అనగనగా ఓ రూపాయి పడిపోతున్న మారకపు విలువ ప్రస్తుతం 11 నెలల కనిష్ఠ స్థాయి
రూ.56.76కి.. త్వరలోనే 57కు చేరే అవకాశం దిగుమతి రంగాలకు తీవ్ర ఇబ్బందులే
అంతర్జాతీయ పరిణామాలే కాదు.. ప్రభుత్వ అలసత్వమూ కారణమే ఈనాడు వాణిజ్య
విభాగం రూపాయి.. రూపాయి నువ్వేం చేస్తావ్ అని అడిగితే.. హరిశ్చంద్రుడి చేత
అబద్ధం ఆడిస్తా.. భార్య భర్తల మధ్య చిచ్చు పెడతా.. తండ్రీ బిడ్డలను
విడదీస్తా.. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతా.. ఆఖరికి ప్రాణ స్నేహితులను
కూడా విడదీస్తా.. అని అందట.. అక్కడితో విడిచిపెడుతుందనుకుంటే పొరపాటే.. దేశ
ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది.. స్టాక్ మార్కెట్లను
కుప్పకూలుస్తుంది.. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుంది.. వివిధ రంగాలను
నీరుకారుస్తుంది... ఇలా చెప్పుకుంటే చాలానే పనులు చేస్తుంది రూపాయి. ఇలా
అందరినీ ప్రభావితం చేసే రూపాయి.. ప్రస్తుతం డాలరుతో 11 నెలల కనిష్ఠ స్థాయి
రూ.56.76కు పడిపోయి అటు ఆర్థిక వ్యవస్థను.. ఇటు ప్రభుత్వాన్ని
కలవరపెడుతోంది. ప్రభుత్వం చొరవ లేకే..: కరెన్సీని రక్షించడానికి రిజర్వు
బ్యాంకు చేపట్టాల్సిన చర్యలన్నీ తీసుకున్నట్లే ఉంది. అయితే ప్రభుత్వం నుంచి
ఈ విషయంలో సరైన దిశానిర్దేశం అందలేదనే చెప్పాలి. కరెన్సీ కనిష్ఠ స్థాయిలకు
వెళ్లినపుడు అంతర్జాతీయ పెట్టుబడుదారులు దేశంలోకి రావడానికి వెనకడుగు
వేస్తారన్న విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం గుర్తించాలి. ప్రస్తుత పరిస్థితులు
కఠినంగా ఉండడంతో పాటు గట్టి సవాళ్లు ఎదురుగా ఉన్నాయన్న విషయాన్ని మనం
ఒప్పుకోవాలి. ఈ సమయంలో సరైన విధానపరమైన చర్యలు అవసరం. ఇంతకీ రూపాయి ఎందుకు
పతనమవుతోందో మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా రూపాయి పడిపోతోందంటే..
దేశంలోకి పెట్టుబడులు రాకపోవడమో.. లేదా తరలిపోవడమో జరిగి ఉంటుందని అందరూ
భావిస్తారు. కానీ మన మార్కెట్లలోకి నికరంగా పెట్టుబడులు బాగానే
వస్తున్నాయి. అయినా రూపాయి పడుతోంది. ఎందుకంటే.. ముఖ్యంగా డాలరు మారక విలువ
అన్ని ప్రధాన కరెన్సీలు అంటే యెన్, యూరోల కంటే బలపడుతోంది. అమెరికా ఆర్థిక
వ్యవస్థ పుంజుకుంటోందని.. 2013లో మరింతగా మెరుగుపడుతుందన్న అంచనాలు ఇందుకు
దోహదం చేస్తున్నాయి. ఒక్క రూపాయే కాదు.. అన్ని ఆసియా కరెన్సీలదే అదే బాట.
మరో పక్క దేశీయంగా సరైన సంస్కరణలు లేకపోవడంతో పెచ్చుమీరుతున్న కరెంట్ ఖాతా
లోటుతో పాటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) దశాబ్ద కనిష్ఠ స్థాయికి దిగజారడం
కూడా రూపాయిపై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఇంకా పడుతుందా..?: సోమవారం(జూన్ 3)
రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ ఫారెన్ ఎక్స్ఛేంజీ(ఫారెక్స్) మార్కెట్లో 56.76
వద్ద 11 నెలల తాజా కనిష్ఠ స్థాయికి చేరింది. త్వరలోనే 57కు కూడా చేరే
అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటిదాకా ఎఫ్ఐఐలు మార్కెట్లో
పెట్టుబడులు పెడుతూ వచ్చారు. అయితే ఈ మధ్యనే వెనక్కిమరలడం మొదలుపెటారు. 9
కోట్ల డాలర్ల దాకా మన స్టాక్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. మరోపక్క
ద్రవ్యోల్బణంపై రిజర్వు బ్యాంకు అంచనాలు ఆశావహంగా లేవు. కరెంట్ ఖాతా లోటు
కూడా భయపెడుతోంది. వ్యవసాయం, తయారీ తవ్వక రంగాలు డీలా పడడంతో జనవరి-మార్చి
త్రైమాసికంలో జీడీపీ 4.8 శాతానికి పడిపోయింది. 2012-13 ఆర్థిక
సంవత్సరానికి ఈ వృద్ధి రేటు 5 శాతానికి పరిమితమైంది. ఇది దశాబ్దపు కనిష్ఠ
స్థాయి. ఇప్పటికే ఫ్యూచర్స్ మార్కెట్లో 57 స్థాయిని అధిగమించిన రూపాయికి
ఫారెక్స్ మార్కెట్లో 56.85 వద్ద గట్టి నిరోధం ఉందని సాంకేతిక నిపుణులు
అంటున్నారు. ఈ స్థాయిని దాటితే అల్‌టైం కనిష్ఠ స్థాయి అయిన 57.32ను
త్వరలోనే చేరే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. మరోపక్క మరికొంతమంది
విశ్లేషకులు ప్రస్తుత పరిస్థితుల్లో స్వల్పకాలంలో ఆల్‌టైం కనిష్ఠానికి
రూపాయి చేరే అవకాశం తక్కువేనంటున్నారు. రూపాయి మారక విలువ క్షీణించిందంటే..
