Friday, January 31, 2014

మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగువ్యక్తి నాదెళ్ల సత్య?


వాషింగ్టన్ నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి: అతిపెద్ద సాఫ్ట్‌వేర్ నిర్మాణసంస్థ, ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ ఛైర్మన్‌గా ఉన్న మైక్రోసాఫ్ట్ సంస్థకు తదుపరి సీఈవోగా తెలుగువాడైన నాదెళ్ల సత్యను ప్రకటించే అవకాశం ఉన్నట్లు అమెరికాలోని పలు వార్తాసంస్థలు కథనాలు ప్రచురించాయి. మైక్రోసాఫ్ట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆయన నియామకంపై తుది నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. అధికారిక నియామకానికి సంబంధించిన తుది ప్రకటన అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం వెలువరించే అవకాశం ఉంది. సత్య నాదెళ్ల నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రస్తుత సీఈవో స్టీవ్‌బామర్ రాజీనామా చేయనున్నారు. అయినప్పటికీ ఆయనకు మైక్రోసాఫ్ట్‌లో 4శాతం వాటా ఉంటుంది. నాదెళ్ల సత్య 2013 ఏడాదికి సుమారు రూ.48కోట్ల రూపాయల వేతనం అందుకున్నారు. ఇందులో జీతభత్యాల కింద 670డాలర్లు, బోనస్‌గా 1.5 మిలియన్ డాలర్లు, మరో 5.4 మిలియన్ డాలర్లు స్టాకుల రూపంలో ఆయనకు లభించాయి. దీంతో పాటు సుమారు రూ.90కోట్ల(15.4మిలియన్ డాలర్లు) విలువ కలిగిన 450వేల మైక్రోసాఫ్ట్ షేర్లను నాదెళ్ల సత్య కలిగి ఉన్నారు. 1992 నుంచి మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న సత్య, ప్రస్తుతం సంస్థ కోడ్, ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవోగా సత్య నియామకం కానున్నారని తెలుసుకున్న పలువురు ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసిన సమయానికి మైక్రోసాఫ్ట్ షేరు ధర 1శాతం పెరిగి 37.20 డాలర్ల వద్ద స్థిరపడింది. నాదెళ్ల సత్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం.