Tuesday, March 11, 2014

డాలర్ భారం

విమానాల నిర్వహణ వ్యయంలో 70 శాతంపై ప్రభావం
ఈనాడు - హైదరాబాద్ దేశీయంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన పరిశ్రమపై డాలర్ ప్రభావం అధికం. విమానాల కొనుగోలు, నిర్వహణలపై విమానయాన కంపెనీలు చేసే వ్యయంలో సిబ్బందికి వేతనాలు వంటివి మినహా 70 శాతానికి పైగా ఖర్చులు డాలర్‌పైనే ఆధారపడి ఉంటున్నాయి. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ బాగా పెరగడంతో దేశీయంగా విమానయాన సంస్థల నష్టాలకు ఇదీ ఒక కారణం అవుతోంది.

విమానాల కొనుగోలు అనంతరం రోజువారీ కార్యకలాపాలకు వైమానిక ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్.. ఏటీఎఫ్), విడిభాగాల కొనుగోలుకు, కాలక్రమంలో సర్వీసింగ్‌కు డాలర్ రూపేణా చెల్లింపులు జరపవలసి వస్తోంది. విమానయాన సంస్థలు జరిపే చెల్లింపుల్లో 70 శాతం వరకు డాలర్ రూపంలోనే ఉంటాయని పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి అశోక్ కుమార్ 'ఈనాడు'తో చెప్పారు. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ గణనీయంగా పెరగడం, సంస్థలపై అధిక ప్రభావం చూపుతోందని తెలిపారు. ఏటీఎఫ్‌పై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సుంకం కూడా వేర్వేరుగా ఉంటోందని తెలిపారు. ఈ మొత్తాన్ని తగ్గించాలని, ఒకే రకంగా ఉంచాలని సూచిస్తున్నా, తమకు ఆదాయమార్గం కనుక రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కిలోలీటరు ఏటీఎఫ్ ధర కోల్‌కతాలో రూ.87,000 కాగా, బ్యాంకాక్‌లో రూ.50,000 మాత్రమే అవుతోందని చెప్పారు. తమిళనాడులో ఏటీఎఫ్‌పై వ్యాట్ 30 శాతం వరకు, రాష్ట్రంలో 16 శాతం వరకు ఉందని వివరించారు. ఫలితంగా దేశీయ గమ్యస్థానాలకు నడుస్తున్న విమానయాన కంపెనీలపై అధిక భారం పడుతోందని, విదేశాల నుంచి వచ్చేవాటికి తక్కువ వ్యయం అవుతోందని చెప్పారు. విదేశాల్లో పన్నులు తక్కువగా ఉండడం దీనికి కారణం.

విమానాశ్రయాల్లో ఛార్జీలు కూడా భారమే
దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారికి కూడా విమానాశ్రయాల్లో రుసుములు భారంగా మారుతున్నాయని అశోక్‌కుమార్ చెప్పారు. కొన్ని విమానాశ్రయాల్లో ల్యాండింగ్, రాత్రి పార్కింగ్ ఛార్జీలు అధికంగా ఉంటున్నాయని, ఈ భారం ప్రయాణికులపైనే పడుతుందన్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులపై నేరుగా అభివృద్ధి రుసుం, సెక్యూరిటీ వంటి ఇతర రుసుములు ఉంటున్నాయని, ఈ భారం తగ్గితే ప్రయాణికుల సంఖ్య మరింత వేగంగా వృద్ధి చెందుతుందని వివరించారు.
2020 నాటికి మూడో స్థానం!
40కి పైగా విమానాశ్రయాలు, 400కు పైగా విమానాలతో అంతర్జాతీయంగా 9వ స్థానంలో భారత విమానయాన పరిశ్రమ నిలిచింది. ప్రస్తుతం దేశీయ గమ్యస్థానాలకు 12.10 కోట్ల మంది, 4.10 కోట్లమంది విదేశాలకు విమానాల్లో రాకపోకలు సాగిస్తున్నారని అంచనా. 2020 నాటికి ఈ రంగంలో అమెరికా, చైనా తరవాత మూడో స్థానానికి మన దేశం చేరుతుందని అంచనా. 2020 నాటికి విమానాల్లో దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య 33.60 కోట్లకు, విదేశాలకు వెళ్లే వారి సంఖ్య 8.50 కోట్లకు చేరుతుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేస్తోంది. రాబోయే 20 ఏళ్లలో దేశీయ విమానయాన రంగంలో వృద్ధి అత్యంత వేగవంతంగా ఉంటుందని దిగ్గజ సంస్థలన్నీ అంచనా వేస్తున్నాయి.

భవిష్యత్తులో వృద్ధి చిన్న నగరాల నుంచే
ప్రస్తుతం విమాన ప్రయాణికుల్లో 30 శాతం రెండో అంచె నగరాలు, మూడో అంచె నగరాల నుంచీ వస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో మొత్తం ప్రయాణికుల్లో 45 శాతం చిన్న నగరాల నుంచే ఉండవచ్చని అంచనా. ఈ నగరాలకు చిన్నపాటి విమానాలు నిర్వహిస్తేనే లాభదాయకం అని కంపెనీలు భావిస్తున్నాయి. రుసుములు తక్కువగా ఉంటే, టికెట్టు ధరను కూడా తక్కువగా నిర్ణయించవచ్చన్నది విమానయాన సంస్థల ఆలోచన. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా- ఏఏఐ) నేతృత్వంలో చిన్న విమానాశ్రయాలుంటే, వీరికి ఛార్జీల రుసుం తక్కువగా ఉంటుంది. ప్రస్తుత 12వ పంచవర్ష ప్రణాళికలో రూ.1,500 కోట్లతో చిన్న నగరాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఏఏఐ తగిన సన్నాహాలు చేస్తోంది.