Wednesday, February 10, 2016

51వ వసంతంలోకి ఎస్బీఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ ఈ మధ్యే 50 ఏళ్లు దాటి 51 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. బ్యాంక్ ఏడో సర్కిల్‌గా మొదలైన ప్రస్థానం ఇప్పుడు అనూహ్యమైన వృద్ధిని సాధించి మిగిలిన శాఖలకు పోటీగా ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తమ సేవలు కొనసాగిస్తూ.. రెండు రాష్ట్రాల వృద్ధిలో తాము కీలకపాత్ర పోషిస్తామని సిజిఎం హర్‌దయాల్ ప్రసాద్ చెబ్తున్నారు.

1965లో ఫిబ్రవరి ఒకటో తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఏడో సర్కిల్‌గా హైదరాబాద్ లోకల్ హెడ్ ఆఫీస్  ప్రారంభమైంది. అప్పట్లో 61 బ్రాంచీలు, 41 సబ్ ఆఫీసులు మాత్రమే ఉండేవి. 22 కోట్ల డిపాజిట్లు, 8 కోట్ల అడ్వాన్సులతో మొదలైన ఎల్‌హెచ్ఓ(లోకల్ హెడ్ ఆఫీస్) ప్రస్థానం 50 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు 91 వేల కోట్ల డిపాజిట్లు, 1.03 లక్షల కోట్లు అడ్వాన్సులతో మిగిలిన సర్కిల్స్‌కు ధీటుగా ఎదుగుతోంది హైదరాబాద్.

చీఫ్ జనరల్ మేనేజర్‌గా గతేడాది పదవీ బాధ్యతలు స్వీకరించిన హర్‌దయాల్ ప్రసాద్.. హైదరాబాద్ సర్కిల్‌ను మరింత అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్‌దయాల్ ప్రసాద్, 1983లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన సత్తాను చాటి ఎస్బీఐ లాస్ ఏంజెల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. ఇక్కడి బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన ముంబై ఎల్‌హెచ్‌ఓలో జనరల్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. బ్యాంకింగ్‌లోని వివిధ శాఖల్లో విస్తృతమైన అనుభవాన్ని సంపాదించుకున్న హర్‌దయాల్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇప్పుడు 1,435 శాఖలు పనిచేస్తున్నాయి.

50 సంవత్సరాలు పూర్తిచేసుకుని.. కొద్ది రోజుల క్రితమే 51 సంవత్సరంలోకి అడుగుపెట్టిన హైదరాబాద్ లోకల్ హెడ్ ఆఫీస్ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. సర్కిల్‌లో పనిచేసిన మాజీ ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైన తమ అనుభవాలు పంచుకున్నారు. ఉద్యోగులంతా ఒక్క చోట చేరి.. జరుపుకున్న సంబరాలు అందరినీ సంతోషంలో ముంచెత్తాయి.