Wednesday, February 10, 2016

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుదీర్ఘమైన చరిత్ర

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ది బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. దేశంలోని నెంబర్ ఒన్ ప్రభుత్వ బ్యాంక్. దేశవ్యాప్తంగా అనేక మారుమూల ప్రాంతాల్లో ఈ బ్యాంక్ తన నెట్‌వర్క్ విస్తరించి ఉంది. కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఉంటుందో ఉండదో కానీ.. అక్కడ మాత్రం ఎస్బీఐ శాఖ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్ అనే ట్యాగ్ లైన్‌లానే.. మన దేశంలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఎస్బీఐతో అనుబంధం ఉండనే ఉంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రైవేట్ బ్యాంకులతో పోటీపడడం, వినూత్న ప్రోడక్టులతో కస్టమర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకోవడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే సాధ్యమైంది. అందుకే కోట్లాది మంది కస్టమర్లు ఎస్బీఐని తమ సొంత బ్యాంకులా భావిస్తారు.

మన ఊళ్లో.. మన కాలనీలో, ఇంటర్నెట్లో.. ఇంటిపక్కన కనిపించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుదీర్ఘమైన చరిత్రే ఉంది. బలమైన పునాదులపై నిర్మాణమైన ఈ బ్యాంక్ నానాటికీ అంతే ధృడంగా మారుతూ వస్తోంది. 1806లో మొదలైన ప్రస్థానం.. అంచలంచెలుగా... ఎదిగి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో చేరింది.

బ్రిటిష్ పాలనా కాలంలో నుంచే ఎస్‌బీఐ మూలాలు ఉన్నాయి. 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా ఏర్పాటయ్యింది. తరువాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేను నెలకొల్పారు. 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఏర్పాటయ్యింది. 1921లో ఈ మూడు బ్యాంకుల విలీనంతో కలకత్తా కేంద్రంగా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను బ్రిటిషర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకును 1955లో నెహ్రూ ప్రభుత్వం జాతీయీకరణ చేసింది. ఇంపీరియల్ బ్యాంక్ పేరును పార్లమెంటులో చట్టం ద్వారా  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద 66వ బ్యాంకుగా ఎస్బీఐ కీర్తిగడించింది. దేశంలోని మొత్తం బ్యాంకింగ్ అసెట్స్‌లో ఎస్‌బీఐ, దాని ఐదు అనుబంధ బ్యాంకులు 20 శాతం పైగా వాటాను కలిగి ఉన్నాయి.

20 లక్షల కోట్లకు పైగా ఆస్తులు, 16 వేలకు పైగా శాఖలు, 36 దేశాల్లో 190కి పైగా ఫారిన్ ఆఫీసులు.. ఇదీ సింపుల్‌గా ఎస్బీఐ ట్రాక్ రికార్డ్. దాదాపు 29 కోట్ల మంది ఖాతాదారులు, 45 కోట్లకుపైగా ఖాతాలతో ఎస్బీఐ దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థగా అలరారుతోంది. దేశంలో ఉన్న శాఖల్లో దాదాపు 66 శాతం బ్రాంచ్‌లు గ్రామీణ - ద్వితీయ శ్రేణి నగరాల్లోనే ఉన్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, చిన్న పట్టణాలపై కూడా బ్యాంకుకు ఉన్న శ్రద్ధ ఎలాంటిదో. అదే స్థాయిలో మాస్కో, కొలంబో, హాంకాంగ్, ఫ్రాంక్‌ఫర్ట్, టోక్యో, సిడ్నీ, లండన్.. ఇలా వివిధ దేశాల్లో ఎన్‌ఆర్‌ఐలకు చేరువయ్యేందుకు కూడా ఎస్బీఐ శాఖలను తెరిచింది. 2014 ఆర్థిక సంవత్సరం నాటికి ఎస్బీఐకి 43,515 ఏటిఎంలు ఉన్నాయి. అనుబంధ బ్యాంకులతో కూడా కలిపి చూసుకుంటే ఈ సంఖ్య 53 వేలకు పెరుగుతుంది. జమ్మూ - కాశ్మీర్ కార్గిల్ వంటి అతి సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతంలో ఏటిఎం ఏర్పాటు చేసిన ఘనత కూడా ఎస్బీఐకే దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. దేశ అత్యున్నత బ్యాంకుకు ఉన్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. వీటిని బ్రేక్ చేయడం కాదు కదా.. దరిదాపుల్లోకి వచ్చే సత్తా కూడా మిగిలిన వాటికి లేదు అంటే ఆశ్చర్యం కాదు.

ఎస్బీఐ అసోసియేట్ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ ఉన్నాయి. నాన్ బ్యాంకింగ్ సబ్సిడరీల్లో క్యాపిటల్ మార్కెట్స్, ఎస్బీఐ కార్డ్స్, జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. ఆర్థిక, బ్యాంకింగ్ విభాగాల్లో తన సత్తా చాటుతున్న బ్యాంక్ నానాటికీ విస్తరిస్తోంది. అందుకే అవార్డుల్లోనూ ఈ  బ్యాంకుకు సాటిలేదు. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్‌లో చేరిన మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఇదే. ఫోర్బ్స్ టూ థౌజండ్ (2000) లార్జెస్ట్ కంపెనీస్ ఇన్ ది వాల్డ్‌ లిస్ట్‌లో కూడా తన స్థానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటోంది ఎస్బీఐ. లండన్‌కు చెందిన ది బ్యాంకర్ మ్యాగ్జైన్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్  - 2008గా అవార్డును ఇచ్చింది. ఆర్థిక రంగంలో రెప్యుటేషన్ ఉన్న టాప్ కంపెనీలపై వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన సర్వేలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్న ఘనత కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే దక్కింది. రికార్డులు క్రియేట్ చేయడంలో అయినా, వాటిని బ్రేక్ చేయడంలో అయినా ఎస్బీఐకి ఎస్బీఐ మాత్రమే సాటి అని ప్రపంచం మొత్తం మెచ్చుకుంటోంది.