Wednesday, February 10, 2016

అరుంధతీ భట్టాచార్య నాయకత్వంలో ఎస్బీఐ

రెండు శాతాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న బ్యాంకులో మొదటిసారిగా మహిళ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు అరుంధతీ భట్టాచార్య. మూడేళ్ల క్రితం ఆమె ఎస్బీఐ పగ్గాలు చేపట్టినప్పుడు అంతా నోరెళ్లబెట్టారు. అయితే అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ.. అరుంధతీ భట్టాచార్య దూసుకుపోతున్నారు. ప్రైవేట్ బ్యాంకులకు ధీటుగా తీర్చిదిద్దడంతో పాటు కొత్తతరం జనాలకు చేరువ చేసేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు అందరి మన్ననలూ పొందుతున్నాయి.


బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం అరుంధతీ భట్టాచార్య సొంతం. 1977లో ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా ఆమె చేరారు. 39 సంవత్సరాల తన కెరీర్‌లో రిటైల్, ట్రెజరీ, కార్పొరేట్ ఫైనాన్స్ వంటి విభాగాల్లో కీలక బాధ్యతలను నిర్వహించారు. డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్, కార్పొరేట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, మర్చంట్ బ్యాంకింగ్‌ చీఫ్ వంటి ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించారు. జనరల్ ఇన్సూరెన్స్, కస్టడీ సర్వీసెస్, ఎస్‌బీఐ మెక్వైరీ ఇన్‌ఫ్రా ఫండ్ సబ్సిడరీస్ వంటి విభాగాల ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. బ్యాంక్ న్యూయార్క్ ఆఫీస్ ఎక్స్‌టర్నల్ ఆడిట్, కరస్పాండెంట్ రిలేషన్స్ చీఫ్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించారు.

57 ఏళ్ల అరుంధతీ భట్టాచార్య.. బ్యాంకులో నూతన్నోత్తేజాన్ని నింపారు. సోషల్ మీడియాలో రావాలని గతంలో ప్రయోగం చేసి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎస్బీఐ.. ఈమె సారధ్యంలో దూసుకుపోయింది. వస్తూవస్తూనే ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్‌లలో బ్యాంక్ ప్రమోషన్‌కు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎస్బీఐకి ట్విట్టర్‌లో  3.24 లక్షల మంది, ఫేస్ బుక్‌లో 39 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇవే కాదు ఇన్‌స్టాగ్రామ్, పిన్‌ట్రెస్ట్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ ఎస్బీఐ హవా కనిపిస్తోంది. ఎస్బీఓ అంటే ఓ ఓల్డ్ ఫ్యాషన్డ్ గవర్నమెంట్ బ్యాంక్ అనే ట్యాగ్‌ను పూర్తిగా చెరిపేసి 'జెన్ వై' కస్టమర్లకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

బ్యాంకును అంతర్గతంగా, బహిర్గతంగా పటిష్టం చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టారు. మొండి బకాయిలతో ఇబ్బందిపెట్టేవాళ్లను గుర్తించడం, ఖర్చుల తగ్గింపు, హెచ్ఆర్‌ విభాగాల్లో మార్పులు, కస్టమర్ సర్వీస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం వంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భట్టాచార్య బాధ్యతలు చేపట్టాక బ్యాంక్ డిపాజిట్స్ 13 శాతం పెరిగాయి. ఎస్బీఐ ఆస్తులు 14.24 శాతం వృద్ధి చెందడంతో పాటు లాభాలు కూడా ఇరవై శాతం వరకూ పెరిగాయి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆమెను బెస్ట్ సీఈఓ 2015గా మార్చాయి.

స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ యాప్ కూడా ఆమె సారధ్యంలో రూపకల్పన జరిగిందే. ఒక్క ఏడాదికాలంలోనే రూ. 11,662 కోట్ల విలువ చేసే 7.71 కోట్ల లావాదేవీలు ఈ వేదిక ద్వారా జరిగాయి. మొబైల్ బ్యాంకింగ్ స్పేస్‌లో ఇప్పుడు ఎస్బీఐ మార్కెట్ లీడర్. ప్రస్తుతం ఎస్బీఐ దగ్గర 1.35 కోట్ల మంది మొబైల్ యూజర్స్ ఉన్నారు. మొత్తం మొబైల్ బ్యాంకింగ్‌లో ఒక్క ఎస్బీఐ వాటానే 46 శాతం. 13 భాషల్లో ఉన్ 'బడ్డీ' డిజిటల్ వాలెట్ ఇప్పటికే ఎంతో మంది చేరువైంది. 'బటువా' పేరుతో మరో యాప్‌ను మాస్‌ కోసం తయారు చేసేందుకు భట్టాచార్య ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలా ఒక్క రిటైల్ కస్టమర్లకే పరిమితం కాకుండా కార్పొరేట్ జనాలకు కూడా ఎన్నో సేవలను అందుబాటులోకి తెచ్చి డిటిటల్ సీఈఓగా పేరుతెచ్చుకున్నారు అరుంధతీ భట్టాచార్య.