుంచి పెరగనుంది. ఎస్టీల ఉపకార వేతనాల్లో వాటా రూ.40 కోట్లలో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు. ఎస్సీలకు కేంద్ర ప్రత్యేక సహాయం కింద కేటాయించిన రూ.600 కోట్లలో ఎప్పట్లాగే రాష్ట్ర వాటా రూ.45 కోట్లు రానుంది. ఆదిమ జాతుల అభివృద్ధికి శ్రీశైలం, నెల్లూరు ఐటీడీఏలకు మరిన్ని నిధులు రానున్నాయి.

ఇంధన మంట

ఇంధన మంట
పెట్రో ధరల్ని పెంచాలంటూ పారిఖ్‌ కమిటీ సిఫార్సుచేసిన నేపథ్యంలో ఈ బడ్జెట్‌పై సామాన్యుల్లో చాలా ఉత్కంఠ నెలకొంది.
ప్రజలు ఆశిస్తున్నదేమిటి?
* దేశంలోని 20 శాతం మంది అవసరాలకే మొత్తం ఇంధనంలో 80 శాతం ఖర్చవుతున్నప్పుడు.. అందరినీ ఒకే గాటన కట్టి ధరలు ఎందుకు పెంచాలన్నది పలువురి ప్రశ్న. ధరల పెంపులో వినియోగ వర్గాల వారీగా హేతుబద్ధత ఉండాలి.

* నలుగురు కూర్చొనే వీలున్న కారులో ఒకరే ప్రయాణించడం వల్ల చాలా ఇంధనం వృథా అవుతోంది. చౌకరకం కార్లు మార్కెట్లోకి ప్రవేశపెట్టిన తర్వాత మధ్యతరగతి వారూ వాటిని సొంతం చేసుకోగలుగుతున్నారు. నగరాల్లో రోడ్డుభద్రత దృష్ట్యా, ప్రజా రవాణా వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా లేనందువల్ల కార్లవైపు మొగ్గుచూపే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిస్తే తమకూ ఇంధనవ్యయ భారం తప్పుతుందనేది మధ్యతరగతి భావన. అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను సరిచేస్తే పెట్రోలు భారం తగ్గుతుంది.

* వంటగ్యాస్‌ను దొంగచాటుగా వాణిజ్య అవసరాలకు వినియోగించడం వల్ల వృథా ఎక్కువవుతోంది. దాన్ని సమర్థంగా అరికట్టడం వల్ల సామాన్యులపై పెద్దగా భారం మోపాల్సిన అవసరం ఉండదు. సంపన్న వర్గాల్లో వంటగ్యాస్‌ వినియోగం ఎక్కువ. పేదలు, మధ్య తరగతితో సమానంగా వారికీ రాయితీ వర్తింపచేయడం సహేతుకం కాదు.

* నిరుపేద కుటుంబాల్లో దీపపు వెలుగులకు ఇప్పటికీ కిరోసిన్‌పైనే ఆధారపడక తప్పదు. కిరోసిన్‌పై ధరలు పెంచడం కంటే కూడా సౌరవిద్యుత్‌ వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తీసుకురావడం అభిలషణీయం.

* సామూహిక బయోగ్యాస్‌ ప్లాంట్లను విరివిగా అభివృద్ధిచేయడం వల్ల కూడా సామాన్యుల ఇంధన అవసరాలు తీరడంతో పాటు చౌకలో లభ్యమవుతుంది.

* పెట్రోల్‌ ధరల నియంత్రణ ఎత్తివేత అంశంపై కిరీట్‌ పారిఖ్‌ నివేదికను ఆ శాఖ మంత్రి మురళీ దేవ్‌రా సరైన సమయంలో పరిశీలిస్తారని ప్రణబ్‌ వెల్లడించారు.
* డీజిల్‌, పెట్రోల్‌పై 7.5%, ఇతర శుద్ధి చేసిన ఉత్పత్తులపై 10% చొప్పున కస్టమ్స్‌ సుంకం విధించారు. ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూపాయి చొప్పున పెంచారు.
* ఫలితంగా పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.2.71, డీజిల్‌ రూ.2.55 చొప్పున పెరిగింది.
* ముడిచమురుపై 5% ఎక్సైజ్‌ సుంకాన్ని విధించారు.

