Friday, December 26, 2014

2014 బిజినెస్ రౌండప్ (ఈనాడు సౌజన్యంతో)




(ఈనాడు సౌజన్యంతో)
ఒక పేజీ తిప్పితే.. మరో పేజీ వస్తుంది. ఓ ఏడాది గడిస్తే.. మరో ఏడాది వస్తుంది. అది సహజం. అయితే గతాన్ని నెమరేసుకుంటే వర్తమానానికి, భవిష్యత్‌కు దారి కనిపిస్తుంది. ఆశలు.. అంచనాలూ కనిపిస్తాయి. ఉదాహరణకు బంగారం సంగతే తీసుకుంటే కారణమేమైనా బాగా దిగివచ్చి.. కొనుగోలుదార్లను బాగా ఆకర్షించింది. ఇక వాహన ధరలేమో అలా తగ్గి.. ఇలా పెరిగాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కొనసాగితేనే వినియోగదార్లకు ప్రయోజనం బదిలీ చేస్తామంటున్నాయి వాహన కంపెనీలు. ఇక మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు ఇబ్బందులు ఎదురైనా పెట్టుబడుల్లో 10 శాతం వృద్ధిని సాధించింది. ఉక్కు కంపెనీలు ఈ ఏడాది మందగమనంలో ఉన్నా.. 'మేకిన్ ఇండియా'పై ఆశలతో దృఢంగా ఉన్నాయి. ఎఫ్ఎమ్‌సీజీ కంపెనీలూ తక్కువ గిరాకీ నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొన్నాయి. మొత్తం మీద ఈ ఆరు కీలక రంగాలు.. వచ్చే ఏడాదిపై ఆశలతో ఉన్నాయి. ఎందుకంటే సంస్కరణలు ఒక్కసారి ఫలాలను అందజేయడం మొదలుపెడితే.. ఆర్థిక వ్యవస్థతో పాటూ అన్ని రంగాలూ పట్టాలు ఎక్కుతాయిగా.
'బంగారం'లా దిగివచ్చింది
వరుసగా రెండో ఏడాదీ బంగారం ధరలు దిగి వచ్చాయి. ఈ ఏడాదైతే 10 శాతం పైగా తగ్గి కొనుగోలుదార్లను ఆకర్షించిందీ పచ్చలోహం. బంగారంలో పెట్టుబడులకు దూరంగా ఉండాలని ప్రభుత్వం హితవు పలికి.. దిగుమతిపై ఆంక్షలు విధించింది. అయితే ఇది స్మగ్లింగ్‌ను పెంచింది. మరో పక్క వెండి ఏకంగా 20% మేర చౌకగా మారింది. 2013 చివరకు 10గ్రా. స్వచ్ఛమైన బంగారం రూ.30,000గా ఉంటే.. అది ఇపుడు రూ.26,000 దరిదాపులకు వచ్చి చేరింది.
ధరలు ఎందుకు తగ్గాయంటే..
స్టాక్ మార్కెట్ భారీ స్థాయిలో దూసుకెళ్లింది. దీంతో అందరూ అటువైపే పెట్టుబడులతో నడిచారు. ఇది బులియన్ స్టాకిస్టుల వద్ద విక్రయాల ఒత్తిడికి కారణమైంది. ఇందుకు తోడు అంతర్జాతీయ లోహ మార్కెట్లో బలహీనతలు కనిపించడంతో దేశీయంగా సెంటిమెంటు కుంగి.. ధరలు తగ్గాయి.
రూ.27,000-30,945 మధ్య
ఈ ఏడాది బంగారం ధరలు తొలుత 29,800 స్థాయి వద్ద ప్రారంభమయ్యాయి.స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం(99.9 స్వచ్ఛత) ధర మార్చి 3న రూ.30,945 వద్ద గరిష్ఠానికి చేరినా..తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ నెల్లో రూ.27,000కూ చేరింది. 99.5 స్వచ్ఛత గల పసిడి ధర సైతం ఈ ఏడాది రూ.26,000-30,795 మధ్య కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్లో 2014 మధ్యలో ఔన్సు బంగారం 1300 డాలర్లుగా పలికినా.. చివరకొచ్చేసరికి 1140 డాలర్లకు పరిమితమైంది. ఇక వెండి సంగతికి వస్తే ఈ ఏడాది మొదట్లో కిలో ధర రూ.50,000ను తాకింది. తర్వాత రూ.36,000-37,000 స్థాయికీ వచ్చింది. గతేడాది చివర్లో వెండి కిలో ధర రూ.44,230గా ఉంది.
చాలా వరకు బ్రేకులే..
