Tuesday, July 8, 2014

2014-15 రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు

(ఈనాడు సౌజన్యంతో)
ఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ ఇవాళ పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సదానందగౌడ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మలాంటిదని పేర్కొన్నారు. కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి ఎన్నో విజ్ఞాపనలు అందాయన్నారు. సరుకు రవాణాలో చైనా, రష్యా లాంటి దేశాల తర్వాత మనమే ముందున్నామన్నారు. రైల్వే ప్రతిరోజు 2.30కోట్ల మందిని గమ్య స్థానాలకు చేరుస్తోందని మంత్రి వివరించారు.
రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* రైల్వే సామాజిక బాధ్యతను మరువలేదు, ప్రయాణికుల భద్రతే మా ప్రధానాంశం
* రైల్వేకు వచ్చిన ఆదాయంలో రూపాయికి 90పైసలు ఖర్చుపెడుతున్నాం.
* 359 ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది, పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.1.80లక్షల కోట్లు కావాలి.
* హైస్పీడ్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతాం.
* సరకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామికావడమే లక్ష్యం.
* గత 10ఏళ్లలో రూ.41వేల కోట్లతో 3700 కి.మీ. కొత్త లైన్ల నిర్మాణం జరిగింది.
* ప్రజలపై భారం వేయకుండా ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టిపెడతాం.
* ఏడాదిలోగా రైల్వేని గాడిలో పెడతాం
* రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం.
* ఇప్పటి వరకు 676 రైల్వే ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తయ్యాయి.
* వచ్చే పదేళ్లలో రైల్వే ఆధునికీకరణకు రూ.5లక్షల కోట్ల నిధులు అవసరం.
* 30 ఏళ్లు నుంచి సగంలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి.
* ప్రయాణికులకు మరింత నాణ్యమైన భోజనం అందిస్తాం
* రైల్వే నిర్వహణలో ఎఫ్‌డీఐలను ఆశిస్తున్నాం.
* కేవలం ఛార్జీల పెంపు వల్లే రైల్వే అభివృద్ధి సాధ్యం కాదు
* ఈ ఏడాది రూ.602కోట్లు మిగులు ఆదాయం మా లక్ష్యం
* రైల్వే సదుపాయం లేని కొత్త ప్రాంతాలకు సేవలపై దృష్టి
* గత పదేళ్లలో 3,500 లైన్లకు రూ.41వేల కోట్లు వ్యయం అయింది.
*రైల్వే నిర్వహణలో నిధుల దుర్వినియోగాన్ని నియంత్రించాలి.
* వచ్చే పదేళ్ల వరకు ఏటా రైల్వే అభివృద్ధికి రూ.50వేల కోట్లు అవసరం
* ప్రైవేటు భాగస్వామ్యంతో అన్ని స్టేషన్లలో వంతెనలు, ఎస్కలేటర్లు ఏర్పాటుకు ప్రతిపాదన
* రైల్వే స్టేషనల్లో సీసీ కెమెరాల ద్వారా భద్రత పర్యవేక్షణ.
* ధరల పెంపుపై నిర్ణీత కాలంలో సమీక్ష జరగాలి.
* 2014-15లో రూ.1.64లక్షల కోట్లు రైల్వే టర్నోవర్‌గా అంచనా.
* ఇటీవల పెంచిన ధరల వల్ల రూ.8వేల కోట్ల ఆదాయం.
* డబ్లింగ్, ట్రిప్లింగ్‌లకు మొదటి ప్రాధాన్యం, కొత్తలైన్ల నిర్మాణానికి రెండో ప్రాధాన్యం
* ప్రైవేటు భాగస్వామ్యంతో రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన
* విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయంపై కేబినెట్ అనుమతి కావాలి.
* ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు ప్రతిపాదన
* ప్రధాన రైల్వే స్టేషన్లలో, నిర్దేశించిన రైళ్లలోనూ వైఫై వ్యవస్థ
* పోస్టాఫీసులు, మొబైళ్లలో టికెట్ల కొనుగోలు విధానం విజయవంతమైంది.
* ఈశాన్య భారతంలో విజ్ఞాన యాత్రలకు ప్రణాళికలు.
* రైల్వే సేవలపై ప్రయాణికుల అభిప్రాయం సేకరణ వ్యవస్థ ఏర్పాటు.
* రైల్వే లైన్ల విస్తరణకు ప్రథమ, కొత్త రైళ్లకు ద్వితీయ ప్రాధాన్యం
* వృద్ధులు, వికలాంగులను స్టేషన్‌లోకి తీసుకొచ్చేందకు బ్యాటరీ వాహనాలు.
* 50 రైల్వేస్టేషన్లలో పారిశుద్ధ్య పనులు ఔట్‌సోర్సింగ్‌కు అప్పగింత
* కాపలా లేని 5,400 క్రాసింగ్‌ల వద్ద ప్రత్యేక చర్యలు
* సాంకేతిక, సాంకేతికేతర విద్యతో కూడిన రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు
* ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం.
* చెన్నై-హైదరాబాద్ మధ్య సెమీ బులెట్ రైలు
* మెట్రోనగరాల్లోని 10 ప్రధాన స్టేషన్లలో అంతర్జాతీయ ప్రమాణాల కల్పన
* రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో సమూల మార్పులు
* ఎంపిక చేసిన లైన్లలో 160 నుంచి 200 కి.మీల వేగంతో నడిచే రైళ్లు
* అన్ని రైల్వేస్టేషన్లలో విశ్రాంతి గదులకు ప్రతిపాదన
* హైస్పీడ్ రైళ్లకు రూ.100కోట్లు కేటాయింపు
* మహిళా భద్రత కోసం 4వేలమంది మహిళా కానిస్టేబుళ్లు
* ఈ-టికెటింగ్ ద్వారా నిమిషానికి 7,200 టికెట్లు బుక్ చేసుకునేలా ఏర్పాట్లు
* రైల్వేల్లో పారిశుద్ధ్యానికి గతేడాది 40శాతం అధిక నిధులు
* రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ప్రయాణ సమయం గుర్తు చేసేలా అలర్ట్ మెసేజ్‌లు
* అన్ని మెట్రో నగరాలను కలుపుతూ వజ్ర చతుర్భుజి రైల్వే లైన్
* ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-చంఢీగడ్, ఢిల్లీ-కాన్పూర్‌లకు హైస్పీడ్ రైళ్లు
* కొత్తగా 5 జనసాధారణ్, 5 ప్రీమియం, 27 ఎక్ర్‌ప్రెస్ రైళ్లు
* కొత్తగా 6 ఏసీ, 8 ప్యాసింజర్, 2 మెమూ, 5 డెమూ రైళ్లు