రాష్ట్రానికేం ఒరిగింది?
*పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినందున రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.565 కోట్ల మేర అమ్మకం పన్ను రాబడి సమకూరనుంది. రాష్ట్రంలో పెట్రోల్‌పై 33%, డీజిల్‌పై 22.25% అమ్మకం పన్ను విధిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం అమ్మకం పన్ను ఆదాయంలో పెట్రోల్‌, డీజిల్‌ ద్వారా రూ.6,500 కోట్ల మేర రావాల్సి వుండగా అదనంగా రూ.565 కోట్లు రానున్నాయి.

వైద్యానికి సుస్తీ

వైద్యానికి సుస్తీ
ప్రభుత్వాసుపత్రులకు వెళితే అన్నీ కొరతే. చిన్నాచితకా జబ్బులకే దిక్కులేదు. కీలకమైన వైద్య, ఆరోగ్య రంగాన్ని ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. పరిస్థితి ఒక్కరోజులో మార్చలేకపోవచ్చుగానీ ప్రజలు కోరుకుంటున్న 'కనీస' మార్పులేమిటి?
సామాన్యుడి విన్నపమేంటి?
* దేశంలో ప్రైవేటు వైద్యరంగం ప్రియమవుతుంటే ప్రభుత్వ వైద్యం మసకబారిపోతోంది. జీడీపీలో ఆరోగ్యం మీద మన వాస్తవ ఖర్చు 1% దాటటం లేదు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచేందుకు దీన్ని పెంచక తప్పదు.
* మన దేశ జనాభాలో లక్షకు 59 మంది వైద్యులుండగా అభివృద్ధి చెందిన దేశాల్లో వీరి సంఖ్య 200పైనే ఉంది. వైద్యుల సంఖ్య పెంపు ఎంతైనా అవసరం.
* దేశానికి ఏటా 50 వేల మంది వైద్య పట్టభద్రులు అవసరం కాగా, 23 వేల మంది మాత్రమే తయారవుతున్నారు. ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రమాణాలు కనీస స్థాయిలో ఉంటున్నాయి.
* ప్రభుత్వాసుపత్రుల్లో వేతనాలు అధమ స్థాయిలో ఉండటంతో వైద్యులెవరూ ముందుకురావటం లేదు. వేతనాలు పెంచటం, ఖాళీలను భర్తీ చెయ్యటం తక్షణావసరం.
* గ్రామీణ భారతంలో 6,800 ఆస్పత్రులు అవసరమని తాజా ఆర్థిక సర్వే తేల్చింది. 2001 జనాభా అవసరాలకే 4,477 ప్రాథమిక, 2,337 సామాజిక ఆరోగ్య కేంద్రాల అవసరం ఉంది. ప్రస్తుత జనాభా ప్రకారమైతే వీటి అవసరం ఇంకా ఎక్కువే.
* ఇప్పటికీ ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, ఇన్‌పేషెంట్‌, ఆపరేషన్‌ థియేటర్‌, ప్రసవ గదులు, రోగ నిర్ధరణపరీక్షలు, ఎక్స్‌రే, ఎమర్జన్సీ కేర్‌ వంటి సౌకర్యాలు లేవు. నిర్వహణ లోపం, సిబ్బంది గైర్హాజరు ప్రధాన సమస్యలు.
* ఇలాంటి సమస్యలన్నింటినీ తీర్చడానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభించారు. కానీ.. ఇది పలు ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.
* అంటువ్యాధుల్ని అరికట్టటం, టీకాల వంటి ప్రజారోగ్య కార్యక్రమాలకు నిధుల కేటాయింపుల్లో కోత విధిస్తున్నారు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
* కేవలం ఆస్పత్రి ఖర్చుల కారణంగానే ఏటా 2 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రిస్తూ, ప్రభుత్వ వైద్యరంగాన్ని పటిష్ఠం చేయాలి.
* 'జననీ సురక్ష యోజన'లో భాగంగా ప్రసవమైన వారికి ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు ప్రతి నర్సు వద్ద రూ.5 వేలు అందుబాటులో ఉంచాలి. అయితే ఇవి ఎక్కడా అమలుకావటం లేదు.
* మన దేశంలో ఎక్కువమంది నిత్యం తీసుకునే మధుమేహం, హైబీపీ, యాంటీబయాటిక్స్‌, నొప్పినివారిణి వంటి మందుల ధరలను పరిశ్రమ గణనీయంగా పెంచుతున్నా నియంత్రణ చర్యల్లేవు. ప్రభుత్వపరంగా సుంకాలు తగ్గిస్తూ, ధరల నియంత్రణ చేపడితే మేలు.

