Tuesday, December 30, 2014

వ్యాపార రంగానికి సరికొత్త జోష్.. (2014 రౌండప్)

  (సాక్షి సౌజన్యంతో)
Sakshi | Updated: December 30, 2014 05:31 (IST)
వ్యాపార రంగానికి సరికొత్త జోష్..
హైదరాబాద్ : ఎన్నో ఆశలు రేపుతున్న వ్యాపార రంగం కొత్త సంవత్సరంలోకి సరికొత్త జోష్ తో అడుగుపెడుతోంది. దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త సర్కారు సంస్కరణల బాట పట్టడం.. స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా ఉండటంతో భారత ఆర్థిక వ్యవస్థపై మళ్లీ విశ్వాసం చిగురించింది. మరోపక్క, అంతర్జాతీయంగా చమురు ధరలు నేలకు దిగి రావడం కూడా మనకు చేదోడుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మరింత పైకి ఎగిసిన చమురు ధరలు.. చివరికొచ్చేసరికి దిగిరావడం సామాన్య ప్రజలకు ఊరటనిచ్చాయి.

తగ్గిన చమురు ధరలు
ఈ ఏడాది జూన్ నుంచీ చమురు ధరలు గణనీయంగా పడిపోవడం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక సానుకూల అంశంగా మారింది. జూన్‌లో 110 డాలర్ల స్థాయిలో ఉన్న బ్రెంట్ క్రూడ్ ధరలు డిసెంబర్ నాటికి 60 డాలర్ల స్థాయికి పడిపోయాయి. పెట్రోల్ డీజిల్, ధరలు డిసెంబర్ లో రెండు సార్లు తగ్గడంతో వినియోగదారులకు వరంగా మారాయి. పెట్రోల్ ధర గత ఆగస్టునుంచి వరుసగా ఎనిమిదో సారి తగ్గగా,  డీజిల్ ధర గత అక్టోబర్‌నుంచి వరుసగా నాలుగోసారి తగ్గడం గమనార్హం. అయితే తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న చమురు ధరలు ఎప్పుడు స్థిరత్వం పొందుతాయనే అంశంపై మాత్రం పూర్తి అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామం దేశీ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తోంది.

ఈ-కామర్స్ జోరు- రిటైల్ బేజారు
ఇండియాలో ఈ కామర్స్ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధిస్తోంది.  2014లో  ఈ-కామర్స్ విజృంభణ ముఖ్యాంశాల్లో ఒకటి.  చైనా దిగ్గజ సంస్థ అలీబాబా సహా పలు దేశాల ఈ కామర్స్ సంస్థల దిగ్గజాలు భారత్‌కు క్యూ కట్టారు. ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలు బిగ్ బిలియన్ డే లాంటి పేర్లతో అత్యంత చవగ్గా వస్తువులు ఇచ్చేయడం లాంటివి ఈ కామర్స్ మరింత పుంజుకోడానికి దోహదపడ్డాయి. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా రూ.1,50,000 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ విజయవంతం కావడం, ఆ సంస్థ చీఫ్ జాక్ మా ఆసియాలోనే అపర కుబేరిడినా అవతరించడం గమనార్హం. దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని ఈ కామర్స్ సంస్థలు హామీ ఇవ్వడంతో రిటైల్ సంస్థల్లో కొంత అనిశ్చితి నెలకొంది. ఈ విభాగం నేరుగా వ్యాపార రంగంలోకి ప్రవేశించడం వల్ల తమ అమ్మకాలు దెబ్బతింటాయని రిటైల్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. తమ అమ్మకాలు భారీ తగ్గుముఖం పట్టేఅవకాశం ఉందని రిటైల్ సంస్థలు బేజారెత్తుతున్నాయి.

దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు
ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు లాభాలతో దుమ్మురేపాయి. ఐదేళ్ల తరువాత మళ్లీ సెన్సెక్స్ ఏకంగా 6,038 పాయింట్లు(29%) ఎగసింది. ఒక దశలో చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో డిసెంబర్ 3న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి రూ. 100 లక్షల కోట్లను (ట్రిలియన్లు) అధిగమించింది.  ఈ ఏడాది 21,140 పాయింట్లతో ఆరంభమైన సెన్సెక్స్.. డిసెంబర్ 24 నాటికి 27,209 పాయింట్లతో కొనసాగుతోంది.  ఇంతక్రితం 2009లో మాత్రమే సెన్సెక్స్ 7,817 పాయింట్లు జమ చేసుకుంది. ఇక ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం దాదాపు 30% పుంజుకోవడం విశేషం.

ఆశాజనకంగా జీడీపీ
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు 5.3 శాతంతో కాస్త కిందికి దిగిజారినా.. గతం కంటే మెరుగ్గా ఉండటం ఆశాజనకంగా మారింది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.7 శాతం వృద్ధితో ఉత్సాహాన్ని ఇచ్చినా.. తరువాత కిందికి జారిపోవడం కాస్త నిరుత్సహాన్ని నింపింది.  గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐదు శాతం దిగువన జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసుకున్నా.. క్రమేపీ ఇది పెరగడం మాత్రం ఉత్సాహాన్ని ఇచ్చింది.   వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.4% వృద్ధిని సాధించగలదని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ తాజాగా అంచనా వేసింది. పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం ఇందుకు సహకరించగలదని ఒక నివేదికలో తెలిపింది.