ఈ ఏడాది వాహన రంగానికి అడుగడుగునా వేగనిరోధకాలే కనిపించాయి. మొత్తం 11 నెలల్లో విక్రయాలు చూసుకున్నా 10 శాతం మేర క్షీణించడం అందుకు నిదర్శనం. వాహన ప్రదర్శన నిర్వహించినా.. కొత్త కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చినా.. అమ్మకాల విషయంలో వెనుకడుగే పడింది. వివిధ కారణాల వల్ల రీకాల్స్ కూడా ఎక్కువయ్యాయి. మారుతీ ఏకంగా 1.7 లక్షల కార్లను వెనక్కి పిలిపించింది. ఇతర కంపెనీలు మోస్తరుగానే రీకాల్స్ చేపట్టాయి.
ఇవీ కొత్త మోడళ్లు: హోండా కొత్త సిటీ, మొబిలియో, స్కార్పియో, సియాజ్, జెస్ట్. (అయితే ఈ ఏడాది హ్యుందాయ్ సాంత్రో; నిస్సాన్ ఎక్స్-ట్రయల్‌లకు మంగళం పాడారు.)
సీసీఐ నుంచి ఎదురుదెబ్బ: ఓ మోస్తరు విక్రయాలతో ఉన్న వాహన కంపెనీలపై సీసీఐ అపరాధ రుసుము కుంగదీసింది. 14 కంపెనీలపై రూ.2545 కోట్ల రుసుము విధించింది. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మారుతీ, మహీంద్రా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఫోక్స్ వ్యాగన్‌లు రూ.20,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మిగతా పెట్టుబడులూ కలుపుకుంటే మొత్తం మీద 5 బిలియన్ డాలర్ల(రూ.30000 కోట్లు) ఈ రంగంలోకి వచ్చాయి.
ఏడాది చివర్లో సానుకూలతలు: ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రభావం ఏడాది చివర్లో కనిపించింది. చివరి త్రైమాసికంలో విక్రయాలు ఫర్వాలేదనిపించాయి. సుంకం తగ్గింపును వినియోగదార్లకు బదలాయించి.. ధరలు తగ్గించడం ఇందుకు కారణం. అయితే ఇటీవల ముడి పదార్థాల వ్యయాలు పెరగడంతో తిరిగి ధరలు పెరిగాయి.
ఏం చేయాలంటే..: కొత్త ఏడాదిపైనే వాహన కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి. ఈ రంగం తిరిగి రాణించాలంటే ప్రభుత్వం నుంచి మద్దతు లభించాలి. భద్రత, పర్యావరణ అంశాల నుంచి ఎదురైన సవాళ్లకు పరిష్కారం చూపించి.. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచాలి. ముఖ్యంగా ఎక్సైజ్ సుంకం తగ్గింపును పొడిగించాలి.
అర లక్ష కోట్ల డాలర్లకు..
లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరే క్రమంలో రిటైల్ పరిశ్రమ ప్రస్తుతానికి అందులో సగం దూరాన్ని అధిగమించింది. ఈ ఏడాది 560 బిలియన్ డాలర్ల(రూ.36,60,000 కోట్లు) స్థాయికి చేరింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 10% వృద్ధి చెందింది. ఈ ఏడాది చిన్న పాటి రిటైల్ సంస్థలు కూడా ఆన్‌లైన్ విక్రయ సంస్థల(ఇ-కామర్స్ పోర్టళ్లు) నుంచి సవాళ్లను ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ ఈ రంగంలో వృద్ధి నమోదు కావడం విశేషం.
క్యారీఫోర్.. ఇంటికి: కొత్త ప్రభుత్వం మే 2014లో పగ్గాలు చేపట్టింది. దీంతో బహుళ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను అనుమతించే విషయం మూలనపడింది. ఈ నేపథ్యంలో వాల్‌మార్ట్ వేచిచూసే ధోరణిలో ఉండగా.. క్యారీఫోర్ మరో అడుగు ముందుకేసి తన అన్ని టోకు స్టోర్లను మూసివేసి భారత్ నుంచి నిష్క్రమించింది. ఇక బ్రిటన్‌కు చెందిన టెస్కో ఒకటే బహుళ బ్రాండ్ రిటైల్‌లో ఉన్న ఏకైక విదేశీ రిటైలర్. టాటా గ్రూపునకు చెందిన ట్రెంట్ హైపర్‌మార్కెట్‌తో ఇది సంయుక్త సంస్థను ఏర్పాటు చేసుకుంది.
2020 కల్లా: రిటైల్ పరిశ్రమ 2020 కల్లా ఒక లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎఫ్‌డీఐని అనుమతిస్తే అంతకంటే ముందే లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తున్న రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ రిటైల్‌లు ఈ ఏడాది తమ స్టోర్లను విస్తరించాయి. ఓ వైపు ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ కంపెనీలు అసలు ధర కంటే తక్కువకు ఉత్పత్తులు విక్రయిస్తున్నాయని ఫిర్యాదు చేస్తూనే.. ఫ్యూచర్ గ్రూపు, రిలయన్స్ రిటైల్‌లు ఆన్‌లైన్‌లోకీ విస్తరించడం మొదలుపెట్టాయి. రిలయన్స్ రిటైల్ ఈ ఏడాది తొలిసారిగా లాభాలను ఆర్జించింది.
