Friday, December 7, 2012

మాలె జిఎంఆర్ చేజారుతుందా?

సింగపూర్ - మాలె , డిసెంబర్ 6 : మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు విషయంలో సింగపూర్ హైకోర్టు తీర్పు తమకే అనుకూలంగా ఉందన్న ధీమాతో ఉన్న జిఎంఆర్ గ్రూప్‌నకు హఠాత్తుగా మరో ఎదురుదెబ్బ తగిలింది. జిఎంఆర్ చేతుల్లోంచి మాలె విమానాశ్రయాన్ని మాల్దీవుల ప్రభు త్వం వెనక్కి తీసుకోవచ్చని సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ (సుప్రీం కోర్టు) తీర్పు చెప్పినట్టుగా మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు. ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించిన విమానాశ్రయాన్ని అవసరమైతే వెనక్కి తీసుకునే అధికారం మాల్దీవుల ప్రభుత్వానికి ఉంటుందని సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ తీర్పు చెప్పినట్టు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ప్రకటించినట్టుగానే శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఏక్షణమైనా మాలె విమానాశ్రయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మాల్దీవుల అధ్యక్షుని ప్రెస్ సెక్రటరీ మసూద్ ఇమాద్ తెలిపారు.

సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ గురువారం నాడు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జిఎంఆర్ పరిస్థితి అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన వ్యూహం ఏమిటన్న విషయం జిఎంఆర్ ఇంకా బయటపెట్టలేదు. మరోవైపు ఈ తీర్పు నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా కనిపిస్తోంది. సింగపూర్ సుప్రీం కోర్టు తీర్పును తమ విదేశాంగ శాఖ, మాలెలోని భారత హైకమిషన్ అధ్యయనం చేస్తున్నాయని భారత్ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు.

ఎయిర్‌పోర్టు కాంట్రాక్టుకు సంబంధించిన చట్టపరమైన నియమనిబంధనలు, పరిహారానికి సంబంధించిన కాంట్రాక్టులోని ఒప్పందాలను మాల్దీవుల ప్రభుత్వం అక్షరాల అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ కేసులో రెండు అంశాలున్నాయనీ ఒకటి మాల్దీవుల ప్రభుత్వ సార్వభౌమా«ధికారానికి సంబంధించినది కాగా మరొకటి ప్రాజెక్టు ఒప్పందానికి సంబంధించిన చట్టబద్ధత అని ఆయన చెప్పారు.

సింగపూర్ కోర్టు గురువారం నాడు ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలే తప్ప ఒప్పందం చట్టబద్దతకు సంబం«ధించిన అంశాల ప్రస్తావన లేదని ఆయన వివరించారు. కోర్టు ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించనందున, ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు, కాంట్రాక్టులో పేర్కొన్న ఒప్పందాలు అన్నింటినీ పొల్లుబోకుండా అమలు చేయాల్సి ఉంటుందని సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. మాల్దీవుల ధీమా....

అంతర్జాతీయ బిడ్డింగ్‌లో రెండేళ్ల క్రితం జిఎంఆర్ గ్రూప్ మొహమ్మద్ నషీద్ ప్రభుత్వ హయాంలో మాలె విమానాశ్రయ ప్రాజెక్టును గెలుచుకుంది. అయితే గత ఫిబ్రవరీలో అధికారంలోకి వచ్చిన మొహమ్మద్ వహీద్ ప్రభు త్వం ఈ ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వచ్చింది. నవంబర్ 27న హఠాత్తుగా ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జిఎంఆర్ సింగపూర్ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. అయితే సింగపూర్ కోర్టు ఉత్తర్వులను లెక్కచేసేది లేదని, జిఎంఆర్‌ను మాలె ఎయిర్‌పోర్టు నుంచి ఖాళీ చేసి తీరుతామని మాల్దీవుల ప్రభుత్వం మొండికేయడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. భారత ప్రభుత్వం కల్పించుకుని నిరసన తెలిపినప్పటికీ మాల్దీవులు వెనక్కి తగ్గలేదు. గురువారం నాడు సింగపూర్ అత్యున్నత న్యాయస్థానంలో కోర్టులో తీర్పు అనుకూలంగా రావడంతో మాల్దీవుల ప్రభుత్వం తన పట్టుకు మరింత బిగిస్తోంది.

జిఎంఆర్‌ను బలవంతంగా బయటకు గెంటినా చట్టపరంగా ఇక తమపై తప్పు ఉండదని ధీమా వ్యక్తం చేస్తోంది. ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు కాంట్రాక్టు ప్రకారం, వివాదం ఏదైనా తలెత్తితే సింగపూర్ లేదా బ్రిటన్ చట్టాల ప్రకారం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సింగపూర్ హైకోర్టులో తీర్పు జిఎంఆర్‌కు అనుకూలంగా వచ్చింది. దానిపై మాల్దీవులు దాఖలు చేసుకున్న అప్పీల్‌లో తీర్పు ఇప్పుడు తమకు అనుకూలంగా వచ్చినట్టు మాల్దీవుల ప్రతినిధి ప్రకటించారు.

జిఎంఆర్‌కు పొగబెట్టిందెవరు ? మాలె ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు నుంచి జిఎంఆర్ గ్రూప్‌ను పక్కకు తప్పించేందుకు జరిగిన కుట్రలో మాల్దీవుల అధ్యక్షుడు వహీద్ ప్రత్యేక సలహాదారు హసన్ సయీద్ పాత్ర ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే దీనిని మాల్దీవుల ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్టు నుంచి జిఎంఆర్‌కు ఉద్వాసన చెప్పాల్సిందిగా దేశ అధ్యక్షునికి హసన్ సయీద్ సలహా ఇచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.