Tuesday, December 8, 2015

ఆన్‌లైన్ బూమ్‌తో తంటా

యూత్ ఎక్కువగా ఉన్న మన దేశంలో ఆన్ లైన్ బూమ్ తెచ్చిన తంటా అంతాఇంతా కాదు. సంప్రదాయ వ్యాపారాన్ని దెబ్బతీస్తూ యావద్దేశాన్ని ఈ-కామర్స్ వైపు ఆకర్షిస్తోంది. ఐతే సరైన ప్లాన్ లేక.. గంపెడాశలతో వచ్చిన చాలా స్టార్టప్ కంపెనీలు ఏడాది తిరక్కముందే చాపచుట్టేస్తున్నాయి. చిన్నాచితకా వెబ్ సైట్లే కాదు.. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి టాప్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ లకూ నష్టాలు తప్పలేదు.

ఆన్ లైన్ బూమ్ మనదేశంలో వ్యాపార పోకడల్ని పూర్తిగా మార్చేసింది. గుండు పిన్ను మొదలు కార్ల వరకూ ఇప్పుడేది కావాలన్నా ఆన్ లైన్లో కొనుక్కోవచ్చు. కొన్ని కంపెనీలు సొంతంగా.. వాటి ఉత్పత్తుల కోసమే ఆన్ లైన్ మార్కెట్లో ప్రవేశిస్తే.. అంగళ్లను పోలిన వ్యాపార విధానంలో ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, ఆస్క్ మీ బజార్, పేటీఎం లాంటివి అమ్మకాల్లో అదరగొడుతున్నాయి.

బిగ్  బిలియన్ డే, వీకెండ్ ఆఫర్స్, ఫెస్టివల్ డేస్.. ఇలా తోచిన ఆలోచనని అమలు చేస్తూ కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇన్ని వెబ్ సైట్లలో దేంట్లో కొనాలో అన్న అయోమయం మీకెందుకంటూ.. ఎక్కడ తక్కువ ధర ఉందో చెప్పేందుకు మరో వెబ్ సైట్.. ఇలా వ్యాపారమంతా ఆన్ లైన్ అయిపోయింది. అదే వాటికి చేటు తెస్తోంది. అంతా ఒక్క క్లిక్ తోనే తెలిసిపోతుంది. ఇది ఓ విధంగా కస్టమర్లకు వరంలా మారినా.. కంపెనీలకు ప్రతికూలంగా తయారైంది. కస్టమర్లను నిలుపుకోవడం ఇప్పుడు ఈకామర్స్ కంపెనీలకు సవాల్‌గా మారింది.