బడ్జెట్‌లో ఏమిచ్చారు
* పొగాకు నియంత్రణ కార్యక్రమం కోసం నిధుల్ని రూ.24 కోట్ల నుంచి రూ.39 కోట్లకు పెంచారు.
* పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీని పెంచారు.
* అన్ని జిల్లాల ఆరోగ్య స్థితిగతుల్ని రూపొందించేందుకు ఈ ఏడాది సర్వే నిర్వహిస్తారు.
* కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కేటాయింపుల్ని రూ.19,534 కోట్ల నుంచి రూ.22,300 కోట్లకు పెంచారు.
* జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌కు రూ.13,910 కోట్లు ఇచ్చారు.
* వైద్య పరికరాలు, ఉపకరణాల డ్యూటీ విధానాన్ని సరళీకరించారు. ప్రత్యేక అదనపు డ్యూటీని ఎత్తివేస్తూ, ఏకీకృత కనీస డ్యూటీని 5 శాతంగా నిర్ణయించారు.
* రిహాబిలిటేషన్‌ ఎయిడ్స్‌, అసిస్టివ్‌ డివైజెస్‌కు మినహాయింపులు కొనసాగింపు.
* ఆర్థోపెడిక్‌ శస్త్రచికిత్సలపై వాడే కొన్ని ప్రత్యేక ఇంప్లాంట్లకు దిగుమతి సుంకం నుంచి మినహాయింపు.
* ఎయిమ్స్‌ బడ్జెట్‌కు అదనంగా రూ.2 కోట్లు ఇచ్చారు.

రాష్ట్రానికి దక్కిందేమిటి..?
* జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద రాష్ట్రానికి గత ఏడాది రూ.860 కోట్లు ఇస్తామని చెప్పి రూ.604.41 కోట్లే విడుదల చేశారు. ఈసారి రాష్ట్రం రూ.1140 కోట్లు అడిగింది. రూ.1075 కోట్లు ఇచ్చినట్లు సమాచారం.

ఉపాధి స్వాహా పథకం

ఉపాధి స్వాహా పథకం
జాతీయ ఉపాధి హామీ పథకం తన కీర్తి కిరీటంలో కలికితురాయి అని యూపీఏ ప్రభుత్వం అనుకుంటోంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా నిజంగా ఉపాధి కరవైన స్థితిలో ఉన్న శ్రామికులకే పని కల్పిస్తున్నామా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. మరోవైపు ఈ శ్రమ ద్వారా సమాజానికి ప్రయోజనం సిద్ధించేలా చెప్పుకోదగ్గ వనురులేమైనా సృష్టించారా? అంటే అదీలేదు. అవినీతి వూడలు దిగుతోందని పలుచోట్ల సామాజిక తనిఖీలో బయటపడింది.
* ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఉంది. చేసే పని సమాజానికి ఉపయోగపడాలనే నిబంధన లేదు. కోట్ల రూపాయలు మట్టి పనుల్లో కలిసిపోతున్నాయి. గత ఏడాది వరకు 14.48 శాతం మందికి మాత్రమే పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించారు.
* గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ నిధుల వినియోగంలో రాజస్థాన్‌ (89%), ఆంధ్రప్రదేశ్‌(83%), ఉత్తరప్రదేశ్‌(78%), జార్ఖండ్‌, మహారాష్ట్ర(57%), తమిళనాడు(56%) రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి.ఇవి కూడా కేటాయించిన నిధుల్ని పూర్తిగా ఉపయోగించుకోలేదు.
* అవసరమైన చోట ఉపాధి కల్పించలేకపోతున్నారు. వలసల్ని నిరోధించలేకపోతున్నారు. మరికొన్ని చోట్ల కూలీలను బతిమాలి పనులు చేయిస్తున్నారు.

