ఆదాయ పన్ను గరిష్ట శ్లాబ్‌ను రెట్టింపు చేయాలి
ప్రస్తుతం ఉన్న రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలి
80సి కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2 లక్షలకు చేర్చాలి
ప్రి-బడ్జెట్ మెమొరాండంలో ఫిక్కీ న్యూఢిల్లీ:

రానున్న
బడ్జెట్‌లో వేతనజీవులకు మరింత ఊరటనిచ్చే చర్యలు చేపట్టాలనే డిమాండ్‌లు
జోరందుకుంటున్నాయి. ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లింపునకు సంబంధించి... సెక్షన్
80సి కింద పన్ను ఆదాయంలో మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. లక్ష నుంచి
కనీసం రూ. 2 లక్షల స్థాయికి పెంచాలని పరిశ్రమ చాంబర్ ఫిక్కీ పేర్కొంది.
ఆర్థిక శాఖకు సమర్పించిన ప్రి-బడ్జెట్ మెమొరాండంలో ఈ మేరకు పలు విజ్ఞప్తులు
చేసింది. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదార్లు పన్ను ఆదా పథకాలపై మరింత
దృష్టిసారించడం, అదేవిధంగా పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ చర్యలు
అవసరమని తెలిపింది.
ప్రస్తుతం జీవిత బీమా ప్రీమియంలు, పిల్లల
చదువులకు సంబంధించిన ఫీజులు, ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్), ఇన్‌ఫ్రా
బ్రాండ్‌లు, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌ల వంటి వాటిలో రూ. లక్ష వరకూ
వెచ్చిస్తున్న వ్యయానికి పన్ను ఆదాయం నుంచి మినహాయింపు లభిస్తున్న సంగతి
తెలిసిందే. కాగా, ఉద్యోగుల్లో వ్యయాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా గరిష్ట
ఐటీ శ్లాబ్‌ను రెట్టింపు చేయాలని కూడా ఫిక్కీ కోరింది. ప్రస్తుతం రూ.10
లక్షల పైబడిన ఆదాయంపై 30%(విద్యా సెస్సుతో కలిపి 30.9%)గా ఉన్న పన్నును...
వచ్చే ఆర్థిక సంవత్సరం(2013-14) నుంచి రూ.20 లక్షల పైబడిన ఆదాయంపై
వర్తింపజేయాలనేది ఫిక్కీ విజ్ఞప్తి. రూ.2 లక్షల వరకూ ఆదాయంపై ప్రస్తుతం
పన్ను లేదు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఆదాయంపై 10%... రూ.5 లక్షల
నుంచి రూ.10 లక్షల ఆదాయంపై 20% పన్ను రేట్లు అమల్లో ఉన్నాయి.
ఇతర విజ్ఞప్తులు ఇవీ...* ఉద్యోగులకు పన్ను ఆదాయంలో కనీసం రూ.50 వేల మినహాయింపు లభించేలా స్టాండర్డ్ డిడక్షన్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలి.
* ఇళ్ల
ధరలు, వడ్డీ రేట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఊరట కల్పించాలి. గృహ
రుణాలపై వార్షికంగా రూ. 1.5 లక్షల వరకూ చెల్లిస్తున్న వడ్డీని పన్ను ఆదాయం
నుంచి మినహాయింపునిస్తుండగా... దీన్ని రూ.2.5 లక్షలకు పెంచాలి.
* విద్యకు
సంబంధించిన వ్యయాన్ని సెక్షన్ 80సీ నుంచి వేరుచేయాలి. వైద్య బీమా కోసం
ఇప్పుడున్న సెక్షన్ 80డీ తరహాలో ప్రత్యేకంగా మినహాయింపు పరిమితి లభించేలా
విభజించాలి.
* వైద్య చికిత్సలకు చేసే
వ్యయాలకు కల్పిస్తున్న మినహాయింపు పరిమితిని కూడా వచ్చే బడ్జెట్‌లో
పెంచాలి. ప్రస్తుతం వార్షికంగా రూ.15,000గా ఉన్న ఈ మినహాయింపు పరిమితిని
రూ.50,000కు చేర్చాలి.