Saturday, March 8, 2014

విండోస్ ‘దేశీ’ మొబైల్స్!

Sakshi | Updated: March 07, 2014 00:58 (IST)
విండోస్ ‘దేశీ’ మొబైల్స్!
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విండోస్ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకు దేశీయ మొబైల్ ఫోన్ కంపెనీలు సైతం రంగంలోకి దిగాయి. అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లను అందించి భారత మొబైల్ ఫోన్ రంగంలో దూసుకెళ్తున్న ఈ కంపెనీలు.. ఇక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) ఆధారిత స్మార్ట్‌ఫోన్లపై దృష్టిపెట్టాయి. దిగ్గజ కంపెనీ నోకియాను సైతం ఆన్‌డ్రాయిడ్ మార్కెట్లోకి దింపిన భారతీయ బ్రాండ్లు కొత్త సంచలనాలకు రెడీ అవుతున్నాయి. కస్టమర్ల ముంగిటకు కొత్త కొత్త విండోస్ ఫోన్లు అదీ రూ.10 వేల లోపే తేబోతున్నాయి.

 తక్కువ ధరకే విండోస్ ఫోన్లు..
 ఓపెన్ సోర్స్ వేదిక కావడంతో చాలా కంపెనీలు ఆండ్రాయిడ్  ఓఎస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అందుకే మొత్తం స్మార్ట్‌ఫోన్లలో వీటి వాటా  78.9% ఉంది. విండోస్ ఓఎస్ లెసైన్సు రుసుమును మైక్రోసాఫ్ట్ గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయని  కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజ సాక్షికి చెప్పారు. అదే జరిగితే మరిన్ని కంపెనీలు ఈ రంగంలోకి అడుగు పెట్టడం ఖాయం. అంతేకాదు రూ.10 వేల లోపే విండోస్ ఫోన్లు లభించవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ప్రస్తుతం విండోస్ వాటా 3.9 శాతమే. 2018కల్లా ఇది 7 శాతానికి చేరుతుందని పరిశోధనా సంస్థ ఐడీసీ అంచనా వేస్తోంది. ఆన్‌డ్రాయిడ్ మార్కెట్ ప్రస్తుతమున్న 78.9 నుంచి 76 శాతానికి చేరుతుందని వెల్లడించింది. ఆపిల్ ఐఓఎస్ 14.9 నుంచి 14.4 శాతానికి తగ్గుతుందని వివరించింది.

 జోలో బ్రాండ్ ఇటీవలే విండోస్ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించి ఈ విభాగంలోకి ప్రవేశించిన తొలి భారతీయ బ్రాండ్‌గా నిలిచింది. కొద్ది రోజుల్లో విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా తేబోతోంది. మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్‌కాన్‌లు కూడా కొద్ది రోజుల్లో విండోస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నాయి. కొద్ది రోజుల క్రితం మైక్రోసాఫ్ట్‌తో చైనా కంపెనీ జియోనీ చేతులు కలిపింది. ఆన్‌డ్రాయిడ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ రెండూ కలిగిన స్మార్ట్‌ఫోన్లను కార్బన్ మొబైల్స్ జూన్‌కల్లా ప్రవేశపెడుతోంది.

 రూ.6 వేలకే సెల్‌కాన్ విండోస్ ఫోన్లు..
 తొలుత 4, 5 అంగుళాల్లో విండోస్ ఫోన్లను సెల్‌కాన్ తేనుంది. వీటిని రూ.6-7 వేలకే పరిచయం చేయాలని భావిస్తున్నట్టు సెల్‌కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. మే నాటికి ఇవి మార్కెట్లో ఉంటాయని చెప్పారు. ఈ నెలలోనే మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు వివరించారు. ఆన్‌డ్రాయిడ్, విండోస్ డ్యూయల్ ఓఎస్ ఫోన్లు పరిశోధన, అభివృద్ధి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మంచి ఫీచర్లతో మోడళ్లకు రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు.