Tuesday, December 8, 2015

కస్టమర్లకు వరం.. కంపెనీలకు నష్టాలు

ఏ వస్తువైనా తయారీ ధరకు దొరుకుతుందా? పైసా లాభం లేకుండా ఎవరైనా అమ్ముతారా? సంప్రదాయ వ్యాపారంలో ఈ పరిస్థితి ఎక్కడా ఉండదు. ఒక్కో మెట్టు ఎక్కితేనే పైకెళ్లేది.. ఒకేసారి ఆకాశానికి నిచ్చెనెయ్యాలని చూస్తే ఏమవుతుంది? ఈ తప్పే ఇండియన్ ఈ-కామర్స్ ని ఒక్కసారిగా పాతాళంలోకి నెట్టేసింది. భవిష్యత్తు లాభాల్ని బేరీజు వేసుకొని వర్తమానంలో నష్టాల్ని కోరి కొనితెచ్చుకుంటున్నాయి.

అతి సర్వత్రా వర్జేయత్.. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ఏ వ్యాపారంలోనైనా ప్రాథమిక సూత్రం ఒకటి ఉంటుంది. లాభాల విషయం పక్కనబెడితే నష్టం రాకుండా అమ్ముకోవాలి. కానీ స్టార్టప్ ల పేరుతో రోజుకో ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ పుట్టుకొచ్చి.. పూర్తి వ్యతిరేక విధానంలో వ్యాపారం చేస్తున్నాయి. నష్టమొచ్చినా సరే కస్టమర్ ని ఆకర్షించాలన్న సూత్రంతో ముందుకెళ్తున్నాయి. కస్టమర్ బేస్ పెరిగితే లాభాలు వాటంతటవే వస్తాయన్నది ఈ-కామర్స్ కంపెనీల వ్యూహం. అందుకే కొనుగోలుదారులను పెంచుకోవడమే లక్ష్యంగా ఇబ్బడిముబ్బడిగా ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఇందులోనూ వైవిధ్యం కనిపిస్తోంది. ఆఫర్లకోసం వీకెండ్స్, పండగల దాకా ఎందుకు ఎదురుచూపులు ఇదుగో తీసుకోండంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి.

కొన్ని కంపెనీలైతే కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు మరో అడుగు ముందుకేసి రూపాయికే అంటూ ఊదరగొడుతున్నాయి. మరికొన్ని ఈ-కాం వెబ్ సైట్లు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే వందల రూపాయల విలువైన కూపన్స్ ఫ్రీగా ఇస్తున్నాయి. మనదేశంలో ఇప్పుడిదో వ్యాధిలా మారింది. లాయల్టీ కస్టమర్లుగా మార్చుకుంటే జీవిత కాలం ఆదాయం పొందొచ్చన్నది వాటి ఆలోచన. ఇదే వాటి కొంప ముంచుతోంది. వాటి దూరాలోచనే దురాలోచనగా మారి నష్టాలపాలు జేస్తోంది.

ఒక్కో కస్టమర్ ని ఆకర్షించడానికి ఈ-కామర్స్ వెబ్ సైట్లు సగటున 200 నుంచి 500 రూపాయల దాకా ఖర్చు చేస్తున్నట్లు ఓ అంచనా. ఆన్ లైన్ కొనుగోళ్ల సగటు ఆర్డర్ విలువ నాలుగొందలకు మించట్లేదని ఓ అధ్యయనంలో తేలింది. రోజురోజుకూ కొనుగోలు దారుల సంఖ్య, ఆన్ లైన్ మార్కెట్ సైజ్ పెరుగుతోందే తప్ప.. సగటు కొనుగోలు విలువ మాత్రం వందల్లోనే ఉంటుంది. అటు ఎక్కువ అమ్ముడయ్యే చాలా ఉత్పత్తులపై ఈ కంపెనీలకొచ్చే కమీషన్ పది శాతానికి మించట్లేదు. అంటే ఒక కస్టమర్ కు ఇచ్చిన డిస్కౌంట్ ని రాబట్టుకోవాలంటే మళ్లీ అతను మరో 10-12 సార్లయినా అదే వెబ్ సైట్లో కొనుగోలు చెయ్యాలి. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. కస్టమర్లేం తెలివి తక్కువవాళ్లు కాదుకదా.. ఏ వెబ్ సైట్లో తక్కువ ధర ఉందో తెలిపే మై స్మార్ట్ ప్రైస్ డాట్ కామ్ లాంటి వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. ఎక్కడ తక్కువుంటే అక్కడే కొంటారు.. అది ఫ్లిప్ కార్ట్ అయితేంటి, స్నాప్ డీల్ అయితేంటి? ఆన్ లైన్లో ఎక్కడా ఎమ్మార్పీ మీద ఐదు, పదిశాతానికి మించి డిస్కౌంట్ రావట్లేదని గ్రహిస్తే.. ఆఫ్ లైన్ లో సంప్రదాయ రిటైల్ షాపులకు వెళ్లి కొనుక్కుంటున్నారు. పైగా కొత్తగా పుట్టుకొచ్చే కంపెనీలు సైతం ఒకేసారి పాతవాటికి పోటీ ఇవ్వాలని చూస్తున్నాయి. ఇందుకోసం కూపన్లు, ఫ్రీగిఫ్ట్ లు, సినిమా టికెట్ల పేరుతో కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇదే వాటిని బొక్కబొర్లా పడేస్తోంది.