Tuesday, March 11, 2014

హైదరాబాద్‌లో మళ్లీ విమానాల పండుగ

12 నుంచి 16 వరకు బేగంపేటలో..
జీఎంఆర్, జీవీకేలు ప్రధాన ఆకర్షణ

విమానాల పండుగ మళ్లీ వచ్చింది. రెండేళ్లకోసారి వచ్చే శోభాయమానమైన 'ఇండియా ఏవియేషన్ షో' మరోసారి హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకూ అయిదు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనకు బేగంపేట విమానాశ్రయం వేదిక. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఉమ్మడిగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాయి. దిగ్గజాలనదగ్గ విమానయాన కంపెనీలెన్నో ఈ ప్రదర్శనలో పాలుపంచుకోనున్నాయి. విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శనతో పాటు వివిధ పౌర విమానయాన అంశాలపై చర్చాగోష్ఠులు, సీఈఓ ఫోరమ్ నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, సంస్థలకు ఇది విశేష అనుభూతి మిగల్చనుంది. ఈసారి ప్రదర్శనలో 250 మంది ఎగ్జిబిటర్లు పాలుపంచుకుంటారని, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సందర్శకులు విచ్చేస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ హాజరు కావచ్చని తెలుస్తోంది.

పెద్ద వ్యాపారావకాశం...
మనదేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న విమానయాన సదుపాయాలు, సేవలను పరిగణనలోకి తీసుకుంటే ఇదొక పెద్ద వ్యాపారావకాశమని స్పష్టమవుతోంది. అందుకే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రెండేళ్లకోసారి జరిగే ఏవియేషన్ షోలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నాయి. ఈ ఏడాది జరిగేది నాలుగో ప్రదర్శన కాగా, హౖదరాబాద్‌లో ఇది జరగడం రెండోసారి. మనదేశంలో 2016-17 నాటికి విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య 58 కోట్లకు చేరుతుందని అంచనా. దీనికి తగ్గట్లుగా విమానాశ్రయాల నిర్మాణం, విమాన సర్వీసులు, సేవలు విస్తరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.4,662 కోట్ల అంచనా వ్యయంతో దేశంలోని 35 ద్వితీయ శ్రేణి (నాన్- మెట్రో) నగరాల్లోని విమానాశ్రయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విస్తరించటానికి సంసిద్ధమవుతోంది. ఇదేకాకుండా 10 నూతన విమానాశ్రయాల నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిధుల కొరత ఎదురుకాకుండా ఉండటానికి విమానాశ్రయాల సదుపాయాల కల్పనలో నూరు శాతం విదేశీ పెట్టుబడికి కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం విదితమే. మరోపక్క ఈ రంగానికి అవసరమైన మానవ వనరుల లభ్యతను పెంపొందించేందుకు అనువుగా ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ (ఐజీఆర్‌యూఏ)ని దాదాపు రూ.32 కోట్ల వ్యయంతో విస్తరిస్తున్నారు. అంతేగాక మహారాష్ట్రలోని గోండియాలో అధునాతన పైలెట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే ప్రతిపాదించింది. ఇక ఎంఆర్ఓ (మెయింటెనెన్స్- రిపేర్- ఆపరేషన్స్) విభాగంలోనూ వివిధ విమాన సంస్థలు మనదేశానికి కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. హైదరాబాద్‌లో, దేశంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో ఎంఆర్ఓ కేంద్రాలను నెలకొల్పుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న ఏవియేషన్ షోకు విశేష ప్రాధాన్యం కనిపిస్తోంది. ఎంఆర్ఓ పరిశ్రమ 2010లో ఉన్న రూ.2,250 కోట్ల నుంచి 2020 నాటికి రూ.7,000 కోట్లకు పెరుగుతుందని అంచనా. చిన్న సైజు ఏటీఆర్-72 విమానాలను తిప్పటానికి అనువైన నూతన విమానాశ్రయాలు మనదేశంలోని మూడు రాష్ట్రాల్లో నిర్మించాలని అలయన్స్ ఎయిర్ భావిస్తోంది. ఇటువంటి పలు విమానాల తయారీ, విమానాశ్రయాల నిర్మాణం- నిర్వహణ సంస్థలు, ఎంఆర్ఓ సంస్థలు ఈ ప్రదర్శనలో పాలు పంచుకోనున్నాయి. విమానాశ్రయాల నిర్మాణం-నిర్వహణలో రాష్ట్రానికి చెందిన జీవీకే, జీఎంఆర్ సంస్థలు క్రియాశీలకంగా ఉన్న విషయం విదితమే. ఈ సంస్థలు ఏవియేషన్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