బూమ్ ని చూసి మొదట్లో ఈ-కామర్స్ సైట్లకు వందలు, వేల కోట్ల పెట్టుబడులు వరదలా వచ్చిపడ్డాయి. విదేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థలతోపాటు దేశీయంగానూ ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడికి ఛాన్స్ వస్తే చాలన్నట్లు వ్యవహరించారు. ఒక్కసారిగా వచ్చిపడ్డ నిధుల్ని చూసి చాలా కంపెనీలు వాటి వ్యాపారాన్ని వేగంగా విస్తరించాయి. ప్రాడక్ట్ పోర్ట్ ఫోలియోతోపాటు తమ వెబ్ సైట్లో అమ్ముకునే రిటైలర్ల సంఖ్యనీ గణనీయంగా పెంచుకున్నాయి. ఇందుకోసం వేలమంది ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. దీంతో దశాబ్దాలుగా మెట్టూ మెట్టూ ఎక్కుతూ వచ్చిన టాటా, బిర్లా, రిలయన్స్ లాంటి కంపెనీల మార్కెట్ విలువ సైతం వీటిముందు దిగదుడుపైంది. ఒక్కరోజే ఆరొందల కోట్ల అమ్మకాలు జరిగితే ఏటా ఎంతుండాలి.. లాభమెంత వస్తుంది.. ఐదేళ్లు, పదేళ్లు.. ఇలా భవిష్యత్తు లాభాల్ని పేపర్ పై పెట్టడంతో ఈ-కామర్స్ కంపెనీల మార్కెట్ విలువ లక్షల కోట్లకు చేరింది. అంతా గుడ్ విలే.. కానీ విలువ మాత్రం వేలు, లక్షల కోట్లలనే ఉంది. దీన్ని చూసి కొత్త స్టార్టప్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్లాన్ ని పేపర్ పెట్టడం, నిధులు రాబట్టడం.. అనుకుందే తడవు నెలలోపే స్టార్ట్ చెయ్యడం జరిగిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఆ తర్వాతే వాటికి చుక్కలు కనిపిస్తున్నాయి. మొదట్లో కస్టమర్ ని రాబట్టుకోవడానికి రిటైలర్ రేట్ మీద మరికొంత డిస్కౌంట్ ఇచ్చిన కంపెనీలు.. తర్వాత వారిని నిలబెట్టుకోవడానికి కూడా మళ్లీ మళ్లీ డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తోంది. అంటే తయారీ ధరకన్నా తక్కువ ధరకే అమ్ముతున్నారన్నమాట. వాటికితోడు ప్యాకింగ్, డెలివరీ అదనపు ఖర్చులు ఎలాగూ ఉన్నాయి. ఇంతా చేసినా కస్టమర్లు సెలెక్టివ్ గా కొన్ని ఉత్పత్తులు మాత్రమే  ఎక్కువగా కొంటున్నారు. అవికూడా కంపెనీలకు తక్కువ మార్జిన్లు వచ్చే ఉత్పత్తులే. ఎక్కవు కమీషన్ ఉండే ఉత్పత్తుల అమ్మకాలు పెరిగితేనే నష్టాల్ని తగ్గించుకోవచ్చన్నది వాటి వ్యూహం. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. దీంతో నిర్వహణ కష్టంగా మారింది. కొత్త నిధులు రాక, ఇక డిస్కౌంట్లు ఇచ్చేపరిస్థితి లేక.. చాలా కంపెనీలు చేతులెత్తేశాయి. కొంతమంది ఎంతకో అంతకు వెబ్ సైట్లను అమ్మేసుకుంటుండగా.. ఇంకొంతమంది కార్యకలాపాలను పూర్తిగా ఆపేశారు. ఈ ప్రభావం రెడీమేడ్ ఫుడ్, గ్రాసరీ రంగంలోని వెబ్ సైట్లపై ఎక్కువగా పడింది. ఫుడ్ పాండా, స్విగ్గీ, జొమాటో.. ఇలా ఎన్నో సైట్లు మనకు దగ్గర్లోని రెస్టారెంట్లను వెతికి పెట్టడమే కాక.. ఆర్డరిస్తే అరగంటలో రెస్టారెంట్ రేటు కన్నా తక్కువకే ఇంటికి తెచ్చిస్తున్నాయి. రెస్టారెంట్ల నుంచి వచ్చే 10-15శాతం కమీషన్ ట్రాన్స్ పోర్టేషన్ కే పోతుంది. మరి ఉద్యోగి శాలరీ, వెబ్ సైట్ నిర్వహణ, ప్రకటనల ఖర్చులు.. ఇలా చూస్తే ఏ విధంగానూ లాభం వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అటు ట్యాక్సీ క్యాబ్స్ కోసం వచ్చిన ఓలా, ఉబర్ లాంటి కంపెనీలు గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి.

ఇక కిరాణా సరకుల రంగంలో ఉన్న గ్రాసరీ వెబ్ సైట్లదీ మరీ దీనగాధ అని చెప్పాలి. డిస్కౌంట్లు, కూపన్స్ అంటూ ఇంటర్నెట్లో విచ్చలవిడి ప్రచారమే వాటి కొంపముంచుతోంది. ఇలాంటి ఎత్తుగడల్ని ఎలా సొమ్ము చేసుకోవచ్చో బాగా తెలిసిన మన నెటిజన్లు.. ఫ్రీ కూపన్స్ వరకే వాటి దగ్గర కొనుగోలు చేస్తున్నారు. మిగతా వాటికోసం ఇంటి దగ్గర్లోని దుకాణాలకు, హోల్ సేల్ షాపులకు వెళ్తున్నారు. అందుకే చాలా వెబ్ సైట్లు ఒకట్రెండు నెలల్లో వందల మంది ఉద్యోగుల్ని తొలగించాయి. భవిష్యత్తు లాభాల్ని చూసి వీటిలో పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. లాభం మాట దేవుడెరుగు అసలొస్తే చాలన్నట్లు తమ వాటాల్ని అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు.