Tuesday, February 25, 2014

వాట్స్‌యాప్‌ను 'లైక్' చేసిన ఫేస్‌బుక్

రూ.1,14,000 కోట్లతో సొంతం!
అతిపెద్ద మొబైల్ ఐటీ కొనుగోలు ఇదే
లాటిన్ అమెరికా, ఆసియాల్లో మరింత విస్తరణకు వూతం

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ సర్వీస్ అయిన వాట్స్‌యాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేయనుంది. 19 బిలియన్ డాలర్ల(డాలరుకు రూ.60 చొప్పున లెక్కగడితే రూ.1,14,000 కోట్లు)కు ఒప్పందం కుదరనుంది. ఇందులో భాగంగా 12 బిలియన్ డాలర్ల విలువైన ఫేస్‌బుక్ షేర్లను; 4 బిలియన్ డాలర్ల నగదును; మిగిలిన 3 బిలియన్ డాలర్లను బదిలీ చేయడానికి వీలులేని షేర్ల రూపంలోనూ చెల్లించనున్నారు. తద్వారా ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక నెట్‌వర్కింగ్ సైట్‌గా ఉన్న ఫేస్‌బుక్.. వాట్స్‌యాప్‌నకున్న 45 కోట్ల వినియోగదార్లను జతచేసుకుని మరింత బలోపేతం కానుంది. 'ప్రపంచానికి మరింత అనుసంధానాన్ని అందించాలన్న ఫేస్‌బుక్, వాట్స్‌యాప్్‌ల ధ్యేయానికి ఈ కొనుగోలు ఉపయుక్తంగా ఉండగలద'ని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాదిలోగా ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాలని సంస్థ భావిస్తోంది.

బ్రాండ్ మారదు: కంపెనీ చేస్తున్న అతిపెద్ద కొనుగోలు ఇదేనంటున్న ఫేస్‌బుక్.. దీని ద్వారా వాట్స్‌యాప్ బ్రాండ్‌పై ప్రభావం ఉండదని అదే విధంగా కంపెనీ ప్రధాన కార్యాలయం సైతం కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోనే ఉండబోతుందని స్పష్టం చేసింది. 2012లో పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ 16 బిలియన్ డాలర్లను సమీకరించిన సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం కౌమ్.. ఫేస్‌బుక్ బోర్డులో చేరుతారు. అదే సమయంలో వాట్స్‌యాప్ వ్యవస్థాపకులు, ఉద్యోగులకు 3 బిలియన్ డాలర్ల(4,59,66,444 షేర్లు) విలువైన పరిమిత స్టాక్ యూనిట్లను అందజేస్తారు. ఒప్పందం అనంతరం కూడా వాట్స్‌యాప్ స్వతంత్రంగానే కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఒప్పందం ముగిసిన తర్వాత వాట్స్‌యాప్‌నకు చెందిన అన్ని షేర్లు, ఆప్షన్లు ఎక్స్ఛేంజీల్లో రద్దవుతాయి.
చి ఒక వేళ నియంత్రణ సంస్థలు ఈ విలీనానికి ఒప్పుకోకపోతే వాట్స్‌యాప్‌నకు ఫేస్‌బుక్ 1 బిలియన్ డాలర్లను నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో అంతే విలువైన ఫేస్‌బుక్ క్లాస్ కామన్ స్టాక్‌ను సైతం ఇవ్వాల్సి ఉంటుంది. రద్దయిన తేదీకి ముందు పదిరోజుల సగటు షేరు ధరను ఇందుకు పరిగణనలోకి తీసుకుంటారు.
చి గతేడాది జుకర్‌బర్గ్ 3 బిలియన్ డాలర్లకు మరో మెసేజింగ్ సంస్థ స్నాప్‌చాట్‌ను కొనుగోలుకు యత్నించి విఫలమయ్యారు.