బోయింగ్ నుంచి..
విమానాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన బోయింగ్ ఈసారి హైదరాబాద్‌లో జరిగే ఏవియేషన్ షోలో తన సరికొత్త విమానాలను ప్రదర్శించనుంది. వాణిజ్య పౌర విమానాలైన 737-8 మ్యాక్స్, నూతన 777-9ఎక్స్ శ్రేణి, 777-300 ఈఆర్ (ఎక్స్‌టెండెడ్ రేంజ్), 787-8 విమానాలను ప్రదర్శించనున్నట్లు బోయింగ్ వెల్లడించింది. గత ఏడు దశాబ్దాలుగా భారత్‌లో పౌర విమానయాన రంగం విస్తరించటంలో తాము ఎంతో బహుముఖ పాత్ర పోషించామని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏవియేషన్ షోలో తాము పాల్గొనబోతున్నామని బోయింగ్ ఇండియా అధ్యక్షుడు ప్రత్యూష్ కుమార్ వివరించారు. కేవలం విమానాల సరఫరాకు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలో నిర్వహణ- మరమ్మతులు, ఇంజనీరింగ్, నైపుణ్యాల విస్తరణ, విడిభాగాల తయారీతో కూడిన విమానయాన రంగం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయనున్నామని ఆయన పేర్కొన్నారు.
ఎంబ్రార్ సైతం...
ఈసారి ప్రదర్శనలో ఎంబ్రార్ తన ఎగ్జిక్యూటివ్ విమానాలను ప్రదర్శించబోతోంది. ఇందులోని 'లీనియేజ్ 1000ఇ' ఈసారి ప్రధాన ఆకర్షణ కాబోతోంది. ఇంకా లెగసీ 650, ఫెనామ్ 300, ఫెనామ్ 100 జెట్స్ కూడా ప్రదర్శనలో ఉంటాయి. బిజినెస్ విమానయాన విపణిలో 2000వ సంవత్సరంలో ఎంబ్రార్ ప్రవేశించింది. అక్కడి నుంచి ఎంతోవేగంగా తన విమానాల శ్రేణిని విస్తరించింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో సర్వీసు కేంద్రాలు, విడిభాగాల పంపిణీ కార్యకలాపాలు ఉన్నాయి. ప్రస్తుతం 50 దేశాల్లో 700 ఎంబ్రార్ ఎగ్జిక్యూటివ్ జెట్‌లు విమానయాన సేవలు అందిస్తున్నాయి.
ఎయిర్‌బస్ ఎ380
ఎయిర్‌బస్ నుంచి అందుబాటులో ఉన్న విమానాల్లో ఎ380కి ఉన్న ఆకర్షణే వేరు. ఏవియేషన్ షోలో భాగాంగా స్వయంగా ఎ380 విమానాన్ని పూర్తిగా చూసే సదుపాయాన్ని అగ్రశ్రేణి విమానయాన సేవల సంస్థ అయిన ఎమిరేట్స్ కల్పించనుంది. ఈ లగ్జరీ విమానంలోని కళ్లు చెదిరే రీతిలో అధునాతన సౌకర్యాలు, ఫస్ట్‌క్లాస్ ప్రైవేట్ సూట్లు సందర్శకులకు అరుదైన అనుభూతిని మిగులుస్తాయి. దీన్ని చూసే అవకాశాన్ని సందర్శకులకు కల్పించేందుకు ఎమిరేట్స్, ఎయిర్‌బస్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బంబార్డియర్ 'ఛాలెంజర్ 605'
అటు రైళ్లు, ఇటు విమానాలు తయారు చేసే ఏకైక సంస్థ బంబార్డియర్. ఇది కూడా హైదరాబాద్‌లో జరిగే ఏవియేషన్ షోలో తన 'ఛాలెంజర్ 605' బిజినెస్ జెట్‌ను ప్రదర్శించనుంది. ఛాలెంజర్ 604 తర్వాత వచ్చిన ఆధునిక బిజినెస్ జెట్ విమానం ఇది. 12 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో ఏకబిగిన ఢిల్లీ నుంచి ఏథెన్స్ కు ఎక్కడా ఆగకుండా ప్రయాణించగల సత్తా ఈ విమానం సొంతం. ఇదే కాకుండా ఇంకా భారతీయ మార్కెట్‌కు అనువైన ఇతర వాణిజ్య విమానాలను సైతం ప్రదర్శించనున్నట్లు బంబార్డియర్ ప్రకటించింది. అయితే బిజినెస్ జెట్ విమానాలపై ప్రధానంగా ఈ సంస్థ దృష్టి సారిస్తోంది. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో భారత్, చైనాతో సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 4,740 విమానాల విక్రయానికి అవకాశం ఉన్నట్లు, ఇందులో 1,340 బిజినెస్ జెట్ విమానాలు ఉంటాయని బంబార్డియర్ అంచనా. తేలికపాటి చిన్న బిజినెస్ జెట్ ల నుంచి పెద్దవైన దీర్ఘకాలిక ప్రయాణానికి అనువైన విమానాల తయారీలో నిమగ్నమై ఉన్న బంబార్డియర్ ఇది తనకు అనుకూల పరిణామంగా భావిస్తోంది. ఈ దిశగా మనదేశంలో జరిగే ఏవియేషన్ షోకు అత్యంత ప్రాధాన్యమిస్తూ, తన ఉత్పత్తులు- సేవలను ప్రదర్శించబోతోంది.