Tuesday, February 25, 2014

టీసీఎస్‌కు నాలుగో అతి పెద్ద కేంద్రంగా హైదరాబాద్

25,000 దాటిన నిపుణులు 6,000 మందికి శిక్షణ
డొమైన్ వ్యూహాలూ ఇక్కడే: కంపెనీ ప్రాంతీయ అధిపతి వి.రాజన్న

(ఈనాడు)
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు నాలుగో అతి పెద్ద సేవా కేంద్రంగా హైదరాబాద్ అవతరించింది. 2007 జనవరిలో 4,500 మంది నిపుణులుండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 25,000 దాటింది. చెన్నై, బెంగళూరు, ముంబయి ప్రాంతాలలో 50,000 మందికి పైగా నిపుణులు ఉండగా, వాటి తరువాత స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ప్రాంగణాల్లో ఎంపిక చేసిన వారిలో 6,000 మందికి ఇక్కడే శిక్షణ ఇస్తున్నారు. విభిన్న రంగాలకు అవసరమైన నిపుణుల తయారీకి వ్యూహాలను కూడా హైదరాబాద్‌లోనే సిద్ధం చేస్తున్నట్లు టీసీఎస్ ప్రాంతీయ అధిపతి వి.రాజన్న 'ఈనాడు'తో చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభాన్ని 50 శాతం పెంచుకున్న సంస్థ వ్యవహారాల్లో హైదరాబాద్ కీలక పాత్రను ఆయన వివరించారు.

అన్ని విభాగాలకు సేవలు
బ్యాంకింగ్- ఆర్థిక సేవలు- బీమా రంగాలు, టెలికాం, ఇంజినీరింగ్, రిటైల్, తయారీ, వినియోగ విభాగాలు, ప్రసార మాధ్యమాలు, వినోద రంగం, మొబిలిటీ, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్లు.. ఇలా అన్ని విభాగాలకు సేవలు విస్తరించాం. బిజినెస్ ఇంటెలిజెన్స్, టెస్టింగ్, ఎంబెడెడ్ సిస్టమ్‌ల సేవలూ అందిస్తున్నాం. 4జీ వంటి అధునాతన సాంకేతికతపై ప్రయోగాలు, అవగాహన కోసం సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ నెలకొల్పాం. ఆయా విభాగాల్లో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సిబ్బందికి శిక్షణ, సూచనలు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగం ఉంది. విభిన్న రంగాలు- విభాగాల (డొమైన్)లపై అవగాహన ఉంటేనే వారికి అవసరమైన సాంకేతిక సొల్యూషన్లు ఇవ్వగలం. టీసీఎస్‌కు ఈ వ్యూహాలు రచించే కీలక బృందం 'బిజినెస్ డొమైన్ అకాడమీ' పేరిట హైదరాబాద్‌లోనే ఉంది. సామాజిక మాధ్యమాలు, మొబిలిటీ, అనలిటిక్స్, క్లౌడ్ విభాగాలలో (స్మాక్) డిజిటల్ సొల్యూషన్ల కోసం 500 మందికి పైగా పనిచేస్తున్నారు. దూర ప్రాంతాల్లోని వ్యవస్థలను నియంత్రించే రిమ్ (రిమోట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్) సేవలను ప్రారంభించాం.

సినర్జీ పార్కులో మరో భవనం
ప్రభుత్వ, దేశీయ సేవల కోసం ప్రత్యేకించిన ఒక టీసీఎస్ కేంద్రం సచివాలయ సమీపంలో ఉండగా, మిగిలిన 5 కేంద్రాలు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో ఉన్నాయి. గచ్చిబౌలిలోని సినర్జీ కేంద్రంలో 13,500 మంది నిపుణులు ఉండగా, ఇక్కడ నిర్మిస్తున్న మరో భవనం ఫిబ్రవరిలో పూర్తి కానుంది. మాదాపూర్‌లోని డెక్కన్ పార్కులో 2,500 మంది పనిచేస్తున్నారు. ఈ రెండు సొంతవి. మిగిలిన 4 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఆదిభట్లలో అతి పెద్ద కేంద్రం సిద్ధం అవుతున్నా, ఈ ఏడాదికి మాత్రం ప్రస్తుత కార్యాలయాల్లో మార్పులేమీ ఉండవు.

వలసలు ఇక్కడే తక్కువ ఎందుకంటే..
టీసీఎస్‌లో వలసలు 10.5 శాతానికి తగ్గాయి. హైదరాబాద్‌లో ఇది మరింత తక్కువగా 8.5 శాతమే ఉంది. దాదాపు అన్ని రంగాలకు సేవలు అందిస్తున్నందున, నిపుణులకు కూడా విభిన్న సాంకేతికతలపై పనిచేసే అవకాశం వస్తుంది. ఇందుకు అవసరమైన శిక్షణ కూడా ఇప్పిస్తున్నాం. ఉద్యోగుల మానసిక ఆహ్లాదం, ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. సినర్జీ పార్కులో పెద్ద ఫిట్‌నెస్ కేంద్రాన్ని నెలకొల్పాం. మహిళా ఉద్యోగులకు కరాటే క్లబ్బుల వంటివీ ఉన్నాయి.

మార్చి కల్లా 3,400 నూతన నియామకాలు
2012-13 విద్యా సంవత్సరంలో ప్రాంగణాల్లో 3,400 మందిని ఎంపిక చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దశలవారీగా వీరు చేరుతున్నారు. వచ్చే మార్చి కల్లా అందరూ చేరుతారు. గత అక్టోబరు నుంచీ ప్రాంగణాల్లో ఇప్పటికి 3,000 మందిని ఎంపిక చేశాం. ప్రాజెక్టుల అవసరార్థం ప్రాంగణం బయట (ఆఫ్ క్యాంపస్) ఎంపికలూ నిర్వహించనున్నాం. మొత్తంమీద గత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనూ ఈసారీ ఎంపికలు (3,400) ఉంటాయి. వీరంతా వచ్చే జూన్/జులై తరువాత సంస్థలో విడతలుగా చేరతారు.

ఉద్యోగానికి సిద్ధం చేసుకుంటున్నాం
ప్రాంగణ ఎంపికలతో పాటు ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు కాగానే ఉద్యోగానికి సిద్ధం అయ్యేలా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు 50కి పైగా విద్యాలయాలతో కలసి పనిచేస్తున్నాం. చివరి సంవత్సరంలో బీటెక్‌తో పాటు ఎమ్‌టెక్, ఎమ్‌సీఏ విద్యార్థులకూ ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం కల్పిస్తున్నాం. వీరికి 6- 8 నెలల ప్రాజెక్టు ఇస్తున్నాం. గూగుల్ మ్యాప్స్, జీపీఎస్‌లకు సంబంధించిన జియో స్పేషియల్ సాంకేతికతపై ఆయా కళాశాలల అధ్యాపకులకూ తరగతులు నిర్వహించాం. గిరాకీ అధికంగా ఉన్న క్లౌడ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భద్రత వ్యవహారాల పైనా తర్ఫీదు ఇస్తున్నాం. అనంతపురం, వరంగల్, జగిత్యాల, విజయనగరం, కాకినాడ, భీమవరం, రాజమండ్రి వంటి రెండో అంచె నగరాల కళాశాలలకూ వెళ్తున్నాం. దేశంలో 500 మంది అధ్యాపకులు పీహెచ్‌డీ చేసేందుకు ఆర్థిక సహకారం ఇవ్వాలన్న టీసీఎస్ ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో 18 మందికి సాయం చేస్తున్నాం.