Wednesday, March 27, 2013

కేటాయింపులు ఏనుగంత.. ఖర్చు ఎలుకంత! సర్కారు ఆర్థిక నిర్వహణ లోపాలమయం కేటాయింపుల్లో ఆరో వంతు ఖర్చు చేయలేదు మరో ఆరో వంతు మిగులు నిధులు బడ్జెట్ రూపకల్పనపైనే సందేహాలున్నాయి ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పింఛను బకాయిలు రూ.900 కోట్లు నష్టజాతక జాబితాలో ఆర్టీసీ, హౌసింగ్ టాప్ భారీగా పెరుగుతున్న వేతనాలు, పింఛన్ల ఖర్చు విద్య, ఆరోగ్యంపై మరింత ఖర్చు చేయాలి కాగ్ నివేదిక విడుదల.. శాసనసభకు సమర్పణ హైదరాబాద్, మార్చి 26 : 'కాగ్ నివేదిక ఏమైనా భగవద్గీత.. ఖురాన్... బైబిలా?' అని ముఖ్యమంత్రి కిరణ్ ఎద్దేవా చేసిన మర్నాడే.. ఆయన పాలనలో ప్రభుత్వ కేటాయింపులు, ఖర్చుల్లో అవకతవకలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తి చూపింది. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపాలమయమని, కేటాయింపులను ఏనుగంత చూపి.. ఎలుకంత మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించింది. పెరుగుతున్న అప్పులకు దన్నుగా సంపదను సృష్టించుకునేలా క్యాపిటల్ వ్యయాన్ని పెంచుకోవాలని సిఫారసు చేసింది. విద్య, ఆరోగ్యంపై మరింత వ్యయం చేయాలంది. ఆరోగ్యంపై బడ్జెట్లో 4.67 శాతం, విద్యపై 13.80 శాతం ఖర్చు చేసిందని, ఇది దేశంలోని సాధారణ కేటగిరీ రాష్ట్రాలతో పోల్చినా తక్కువని చెప్పిం ది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ వాణీ శ్రీరామ్ రూపొందించిన ఈ నివేదికను మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఆమె ఆ నివేదికను మీడియాకు విడుదల చేశారు. కాగా, రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన లో లోపాలున్నాయని కాగ్ తప్పుబట్టింది. కేటాయింపులు, ఖర్చులమధ్య పొంతన లేదని, నిధులు కేటాయించకుండానే ఖర్చు చేయడం ఆర్థిక నియమాల ఉల్లంఘనేనని తేల్చిచెప్పింది. కేటాయింపులు భారీగా చూ పినా.. వాస్తవ వ్యయం అతి స్వల్పమేనని తేల్చింది. కేటాయింపుల్లో 17శాతం వరకూ ఖర్చు చేయలేదని వివరించింది. ఉదాహరణకు చేనేత కార్మికులను అప్పుల ఊబి నుం చి బయట పడేసేందుకు రుణమాఫీ పథకా న్ని ప్రకటించారు. దీనికి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, విడుదల చేసింది రూ.32.88 కోట్లు (16శాతం) మాత్రమే. రాష్ట్రీయ మా ధ్యమిక శిక్షా అభియాన్‌కు కేంద్ర, రాష్ట్రాలు 75:25 నిష్పత్తిలో నిధులిస్తాయి. ఈ పథకానికి రూ.322.05కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది రూ.225.52కోట్లే. ఇక, కిశోర బాలికల పథకం 'సబల'కు రూ.124.91 కోట్లను కేటాయించి, రూ.20.25కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇందిరమ్మ గ్రామీణ పథకం కింద 2.93 లక్షల ఇళ్లను; ఇందిరమ్మ పట్టణ పథకం కింద 50 వేల ఇళ్లను నిర్మించాలన్న భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు రూ.571.25కోట్లు కేటాయించామని ఘనం గా ప్రకటించింది. కానీ, ఈ రెండు పథకాల కింద ఖర్చు రూ.142.81 కోట్లు మాత్రమే! మరీ విచిత్రం ఏమిటంటే.. జాతీయ గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా కార్యక్రమానికి రాష్ట్రం తన వాటాగా రూ.100కోట్లు కేటాయించింది. కానీ, రూపాయి కూడా విడుదల చేయలేదు. మధ్యాహ్న భోజన పథకానికి రూ.1.112 కోట్లు కేటాయించి, రూ.673 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని కాగ్ తేల్చింది. రాష్ట్రంలో నిరుపేదలకు 9.28 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మిస్తామన్న సర్కారు.. 