Saturday, March 29, 2014

సౌర విద్యుత్తుకు మోకాలడ్డు

ట్రాన్స్‌కో/డిస్కమ్‌లతో ఇబ్బందులు
ప్రభుత్వ విధానం మాత్రం ఆర్భాటం
అమలులో పూర్తిగా విఫలం
ఘొల్లుమంటున్న 'క్యాప్టివ్' యూనిట్లు
ఏపీఈఆర్‌సీ పైనే ఆశలు

Courtesy : ఈనాడు
మన దేశంలో సౌర విద్యుత్తుకు అవకాశాలు అధికం. దీన్ని గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాలు అందిపుచ్చుకున్నాయి. ఎంతో ముందంజ వేశాయి కూడా. కానీ మన రాష్ట్రం మాత్రం వెనుకబడిపోయింది. విధానాల అమల్లో గందరగోళం, అలసత్వం, విద్యుత్తు విభాగాల్లో సానుకూల వైఖరి లేకపోవటం దీనికి కారణాలు. సౌర విద్యుత్తుకు అండగా నిలుస్తూ 2012, సెప్టెంబరులోనే రాష్ట్ర ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ సౌర విద్యుత్ విధానా'న్ని విడుదల చేసింది. పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం.. ఇది ఎంతో అనుకూలమైన విధానం. కానీ అమలులో ఇది పూర్తిగా విఫలమైంది.
ప్రభుత్వ సౌర విద్యుత్ విధానం చూస్తే.. ఎవరైనా ఆహా, ఓహో అనాల్సిందే...! రాష్ట్రంలోని పలు సంస్థలు ప్రభుత్వ విధానానికి మురిసిపోయి.. సొంత (క్యాప్టివ్) సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పాయి. ఇప్పుడవే సంస్థలు నానా అవస్థలు పడుతున్నాయి. 2012 సెప్టెంబరులో 39, 44 జీవోల ద్వారా ప్రత్యేక సౌర విద్యుత్తు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2017 వరకూ ఇది అమల్లో ఉంటుంది. ఈవిధానం ప్రకారం సౌర విద్యుత్ యూనిట్లకు ట్రాన్స్‌మిషన్-వీలింగ్ (విద్యుత్తు ప్రసార, రవాణా) ఛార్జీలుండవు. ఉత్పత్తి చేసిన విద్యుత్తులో వాడుకోకుండా మిగిలిన దానికి 'బ్యాంకింగ్ సదుపాయం' ఉంటుంది. ఈ విధానాన్ని వినియోగించుకోవడానికి 2 శాతం బ్యాంకింగ్ ఛార్జీల కింద చెల్లిస్తే సరిపోతుంది. థర్డ్ పార్టీ విద్యుత్తు అమ్మకానికి క్రాస్ సబ్సిడీ ఛార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. అన్ని సౌర విద్యుత్తు కేంద్రాలకూ విద్యుత్ పన్ను నుంచి మినహాయింపు ఉంది. వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను వాణిజ్య పన్నుల శాఖ తిరిగి చెల్లిస్తుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పరిశ్రమల శాఖ నుంచి తిరిగి చెల్లిస్తారు. అధిక తరుగుదల సదుపాయం ఉండటం, భవిష్యత్తులో విద్యుత్తు యూనిట్ ధర పెరిగినా ఇబ్బంది లేని పరిస్థితి, పెట్టిన పెట్టుబడి అయిదారేళ్లలో వెనక్కి తిరిగొచ్చే అవకాశం... అదనపు ఆకర్షణలు.

