Friday, February 25, 2011

సామాన్య ప్రయాణికుల సౌకర్యమే పరమావధిగా మమత రైల్వే బడ్జెట్

సామాన్య ప్రయాణికుల సౌకర్యమే పరమావధిగా మమత రైల్వే బడ్జెట్
కొత్త ప్రాజెక్టులలో పశ్చిమబెంగాల్‌కే పెద్ద పీట
ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 24 : సామాన్య రైల్వే ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడమే పరమావధిగా ప్రకటిస్తూ రైల్వే మంత్రి మమతా బెనర్జీ శుక్రవారంనాడు పార్లమెంటుకు 2011-12 బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. అందరూ ఊహించినట్టే పశ్చిమబెంగాల్‌కు పెద్ద పీట వేస్తూ మమత ప్రతిపాదనలు కొనసాగడంతో పార్లమెంటులో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ గందరగోళంలో మమత ప్రసంగానికి కొంతసేపు ఆటంకం కలిగింది. ముఖ్యంగా కలకత్తా మెట్రో రైలు మార్గాన్ని మరిన్ని స్టేషన్లకు అనుసంధిస్తున్నట్టు మమత ప్రకటించడంతోనే సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. కలకత్తా మెట్రోకు 34 అదనపు సర్వీసులు ప్రవేశపెడుతున్నట్టు ఆమె ప్రకటించారు, అంతకుముందే మమత నందిగ్రామ్‌కు ఇండస్ట్రియన్ పార్క్‌ను ప్రకటించారు. సింగూరుకు మెట్రో కోచ్ ఫ్యాక్టరీని, ఆ తర్వాత డార్జిలింగ్‌కు రైల్వే సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టును ప్రకటించారు. ఇక అన్నీ పశ్చిమబెంగాల్‌కే కట్టపెట్టండి అంటూ ప్రతిపక్షాలు సభలోనే గట్టి గట్టిగా అరుస్తూ మమత ప్రసంగాన్ని కొనసాగనివ్వలేదు. తాను ఇంకా బడ్జెట్ ప్రతిపాదనలు చేస్తుండగానే ప్రతిపక్షాలు ఇలా ఆక్షేపించడం దారుణమని మమత గట్టిగా ప్రతిపక్షాల దాడిని ఎదుర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికైన దృష్ట్యా బెంగాల్ ప్రగతికి ఖచ్చితంగా తన కృషి కొనసాగిస్తానని మమత చెప్పడం ప్రతిపక్షాలకు మరింత ఆగ్రహం కలిగించింది. తన పనిలో రాజకీయాలకు తావు లేదని, ఎవరి యోగ్యతా పత్రాలూ తనకు అక్కరలేదని కూడా మమత గట్టిగా చెప్పారు. ప్రతిపక్షాలు గట్టిగా అరుస్తుండడంతో మమత కూడా గట్టిగా డోంట్ షౌట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు మీరు బడ్జెట్ సమర్పణ కొనసాగించండని స్పీకర్ మీరా కుమార్ ప్రోత్సహించడంతో మమత తిరిగి తమ ప్రసంగం కొనసాగించారు.

ఎ.సి., నాన్ ఎ.సి. టిక్కెట్ బుకింగ్ ఛార్జీలను 50 శాతం తగ్గిస్తున్నట్టు, అలాగే ఇంటర్‌నెట్ బుకింగ్ ఛార్జీలను కూడా తగ్గిస్తున్నట్టు మమత ప్రకటించడంతో సభలో అందరూ సంతోషంతో కరతాళ ధ్వనులు చేశారు. అలాగే రైల్వే స్టేషన్‌లలో రైల్వే కూలీల శారీరక కష్టాన్ని తగ్గించడానికి వీలుగా ట్రాలీ సేవలను త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు రైల్వే మంత్రి ప్రకటించారు.

ఆరవ వేతన కమిషన్ వల్ల రైల్వేకు 2011-12 ఆర్థిక సంవత్సరంలో మరిన్ని కష్టాలు తప్పేటట్టు లేవని, అలాగే 2010-11 ఆర్థిక సంవత్సరంలో అనేక కారణాలవల్ల రాబడి తగ్గిపోయిందని ఆమె చెప్పారు. అయినా గాని 2011-12 వ సంవత్సరంలో పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు, వికలాంగులకు మరిన్ని రాయితీలు కల్పించాలని నిర్ణయించినట్టూ మమత వివరించారు.

సికింద్రాబాద్ సబ్ అర్బన్ రైల్వేకు అదనంగా 6-9 సర్వీసులు ప్రవేశపెట్టనున్నట్టు మమత ప్రకటించారు. హైదరాబాద్, చెన్నై, కలకత్తానగరాలకు ఇంటెగ్రేటెడ్ రైల్ నెట్‌వర్క్ సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్టు ఆమె వెల్లడించారు.