91వేలు మాత్రమే పూ ర్తి చేసిందని తప్పుబట్టింది. ఆదర్శ పాఠశాల ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్రాలు 75ః25 నిష్పత్తిలో నిధులను భరిస్తున్నాయి. ఇందులో రూ.412 కోట్ల కేంద్ర వాటా 2011 జూలైలోనే వచ్చేసింది. కానీ, రాష్ట్రం రూ.136 కోట్లను విడుదల చేయలేదు. సరికదా.. కేంద్ర నిధుల్లో రూ.6.33 కోట్లను మాత్రమే ఖర్చుచేసి.. రూ.400 కోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారి ప్రాజెక్టుకింద రోడ్ల అభివృద్ధికి కేంద్రం, ప్రపంచ బ్యాంకు ఆమోదించిన అంచనా వ్యయం రూ.3165 కోట్లు. 2011-12లో దీనికి రూ.600కోట్లు కేటాయించారు. కానీ, ఖర్చు చేసింది రూ.221 కోట్లు మాత్రమే. అప్పులు ఇచ్చి వసూలు చేయరా? నష్టజాతక ప్రభుత్వరంగ సంస్థల మూసివేతకు 13వ ఆర్థిక రంగ సిఫారసుల ప్రకారం ప్రణాళికను రూపొందించుకోవాలని కాగ్ సూచించింది. రుణాలు తీసుకున్న సంస్థల నుంచి అసలు, వడ్డీలను ఎప్పటికప్పుడు వసూలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు నష్టాల జాబితాలో ముందు వరుసలో ఉన్నాయని కాగ్ తేల్చింది. ఈ కంపెనీలు, కార్పొరేషన్లలో 11సంస్థలకు మాత్రమే వార్షిక పద్దు లు ఖరారయ్యాయి. వాటిలో ఆ ఏడాదికి పేరుకుపోయిన నష్టా లు రూ.5979 కోట్లు. గృహనిర్మాణ సంస్థ రూ.3554 కోట్ల నష్టంతో, ఆర్టీసీ రూ.1984 కోట్ల నష్టంతో అగ్రస్థానంలో ఉన్నాయి. అలాగే కంపెనీలు, ప్రభుత్వ కార్పొరేషన్లలో పెట్టుబడులకు వచ్చిన ప్రతిఫలం ఎప్పటిలా స్వల్పంగానే ఉందని కాగ్ పేర్కొం ది. 2011-12లో ప్రభుత్వం తెచ్చిన రుణాలకు చెల్లించిన వడ్డీ రేటు 7.40శాతం కాగా.. ప్రభుత్వం పెట్టుబడులపై సగటు వడ్డీ రేటు 0.85 శాతమే. ప్రభుత్వం రూ.4983 కోట్ల రుణాలను ఇవ్వగా.. రికవరీ చేసింది రూ.164కోట్లే. ఇక రూ.17,337కోట్ల రుణాలకు సంబంధించి వివిధ సంస్థల నుంచి లెక్కల్లేవని కాగ్ తప్పుబట్టింది. పీడీ అకౌంట్లో పాతిక వేల కోట్లు బడ్జెట్ కేటాయింపుల్లో ఆరోవంతుదాకా నిధులు మిగిలి పోతున్నాయని కాగ్ వెల్లడించింది. కేటాయింపులలో 20 శాతానికి మించి భారీ మిగుళ్లు బడ్జెట్ అంచనాల్లో కచ్చితత్వం లేకపోవడాన్ని సూచిస్తున్నాయని వివరించింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయడం లేద ని, దీంతో బడ్జెట్ రూపకల్పన ప్రక్రియపైనే సందేహాలు వస్తున్నాయని స్పష్టం చేసింది. చివర్లో ఒకేసారి భారీగా నిధులను ఖర్చు చేసేయడం లేదా మిగులుగా చూపడాన్ని నివారించేందుకు వాస్తవిక బడ్జెట్ అంచనాలను రూపొందించాలని సిఫార సు చేసింది. అసలు నిధుల కేటాయింపు తక్కువగా ఉండగా పాఠశాల విద్య, భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖలకు సంబంధించి మూడు గ్రాంట్లలో రూ.వెయ్యి కోట్లకుపైగా మిగు ళ్లు ఏర్పడ్డాయని తప్పుబట్టింది. వ్యక్తిగత డిపాజిట్ (పీడీ) అకౌంట్లలో రూ.