Saturday, March 8, 2014

మూడేళ్లకే బైక్ మార్చేస్తున్నారు!

Sakshi | Updated: March 08, 2014 01:12 (IST)
మూడేళ్లకే బైక్ మార్చేస్తున్నారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘వ్యూహం అంటూ లేకుండా వాహన రంగంలో నిలదొక్కుకోలేం. బజాజ్ ఆటో భారతీయ కంపెనీయే. కానీ మేం ఇక్కడితో పరిమితం కాలేదు. 30కి పైగా దేశాలకు వాహనాలను సరఫరా చేస్తున్నాం. మా దృష్టి భారత్‌తోసహా అన్ని మార్కెట్లపైనా ఉంటుంది. ఒక దేశం కోసం అంటూ వాహనాలను తయారు చేయం’ అని అంటున్నారు బజాజ్ ఆటో కంపెనీ, మోటార్ సైకిల్  విభాగపు ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్. సరికొత్త డిస్కవర్ 125 బైక్‌ను ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. కస్టమర్ల అభిరుచులు, కంపెనీ భవిష్యత్ కార్యాచరణ, మార్కెట్ తీరుతెన్నులు ఆయన మాటల్లోనే..
 మూడేళ్లయితే చాలు..
 దక్షిణాదివారైనా, ఉత్తరాదివారైనా మోటార్ సైకిళ్ల విషయంలో భారతీయ కస్టమర్ల అభిరుచులు దాదాపు ఒకేలా ఉన్నాయి. స్టైల్, మంచి పవర్ ఉన్న బైక్‌లపై మక్కువ పెరుగుతోంది. గతంలో ఒకసారి బైక్ కొంటే ఏడెనిమిదేళ్లు వాడేవారు. ఐదేళ్ల క్రితం వరకు ఈ ట్రెండ్ ఉండేది. ఇప్పుడు మూడు నాలుగేళ్లకే వాహనం మారుస్తున్నారు. రెండేళ్లుగా సెంటిమెంట్ బాగోలేదు. ఉద్యోగం ఉంటుందో లేదో అన్న ఆందోళనలో ఉంటే కొత్త బైక్ కొనలేరుగా. అందుకే ద్విచక్ర వాహన పరిశ్రమ స్తబ్దుగా ఉంది. వచ్చే ఏడాది వృద్ధి ఖాయం. ఎక్సైజ్ డ్యూటీని 12 నుంచి 8 శాతానికి కుదించడం మంచి పరిణామం. కొత్త ప్రభుత్వం ఈ తగ్గింపు సుంకాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం. మా వాహనాల ధరను రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు తగ్గించాం.

 స్కూటర్ తెచ్చే ఆలోచనే లేదు..
 ప్రపంచంలో అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో 80 శాతం మోటార్ సైకిళ్లే. ప్రపంచ వ్యాప్తంగా మోటార్ సైకిళ్ల విభాగంలో బ జాజ్‌కు 10 శాతం వాటా ఉంది. అందుకే మోటార్ సైకిల్ కంపెనీగా మాత్రమే మేం కొనసాగుతాం. స్కూటర్ తయారు చేసే ఆలోచన ఏ మాత్రం లేదు. ఏటా 48 లక్షల బైక్‌లను తయారు చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది. ప్లాంట్ల యుటిలైజేషన్ 85 శాతం. ఇందులో ఎగుమతుల వాటా 33 శాతం. దేశంలో మోటార్ సైకిళ్లలో 22 శాతం వాటా బజాజ్‌కు ఉంది. కొత్త డిస్కవర్ 125 రాకతో ఇది 30 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం.

 ఆ మూడింటిపైనే..
 క్రూయిజర్ బైక్ అయిన అవెంజర్ 220 హోట్ కేక్‌లా అమ్ముడుపోతోంది. ప్రస్తుతానికి అవెంజర్ బ్రాండ్‌లో ఈ ఒక్క మోడల్‌నే కొనసాగిస్తాం. కొత్త వేరియంట్లు ఏవైనా పల్సర్, ప్లాటినా, డిస్కవర్.. ఈ మూడు బ్రాండ్లలో మాత్రమే విడుదల చేస్తాం.

 ఏపీలో ఎక్కువ కాబట్టే..
 దేశంలో నెలకు 1.6 లక్షల బైక్‌లు 125 సీసీ సామర్థ్యం గలవి అమ్ముడవుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 17 శాతముంది. ఈ కారణంగానే భారత్‌లో తొలిసారిగా కొత్త డిస్కవర్ 125ని హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించాం. 100 సీసీ బైక్‌లు కేవలం మైలేజీకే పరిమితం. 7.5-8 హార్స్‌పవర్‌ను ఇవి మించడం లేదు. మైలేజీ మినహా మరే ఇతర ప్రయోజనం లేదు. 20 ఏళ్లుగా ఈ విభాగంలో పెద్దగా సాంకేతిక అభివృద్ధి జరగలేదు. అధిక సామర్థ్యం గల బైక్ కొనాలని ఉన్నా ఖర్చు ఎక్కువని, మైలేజీ రాదని కస్టమర్లు మిన్నకుండి పోతారు. వీరికోసమే స్టైల్, పవర్, మైలేజీ కలిగిన కొత్త డిస్కవర్ 125ను పరిచయం చేశాం. 11.5 పీఎస్ పవర్, మైలేజీ 76 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ 100 కిలోమీటర్లు. డ్రమ్ బ్రేక్ మోడల్ ధర హైదరాబాద్ ఎక్స్ షోరూంలో రూ.49,075. డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంది. ఆరు రకాల ఆకర్షణీయ రంగుల్లో ఇది లభిస్తుంది.