Wednesday, February 5, 2014

తెలుగు తేజానికి మైక్రోసాఫ్ట్ పగ్గాలు

Courtesy : Eenadu

ఈ సంధి కాలంలో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టడానికి సత్య నాదెళ్ల కంటే సరైన వ్యక్తి ఎవరూ లేరు. ఇంజినీరింగ్ నైపుణ్యం, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను కలిసికట్టుగా ఉంచడం వంటి విషయాల్లో సత్య ఒక నాయకుడుగా నిరూపించుకున్నారు.

తదుపరి తరం ఉత్పత్తుల్లో వినూత్నత, వృద్ధిలోకి కంపెనీ అడుగుపెడుతున్న ఈ సమయంలో మైక్రోసాఫ్ట్‌కు ఏం కావాలో; సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నాదెళ్లకు బాగా తెలుసు.
- బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు

సత్య నాదెళ్ల ఓ అద్భుతమైన నాయకుడు. వినూత్న సాంకేతిక నైపుణ్యం ఆయన సొంతం. వ్యాపార పోకడలను త్వరితంగా అర్థం చేసుకోగల శక్తిసంపన్నుడు. ఎక్కడ అవకాశాలు ఉన్నాయో కనిపెట్టగలడు. వాటిని మైక్రోసాఫ్ట్ ఎలా అందిపుచ్చుకోవాలో నిర్ణయించగలడు. సత్య నాదెళ్లతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేశా. సత్య నాదెళ్ల గొప్ప సీఈఓ అవుతారన్న నమ్మకం నాకుంది.
- స్టీవ్ బామర్, వైదొలగుతున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ 

న్యూయార్క్: వూహించినదే జరిగింది. ప్రపంచ అగ్రగామి సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓగా మన తెలుగు తేజం సత్య నాదెళ్ల నియమితులయ్యారు. 38 ఏళ్ల మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడుఈయనే కావడం గమనార్హం. స్టీవ్ బామర్ స్థానంలో 46 ఏళ్ల నాదెళ్ల నియామకంతో కొన్ని నెలలుగా షికారు చేస్తున్న వూహాగానాలకు తెరపడింది. ఒక అమెరికా కంపెనీలో.. అందునా మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలో.. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత సీఈఓ పదవి చేపట్టిన వ్యక్తిగా సత్య నాదెళ్ల నిలిచారు. ఇది ఒక భారతీయుడికి లభించిన అరుదైన గౌరవం.
నాదెళ్లతో పాటు.. గూగుల్‌కు చెందిన సుందర్ పిచాయ్ కూడా మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టడానికి పోటీ పడ్డారు. క్రికెట్ అంటే బాగా ఇష్టపడే నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అంతక్రితం క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ గ్రూపునకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఛైర్మన్‌గా జాన్ థాంప్సన్ : ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న జాన్ థాంప్సన్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ స్థానంలో ఛైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక బిల్‌గేట్స్ సాంకేతిక సలహాదారుగా కొత్త అవతారం ఎత్తనున్నారు. బోర్డు సభ్యుడిగా కొనసాగుతారు.

మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు ఉద్యోగులకు సత్య నాదెళ్ల రాసిన లేఖ సారాంశం....... 

