Saturday, September 27, 2014

అప్పా జంక్షన్‌లో రియల్ బూమ్

(సాక్షి సౌజన్యంతో)

 హైదరాబాద్‌లో సొంతిల్లు అనగానే మోస్తారుగా ఉన్నోళ్లకే అనుకుంటాం. కానీ, సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేస్తోంది అప్పా జంక్షన్. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుల సొంతింటికి దగ్గరి దారిని చూపిస్తోంది. కూతవేటు దూరంలో విద్యా, వైద్య సౌకర్యాలు.. వినోదాలకు సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు.. అంతే దూరంలో ఐటీ కంపెనీలు.. అంతర్జాతీయ విమానాశ్రయం.. ఓఆర్‌ఆర్   ఇలా ఒకటేమిటి నగరం నడిబొడ్డున పొందే సకల సౌకర్యాలూ ఇక్కడ పొందొచ్చు. అందుకే దేశ, విదేశీ కంపెనీలు అప్పా జంక్షన్‌లో రియల్ ప్రాజెక్ట్‌లు, వెంచర్లను వేసేందుకు క్యూ కడుతున్నాయి.

 హైదరాబాద్‌లో రియల్ బూమ్ బంజారాహిల్స్‌తో మొదలై.. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్‌కు, ఆపైన గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌కు విస్తరించింది. ప్రస్తుతం ఈ బూమ్ అప్పా జంక్షన్‌కు పరుగులు పెట్టిందని స్థిరాస్తి నిపుణులు చెబుతుంటారు. దీన్ని రియల్ ఎస్టేట్ పరిభాషలో ‘డెవలప్‌మెంట్ మేకింగ్ షిఫ్ట్’గా పేర్కొంటారు. భాగ్యనగరంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ముందు వరుసలో అప్పా జంక్షన్ ఉంటుంది.

ఇప్పటివరకు హైదరాబాద్‌లోని ధనవంతులకు మొదటి సొంతిల్లు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిల్లో ఉండేది. రెండో ఆస్తి బెంగళూరు, చెన్నై వంటి ఇతర ప్రాంతాల్లో ఉండేది. కానీ, ప్రస్తుతం వీరు కూడా వారి రెండో ఆస్తిని అప్పా జంక్షన్‌లో ఏర్పరుచుకోవడానికి ఇష్టపడుతున్నారని వివరిస్తున్నారు. ఇది చాలు అప్పా జంక్షన్ ఉన్నత శ్రేణి వర్గాలుండే ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందనడానికి.

 అతి దగ్గర్లో ఐటీ హబ్, ఎయిర్‌పోర్ట్: అప్పా జంక్షన్ ప్రాంతం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు, గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలకు అతి దగ్గర్లో ఉండటం కలిసొచ్చే అంశం. 3 కి.మీ. దూరంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌డీ), ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పోలీస్ అకాడమీలుండటంతో నిత్యం జనాలతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంది. అప్పా జంక్షన్‌లో సుమారు 70కి పైగా విద్యా సంస్థలు, ఆసుపత్రులెన్నో ఉన్నాయి.

 ఈ ప్రాంతంలో మిలటరీ ఏరియా, ఎన్‌ఐఆర్డీ, ఎన్జీ రంగా వర్సిటీలుండటంతో పచ్చని ప్రకృతిలో ఆరోగ్యకరంగా జీవించొచ్చు. హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయానికి అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకూ కొదవేలేదని చెప్పొచ్చు.

 సొంతింటితో పాటు కారు కూడా: నగరంలో సొంతిల్లు అనేది ఉన్నత శ్రేణి వర్గాలకే కాదు.. సామాన్య, మధ్యతరగతి ప్రజలకూ ఉండాలి. అప్పుడే ఆ నగరం అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క అని గిరిధారి కన్‌స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. నా దృష్టిలో అఫడబుల్ హౌజింగ్ అంటే.. సిటీకి దూరంగా, రవాణా సదుపాయాలు కూడా సరిగా లేని ప్రాంతాల్లో ఇళ్లుండటం కాదు.. సిటీకి దగ్గర్లో, అందుబాటు ధరల్లో ఇళ్లు లభించాలి.

కుటుంబంతో కలసి సెకండ్ షో సినిమా చూసి సురక్షితంగా ఇంటికి చేరుకునేంత దగ్గర్లో ఉండాలి. అందుకే అప్పా జంక్షన్‌లో మేం నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్ట్‌ల్లో రూ.25 లక్షలకే 2 బీహెచ్‌కే ఫ్లాట్లను అందిస్తున్నామన్నారు. అప్పా జంక్షన్‌లో ఫ్లాటు కొంటే కారు కూడా సొంతమవుతుందనే నిర్ణయానికి కొనుగోలుదారులొచ్చారు. ఎలాగంటే.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఫ్లాటు కొనాలంటే ఎంతలేదన్నా రూ.40 లక్షలకు మించి కావాలి. అదే అప్పా జంక్షన్‌లో అయితే రూ.25 లక్షలకే ఫ్లాటు కొనడంతో పాటు మిగిలిన డబ్బుతో కారూ సొంతమవుతుందన్నమాట.