ఎందుకీ కొనుగోలు
ప్రపంచంలో ఇప్పటికీ మూడింట రెండొంతుల మంది ఇంటర్నెట్‌ను వినియోగించని వారే. వీరికి అంతర్జాలాన్ని దరిచేయాలన్నదే ఫేస్‌బుక్‌కు చెందిన ఇంటర్నెట్.ఓఆర్‌జీ ప్రాజక్టు లక్ష్యం. ఎక్కువ శాతం వృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే జరగనుందనేది సుస్పష్టం. ఆ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందిన వాట్స్‌యాప్‌ను చేజిక్కించుకోవడం ఫేస్‌బుక్ వ్యూహంలో కీలకంగా మారింది. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ప్రస్తుతం వాట్స్‌యాప్‌కున్న ప్రతి యాక్టివ్ వినియోగదారూ.. చెల్లించే వినియోగదారుగా మారితే వాట్స్‌యాప్్‌కు 450 మిలియన్ డాలర్లు వస్తాయి.
ఏమిటీ వాట్స్‌యాప్
ఇదో అంతర్జాల ఆధారిత క్రాస్-ఫ్లాట్‌ఫాం మొబైల్ అప్లికేషన్. వివరంగా చెప్పాలంటే.. ఎలాంటి టెలికాం ఛార్జీలు చెల్లించకుండానే సంక్షిప్త సందేశాలను (ఫొటోలు, వీడియోలు సైతం) వినియోగదారులు ఒకరికొకరు చేరవేసుకునే, పంచుకునే అప్లికేషన్. దీనిని 2009లో యాహూ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు అయిన జాన్ కౌమ్(ఉక్రేనియా), బ్రియాన్ ఆక్టన్(అమెరికా)లు స్థాపించారు. దాదాపు ప్రతీ నెలా 45 కోట్ల మంది ఈ మెసేజింగ్ సర్వీసును ఉపయోగించుకుంటుండగా.. ఇందులో 70 శాతం మంది యాక్టివ్‌గా ఉంటున్నారు. అంతే కాదు రోజుకు 10 లక్షల మంది కొత్త వినియోగదారులు ఇందులో చేరుతున్నారు. ఒప్పందం అనంతరం కూడా కేవలం నామమాత్రపు ఫీజుతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఏ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నా.. ఈ అప్లికేషన్ సాయంతో సందేశాలు పంపించుకోవచ్చని స్వయనా కౌమ్ చెప్పారు. మధ్యలో ఎలాంటి ప్రకటనలూ బాధించబోవని హామీ ఇచ్చారు.
భారత్‌లో విస్తరణకు వూతం
తాజా కొనుగోలుతో లాటిన్ అమెరికా, ఆసియా (ముఖ్యంగా భారత్‌లో) ఫేస్‌బుక్ విస్తరణకు వూతం లభిస్తుంది. ఎందుకంటే భారత్ సహా ఐరోపా, లాటిన్ అమెరికా దేశాల్లోని యువత వాట్స్‌యాప్్‌కు బాగా దగ్గరయ్యారు. ఇక్కడ అది స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని జుకర్ బర్గే స్వయంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఆ మార్కెట్‌ను సొంతం చేసుకుంటే భవిష్యత్‌కు ఢోకా ఉండదన్న అంచనాతోనే ఈ కొనుగోలు జరగనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
భారీ ఒప్పందం ఇదే..
ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద మొబైల్ ఐటీ ఒప్పందం ఇదే. 2011లో స్కైప్‌ను మైక్రోసాఫ్ట్‌ను కొనుగోలు చేసిన 8.5 బిలియన్ డాలర్ల కంటే దీని విలువ రెట్టింపు కావడం గమనర్హం. ఇక గూగుల్ నుంచి మోటరోలాను కొనుగోలు చేయడానికి లెనోవో పెట్టిన 2.9 బిలియన్ డాలర్లతో పోలిస్తే తాజా ఒప్పందం అయిదు రెట్లు పెద్దది.