'ఈ రోజు నాకు చిరస్మరణీయం. 22 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌లో అడుగుపెట్టిన రోజు గుర్తుకొస్తోంది. పనిచేసే కంపెనీని ఎంచుకునే అవకాశం మీలాగే నాకూ లభించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా నమ్మి మైక్రోసాఫ్ట్‌లో అడుగుపెట్టా. ఆనాటి నుంచి కొత్త ఆలోచనలు, ఉత్పత్తులతో ప్రజల సామర్థ్యాలను పెంచుతున్న మైక్రోసాఫ్ట్‌ను చూస్తూనే ఉన్నా. అద్భుతాలు సృష్టించాలనుకుంటే.. పని చేయడానికి మైక్రోసాఫ్ట్‌కు మించిన కంపెనీ లేదని నాకు తెలుసు. ఇదే స్ఫూర్తి నన్ను ఈ రోజు వరకూ నడిపిస్తోంది. నాకు నమ్మలేని గౌరవం దక్కింది. ఇంత గొప్ప కంపెనీకి నాయకత్వం వహించి సేవ చేసే భాగ్యం కలిగింది. చిన్న ఆలోచన నుంచి ప్రపంచంలోనే అత్యంత గొప్ప, ఆరాధ్య కంపెనీ స్థాయికి మైక్రోసాఫ్ట్ ఎదగడానికి కారణమైన స్టీవ్, బిల్‌గేట్స్‌తో సన్నిహితంగా పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టం. ఇప్పుడు సీఈఓ బాధ్యతలు చేపట్టాను. కంపెనీకి అదనంగా సమయం కేటాయించమని, టెక్నాలజీ, ఉత్పత్తులపై దృష్టిపెట్టమని బిల్‌ను కోరాను. కంపెనీ కొత్త ఛైర్మన్ జాన్ థాంప్సన్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. మనం ఎన్నో విజయాలను సాధించాం. మరిన్ని విజయాల కోసం తహతహలాడుతున్నాం. పరిశ్రమకు, మైక్రోసాఫ్ట్‌కు ఇది కీలకమైన సమయం. మొబైల్, క్లౌడ్ రంగాల్లో మైక్రోసాఫ్ట్ దూసుకుపోయేలా చేయడం మనందరి ముందున్న కర్తవ్యం. ఈ తరుణంలో నా గురించి మీతో ఓ రెండు ముక్కలు చెప్పుకోవాలి. నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన విషయాలను మీతో పంచుకోవాలి.

నా వయసు 46 ఏళ్లు. 22 ఏళ్ల క్రితం పెళ్త్లెంది. ముగ్గురు పిల్లలు. అందరి లాగే నా కుటుంబం, అనుభవాలే నన్ను తీర్చిదిద్దాయి. నా మిత్రులు, శ్రేయోభిలాషులు నన్ను పుస్తకాల పురుగంటారు. అయితే.. చదివిన పుస్తకాల కంటే కొన్నవే ఎక్కువ. ఆన్‌లైన్‌లో కొత్త కోర్సులకు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నా.. పూర్తి చేసింది తక్కువే. కొత్త విషయాలను తెలుసుకోలేకపోతే ఉపయోగపడే గొప్ప పనులు చేయలేమని నా నమ్మకం. మొత్తం మీద కుటుంబం.. జ్ఞానాన్ని సముపార్జించాలన్న తృష్ణ, ఉత్సుకతలే నన్ను మలిచాయి.

నేను ఇక్కడికి ఎందుకొచ్చానంటే..?

ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే మైక్రోసాఫ్ట్‌లో ఎక్కువమంది ఎందుకు చేరుతున్నారో ఆ కారణం తెలుసుకోవాలి. ఆ కారణమే నేను ఈ కంపెనీలో చేరడానికి దారి తీసింది. అబ్బురపడే పనులు చేయగలగడానికి వీలుగా ప్రజలకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, తద్వారా ఈ ప్రపంచంలో మార్పు తేవాలనే ఆశయంతోనే పలువురు మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారు. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు.. అయినప్పటికీ నిజం మాత్రం ఇదే. మనం దీన్ని చేసి చూపించాం. ఈవేళకీ చేస్తున్నాం.
రానున్న పది సంవత్సరాల్లో కంప్యూటింగ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుందని నా నమ్మకం. కొత్త రకాల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ప్రాణం పోసుకొని మనం చేస్తున్న అనేక పనులలోకి, వ్యాపారాల లోకి, జీవన శైలుల్లోకి, ఏకమొత్తంగా మనదైన ప్రపంచంలోకీ చొచ్చుకు వచ్చి డిజిటైజ్ చేసేస్తాయి. ఈ ప్రపంచం సాఫ్ట్‌వేర్ ఆలంబనగా నిలుస్తున్న ప్రపంచం.

మన కుటుంబాలతోనూ, స్నేహితులతోనూ ఉన్న అనుబంధాన్ని మరింత మెరుగ్గా మనం పెంచుకోవడానికీ, ఈ ప్రపంచాన్ని ఇదివరకెన్నడూ ఎరుగని పద్ధతుల్లో చూడడానికి, అనుభూతించడానికి, సన్నిహితంగా పంచుకోవడానికి ఉపయోగపడనుంది. ఒక బలమైన ప్రభావాన్ని కలగజేయడంలో సాటిలేని శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నందువల్లనే నేను ఇక్కడికి వచ్చాననుకుంటున్నా.

ఇక్కడ ఎందుకున్నాం?