ఇదీ ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితి...
గ్రామీణ కుటుంబాలు: 1.26 కోట్లు, జాబ్‌ కార్డులు: 1.17 కోట్లు.
2008-09లో ఖర్చు: రూ.2,963.90 కోట్లు
2009-10లో ఖర్చు (ఫిబ్రవరి 23నాటికి): 3,313.18 కోట్లు
* కేంద్ర వేలకోట్లు ఇస్తున్నా రాష్ట్రం సరిగా వినియోగించుకోవడం లేదు. ఇంతవరకూ రాష్ట్రంలో రూ.8182కోట్లు ఖర్చు చేశారు. పని కల్పించడమే దయాదాక్షిణ్యం అన్న పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి నిధులు విడుదలవుతున్నా
పక్షం రోజులకు ఒకదఫాఎక్కడా డబ్బులు పంపిణీ చేయడం లేదు. స్మార్ట్‌ కార్డులు సగం కూడా జారీ కాలేదు. చేసిన పనుల్లో 90 శాతం క్షేత్రస్థాయిలో వెతికితే కనిపించవు.
* గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.2,963 కోట్లు వ్యయం చేశారు. 10 శాతం స్వాహా అయినట్లు సామాజిక తనిఖీలో వెల్లడి అయ్యింది. మూడేళ్లలో రూ.4651 కోట్ల పనులు చేయగా రూ.1000 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని మరో అంచనా.

బడ్జెట్‌ ఏమిచ్చింది...!
ఈ పథకానికి 40,100 కోట్ల రూపాయలు కేటాయించారు. కిందటేడాది కన్నా రూ. వెయ్యి కోట్లు అదనం. దేశంలోని 4.5కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కల్పించాలన్నది లక్ష్యం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న శ్రామిక కుటుంబాలకు అమలు చేస్తున్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకాన్ని ఉపాధిహామీ కార్మికులకూ విస్తరిస్తున్నారు. ఉపాధి హామీ కింద 15 రోజులు దాటి పని చేసిన కార్మికులకు ఇది వర్తిస్తుంది.

