Wednesday, February 10, 2016

దూసుకుపోతోన్న ఎస్బీఐ

లీడర్.. లీడ్స్ ఫ్రం ది ఫ్రంట్.. అంటారు. అంటే.. ముందుండి నడిపించే వాడే నాయకుడు. బ్యాంకింగ్ సామ్రాజ్యంలో ఎస్బీఐ కూడా అలాంటి పాత్రే పోషిస్తోంది. బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్ అని అనిపించుకుంటున్న ఎస్బీఐ... టెక్నాలజీని, వినూత్నతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటోంది. ఇతర బ్యాంకులు ఎంత పరిజ్ఞానంతో ముందుకు వచ్చినా.. వాళ్లందరినీ బీట్ చేస్తూ.. దూసుకుపోతోంది.


ఏ వ్యవస్థనైనా నూతనత్వమే ముందుకు నడిపిస్తుంది. కస్టమర్ల అవసరాలు, మారుతున్న కాలానికి తగ్గట్టు మారితేనే మనుగడ ఉంటుంది. ప్రపంచమంతా అత్యంత వేగంగా ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ఏ మాత్రం వెనుకబడినా ఇబ్బందులు తప్పవు, అందునా ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో ఆ జోరు మరింత ముఖ్యం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత స్పీడ్‌లో ఓన్ చేసుకుంటే.. అంత స్పీడ్‌గా వృద్ధి కూడా ఉంటుంది. బ్యాంకులకు వచ్చి కార్యకలపాలు నిర్వహించుకునే స్థాయి నుంచి జనాలు ఇంట్లో కూర్చునే పనులు కానించేసే పరిస్థితులు వచ్చేశాయి. చేతుల్లో ఉన్న మొబైల్‌తోనే ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు జనాలు ఎక్కువగా మొగ్గుచూపుతున్న పరిస్థితులు. బ్యాంక్ శాఖల్లో క్యూ లైన్లలో నిలబడేందుకు కూడా జనాలు సిద్ధంగా లేరు. అందుకే వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎస్బీఐ కూడా జోరు పెంచుతూ వస్తోంది. ఓ వైపు బ్రాంచ్ నెట్‌వర్క్ విస్తరించుకుంటూనే టెక్నాలజీని కూడా బలోపేతం చేస్తోంది.

ఎస్‌బిఐఐన్ టచ్ (SBIIN TOUCH) పేరుతో బ్యాంక్ ఈ మధ్యే ఆరు సరికొత్త డిజిటల్ టెక్నాలజీ బ్రాంచులను ప్రారంభించింది. ఢిల్లీ సహా ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో ఈ శాఖలు ఉన్నాయి. యంగ్ జనరేషన్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వీటిని ప్రారంభించారు. ఈ కియోస్క్ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతాను తెరవచ్చు. ఈ ఇంటరాక్టివ్ మెషీన్స్ ద్వారా అక్కడికక్కడే ఫోటోగ్రాఫ్స్ తీసుకుని, డాక్యుమెంట్లను స్కాన్ చేసుకుని సబ్మిట్ చేయవచ్చు. త్వరలో ఇలాంటి డిజిటల్ బ్యాంకుల సంఖ్యను 250కి పెంచబోతున్నట్టు ఎస్బీఐ చెబ్తోంది. ఇప్పటికే బిజినెస్ కరస్పాండెంట్ల నెట్‌వర్క్ ఉన్న ఈ సంస్థ.. మరింత మందికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. డిజిటల్ బ్యాంకుల్లో కేవలం ఒకరిద్దరు ఉద్యోగులు మాత్రమే ఉండి సేవలందిస్తారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా వీటిని విస్తరించాలని బ్యాంక్ యోచిస్తోంది. స్మార్ట్ ఏటిఎం, పర్సనలైజ్డ్ ఏటిఎం కార్డులు వంటివి కూడా కస్టమర్ల అభిమానాన్ని చూరగొన్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోనూ నిత్యం మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాలో భాగంగా అనేక కార్యక్రమాలను బ్యాంక్ డిజిటలైజ్ చేస్తూ వస్తోంది.

గతేడాది బడ్డీ పేరుతో స్టేట్ బ్యాంక్ ఓ మొబైల్ వాలెట్ ప్రారంభించింది. యాక్సెంచర్, మాస్టర్ కార్డ్‌ కలిసి దీన్ని రూపొందించింది. ఇప్పుడు బ్యాంకుకు ఉన్న దాదాపు 30 కోట్ల మంది కస్టమర్లలో దాదాపు రెండు కోట్ల మంది ఇంటర్నెట్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కోటి ఇరవై లక్షల మంది మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఈ బ్యాంకును అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ లాంటి దేశంలో బ్యాంకింగ్‌కు ఇంకా చాలా స్కోప్ ఉంది. ఇక్కడి నుంచి ఎన్నో రెట్లు అభివృద్ధి చెందేందుకు కూడా అవకాశం కలిగి ఉన్న నేపధ్యంలో ఎస్బీఐ లాంటి అతిపెద్ద బ్యాంక్ ఇలాంటి ఆలోచనలతో ముందుకు రావడం హర్షించాల్సిన విషయం.