అమలు శూన్యం!
రాష్ట్రంలో ఒకటి నుంచి పది మెగావాట్ల వరకూ సామర్థ్యం కల సొంత సౌర విద్యుత్తు యూనిట్లు 30-40 దాకా ఏర్పాటయ్యాయి. సౌర విద్యుత్తుకు ఒక మెగావాట్ సామర్థ్యానికి గతంలో రూ.10-12 కోట్ల వరకూ వెచ్చించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం స్థాపిత వ్యయం రూ.7-7.5 కోట్లకు తగ్గింది. దీంతో పలు సంస్థలు సొంత యూనిట్లు పెట్టుకున్నాయి. ఆ తర్వాత కానీ కష్టాలు తెలిసిరాలేదు. డిస్కమ్/ట్రాన్స్‌కోల నుంచి దీర్ఘకాలిక ఓపెన్ యాక్సెస్ ఒప్పందం (ఎల్‌టీఓఏఏ) ఖరారు కావటానికి యూనిట్ నిర్మాణం పూర్తయి గ్రిడ్‌కు కనెక్ట్ అయిన తర్వాత రెండు మూడు నెలల సమయం పడుతోంది. ఈ లోపు క్యాప్టివ్ యూనిట్లు ఉత్పత్తి చేసే విద్యుత్తు అంతా డిస్కమ్‌ల సొంత ఖాతాలో పడుతోంది. ఆ సంస్థలు వాడుకోవడానికి అవకాశం ఉండట్లేదు. సౌర విద్యుత్తు విధానం ప్రకారం వాడుకోకుండా మిగిలిపోయిన విద్యుత్తుకు 'బ్యాంకింగ్ సదుపాయం' ఇవ్వాలి. దీన్ని ట్రాన్స్‌కో/డిస్కమ్‌లు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ విధానంతో తమకు పనిలేదని, ఏపీఈఆర్‌సీ (ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ సంస్థ) ఆదేశాలనే తాము పాటించాల్సి ఉంటుందని అవి స్పష్టం చేస్తుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిని క్యాప్టివ్ యూనిట్లు ఎదుర్కొంటున్నాయి. ఏదైనా సందర్భంలో గ్రిడ్ నెట్‌వర్క్ పనిచేయక సౌర యూనిట్ల నుంచి విద్యుత్తు తీసుకోలేని పక్షంలో దాన్ని డిస్కమ్‌లు తీసుకున్నట్లుగానే భావించాలని కోరుతుండగా దానికి ఎటువంటి స్పందన లేదు. ఇక వీలింగ్, ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు వసూలు చేయకూడదు. అయినా వసూలు చేస్తున్నారు.

కోట్ల రూపాయల నష్టం
ఓపెన్ యాక్సెస్ ఒప్పందం ఖరారు కావటంలో జరుగుతున్న జాప్యం.. విద్యుత్తు బ్యాంకింగ్ సదుపాయాన్ని అమలు చేయకపోవటం వల్ల సౌర విద్యుత్తు యూనిట్లు కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి. అవి ఉత్పత్తి చేసి వాడుకోగా మిగిలిన విద్యుత్తు అంతా ప్రస్తుతం విద్యుత్తు పంపిణీ సంస్థల ఖాతాల్లోకి వెళ్లిపోతోంది. దీనికి బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించటం పరిష్కారం కాగా.. దాన్ని డిస్కమ్‌లు అమలు చేయటం లేదని ఆయా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సౌరవిద్యుత్తు ప్రతిరోజూ సాయంత్రం వరకు మాత్రమే లభిస్తుంది. ఏదైనా వ్యాపార సంస్థ ఆ తర్వాత విద్యుత్తును వినియోగించుకుంటే దానికి పగలు ఉన్న మిగులు విద్యుత్తును సర్దుబాటు చేయటం లేదు. ఈ విధంగా జరుగుతున్న నష్టం కూడా భారీగా ఉంటోంది. తాము రోజుకు పదివేల యూనిట్లకు పైగా విద్యుత్తును నష్టపోతున్నట్లు ఇటీవల సౌర విద్యుత్తు కేంద్రాన్ని స్థాపించిన సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