లక్షకుపైగా ఉంచడాన్ని తప్పుబట్టింది. సుమారు రూ.23,483 కోట్లను పీడీ అకౌంట్లలోనే ఉంచేయడం పారదర్శకతకు పాతర వేయడమేనని తలంటింది. ఖాళీలను భర్తీ చేయకపోవడం, నిధుల కోసం యూనిట్ కార్యాలయాల నుంచి అభ్యర్థనలు రాకపోవడం, యూజీసీ గ్రాంట్లు రాకపోవడం, కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు ఉత్తర్వులు రాకపోవడం తదితర కారణాల వల్ల ఉన్నతవిద్యలో నిధులు మిగిలిపోయాయని వివరించింది. మంజూరు ఉత్తర్వులు అందకపోవడం, పనుల్లో పురోగతి మందగించడంవల్ల పురపాలన, పట్టణాభివృద్ధిలో మిగులు ఏర్పడిందని, కేంద్ర నిధులు ఆలస్యంగా అందడం, నిర్వహణ పనుల్లో పురోగతి లేకపోవడంవల్ల సాంఘిక, వెనకబడిన సం క్షేమ శాఖల్లో నిధులు మిగిలిపోయాయని తెలిపింది. పొంతనలేని అంచనాలు.. వాస్తవాలు బడ్జెట్లో అంచనాలకు, వాస్తవాలకు మధ్య భారీ తేడా ఉంద ని కాగ్ తలంటింది. 2011-12లో పన్నుల రాబడులు, పన్ను లు కాని రాబడులు రెండూ పెరిగాయి. ఆ ఏడాదిలో అబ్కారీ ఆదాయం 16.31 శాతం, వాణిజ్య పన్నులు 19.78, వాహనాలపై పన్నులు 13.69శాతం పెరిగాయి. దీంతో పన్నుల ఆదా యం అంతకుముందు ఏడాదికంటే 18.04 శాతం పెరిగింది. అయినా, బడ్జెట్ అంచనాల కంటే రెవెన్యూ వసూళ్లు 7.37శాతం తగ్గాయి. రెవెన్యూ వ్యయం 6.95 శాతం తగ్గింది. ఫలితంగా బడ్జెట్ అంచనాల కంటే రెవెన్యూ మిగులు 17.98 శాతం తగ్గితే.. రెవెన్యూ వ్యయం 6.95 శాతం తగ్గింది. ఈ తగ్గుదల ప్రధానంగా నీటి సరఫరా -పారిశుధ్యం (46.02శాతం), పట్టణాభివృద్ధి (28.52 శాతం), సాగునీరు-వరదల నియంత్రణ (19.04శాతం) , వడ్డీ చెల్లింపు (7.66 శాతం)ల్లో నమోదైంది. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి భేష్! అయితే, ఆర్థిక నిర్వహణపై విమర్శలు చేసినా కాసిని ప్రశంసలూ కురిపించింది. ప్రభుత్వం ఆరేళ్ల నుంచి వరుసగా రెవెన్యూ మిగులును సాధిస్తూనే ఉంది. ద్రవ్యలోటు గత ఏడాదికంటే స్వల్పంగా పెరిగినా ఎఫ్ఆర్‌బీఎం చట్టం నిర్దేశిత పరిమితిని మించలేదు. దీనికి అనుగుణం గా రుణభారం తగ్గించుకోవడానికి లేదా వదిలించుకోవడానికి సంక్షిప్త నిధి, పూచీ విమోచన నిధిని ఏర్పాటు చేసింది. ఆర్బీఐ నిర్దేశించిన రేట్ల ప్రకారం వీటిలో నిధులను జమ చేస్తూ వస్తోంది. అయితే, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ తీసుకున్న రుణాలను వాటి తరపున ప్రభుత్వమే చెల్లిస్తోన్న సందర్భాల్లో ఆర్థికసాయాన్ని ప్రభుత్వ పద్దుల్లో తప్పుగా నమోదు చేశారు. ఫలితంగా లోన్ల పద్దు కింద ప్రతికూల నిల్వలు రూ.3.72 కోట్లు ఏర్పడి ఆర్థిక పద్దుల్లో రాష్ట్ర రెవెన్యూ వ్యయాన్ని తక్కువగా చూపారు. రాష్ట్ర ద్రవ్య సూచికలపై దీని ప్రభావం పడింది. పెరిగిన వేతన వ్యయం.. జీతాలు, వేతనాలపై ఖర్చు (రూ. 26,823కోట్లు) గత ఏడాది కంటే 12.49 శాతం పెరిగింది. అయితే, బడ్జెట్ అంచనాల కన్నా ఇది 1.52 శాతం తక్కువ. 13వ ఆర్థిక సంఘం అంచనా(రూ.15,735 కోట్లు)కన్నా చాలా ఎక్కు వ. పింఛన్లు, పదవీ విరమణ ప్రయోజనాలకు రూ. 