Wednesday, February 10, 2016

కస్టమర్లకు సులువుగా ఎస్బీఐ రుణాలు

ఒకప్పుడు లోన్లు కావాలంటే.. బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఈ మధ్య బ్యాంకులో మన ముంగిట్లోకి వచ్చి లోన్లు ఇచ్చే పరిస్థితి వస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న కార్, హౌజింగ్ మేళాతో కస్టమర్లకు సులువుగా రుణాలు దొరుకుతున్నాయి. డిస్కౌంట్లతో పాటు స్పాట్ అప్రూవల్‌ ఉండడం కూడా కస్టమర్లకు కలిసొస్తోంది.

ఇల్లు.. ఓ సామాన్యుడి కల. సొంతింట్లో ఉంటే ఆ అనందమే వేరు. ఎన్ని తిప్పలు పడ్డా.. చివరకు ఓ గూడు ఉండాలనేది ప్రతీ ఒక్క మధ్యతరగతి వ్యక్తి ఆలోచన. అందుకే బ్యాంకులు కూడా ముందుకు వచ్చి విరివిగా తమ కస్టమర్లకు లోన్లు ఇస్తూ ఉంటాయి. అయితే ప్రభుత్వ బ్యాంకులు మేలా.. ప్రైవేట్ బ్యాంకులు మేలా అనే కన్ఫ్యూజన్‌తో ఉంటారు జనాలు. సాధారణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడల్లా ఎస్బీఐ వంటి ప్రముఖ బ్యాంకులే వడ్డీల్లో మొదట కోత విధిస్తాయి. మిగిలిన వాటితో పోలిస్తే కొన్ని బేస్ పాయింట్లు వడ్డీ కూడా తక్కువే ఉంటుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు వంటివి కూడా కాస్త అందుబాటులోనే ఉంటాయి. అందుకే ఎస్బీఐ వంటి వాటికే కస్టమర్లు ఎక్కువగా మొగ్గుచూపుతూ ఉంటారు.

లోన్లు కావాలంటే ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు బ్యాంకులే మన ఇళ్ల దగ్గరికి వచ్చేస్తున్నాయి. కార్ మేళా, హౌజింగ్ లోన్ మేళా పేరుతో కస్టమర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంది. తరచూ రుణమేళాలు నిర్వహిస్తూ కస్టమర్లకు చేరువవుతోంది. ఇలాంటి ప్రాపర్టీ షోస్ నిర్వహించడం వల్ల బిల్డర్లు, కస్టమర్లను ఒకే వేదికపైకి తెచ్చినట్టు అవుతుందని బ్యాంకర్లు చెబ్తున్నారు.
ప్రాసెసింగ్ ఫీజ్‌ను రద్దు చేయడంతో పాటు సింపుల్ లోన్ ప్రాసెస్‌ ఉండడం వల్ల కస్టమర్ల టైం సేవ్‌ అవుతుందనేది వీళ్ల భావన.

అటు బిల్డర్లు, ఇటు బ్యాంకూ ఒకే చోట ఉండడం చాలా సంతోషంగా ఉందంటున్నారు కస్టమర్లు. మొదట ప్రాపర్టీల చుట్టూ తిరగడం, వాటికి లోన్లు వస్తాయో రావడం తికమకపడాల్సిన అవసరం లేదంటున్నారు. రుణాలు ఇచ్చే బ్యాంకులే ముందుకు రావడం సంతోషంగా ఉందనేది మరికొంత వినియోగదారుల మాట.

ఇలాంటి ప్రాపర్టీస్ మేళా వల్ల తమకు కన్వర్షన్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయని బిల్డర్స్ చెబ్తున్నారు. స్పాట్ సాంక్షన్స్ వల్ల కస్టమర్లకు కూడా ఒక క్లారిటీ వస్తుందనేది వాళ్ల సంతోషం.

ఇలాంటి రుణమేళాలలో ప్రాసెసింగ్ ఫీజులు రద్దు చేయడం, కొన్ని బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లలో డిస్కౌంట్లు కూడా ఇవ్వడంతో కస్టమర్లు కూడా ఆకర్షితులవుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తామని చెబ్తున్నారు అధికారులు.