Tuesday, January 5, 2016

స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలుపుదల ఎందుకు?

(ఈనాడు సౌజన్యంతో)
నూతన సంవత్సరం తొలి ట్రేడింగ్‌ రోజైన సోమవారం చైనా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో షేర్లు 7% నష్టపోవడంతో, ట్రేడింగ్‌ను నిలిపి వేశారు. విపణిలో అధిక హెచ్చుతగ్గులను నివారించేందుకు ప్రవేశపెట్టిన సర్క్యూట్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ఈ రోజు నుంచే పని ప్రారంభించినట్లు అయ్యింది. అయితే దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మాత్రం షేర్ల ధరల్లో 20 శాతం కదలిక ఉంటేనే ట్రేడింగ్‌ నిలుపుతారు.
చైనాలో ఇలా: చైనాలో అమల్లోకి వచ్చిన సర్క్యూట్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ప్రకారం సీఎస్‌ఐ300 సూచీ 5 శాతం నష్టపోతే, షాంఘై, షెన్‌జెన్‌ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్‌ను 15 నిముషాల పాటు నిలుపుతారు. ఒకవేళ పతనం కొనసాగి చూసీ 7% నష్టపోతే, మిగిలిన రోజంతా ట్రేడింగ్‌ను రద్దు చేస్తారు.
మన దేశంలో..: దేశీయ ఈక్విటీ విపణుల్లో మాత్రం సర్క్యూట్‌ బ్రేకింగ్‌ అమలుకు సూచీ కదలికల పరిధిని మరింత పెంచారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలలో ఏ సూచీలో అసాధారణ కదలిక ఏర్పడినా, ఈక్విటీలతో పాటు డెరివేటివ్‌ల ట్రేడింగ్‌ మొత్తాన్ని నిలిపేస్తారు.
* మధ్యాహ్నం ఒంటి గంటలోపు సూచీ 10 శాతం పెరిగినా/నష్టపోయినా ట్రేడింగ్‌ మొత్తాన్ని 45 నిముషాలు నిలిపేస్తారు. అదే మధ్యాహ్నం 1-2.30 గంటల మధ్య సూచీ కదలికల్లో 10 శాతం తేడా వస్తే, ట్రేడింగ్‌ను 15 నిముషాలే ఆపుతారు. ఒకవేళ మధ్యాహ్నం 2.30 గంటల తరవాత ఈ పరిణామం సంభివిస్తే, ట్రేడింగ్‌ను నిలుపరు.
* మధ్యాహ్నం ఒంటి గంట లోపే సూచీ 15 శాతం క్షీణించినా, లాభాలతో దూసుకెళ్లినా 105 నిముషాల సేపు ట్రేడింగ్‌ ఆపేస్తారు. ఇది మధ్యాహ్నం 1-2 గంటల మధ్య సంభవిస్తే ట్రేడింగ్‌ను 45 నిముషాలు నిలుపుతారు. అదే మధ్యాహ్నం 2 గంటల తరవాత సూచీలో 15 శాతం కదలిక వస్తే, మిగిలిన సమయం మొత్తం ట్రేడింగ్‌ ఆగిపోతుంది.
* ఒకవేళ సూచీ 20 శాతం కుంగినా, లాభపడినా మిగిలిన రోజంతా ట్రేడింగ్‌ను నిలిపి వేస్తారు.