11,110 కోట్లు ఖర్చు చేసింది. రెవెన్యూ రాబడుల్లో ఇది 12 శాతం. ఉద్యోగులకు వడ్డీ నష్టం ఉద్యోగుల నుంచి పింఛను మొత్తాన్ని జీతాల్లోంచి ప్రభుత్వం మినహాయించుకుంటోంది. కానీ, తన వాటాను మాత్రం ప్రభుత్వం పింఛను నిధికి జమ చేయడం లేదు. కాగ్ తన నివేదికలో ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పింఛను నియంత్రణాధికార సంస్థ నిర్దేశాల ప్రకారం కాంట్రిబ్యూటరీ ఫించన్ పథకంలో తన వాటా మొత్తాన్ని ఫండ్ మేనేజర్‌కు బదిలీ చేయాల్సి ఉండగా, 2012 మార్చినాటికి అలా బదిలీ చేయకుండా బకాయి పడిన పూర్తి మొత్తం రూ.894 కోట్లకు చేరింది. నిజానికి ఉద్యోగులు తమ వాటాగా చెల్లించిన మొత్తంతో పోలిస్తే ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.100 కోట్లను తక్కువగా కేటాయించింది. పింఛను కోసం చేసే బడ్జెట్ కేటాయింపులను సమీక్షించుకోవాలని ప్రభుత్వానికి కాగ్ సిఫారసు చేసింది. బీమా గణన ప్రాతిపదికన చెల్లించాల్సిన పింఛను మొత్తాలను లెక్కగట్టి, అదే పద్దు కింద కేటాయించాలని, పింఛను నిధికి జమ చేయాల్సిన బకాయిలను తక్షణమే ఫండ్ మేనేజర్‌కు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టులను పూర్తి చేయండి మహాప్రభో! జల యజ్ఞం సహా వివిధ ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండిపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒనగూడిన ప్రయోజనం శూన్యమని కాగ్ తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే ఏళ్ల తరబడి కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ముఖ్యంగా సాగునీటి రంగానికి సంబంధించిన పనులను పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారమే.. 2012 మార్చి 31 నాటికి 228 ప్రాజెక్టులు (సాగునీరు, ఆర్అండ్‌బీ తదితరాలు) అసంపూర్తిగానే ఉన్నాయని పేర్కొంది. 2011-12లో వీటిపై రూ.49,516 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపింది. అంతకుముందు ఏడాది అసంపూర్తి ప్రాజెక్టులు 188! ఆ ఏడాది (2010-11) వాటిపై ఖర్చు రూ.46,330 కోట్లు! వేల కోట్లు ఖర్చయినా ఫలితం సున్నా. మరో విశేషం ఏమిటంటే.. ఈ 228 ప్రాజెక్టుల్లో 54 ప్రాధాన్యంగలవిగా ప్రభుత్వం చూపింది. వాటి తొలి అంచనాలను సవరించి అంచనా వ్యయాన్ని రూ.87,559 కోట్లకు పెంచింది. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా ఆశించిన ప్రయోజనాలూ రాలేదని కాగ్ తప్పుబట్టింది. చదువుపై ప్రసరించని 'కిరణం' హైదరాబాద్, మార్చి 26 : చదువుకుంటేనే ఉన్నత స్థితికి ఎదుగుతారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరచూ చెబుతుంటారు. కానీ, ఆయన హయాంలో విద్యా రంగానికి కేటాయింపులు అంతంతమాత్రమే! అందుకే, విద్య, ఆరోగ్య రంగాలకు నిధులు పెంచాలని కాగ్ సూచించింది. సామాజిక ఆర్థిక రంగాల విషయంలో ప్రాథమ్యాలను పునర్ నిర్వచించుకోవాలని సిఫారసు చేసింది. వీటికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇచ్చినా కేటాయించిన నిధులను నిర్దేశిత పథకాలకు వినియోగించలేదని తప్పుబట్టింది. కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడం, కొద్దోగొప్పో విడుద ల చేసినా సకాలంలో ఇవ్వకపోవడంతో లక్ష్యం నెరవేరలేదని ఆక్షేపించింది. సామాజిక రంగంపై క్యాపిటల్ వ్య యం సాధారణ కేటగిరీ రాష్ట్రాల కంటే తక్కువగా ఉందని తప్పుబట్టింది. 