కోతలకు కోతలెయ్యాలి

కోతలకు కోతలెయ్యాలి
గ్రామీణ రైతు కోరుకునేది తన భూమికి నీరు పారించడానికి నిరంతరాయ విద్యుత్‌ సరఫరా. ఓ విద్యార్థి కోరుకునేది.. పరీక్షల సమయంలో కోతల్లేని కరెంట్‌. తన ఉపాధికి ఢోకా లేకుండా నిరంతర సరఫరా ఉండాలని కార్మికుడూ, ఉత్పత్తి ఆగిపోకూడదని పారిశ్రామిక వేత్తా కోరుకుంటాడు. మరి వారి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా బడ్జెట్‌లో ఎంతవరకు కేటాయింపులు ఉంటున్నాయి?
సామాన్యుడి విన్నపమేంటి?
* సరఫరాలో నష్టాలు దాదాపు 27 శాతం వరకున్నాయి. విద్యుత్‌ చౌర్యం, నాసిరకపు ఉపకరాణాల వినియోగం వంటి వాటివల్ల వృథా ఎక్కువగా ఉంటోంది. వీటిని అరికడితే చాలా వరకు కొరతను అధిగమించొచ్చు.
* ప్రస్తుత అవసరాల్లో దాదాపు 8 శాతం కొరత ఉంది. అధిక వినియోగ వేళల్లో కొరత 15 శాతం వరకుంది. ఈ పరిస్థితిని నివారించాలి.
* గ్రామాల్లో పరిస్థితి మరీ దయనీయం. భారత్‌ నిర్మాణ్‌ కింద 2009 నాటికి 1,25,000 గ్రామాలకు, 2.3 కోట్ల నిరుపేదలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని లక్ష్యం పెట్టుకోగా 67,607 గ్రామాలకు, 83.88 లక్షల నిరుపేదలకు మాత్రమే విద్యుత్‌ సౌకర్యం కల్పించారు.
* విద్యుత్‌ సౌకర్యం ఉన్న పల్లెల్లోనూ కాలాతీతంగా రోజూ కోతలు తప్పడం లేదు. వేసవిలో రోజుకు 12 నుంచి 14 గంటల వరకు కోత ఉంటోంది. నగరాల్లో వేసవిలో 4 గంటల వరకు కోత విధిస్తున్నారు. కోతలకు కోతలెయ్యాలి.
* ప్రతి కుటుంబానికీ విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతోపాటు నిరంతరాయ సరఫరా సమాజ అవసరం.
* పదకొండో పంచవర్ష ప్రణాళిక చివరకు 78 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని చేర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా 2009 నాటికి కేవలం 12 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని మాత్రమే చేర్చగలిగారు. సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.
* సౌర విద్యుత్‌ విధానం అమల్లోనూ పలు సవాళ్లున్నాయి. సౌర విద్యుదుత్పత్తి, నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రభుత్వ రాయితీలేనిదే సాధారణ వినియోగదారుడికి అది పెనుభారం. కానీ క్రమంగా రాయితీలు ఎత్తివేసి రుణాల ద్వారానే సాయం అందించాలన్నది సోలార్‌ మిషన్‌ లక్ష్యం. విద్యుత్‌ ఉత్పత్తి ఎలా జరిగినా జనంపై భారం మోపకూడదు.
* విద్యుదుత్పత్తి భవిష్యత్‌ లక్ష్యాల్ని సాధించడానికి మానవ వనరుల కొరత ప్రధాన సమస్య కానుంది. 12వ ప్రణాళిక లక్ష్యమైన లక్ష మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని సాధించడానికి 7.4 లక్షల మంది అదనంగా అవసరం. అణు విద్యుత్‌ లక్ష్యసాధనకు 2020 నాటికి కనీసం 20 వేల మంది అణు విద్యుత్‌ ఇంజినీర్లు అవసరం కాగా ఏటా దేశంలో తయారవుతున్న నిపుణులు 700 లోపే. వచ్చే ఐదేళ్లలో అమెరికా, బ్రిటన్‌లో 20 శాతం మంది పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ రంగంలో మానవ వనరుల లభ్యత పెద్ద సవాల్‌. 2020కి విధించుకున్న సౌరవిద్యుత్‌ లక్ష్యసాధనకు లక్ష మంది నిపుణులు అవసరం.