ఇంతకు ముందు వరకు మన ధ్యేయమల్లా ప్రతి ఇంట్లోకీ ఒక పీసీని చేర్చాలనేది. దీన్ని మనం చాలావరకు సాధించగలిగాం. ఇవాళ మరింత విస్తృత శ్రేణి పరికరాలపై దృష్టి కేంద్రీకరించాం. నోకియాతో మన ఒప్పందం ఇంకా పూర్తి కాలేదు కానీ.. ఆ కంపెనీ ఉపకరణాలను, సేవలను మన కుటుంబంలోకి ఆహ్వానిద్దాం. మొబైల్ ఫోన్లపరంగా వారు మనకు తెచ్చి ఇచ్చే శక్తియుక్తులను అందుకుందాం. ఈ ప్రపంచానికి మైక్రోసాఫ్ట్ తనవంతుగా అందించగల విశిష్ట సేవలేమిటన్నది మనం గుర్తించి తీరాలి. ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఇది.

ఇక నుంచి ఏం చేద్దాం?

ఆస్కార్ వైల్డ్ అన్నట్లు 'మనకు అసాధ్యం అన్నది ఉండదన్న విషయాన్ని విశ్వసించాలి. అదే సమయంలో అనుమానాన్ని దరిదాపుల్లోకి కూడా రానీయకూడదు.'
అపుడే మనం చేయాల్సిన పనిపై ఒక స్పష్టత మొదలవుతుంది. అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా మనల్ని నడిపిస్తుంది. వినూత్నతకు ప్రాధాన్యమివ్వాలి. మన వినియోగదార్లకు కావాల్సింది అదే. మనం అందించే ప్రతీ సేవ, వస్తువుల్లో మరింత వినూత్నతను కనబరచాలి.

ఇక, మనం మన అత్యుత్తమ పనితనాన్ని ప్రదర్శించాలి. మనలో ప్రతి ఒక్కరూ తమ పనికి అర్థాన్ని వెతుక్కోగలరని నేను గట్టిగా నమ్ముతున్నా. ప్రజల జీవితాన్ని మార్చేదేదో చేసినపుడే అది అత్యుత్తమ పని.చాలా వరకు కంపెనీలు ప్రపంచాన్ని మార్చివేయాలని భావిస్తుంటాయి. కానీ చాలా కొన్నిటి వద్దే అందుకు కావలసిన ముడిసరకులుంటాయి. అందులో ముఖ్యమైనవి: ప్రతిభ, వనరులు, నిరంతర శ్రమ. మైక్రోసాఫ్ట్‌కు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొత్త సీఈఓగా నేను మరింత గట్టి పునాదులుండాలని కోరుకోను. రండి.. ఈ పునాదిపైనే ఒక నవ లోకాన్ని నిర్మిద్దాం.

ముళ్ల బాటే!

మొబైల్ కంప్యూటింగ్ రంగంలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న మైక్రోసాఫ్ట్‌కు యాపిల్, గూగుల్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కంపెనీ 'మొబైల్' ఆశలను నెరవేర్చడంలో సత్య నాదెళ్ల ఎటువంటి వ్యూహాలను అమలు చేయనున్నారన్నదిఆసక్తి కరం.. సవాళ్లు పరిశీలిస్తే..
చి అంతర్జాలం (ఇంటర్నెట్) ఆధారిత, క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో సత్యకు మంచి అనుభవమే ఉంది. కంపెనీకి నాయకత్వం వహించడానికి ఆయన తగిన వ్యక్తే. అయితే.. వినియోగదారులను మెప్పించడంలో.. వాటాదారులను సంతృప్తిపరచడంలో ఏ మేరకు విజయం సాధించగలరన్నది ప్రశ్న.

- క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఆయనకు అనుభవం ఉన్నా.. మొబైల్ సొల్యూషన్లపై పెద్ద అవగాహన లేదు. దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.

- వర్క్‌ప్లేస్ కంప్యూటింగ్‌లో కంపెనీకి ఇప్పటికీ తిరుగు లేకపోయినప్పటికీ.. అటు అమెరికాలోను, ఇటు విదేశాల్లోను క్రమక్రమంగా కంపెనీ వినియోగదారుల ఆదరణ కోల్పోతోంది.