2011-12లో సాధారణ కేటగిరీ రాష్ట్రాల్లో 17.18 శాతం విద్యారంగంపై ఖర్చు చేయగా, రాష్ట్రంలో అది 13.80 శాతమే. ఎన్నికలూ లేవు.. నిధులూ లేవు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణంగానే కేంద్రం నుంచి పలు రకాల నిధులు నిలిచిపోయినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు జరపని కారణంగా పనితీరు ప్రాతిపదికన రాష్ట్రానికి అందజేసే నిధులు రూ.1044 కోట్లను కేంద్రం మంజూరు చేసినా.. రూ.420 కోట్లు మాత్రమే విడుదల చేసిందని వివరించింది. కాగా, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు 29 అధికారాలు బదిలీ కావాల్సి ఉండగా ఇప్పటివరకు పది మాత్రమే బదిలీ అయ్యాయని తప్పుబట్టింది. ఉద్యోగశ్రీకి ఉరితాడు నిరుద్యోగులపై సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శించిందని 'కాగ్' కడిగేసింది. ఉద్యోగార్థులకు తగిన నైపుణ్యాన్ని కల్పించడంతోపాటు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన 'రాజీవ్ ఉద్యోగ శ్రీ'కి 2011-12 బడ్జెట్‌లో రూ.40 కోట్లను కేటాయించారు. కానీ, ఖర్చు చేసింది రూ.10 కోట్లే. అంతేకాదు.. కార్మిక, ఉపాధి శాఖకు వివిధ పద్దుల కింద 2011-12లో రూ.602.66 కోట్లను కేటాయించగా, రూ.140.33 కోట్లను ఖర్చు చేయలేదు. ఇందులో రూ.90.61 కోట్లను సరెండర్ చేయలేదు. పింఛను చెల్లింపుల్లో అక్రమాలు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన పింఛన్లు, కుటుంబ పింఛన్లకు సంబంధించి పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు 'కాగ్' స్పష్టం చేసింది. కేవలం మచ్చుకు జరిపిన తనిఖీల్లోనే అంటే 410 కేసుల్లో రూ.2.7 కోట్ల మేరకు అధికంగా చెల్లించినట్లు పేర్కొంది. 2012 మార్చి 31 నాటికి 374 కేసుల్లో రూ.2.40 కోట్ల 'రికవరీ' జరగలేదని కాగ్ ఆక్షేపించింది. అసలు పింఛను, రెండో సీవీపీ నుంచి కమ్యూటేషన్ విలువను తగ్గించకపోవడం, పింఛను, కుటుంబ పింఛను సహా బకాయిలను తప్పుగా లెక్కించడం, అదనపు పింఛను మొత్తాన్ని అధికంగా చెల్లించడం, గ్రాట్యుటీ/పింఛను నుంచి చేయాల్సిన రికవరీలను మినహాయించకుండానే అధిక చెల్లింపులు చేయడం, అమ్ముకున్న పింఛన్లను తప్పుగా పునరుద్ధరించడం, రెండుసార్లు పింఛన్లను చెల్లించడం, పింఛనుదారులు మరణించాక కూడా పింఛన్ల చెల్లింపులు వంటి పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు 'కాగ్' వెల్లడించింది. సబ్సిడీలో సింహభాగం విద్యుత్తుదే! హైదరాబాద్, మార్చి 26 : రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలకు కేటాయించే మొత్తంలో సింహ భాగం విద్యుత్తు సబ్సిడీలకే పోతోంది. కాగ్ నివేదిక ప్రకారం.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలపై చేసిన మొత్తం వ్యయం రూ.7313 కోట్లు. ఇందులో విద్యుత్ సబ్సిడీకి ప్రభుత్వం రూ.4300 కోట్లు (59 శాతం) ఖర్చు చేసింది. ఇందులోనూ సింహ భాగం ఉచిత విద్యుత్తుదిగానే చెబుతున్నారు. సబ్సిడీ వ్యయంలో రెండో స్థానం బియ్యానిది. మొత్తం సబ్సిడీ వ్యయంలో 39 శాతం (రూ.2280 కోట్లు) బియ్యంపై ఖర్చు చేశారు. ఇతర అన్ని సబ్సిడీలకు కలిపి రూ.733 కోట్లు (10శాతం) వ్యయం చేశారు. 2010-11తో పోలిస్తే 2011-12లో సబ్సిడీ వ్యయం రూ.770 కోట్ల మేరకు పెరిగింది.