Tuesday, February 25, 2014

ఏటీఎంలకు మరో రూ.1,800 కోట్లు వెచ్చించేందుకు బ్యాంకులు సన్నద్ధం

రద్దీ లేని చోట్ల రాత్రిళ్లు మూసివేత..!
ఈనాడు -
ప్రతి బ్యాంకు శాఖలోనూ ఏటీఎం తప్పసరి చేయాలన్న భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఆదేశాలను అమలు చేసేందుకు బ్యాంకులు సన్నద్ధం అవుతున్నాయి. విస్తరిస్తున్న జనావాసాలకు అనుగుణంగా, మరిన్ని ఏటీఎం కేంద్రాలనూ ఏర్పాటు చేస్తున్నాయి. గత ఏడాది ఆఖరుకు దేశంలోని బ్యాంకులన్నీ కలిపి 1.41 లక్షల ఏటీఎంలను నెలకొల్పగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా దేశంలో మరో 30,000 ఏర్పాటవుతాయని అంచనా. ఇందుకు బ్యాంకులు కనీసం రూ.1,800 కోట్లు వెచ్చించాల్సి ఉంది.
ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరాన్ని, బ్యాంకు పనివేళల్లోనే ఆర్థిక లావాదేవీలు జరుపుకోవాల్సిన అవస్థను తప్పించిన ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్)లు మరిన్ని ఏర్పాటు కాబోతున్నాయి. ప్రారంభంలో నగదు ఉపసంహరణ, ఖాతాలో నిల్వ పరిశీలన, లావాదేవీల పరిశీలన (మినీ స్టేట్‌మెంట్)కు ఏటీఎంలను ఎక్కువగా వినియోగించే వారు. ఇప్పుడు నగదు జమ, వేరే ఖాతాలకు నగదు బదిలీ, బీమా- బిల్లుల చెల్లింపు, రుణానికి అభ్యర్థన, టికెట్ల కొనుగోలుల వంటి వాటికీ వాడుతున్నారు. బ్యాంకు శాఖల ఆవరణల్లో అద్దె అదనంగా లేకున్నా, ఏటీఎం నెలకొల్పేందుకు గదిని తీర్చిదిద్ది, భద్రతా ఏర్పాట్లు చేసేందుకు బ్యాంకులకు అదనపు ఖర్చు తప్పదు.

ఇదీ లెక్క: దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని వాణిజ్య బ్యాంకులు 1.08 లక్షల బ్యాంకు శాఖలను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభంలో 1,14,014 ఏటీఎంలు ఉంటే, గత డిసెంబరు ఆఖరుకు కొత్తగా 27,501 జత చేరి, వీటి సంఖ్య 1,41,515కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే ప్రతి బ్యాంకు శాఖలోనూ ఒక ఏటీఎం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. దీనికి తోడు విస్తరిస్తున్న జనావాసాల్లో కొత్తగా ఏటీఎం కేంద్రాలను బ్యాంకులు నెలకొల్పుతున్నాయి. మార్చి లోపు మరో 30,000 వరకు కొత్తగా ఏటీఎంలు ఏర్పాటు చేయవచ్చని ఒక జాతీయ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. అత్యధిక కేంద్రాల్లో ఒక ఏటీఎం ఏర్పాటు చేస్తున్నా, రద్దీకి అనుగుణంగా కొన్ని కేంద్రాల్లో 2-5 వరకు కూడా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నాయి. ఒక ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించేందుకు బ్యాంకులకు సగటున రూ.6 లక్షల వరకు ఖర్చవుతోంది. అంటే 30,000 ఏటీఎంలు నెలకొల్పేందుకు బ్యాంకులు మరో రూ.1,800 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ఒక్కో కేంద్రంలో 2-3 ఏటీఎంలను నెలకొల్పినప్పటికీ, ఇందుకు పెద్ద ప్రాంగణాలు అద్దెకు తీసుకోవడం వల్ల అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఫలితంగా కేంద్రాల సంఖ్య తగ్గినా, బ్యాంకుల పెట్టుబడి ఒకే మాదిరి ఉంటోంది. ప్రస్తుతం ఏటీఎంలపై సగటు లావాదేవీలు రోజుకు 180 వరకు ఉన్నాయి. నిర్వహణ ఖర్చులన్నీ కలుపుకొంటే, ఒక్కొక్క లావాదేవీకి రూ.12-15 వ్యయం అవుతున్నట్లు అంచనా.

నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు..
ఒకవైపు ఏటీఎం కేంద్రాలు పెంచుతూనే, మరో వైపు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకొనేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. బెంగళూరులో ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి జరిగాక, భద్రతా ఏర్పాట్లు పెంచాలంటూ బ్యాంకులపై ఒత్తిడి పెరిగింది. 24 గంటలూ భద్రత కల్పించేందుకు మూడు షిఫ్టులలో ముగ్గురేసి సెక్యూరిటీ గార్డుల జీతభత్యాలు అదనపు భారం అవుతుంది. ఇందుకోసం అన్ని బ్యాంకులపై కలిపి ఏడాదికి రూ.4,000 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. అంటే ప్రతి లావాదేవీకి అదనంగా రూ.5 వరకు పడుతుందని భావిస్తున్నారు.
చి అవకాశం ఉన్న- లావాదేవీలు తక్కువగా ఉన్న సమయాల్లో ఏటీఎం కేంద్రాల మూసివేతను బ్యాంకులు చేపడుతున్నాయి.
చి అత్యధిక ఏటీఎం కేంద్రాల్లో ఎయిర్‌కండీషన్ సదుపాయం ఉంది. వీటితో పాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. కాబట్టి ఏటీఎం తక్కువ గంటలు పనిచేస్తే విద్యుత్తు బిల్లు భారం కూడా తగ్గుతుందనేది బ్యాంకుల ఆలోచన.
చి ప్రస్తుతం ఒక బ్యాంకు ఖాతాదారు, సొంత బ్యాంకు ఏటీఎంలలో ఎన్ని లావాదేవీలైనా ఉచితంగా నిర్వహించుకుంటున్నారు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే, నెలకు 5 లావాదేవీలు ఉచితం. అవి దాటితే ఛార్జీ పడుతుంది. వాస్తవానికి వేరే బ్యాంకు ఏటీఎంలో నగదు ఉపసంహరిస్తే, ఖాతాదారు తరఫున బ్యాంకు రూ.15 (ఇంటర్‌ఛేంజ్ రేట్), నగదు నిల్వ పరిశీలనకు రూ.5 చొప్పున చొప్పున మొదటి లావాదేవీ నుంచే చెల్లిస్తున్నాయి. 5 లావాదేవీలు దాటాకే ఈ మొత్తాన్ని ఖాతాదారు నుంచి వసూలు చేస్తున్నాయి. ఇకపై సొంత బ్యాంకు ఏటీఏంలలోనూ నెలకు 5 లావాదేవీలు దాటితే, ఇలానే చార్జీ వసూలు చేయాలన్నది బ్యాంకర్ల ప్రతిపాదనగా ఉంది.
చి లావాదేవీలు అధికంగా జరిగే కేంద్రాలను మాత్రమే 24 గంటలూ తెరచి ఉంచి, మిగిలిన వాటికి విరామం ఇవ్వనున్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6/8 గంటల వరకు లావాదేవీల సంఖ్య 5-10 దాటని ప్రాంతాల్లో ఏటీఎంల మూసివేతను ఇప్పటికే కొన్ని బ్యాంకులు ప్రారంభించాయి కూడా.
మార్చి లోపు కొత్తగా 1600 ఏటీఎంలు
ఒక ఏటీఎం ధర రూ.3.25 లక్షల వరకు ఉంది. స్థిరాస్తి (గది లీజు), విద్యుత్తు సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు, అలంకరణ.. ఇవన్నీ కల్పించేందుకు ఒక్కో కేంద్రంపై రూ.6 లక్షల వరకు వెచ్చిస్తున్నాం. మా బ్యాంకుకు 1,400 ఏటీఎంలున్నాయి. మార్చి 31లోపు మరో 1600 ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నాం. బ్యాంకుకు ఖాతాదారు వచ్చి, నగదు లావాదేవీలు జరుపుకునేందుకు అయ్యే వ్యయం ఏటీఎంతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ అనేది వాస్తవమే. అందుకే 5 లావాదేవీల పరిమితిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు అన్ని బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి.
- ఎం.ఆంజనేయ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిండికేట్ బ్యాంకు