ముఖ్యంగా మనం డాలర్లు చెల్లించి దిగుమతి చేసుకునే రంగాలపై తీవ్ర ప్రభావం
ఉంటుంది. మనం ఎక్కువ శాతం ముడి పదార్థాలకు దిగుమతులపైనే ఆధారపడి ఉన్న సంగతి
తెలిసిందే. ముడి చమురు..: ఫారెక్స్ నిల్వల్లో మనం ఎక్కువ భాగం
ఖర్చుపెట్టేది చమురు దిగుమతుల కోసమే. బ్రెంట్ చమురు ధర రెండేళ్ల కిందట
బారెల్‌కు 118 డాలర్ల దాకా పలికింది. అప్పట్లో రూపాయి మారక విలువ 44.4గా
ఉంది. ప్రస్తుతం ముడి చమురు ధర 103 డాలర్లకు తగ్గింది. అయితేనేం ఒక్కో
డాలరుకు 56 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో చమురు ధర తగ్గినా మనకు
పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదు. కార్పొరేట్ రుణాలు: మన కార్పొరేట్లు ఎక్కువగా
పెట్టుబడుల కోసం విదేశీ నిధులను సమీకరిస్తుంటారు. ఇందు కోసం విదేశీ
వాణిజ్య రుణాలు(ఈసీబీలు); విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల
(ఎఫ్‌సీసీబీలు)ను ఆశ్రయిస్తుంటారు. ఇక్కడి అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యలభ్యత
దృష్ట్యా విదేశీ నిధులను సమీకరించుకున్నాయి కంపెనీలు. అయితే రూపాయి విలువ
17 శాతం దాకా క్షీణించడంతో వీరికి రుణం మరింత భారమైంది. విద్యుత్: ఫెర్రస్
లోహాల దిగుమతి వ్యయాలు అధికం కావడంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు కొంత
ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఎరువులు: ఈ పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలలో
సగభాగం దిగుమతుల ద్వారా అందేవే. వీటి వ్యయం 20 శాతం దాకా పెరగడంతో వీటిపై
భారం పడుతోంది. వీటికి లాభం ఫార్మా కంపెనీలకు: సాధారణంగా ఫార్మా
కంపెనీలన్నీ ఎగుమతులపైనే ఎక్కువ ఆధారపడి ఉంటాయి. రూపాయి పతనం కావడంతో వీటి
మార్జిన్లు పెరగనున్నాయి. విదేశీ వాణిజ్య రుణాలపై నష్టాలు; ఎఫ్‌సీసీబీలు
కొంత మేర వీటిపై ఒత్తిడి తెచ్చినా.. కలిసొచ్చే మార్జిన్లతో పోలిస్తే అవి
అంత భారీగా ఏమీ ఉండబోవు. జౌళి: ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం పెరగడానికి తోడు
నూలు ధరలు తగ్గడంతో జౌళి పరిశ్రమకు ప్రస్తుత పరిస్థితుల్లో లాభాలు వచ్చేలా
కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత హెడ్జింగ్ పొఖ్ణ్మీ;షన్లపై
మార్క్-టు-మార్కెట్ నష్టాలు మొత్తం మీద లాభదాయకతను లెక్కించేటపుడు కీలకం
కానున్నాయి. వజ్రాభరణాలు: ఈ మధ్య తగ్గుతున్న బంగారం, వెండి ధరలకు తోడు
రూపాయి కూడా క్షీణించడంతో వజ్రాభరణాల పరిశ్రమ పంట పండిందనే చెప్పాలి.
దిగుమతి చేసుకునే బంగారం, వెండి ధరలు తగ్గడం.. ఎగుమతులు చేసేటపుడు రూపాయి
విలువ ఆధారంగా ఎక్కువ మార్జిన్లు రావడంతో రెండు వైపులా ప్రయోజనాలు
అందుతాయి.