అనుమతుల కోసం తంటా
ఇక రాష్ట్రంలో సొంత సౌర విద్యుత్ కేంద్రాన్ని స్థాపించాలంటే దానికి అనుమతుల కోసం ట్రాన్స్‌కో/డిస్కమ్‌ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోవలసిందే. దరఖాస్తు చేసిన నాటి నుంచి సాధ్యాసాధ్యాల నివేదిక, ప్లాంట్ నిర్మాణం, ఓపెన్ యాక్సెస్ ఒప్పందం, మీటర్లు నెలకొల్పటం వరకూ వివిధ దశల్లో విద్యుత్తు కార్యాలయాల చుట్టూ తిరగాలని, డిస్కమ్/ట్రాన్స్‌కోలోని వివిధ విభాగాలు/సెక్షన్లలోని అధికారుల నుంచి వందలాది సంతకాలు తీసుకోవాలని సంబంధిత వర్గాలు వాపోతున్నాయి. ఓపెన్ యాక్సెస్ ఒప్పందం ప్రక్రియ ఏదో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఇచ్చినంత పెద్దదిగా ఉందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సౌర యూనిట్లకు ఈ ప్రక్రియను కుదించాల్సిన అవసరం ఉందని సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ సంస్థ అధిపతి ఒకరు అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చేవారు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ఏపీఈఆర్‌సీ ఆదేశాల కోసం ఎదురుచూపులు
ఈ నేపథ్యంలో క్యాప్టివ్ యూనిట్లు ఇప్పుడు ఏపీఈఆర్‌సీ వైపు చూస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం బ్యాంకింగ్ సదుపాయాన్ని వర్తింపజేయాలని, వీలింగ్/ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు వసూలు చేయరాదని డిస్కమ్‌లను ఏపీఈఆర్‌సీ ఆదేశించాలని కోరుతున్నారు. మరోపక్క వాడుకోకుండా మిగిలిన విద్యుత్తుకు (బ్యాంక్‌డ్ ఎనర్జీ), డిస్కమ్‌లు ఆ ఏడాదిలో వివిధ మార్గాల్లో కొనుగోలు చేసిన సగటు విద్యుత్ ధరలో 50 శాతం చొప్పున చెల్లించాలనే ప్రతిపాదన ఒకటి ఉంది. ఈ సగటు ధర రూ.3-3.50 కంటే ఉండదు. దీన్లో 50 శాతం అంటే, రూ.1.50- 1.75 మాత్రమే. మిగులు విద్యుత్తుకు వాణిజ్య ధర చెల్లించాలి కానీ ఇంత తక్కువ ఇస్తే ఎలాగని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అంశాలను ఏపీఈఆర్‌సీ పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నారు.
వెయ్యి మెగావాట్లు హుళక్కే!
రాష్ట్రంలో 1000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి వీలుగా యూనిట్లు ఏర్పాటు చేసే ఆసక్తిగల సంస్థల నుంచి కు ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియ ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో సౌర విద్యుత్తు యూనిట్ల ఏర్పాటుకు వివిధ సంస్థలు ఇతర రాష్ట్రాల వైపు దృష్టి సారిస్తున్నాయి. దీంతో విద్యుత్తు కొరతను ఎంతోకొంత అధిగమించే అవకాశం చేజారిపోతోంది. జవహర్‌లాల్ సోలార్ ఎనర్జీ మిషన్ (జేఎస్ఈఎం) కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు రెండు దశల్లో 95 మెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యాన్ని మంజూరు చేసింది. కానీ ఇందులో నాలుగో వంతు కూడా అమలు కాలేదు. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 1000 మెగావాట్ల సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని ప్రతిపాదించి, అందుకు 2012 సెప్టెంబరులో టెండర్లు పిలిచింది. దీనికి స్పందించి వచ్చిన బిడ్లలో 184 బిడ్లు సాంకేతికంగా అర్హత సంపాదించాయి. కానీ చివరికి 7 సంస్థలు మాత్రమే యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చాయి. అవి నెలకొల్పాలనుకుంటున్న యూనిట్ల మొత్తం సామర్థ్యం 50-60 మెగావాట్లు మాత్రమే. సౌర విద్యుత్తుకు యూనిట్‌కు రూ.6.49 కొనుగోలు ధరను మంత్రుల బృందం నిర్ణయించగా ఇది ఆకర్షణీయ ధర కాదని పలు సంస్థలు వెనక్కి తగ్గాయి. ఇది ఎంతో తక్కువ ధర అని, ఈ ధరకు ఉత్పత్తి ఎక్కడా సాధ్యం కాదని, కాస్త ఎక్కువ ధర ఇచ్చేందుకు సిద్ధపడితే మరింతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తారని పరిశ్రమ ప్రతినిధి ఒకరు వివరించారు. వేసవిలో, ఇతర సందర్భాల్లో విద్యుత్తు లేక రాష్ట్రంలో యూనిట్ విద్యుత్తును రూ.7-12 వరకూ పెట్టి కొనుగోలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మరోపక్క రూ.6.49 ధరకు యూనిట్లు స్ధాపించేందుకు సిద్ధపడిన సంస్థలతో ఇంతవరకూ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదర్చుకోలేదు. ఈ వ్యవహారం ప్రభుత్వం వద్ద, ట్రాన్స్‌కోలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికలు రావటం, ఆతర్వాత రాష్ట్ర విభజన ఉండటంతో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు వేగంగా ముందుకు సాగే అవకాశం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యం ప్రస్తుతానికి కొండెక్కినట్లే భావించాలి.

వాస్తవానికి రాష్ట్రంలో పెద్దఎత్తున సౌర విద్యుత్తు సామర్థ్యం సమకూర్చుకునేందుకు అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో 1500 మెగావాట్ల వరకూ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించేందుకు అవకాశం ఉందని ఆ వర్గాల కథనం. ఇంకా రిటైల్ వినియోగంలోనూ సౌర విద్యుత్తును ప్రోత్సహించవచ్చు. మెదక్, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, నల్గొండ తదితర జిల్లాల్లో సౌర విద్యుత్తు యూనిట్ల స్థాపనకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. దీన్ని ప్రభుత్వం అందిపుచ్చుకోవలసిన అవసరం ఉంది.