బడ్జెట్‌ ఏమిచ్చింది..?
* విద్యుత్‌ రంగానికి రూ.5,130 కోట్లు. రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ కేటాయింపులకు ఇది అదనం. గత ఏడాది విద్యుత్‌ రంగానికి కేటాయింపులు రూ.2,230 కోట్లే.
* పునరుత్పాదక ఇంధన శాఖ ప్రణాళిక వ్యయానికి రూ.1,000 కోట్లు. గత బడ్జెట్‌లో ఇది రూ.620 కోట్లే. పెంపు 61శాతం.
* సౌరవిద్యుత్‌ ఉత్పత్తికి అవసరమయ్యే పరికరాలకు కస్టమ్స్‌ సుంకంలో 5 శాతం మినహాయింపు. వీటికి సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం నుంచి కూడా మినహాయింపు.
* పవన విద్యుత్‌కు అవసరమయ్యే బ్లేడ్ల తయారీకి కేంద్ర ఎక్సైజ్‌ సుంకం నుంచి మినహాయింపు.
* జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌ ప్రాంతంలో చిన్నతరహా
జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, సౌరవిద్యుత్‌, సూక్ష్మవిద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.500 కోట్లు.
* కొత్త ఇంధన వనరుల పరిశోధన నిమిత్తం క్లీన్‌ఎనర్జీ నిధి ఏర్పాటుకు ప్రతిపాదన. ఈ నిధి కోసం బొగ్గుపై టన్నుకు రూ.50 సెస్సు విధింపునకు ప్రతిపాదన. దిగుమతి చేసుకునే బొగ్గుకు కూడా వర్తింపు.
* విద్యుదుత్పత్తి వ్యయం తగ్గించేందుకు మెగాపవర్‌ ప్లాంట్‌ విధానంలో మార్పులు.
* క్యాప్టివ్‌ విద్యుత్‌ ప్లాంట్లకు వేలం ద్వారా బొగ్గు ఖండాల (కోల్‌ బ్లాక్స్‌) సరఫరా.
* బొగ్గుధరలు తదితర అంశాలను పరిశీలించడానికి బొగ్గు అభివృద్ధి నియంత్రణ సంస్థ ఏర్పాటు.

అంతర్గత అ'భద్రత'!

అంతర్గత అ'భద్రత'!
ముంబయి దాడుల తర్వాత దేశ అంతర్గత భద్రత ప్రశ్నార్థకమైంది. ఓ వైపు ఉగ్రవాదం, మరోవైపు నక్సలిజం అంతర్గత భద్రతకు పెను సవాలు విసురుతున్నాయి. కాలం చెల్లిన ఆయుధాలు, ప్రణాళికా లోపాలు, నిధుల కొరత, రాజకీయ సంకల్ప లేమి ప్రజాభద్రతకు శాపంగా మారాయి. అంతర్గత భద్రత బలోపేతానికి ప్రస్తుత బడ్జెట్‌లో గణనీయంగా నిధులు అవసరం.
సామాన్యుడి గోడు ఏమిటి?
* ముంబయి తరహా దాడులు మున్ముందు జరగకుండా దేశం రక్షణ వ్యవస్థలన్నీ బలోపేతం కావాలి.
* సరికొత్త పోకడలు పోతున్న తీవ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ఏదో ఒక వ్యూహం సరిపోదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, భద్రత, నిఘా సంస్థల మధ్య సమన్వయం, ముందస్తు దాడులు, కమెండోలకు శిక్షణ లాంటివి చాలా ముఖ్యం.
* ముంబయి దాడులకు పాల్పడిన తీవ్రవాదులు తీరం గుండానే వచ్చారు. కాబట్టి తీరప్రాంత గస్తీని బలోపేతం చేయాలి.
* అంతర్గత భద్రతకు ఇజ్రాయెల్‌ పక్కా వ్యూహాల్ని అమలుచేస్తుంది. సరిహద్దు బయటి ప్రమాదాల్ని 'మొస్సాద్‌', అంతర్గత భద్రతను 'షిన్‌బెట్‌' గూఢచార సంస్థలు చూసుకుంటాయి. పని విభజన స్పష్టం. మన దగ్గర అలా లేదు. ఈ తరహా లోపాల్ని సరిదిద్దాలి.
* నెదర్లాండ్స్‌ లాంటి చిన్న దేశాలు సైతం ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు విమానాశ్రయాల్లో ఫుల్‌బాడీ స్కానర్లను ప్రవేశపెట్టాయి. ఇలాంటివి మన దేశంలోనూ ప్రవేశపెట్టాలన్న వాదన ఉంది.
* నక్సలైట్ల ఏరివేతకు ఉద్దేశించిన ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ లాంటి వాటి వల్ల గిరిజనులకు నష్టం కలగకూడదు. అటవీ ప్రాంతాల్లోని ఖనిజాల్ని పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకే ఈ ఆపరేషన్‌ అన్న విమర్శల్లాంటివి రాకుండా చూసుకోవాలి.
* 20 రాష్ట్రాల్లో.. 223 జిల్లాల్లో.. 2 వేల పోలీసుస్టేషన్ల పరిధిలో మావోయిస్టు కార్యకలాపాలు సాగుతున్నాయి. దీనికి కారణం స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా... మారుమూల పల్లెలు నేటికీ అభివృద్ధికి నోచుకోకపోవడమే. కేంద్రం ఇపుడు గిరిజనాభివృద్ధి మంత్రం విన్పిస్తోంది. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది.
* దేశంలో అవసరమైన సంఖ్యలో పోలీసుల్లేరు. ప్రతి లక్షమందికి 123 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి సూచించిన ప్రకారం అయితే సాధారణ పరిస్థితుల్లో లక్ష మందికి 246 మంది ఉండాలి.
* దేశీయంగా తలెత్తుతున్న వేర్పాటువాద సమస్యలకు సాధ్యమైనంత త్వరగా రాజకీయ పరిష్కారం కనుగొనాలి.