ఎయిర్ ఏషియా ఇండియా సేవలు
ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్, జెట్‌లైట్‌ల  తరహాలో ఎయిర్ ఏషియా కూడా చౌక విమానయాన  సర్వీసులను అందించడానికి ఈ ఏడాది శ్రీకారం చుట్టింది.  టోనీ ఫెర్నాండెస్ నేతృత్వంలోని మలేసియా విమానయాన సంస్థ,  ఎయిర్ ఏషియా,  టాటా సన్స్, అరుణ్ భాటియాకు చెందిన టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్‌లు కలసి 49:30:21 భాగస్వామ్యంతో ఎయిర్ ఏషియా ఇండియా సంస్థను ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది స్పైస్ జెట్ కష్టాలు కూరుకుపోయింది. విదేశీ, దేశీ సరఫరాదారులు, విమానాశ్రయ నిర్వాహకులు, చమురు కంపెనీలకు బకాయిలు రూ. 1,230 కోట్లకు ఎగబాకడంతో అవి తక్షణం చెల్లింపు జరపాలంటూ పట్టుబట్టాయి. దీంతో ఒకరోజు  సర్వీసుల నిలిపివేత వరకూ పరి స్థితి వెళ్లింది. చివరకు ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇవ్వడంతో మళ్లీ సర్వీసులు కొనసాగుతున్నాయి.

పెను సవాళ్లతో ఆటోమొబైల్ రంగం
అమ్మకాలపరంగా ఆటోమొబైల్ కంపెనీల ప్రయాణం ఈ ఏడాది పెను సవాళ్లను ఎదుర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆటో ఎక్స్‌పోలో ఏకంగా 70 కొంగొత్త మోడల్స్ ఊరించిన మార్కెట్ మాత్రం ఎగుడుదిగుడుగా సాగింది.  మొబీలియో, సియాజ్, జెస్ట్ వంటి వాహనాలతో ఏడాది పొడవునా కొత్త కార్లు సందడి చేశాయి. అయితే, అమ్మకాలు మాత్రం ఒక నెల పెరగడం, మరో నెల తగ్గడం లాగా సాగింది. ఏడాది తొలి 11 నెలల్లో అమ్మకాలు 10 శాతం మేర క్షీణించాయి. కాంపిటీషన్ కమిషన్ 14 కార్ల సంస్థలపై రూ. 2,545 కోట్ల జరిమానా విధించడం మరో చెప్పుకోతగ్గ పరిణామం. అయితే, సవాళ్లెన్ని ఎదురైనప్పటికీ.. ఆటోమొబైల్ కంపెనీలు మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో వెనక్కి తగ్గలేదు. మహీంద్రా, మారుతీ, హీరో మోటోకార్ప్, బజాజ్ తదితర సంస్థలు 5 బిలియన్ డాలర్ల మేర భారీ పెట్టుబడులను ప్రకటించాయి. కొత్త సంవత్సరం సానుకూలంగా ఉండగలదని ఆటోమొబైల్ కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల మధ్య ' వ్యాపార' పోటీ
వ్యాపార రంగంలో తెలుగు రాష్ట్రాలు తమ ఉనికిని చాటి చెప్పేందుకు యత్నిస్తున్నాయి. ఆ రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ  రెట్టించిన ఉత్సాహంతో వ్యాపార కార్యకలాపాల్ని మరింత ముందుకెళ్లేందుకు బాటలు వేసుకుంటున్నాయి. కొత్త ప్రాజెక్టులు, విస్తరణలు,  పెట్టుబడులు ఇలా అన్నింటా రెండు రాష్ట్రాల మధ్య ఒక రకంగా పోటీకి తెరతీసింది. కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి రెండు రాష్ట్రాలు పోటీ పడుతుండటంతో కార్పొరేట్ రంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ దిశగా యత్నాలు ఆరంభించింది. హీరో మోటార్ సైకిల్స్ ప్రాజెక్ట్ గురించి ఇరు రాష్ట్రాలు పోటీ పడగా చివరకు ఆ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. అయితే ప్రపంచ అతిపెద్ద రిటైల్ ఫర్నిచర్ సంస్థ ఐకియూ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అలాగే ఇసుజు, ఏషియన్ పెయింట్స్ వంటి సంస్థలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే తెలంగాణలో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, కోజెంట్ గ్లాస్ యూనిట్, జాన్సన్ అండ్ జాన్సన్, కోకకోలా తదితర కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.

ఐటీ  'విస్తరణ '
తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయికి ఐటీని విస్తృతం చేస్తోంది. హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే తన కార్యాచరణను మరింత విస్తృతం చేసింది. తొలుత హైటెక్‌సిటీ ప్రాంతంలో ఎయిర్‌టెల్‌తో కలిసి పబ్లిక్ వైఫై అందుబాటులోకి తెచ్చింది. టెక్నాలజీ స్టార్టప్‌ల కోసం టి-హబ్ పేరుతో దేశంలో అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఏర్పాటవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ కూడా ఐటీకి విస్తృత ప్రాధాన్యం ఇస్తోంది. ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో డిజిటల్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగానే గూగుల్, విప్రో తదితర సంస్థలతో చేతులు కలిపింది.

ఏరోస్పేస్ కు ప్రత్యేక పాలసీ
తెలంగాణ ప్రభుత్వం ఏరోస్పేస్‌కు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. స్విట్జర్లాండ్ కంపెనీ రువాగ్ ఏవియేషన్ తయారీ డార్నియర్-228 విమానాల కోసం విమాన బాడీ, రెక్కల తయారీ కేంద్రాన్ని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఆదిభట్లలోని ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ సెజ్‌లో నెలకొల్పుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్ సహకారంతో జీఎంఆర్ గ్రూప్ ఏరోస్పేస్ ట్రైనింగ్ హబ్‌ను శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేస్తోంది.