Tuesday, December 8, 2015

స్టార్టప్ మానియా

ప్రపంచంలో ఎక్కడాలేని స్టార్టప్ మానియా మనదేశంలో కనిపిస్తోంది. ఉద్యోగాల్ని అర్థించకుండా.. కల్పించాలన్న ప్రభుత్వాల పిలుపు యువతపై బాగా ప్రభావం చూపింది. ఏమాత్రం అనుభవం లేకుండానే ఈ రంగంలోకి దిగుతూ బోర్లా పడుతున్నారు. అదే చక్కని వ్యాపార వ్యూహాలతో ముందుకెళ్లే కంపెనీలు మంచి లాభాల్నే చవిచూస్తున్నాయి.

మనదేశంలో స్టార్టప్ కంపెనీల్లో పదిశాతం మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. వ్యాపారంలో అనుభవం లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. టాప్ బిజినెస్ స్కూళ్లు, ఐఐటీ, ఐఐఎంల్లో చదువుకున్న వాళ్లయినా సరే.. నేరుగా వ్యాపారంలో దిగితే నష్టపోతున్న వారు అనేకం. అదే కొన్నాళ్ల ఉద్యోగ అనుభవం తర్వాత వస్తున్న వారు మాత్రం ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సందర్భాలు చాలా తక్కువ. స్టార్టప్ ల కోసం యూత్ తహతహలాడేందుకు కారణం ఈ-కామర్స్ బూమే. నాలుగైదేళ్లు వెనక్కి వెళ్తే టెలికాం రంగంలో ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్.. ఇలా అన్ని కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేవి. నెలనెలా కోట్లలో కొత్త సిమ్ కార్డులు సేల్ అవుతుండేవి. కారణం.. కంపెనీల ఆఫర్ల కోసమే తీసుకునేవాళ్లు ఎక్కువ. ఆఫర్ అయిపోగానే వాటిని పక్కన పడేసేవాళ్లు. అంటే వాపు చూసి బలుపు అనుకున్నాయి అప్పట్లో టెలికం కంపెనీలు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఈకామర్స్ రంగంలో కనిపిస్తోంది.

ప్రస్తుతం భారత ఈకామర్స్ మార్కెట్ విలువ దాదాపు రెండు లక్షల కోట్లు. 2020 నాటికి నాలుగు రెట్లు పెరుగుతుందని గోల్డ్ మాన్ శాక్స్ అంచనా. టాప్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్ కార్ట్ సేల్స్ చూస్తే 2013-14కన్నా 14-15వ ఆర్థిక సంవత్సరంలో మూడింతలు  పెరిగాయి. కానీ పైసా లాభం రాలేదు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2వేల కోట్లు నష్టపోయింది. అంతకుముందు ఏడాది నష్టం 715 కోట్లు.  సేల్స్ పెరుగుతున్నకొద్దీ నష్టాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. ఆపరేషనల్ కాస్ట్ పెరగడమే దీనికి కారణం. డిస్కౌంట్లు, ప్యాకేజింగ్, రవాణా, ఉద్యోగుల జీతాలు, వెబ్ సైట్ నిర్వహణ, లేటెస్ట్ టెక్నాలజీ వాడకం.. ఇలా అన్నీ ఖర్చులే. ఆదాయ మార్గాలు మాత్రం సెల్లర్స్ నుంచి వచ్చే కమీషన్, కస్టమర్ డేటా, లాయల్ కస్టమర్స్ కొనుగోళ్లు. అన్ని వెబ్ సైట్లదీ ఇదే పరిస్థితా అంటే అదేంలేదు. ఇందుకు అమెజాన్, ఈబే లాంటి కంపెనీలే నిదర్శనం. బహుళజాతి ఆన్ లైన్ మార్కెట్ సంస్థలైన అమెజాన్, ఈబే, అలీబాబా చక్కని లాభాల్ని ఆర్జిస్తుండటం విశేషం. కారణం.. వాటికి పటిష్టమైన బ్యాక్ ఎండ్ వ్యవస్థ ఉండటం ఒకటైతే.. ఒక్కసారిగా లాభాలు ఆర్జించే దగ్గరి దారుల్ని వెతకవవి. ఎంత డిస్కౌంట్ ఇవ్వొచ్చో అంతే ఇస్తాయి. అదే వాటిని ఇంతటి పోటీ ప్రపంచంలోనూ మేటి ఈకామర్స్ కంపెనీలుగా నిలబెట్టాయి.

వెబ్ సైట్లు, యాప్ లంటూ టెక్నాలజీకి, కస్టమర్లను ఎట్రాక్ట్ చెయ్యడానికే ఎక్కువ ఖర్చు పెడుతున్న మన కంపెనీలు.. ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టట్లేదన్నది నిపుణుల విశ్లేషణ. వాట్సాప్ లాంటి కంపెనీలు ఖాతాదారుల అభిరుచులు, ఆలోచనలను తెలుసుకుని.. వాటిని విశ్లేషించి విక్రయించడం ద్వారా భారీ ఆదాయం ఆర్జిస్తున్నాయి. కానీ మన ఈకామర్స్ సైట్ల దగ్గరా కోట్లలో కస్టమర్లున్నా.. వారు ఏమేం కొంటారో తెలిసినా.. ఆ డేటాని విశ్లేషించలేకపోతున్నాయి. పైగా యాడ్ రెవెన్యూని పెంచుకోవడంలోనూ వెనుకబడ్డాయి. అందుకే చివరికి ఉద్యోగుల్ని తొలగిస్తూ.. ఆపరేషన్స్ క్లోజ్ చేస్తూ అబాసుపాలవుతున్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా... అనుభవం... అనుభవ రాహిత్యం మధ్య తేడా గమనించకుండా వ్యాపార రంగంలో అడుగు పెడితే చేతులు కాలడం ఖాయమన్నది ఈ కామర్స్‌ బిజినెస్‌ను చూస్తే అర్థమవుతుంది.