- ఆండ్రాయిడ్ ఫోన్లు, యాపిల్ ఐపాడ్‌లను సవాలు చేయడానికి నోకియాను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. ఇది వాల్‌స్ట్రీట్‌ను అంతగా మెప్పించలేదు. హార్డ్‌వేర్ వ్యాపారం నుంచి తప్పుకోవాలని కీలకమైన వాటాదారుల నుంచి ఒత్తిడి వస్తోంది.

- యూనిట్ అధిపతిగా సత్య నాదెళ్లకు అనుభవం ఉన్నా.. ఒక భారీ కంపెనీ ఎదుర్కొనే సవాళ్లను నేరుగా చవి చూడలేదు. ఇంత పెద్ద కంపెనీ లాభ, నష్టాల ఖాతాలపైనా ఆయనకు అనుభవం లేదు.

- పెద్ద పెద్ద కంపెనీల్లో వాటాదారుల విలువ పెరగడం నిధుల కేటాయింపుపైనే ఆధారపడి ఉంటుంది. కొత్త ఉత్పత్తుల వల్ల కాదు. వాటాదారుల విలువ పెంచడమే నాదెళ్లకు అసలైన సవాల్.

మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యాలయం: రెడ్‌మండ్, వాషింగ్టన్ 
ఏర్పాటు: 1975, ఏప్రిల్ 4, ఆల్బుకర్క్, న్యూమెక్సికో రాష్ట్రం 
వ్యాపార కార్యకలాపాలు: ఆసియా, ఐరోపా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలు దక్షిణ ఫసిఫిక్ 
ఉద్యోగుల సంఖ్య: సుమారు 1,00,932 (2013, డిసెంబరు నాటికి) 
ఆదాయం: 77.85 బిలియన్ డాలర్లు (2013లో)

బుక్కాపురం బిడ్డ.. 'ఐఏఎస్' యుగంధర్ కుమారుడు..

ఈనాడు, అనంతపురం; న్యూస్‌టుడే, తాడిపత్రి: సత్య నాదెళ్ల అలియాస్ నాదెళ్ల సత్యనారాయణ చౌదరి స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. లోగడ ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగాను, ప్రణాళికా సంఘం సభ్యుడిగాను, ఇతర హోదాల్లోను పనిచేసి, ప్రజాసంక్షేమం, పరిపాలనలో తనదైన ముద్ర వేసి జాతీయస్థాయిలో పేరుగాంచిన మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ కుమారుడే సత్య. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ అల్లుడు కూడా. యుగంధర్ చిన్నతనం నుంచే కష్టపడి చదివారు. ఐఏఎస్‌కు ఎంపికై, హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కుమారుడు సత్యను బాగా చదివించారు. పలు సందర్భాల్లో తండ్రి యుగంధర్‌తో కలిసి సత్య బుక్కాపురం సందర్శించారు. తమ ఇల్లు, పంట పొలాలు చూశారు. బంధువులను కలిసి ఆత్మీయంగా పలకరించారు. యుగంధర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలో గ్రామాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. వూరిలోని చెన్నకేశవస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, గ్రామంలో సీసీ రోడ్లు, ఎస్సీలకు పక్కా ఇళ్ల నిర్మాణం- ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ప్రధాన భూమిక పోషించారు. 'ఈనాడు-ఈటీవీ' బృందం మంగళవారం బుక్కాపురాన్ని సందర్శించి, సత్య బంధువులు, కుటుంబీకులతో ముచ్చటించింది. ఆయన అత్యున్నత స్థాయికి ఎదగడం పట్ల వారు హర్షం వ్యక్తంచేశారు. ఆ తండ్రీ కొడుకులు గ్రామానికి పేరు ప్రతిష్ఠలు తెచ్చారని ప్రశంసించారు.
పంట పొలాలు చూసి సంతోషించాడు: సర్పంచ్

''సత్య తండ్రి, మా తండ్రి చిన్నాన్న పెదనాన్న పిల్లలు. సత్య మైక్రోసాఫ్ట్ సీఈవో కావడం చెప్పలేని ఆనందాన్నిస్తోంది. సత్య బీటెక్‌లో చేరే ముందు తండ్రితో కలిసి గ్రామానికి వచ్చాడు. పంట పొలాలు చూసి సంతోషపడ్డాడు. గ్రామస్థులందరిని ఆప్యాయంగా పలకరించాడు. ఇప్పటికీ వారికి ఇక్కడ పదెకరాల పొలం ఉంది'' అని బుక్కాపురం సర్పంచ్ భీమశంకర్ తెలిపారు.