మేకిన్ ఇండియాపైనే ఆశలు
ఈ ఏడాది భారత్ అతిపెద్ద నాలుగో ఉక్కు ఉత్పత్తిదారుగా తన పేరును నిలబెట్టుకుంది. అంతర్జాతీయ సగటు ఉత్పత్తి వృద్ధి కంటే ఎక్కువగానే సాధించింది. 76 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. అయితే పెరుగుతున్న దిగుమతులు, ఇతర ఆందోళనల మధ్య 2015లో ఉక్కు రంగానికి కష్టకాలం ఎదురుకావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు.
సానుకూలతలు
చి ఉత్పత్తి అంతర్జాతీయ సగటు కంటే ఎక్కువగానే నమోదైంది. అయితే గిరాకీ మాత్రం స్తబ్దుగా ఉంది. ఇక మేక్ ఇన్ ఇండియాపైనే ఆశలు పెట్టుకున్న ఉక్కు తయారీ కంపెనీలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి.
చి అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి చేరిన ముడి ఇనుము ధరల నుంచి ఈ రంగం ప్రయోజనం పొందనుంది. అంతే కాకుండా తగ్గుతున్న కోకింగ్ కోల్ ధరలూ వీటికి మద్దతు పలకనున్నాయి.
చి అంతర్జాతీయ సగటు కంటే భారత తలసరి ఉక్కు వినియోగం నాలుగో వంతుగానే ఉండడం ఆశలను రేకెత్తిస్తోంది. మరో పక్క కర్ణాటక, గోవాల్లో మూతపడ్డ ముడి ఇనుము గనులు త్వరలోనే మొదలవుతాయన్న ఆశలున్నాయి.
చి మొజాంబిక్‌లో కోకింగ్ కోల్ గనిని ఐవీఆర్‌సీఎల్ కొనుగోలు చేసింది.
చి ముడిపదార్థాల ధరలు సమీప భవిష్యత్‌లో పెరగవన్న అంచనాలున్నాయి.
ప్రతికూలతలు
చి అయితే ఉత్పత్తి వ్యయం అధికంగా ఉండడంతో పాటు వివిధ మార్కెట్లకు ఎగుమతి చేసే విషయాల్లో పరిమితులు ఉండడం(ముఖ్యంగా ప్రభుత్వ రంగ కంపెనీలకు) తదితరాలు ఈ రంగానికి ఇబ్బందులు పలకవచ్చు. మరో పక్క భారత్ సహా ఇతర దేశాలకు చైనా ఎగుమతులను పెంచుతోంది. ఇది కూడా ఉక్కు రంగాలను ఉక్కిరిబిక్కిరి చేసే అంశమే.
చి అధిక దిగుమతుల కారణంగా దేశీయ ఉక్కు తయారీ దార్లు 5-6 శాతం దాకా ధరలను తగ్గించాల్సి వచ్చింది.
ఒక్క ఏడాదిలో రూ.3 లక్షల కోట్లు
నియంత్రణ సంస్థల కఠిన విధానాలు, ఇతరత్రా ఇబ్బందులున్నా.. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రాణించింది. ఈ ఏడాది అదనంగా రూ.3 లక్షల కోట్లను జతచేసుకుని మొత్తం నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎమ్)ను దాదాపు రూ.11 లక్షల కోట్లకు చేర్చుకుంది. అక్టోబరులో ఇవి రూ.10.96 లక్షల కోట్ల వద్ద గరిష్ఠానికి చేరాయి. ఏడాది చివర్లోనూ దాదాపు అంతే స్థాయిలోనే ఉండడం విశేషం. 2013 చివరకు ఫండ్‌ల ఆస్తులు రూ.8.26 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇవి 2012 చివర్లో రూ.8.08 లక్షల కోట్లు; 2011 చివర్లో రూ.6.11 లక్షల కోట్లు; 2010 తుదకు రూ.6.26 లక్షల కోట్లుగా ఉన్నాయి.
భవిష్యత్‌పై ధీమా: 2015లోనూ ఫండ్ పరిశ్రమ పనితీరు మెరుగ్గానే ఉంటుందని ఫండ్ సంస్థలు భావిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో ర్యాలీకి తోడు ఆర్థిక వ్యవస్థ రాణింపు వల్ల ఫండ్‌లలోకి మరిన్ని పెట్టుబడులు తరలివస్తాయన్నది అంచనా. అదీ కాక వచ్చే ఏడాది కొత్త సంస్థ ఏదీ ఈ రంగంలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
ఇవి నిష్క్రమించాయ్: దైవా, ఐఎన్‌జీ, మోర్గాన్‌స్టాన్లీ, ప్రమెరికా, ఫిడిలిటీ, పిన్‌బ్రిడ్జ్ వంటి సంస్థలు భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి వైదొలిగాయి.