బడ్జెట్‌ ఏమిచ్చింది..?
* నక్సలైట్లనూ, తీవ్రవాదులను ఎదుర్కొనే పారామిలిటరీకి, ముఖ్యమైన ఇంటిలిజెన్స్‌కూ నిధులను తగ్గించారు. (బ్రాకెట్లలో 2009-10 బడ్జెట్‌ కేటాయింపులు)
* పారామిలిటరీకి 16 శాతం తగ్గింపుతో రూ. 5,745 కేటాయించారు. (రూ. 6,838.84)
* ఇంటిలిజెన్స్‌ బ్యూరో: రూ.779.37 కోట్లు (రూ.918.03 కోట్లు)
* జాతీయ భద్రతా దళాల(ఎన్‌ఎస్‌జీ)కు 10 శాతం ఎక్కువ ఇచ్చారు: రూ. 352.58 (రూ.320.63)
* హోంమంత్రిత్వ శాఖకు ఈ సారి 10 శాతం ఎక్కువ నిధులను కేటాయించారు.
* హోంశాఖ: రూ. 37,136.07 (రూ. 33,809 కోట్లు)
* సరిహద్దు రక్షణ: రూ. 1489.28 కోట్లు
* పోలీసు ఆధునికీకరణ: రూ.1975 కోట్లు
* నేరాలనూ, నేరస్థులనూ పసిగట్టే వ్యవస్థ: రూ.175 కోట్లు (రూ. 104 కోట్లు)
* నేషనల్‌ ఇంటిలిజెన్స్‌ గ్రిడ్‌ (నాట్‌గ్రిడ్‌): రూ. 1.5 కోట్లు
* జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్‌ఐఏ): రూ.16.33 కోట్లు (రూ.15కోట్లు)
* ఢిల్లీ పోలీసులు: రూ.2,805 కోట్లు
* కేంద్ర పోలీసు గృహనిర్మాణం: రూ.444 కోట్లు
* పోలీసు విభాగం మొత్తం: రూ.30,000 కోట్లు
* 2009-10 సంవత్సరంలో అంతర్గతభద్రత బాగానే ఉందని ప్రణబ్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్గత భద్రతకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని చెప్పారు.
* వామపక్ష తీవ్రవాదం ఉన్న 33 జిల్లాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనుల కోసం కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
* వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రణాళికా సంఘం... ఒక 'సమీకృత కార్యాచరణ ప్రణాళిక'ను రూపొందిస్తోంది.
* కాశ్మీర్‌లో హింస తగ్గింది. ఈ రాష్ట్రం నుంచి అయిదు పారా మిలిటరీ దళాల్లోకి 2 వేల మంది యువతను తీసుకుంటారు.

రాష్ట్రానికి దక్కిందేమిటి..?
నక్సల్స్‌: మావోయిస్టుల నిరోధానికి కేంద్రం నుంచి మరింత సాయం రానుంది. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు రూ.120 కోట్లు ఇస్తున్నారు. ఇది మరింత పెరగనుంది.