Monday, December 31, 2012

'క్లిఫ్’ అంచున అమెరికా!


ఆఖరి నిమిషంలో డీల్ కోసం చట్టసభల సభ్యుల ముమ్మర యత్నాలు
విఫలమైతే జనవరి 1 నుంచి అమల్లోకి ‘ఫిస్కల్ క్లిఫ్’
భారీగా పన్నుల పెంపు, వ్యయాల్లో కోత భయాలు


వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా... ఇప్పుడు ‘ఫిస్కల్ క్లిఫ్’ అంచున వేలాడుతోంది. 2012 సంవత్సరం కనుమరుగయ్యేందుకు ఇక గంటల వ్యవధే మిగిలి ఉంది. 2013 జనవరి 1 ప్రారంభమవుతూనే అక్కడి ప్రజలు, కంపెనీలపై పన్నుల భారం రూపంలో వడ్డింపు కూడా మొదలవుతుంది. బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నుల పెంపు, భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యయాల్లో కోత అమల్లోకి వచ్చేస్తుంది(దీన్నే ఫిస్కల్ క్లిఫ్‌గా వ్యవహరిస్తున్నారు). గడిచిన కొద్ది వారాలుగా దీన్ని నివారించడం కోసం అక్కడి ప్రభుత్వం, విపక్షాల మధ్య జరుగుతున్న చర్చల్లో ఎలాంటి ఫలితం లేకపోవడంతో... ఇక ఆఖరి నిమిషంలో డీల్‌పైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.

అమెరికా చట్టసభల సభ్యులు(సెనేట్, ప్రతినిధుల సభ) ఆదివారం, సోమవారం 36 గంటల పాటు ప్రత్యేక సెషన్లను నిర్వహిస్తున్నారు. డెమోక్రాట్‌ల ఆధిపత్యం ఉన్న సెనేట్‌లో ఇరు పార్టీలకు చెందిన నాయకులు శనివారం కూడా విస్తృత చర్చల్లో మునిగితేలారు. అటు డెమెక్రాట్‌లకు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)లో మెజారిటీ కలిగిన రిపబ్లికన్‌లకు సైతం ఆమోదనీయమైన ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరు సభల సభ్యులూ ఫిస్కల్ క్లిఫ్ నివారణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చించి, ఒప్పందాన్ని ఆమోదించేందుకు చాలా కొద్ది సమయమే మిగిలిఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

భయాలు ఇవీ: ఫిస్కల్ క్లిఫ్ గనుక అమల్లోకి వస్తే... ప్రజలు, కార్పొరేట్లపై పన్ను భారం పెరిగి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారిపోవచ్చనేది ఆర్థిక వేత్తల ఆందోళన. అమెరికా చరిత్రలోనే ఏకమొత్తంలో అతిపెద్ద పన్నుల పెంపునకు ఈ ఫిస్కల్ క్లిఫ్ కారణమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 500 బిలియన్ డాలర్ల మేర ప్రజలపై భారం పడుతుందని ఆర్థిక వేత్తలు లెక్కకడుతున్నారు.

దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రతికూలత చూపుతుందని వారి వాదన. ఇప్పటికే 2008-09 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి రికవరీ కోసం నానాతంటాలూ పడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది శరాఘాతమేనని స్పష్టం చేస్తున్నారు. మరోపక్క, అమెరికా కాంగ్రెస్(ఇరు సభల ప్రతినిధులు) దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదానిపై ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలోనూ ఆందోళన కనబడుతోంది. ఈ గండం నుంచి అమెరికా ఎలా గట్టెక్కుతుందోనని ఇన్వెస్టర్లు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఫిస్కల్ క్లిఫ్ సంగతిదీ...
అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ల పార్టీకి చెందిన జార్జి బుష్ హయాంలో ప్రజలకు పన్నుల ఉపశమనం కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. వీటిని డెమెక్రాట్‌లకు చెందిన ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా నేతృత్వంలోని ప్రభుత్వం కూడా 2010లో తాత్కాలిక ప్రాతిపదికన పొడిగించింది. ఈ చర్యల గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో తీరిపోతుంది. అంటే... 2013 జనవరి 1 నుంచి ఆటోమేటిక్‌గా పన్నుల పెంపు, ప్రభుత్వ వ్యయాల్లో కోత అమల్లోకి వచ్చేస్తుంది. ఈ పరిణామాన్నే ఫిస్కల్ క్లిఫ్‌గా వ్యవహరిస్తున్నారు. దీన్ని నివారించేందుకే ఇప్పుడు చివరి ప్రయత్నాలు జరుగుతున్నాయి..

ఎవరి వాదనలు ఏంటి...
రిపబ్లికన్ పార్టీ సభ్యులు పన్నుల పెంపునకు మొదటి నుంచీ ససేమిరా అంటున్నారు. దీనికి బదులు పన్నుల వసూళ్లలో ఇప్పుడున్న లోటుపాట్లను పూడ్చుకొని ఆదాయాన్ని పెంచుకోనేలా మార్గాలు అన్వేషించాలనేది వారి సూచన. మరోపక్క, సామాజిక భద్రత ఇతరత్రా పథకాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న వ్యయాల్లో భారీగా కోత విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా, ఒబామా మాత్రం ఆదాయ పెంపునకు వీలుగా ధనికులపై పన్నులు పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు.

గడువు లోగా ఒకవేళ ఇరు పార్టీలు గనుక ఒక ఒప్పందానికి వచ్చి.. రాజీ నిర్ణయం తీసుకోనిపక్షంలో పన్ను చెలిపుదార్లందరికీ ఈ తప్పనిసరిగా పెరుగుదల అమల్లోకి వచ్చేస్తుంది. కాగా, ఒబామా ప్రతిపాదిత డీల్ కుదిరినప్పటికీ, ఇది ఇరు సభల్లోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక్కడే సమస్య నెలకొంది. రిపబ్లికన్లలో డెమోక్రాట్ వ్యతిరేకులు దీనికి అంగీకరిస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. కాగా, సమయం ఇక మించిపోతుండటంతో డిసెంబర్ 31 డెడ్‌లైన్ అమలులోకి రాకుండా, ప్రత్యామ్నాయంగా జనవరిలో దీనికి పూర్తి పరిష్కారం కోసం అంగీకారం కుదరవచ్చని కూడా మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. పన్నుల పెంపులో కొంత తగ్గింపు, ఏ స్థాయి ఆదాయలకు వర్తింపజేయాలి, ఇతరత్రా ప్రతిపాదనలను జనవరి 1 నుంచే పాత తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేలా ఒప్పందం ఉండొచ్చని కూడా వారు చెబుతున్నారు.