Friday, February 28, 2014

చిన్న సిమెంటు కంపెనీలపై కన్నేస్తున్న పెద్ద కంపెనీలు

విపణిలో సుస్థిర స్థానమే లక్ష్యం

సిమెంటు పరిశ్రమలో కొనుగోళ్లు- విలీనాల సీజను మొదలైంది. ప్రస్తుత గడ్డు కాలాన్ని అతి కష్టం మీద తట్టుకుంటున్న చిన్న, మధ్య స్థాయి కంపెనీల ముందు బడా కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు పెట్టి, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మన రాష్ట్రంతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని ఒకటి రెండు యూనిట్ల కొనుగోలుకు ఒక బహుళ జాతి సిమెంటు సంస్థ, మరొక దేశీయ సిమెంటు కంపెనీ కసరత్తు మొదలుపెట్టాయని పరిశ్రమ వర్గాల సమాచారం.

నిజానికి సిమెంటు పరిశ్రమకు ఉత్థాన పతనాలు మామూలే. ఆయిదారేళ్లకోసారి అనూహ్యమైన అవకాశాన్ని, ఆ తరువాత తట్టుకోలేనంత కష్టకాలాన్ని ఈ పరిశ్రమ చవిచూస్తోంది. ఇలా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే. అయితే కష్టకాలంలో తట్టుకునే శక్తి ఉన్న కంపెనీలు మనుగడ సాధించగలుగుతున్నాయి. లేకపోతే అటువంటి వాటిని ఏదో ఒక పెద్ద కంపెనీ కొనుగోలు చేస్తూ వస్తోంది. 2004-05 వరకూ సిమెంటు పరిశ్రమ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కానీ తరువాత కలిసొచ్చిన అవకాశాలతో పరిశ్రమ బాగా కోలుకుంది. అనూహ్యమైన డిమాండును సంపాదించింది. దీన్ని అవకాశంగా తీసుకొని పెద్దఎత్తున విస్తరణ సామర్థ్యాన్ని పరిశ్రమ వర్గాలు విస్తరించాయి. అక్కడే తేడా వచ్చింది. 2008 తరువాత ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రతరమై సిమెంటు కంపెనీలు లెక్కలు తప్పయ్యాయి. డిమాండు క్షీణించింది. అధిక డిమాండును ఆశించి అప్పులు చేసి మరీ సామర్థ్యాన్ని పెంచుకున్న సంస్థలకు కష్టకాలం మొదలైంది. ఈ పరిస్థితిని పెద్ద కంపెనీలు ఎలాగో నెట్టుకొస్తున్నప్పటికీ, చిన్న- మధ్యస్థాయి సిమెంటు కంపెనీలు తట్టుకోలేకపోతున్నాయి. పైగా అప్పుల భారం ఉన్న కంపెనీలకు అయితే అసలే కుదరడం లేదు. దీన్ని గుర్తించిన పెద్ద సంస్థలు వాటి విస్తరణ వ్యూహాలను అమల్లో పెడుతున్నాయి. తమకు అనుకూలంగా, తమ విస్తరణ వ్యూహాలకు అనువైన సిమెంటు యూనిట్లను గుర్తించి, కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

వినియోగానికి మించిన ఉత్పత్తి సామర్థ్యం
ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ సమస్య అధికంగా ఉంది. ఉత్పత్తి సామర్థ´్యం గత అయిదేళ్ల కాలంలో దక్షిణాదిలో అనూహ్యంగా పెరిగిపోయింది. ఆంధ్ర ప్రదేశ్‌లో సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 30 మిలియన్ టన్నుల నుంచి 75 మి. ట.కు పెరిగింది. తమిళనాడులో దాదాపు 10 మి. ట. సామర్థ్యం కాస్తా 27 మి. ట.కు చేరింది. ఇక కర్ణాటకలోనూ ఉత్పత్తి సామర్థ´్యం 40 మిలియన్ టన్నులకు చేరుకుంటోంది. ముఖ్యంగా కర్ణాటకలోని గుల్బర్గా క్లస్టర్‌లో కొత్త యూనిట్లు ఎంతో అధికంగా వచ్చాయి. సాగర్ వికా, దాల్మియా భారత్ తదితర సంస్థలు గుల్బర్గా క్లస్టర్‌లో కొత్త యూనిట్లు స్థాపించాయి. గుల్బర్గా నుంచి ఉత్తర కర్ణాటక ప్రాంతంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లకు సిమెంటును అందించే అవకాశం ఉండడంతో పలు సంస్థలు వ్యూహాత్మకంగా అక్కడ కొత్త యూనిట్లను స్థాపిస్తున్నాయి. ఇంకా మరికొన్ని యూనిట్లు కూడా అక్కడ వస్తున్నాయి. దీంతో కర్ణాటకలోనూ సామర్థ్యం పెరుగుతోంది. చిన్న రాష్ట్రమైన కేరళలో ఒక మిలియన్ టన్నుల వరకూ మాత్రమే సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మొత్తంమీద నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో వినియోగానికి మించిన ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు ఉంది. ఈ పరిస్థితి కూడా కొనుగోళ్లు- విలీనాల ప్రక్రియకు వీలు కల్పిస్తోంది.

ముందుముందు మరిన్ని..?!
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం గుల్బర్గాలోని సిమెంటు యూనిట్‌ను పూర్తిగా సొంతం చేసుకునేందుకు ఒక బహుళ జాతి సిమెంటు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ యూనిట్లో పాక్షికంగా వాటా ఉన్న ఈ సంస్థ మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసి, ఆ యూనిట్‌ను సొంతం చేసుకోబోతోందని చెబుతున్నారు. తద్వారా దక్షిణాది విపణిలో తన స్థానాన్ని సుస్థి´రం చేసుకొనే అవకాశం కలుగుతుందని ఈ బహుళ జాతి సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విధంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏదైనా మధ్య స్థాయి సిమెంటు కంపెనీని కొనుగోలు చేయాలని కూడా ఒక అగ్రశ్రేణి దేశీయ సిమెంటు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. సిమెంటు రంగంలో ఈ విధమైన స్ధిరీకరణ ఒకటి రెండు కొనుగోళ్లు- విలీనాలకే పరిమితం కాకుండా ముందుముందు కూడా కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
- ఈనాడు, హైదరాబాద్