Sakshi | Updated: February 28, 2014 00:45 (IST)

త్వరలో వాయిస్ కాల్ సేవలకూ రెడీ!
ఇప్పటికే మెసేజింగ్ వల్ల రూ.2 వేల కోట్ల దాకా గండి
మరింత నష్టపోతామంటున్న టెలికం కంపెనీలు
వాయిస్ నుంచి డేటాకు మారాలని సూచిస్తున్న నిపుణులు
వాట్స్ యాప్. ఇంటర్నెట్ ఉంటే చాలు. దీంతో ఏదైనా చేసేయొచ్చు. ఫ్రీగా మెసేజ్‌లు పంపుకోవచ్చు. వీడియోల్ని సెకన్లలో పంపేయొచ్చు. ఆడియో ఫైల్స్‌ను కూడా క్షణాల్లో కోరుకున్న వారికి పంపేయొచ్చు. వాట్స్ యాప్ వాడని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కానే కాదు. అలాంటి వాట్స్ యాప్... ఇపుడు వాయిస్ కాల్స్‌ను కూడా అందించేందుకు శ్రీకారం చుడుతోంది. అదే గనక ఆరంభమైతే ఫ్రీగా కాల్స్ కూడా చేసేసుకోవచ్చు. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్... ఎక్కడి నుంచి ఎక్కడికైనా! మరి అదే జరిగితే టెలికం సంస్థల సంగతేంటి? వస్తున్న ఆదాయాల్లో 85 శాతం వాయిస్ కాల్స్ ద్వారానే పొందుతున్న టెలికం సంస్థల భవిష్యత్తేంటి? - సాక్షి, బిజినెస్ డెస్క్
నలభై ఐదు కోట్ల మంది వాడకందార్లతో ప్రపంచంలోనే అతి పెద్ద మెసేజింగ్ సర్వీస్‌గా మారిన వాట్స్ యాప్‌ను అతి పెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్... ఈ మధ్యే 19 బిలియన్ డాలర్లు (రూ.1.18 లక్షల కోట్లు) పెట్టి కొనేసింది. ఫేస్‌బుక్, వాట్స్ యాప్ కలిస్తే ఇంకేముంది! రెండూ కలిసి కొత్త వ్యూహాలను ప్రక టిస్తుండటంతో పోటీ సంస్థలతో పాటు టెలికం కంపెనీలూ కలవరపడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం టెలికం ఆపరేటర్లకు ఎస్సెమ్మెస్, వాయిస్, డేటాతో పాటు వాల్యూ యాడెడ్ సర్వీసుల వంటి నాలుగు ఆదాయ వనరులున్నాయి. వీటిలో అగ్రస్థానం వాయిస్ కాలింగ్ సర్వీసులదే. ఇపుడు 3జీ రావటంతో డేటా సేవలను మరింత పెంచేందుకు కసరత్తు చేస్తున్నాయి. అవి ఆ ప్రయత్నాల్లో ఉండగానే... సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు, మెసేజింగ్ సర్వీసుల సంస్థలు చాప కింద నీరులాగా చుట్టబెట్టేస్తున్నాయి. స్కైపీ, వైబర్ లాంటి వాటితో పాటు దాదాపు అయిదేళ్ల క్రితం ప్రారంభమైన వాట్స్ యాప్ కూడా ఇందులో దూసుకెళ్లిపోతోంది. గతేడాది మెసేజ్‌ల మార్కెట్ విలువ దాదాపు రూ.6,000 కోట్లు ఉండగా.. వాట్స్‌యాప్ లాంటి మెసేజింగ్ యాప్స్ కంపెనీలు సుమారు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల దాకా ఆదాయానికి గండికొట్టాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా వాల్యూ యాడెడ్ సర్వీసుల ద్వారా టెలికం కంపెనీలు లక్షల కోట్లు ఆర్జిస్తుండగా.. గూగుల్ వంటి వెబ్‌సైట్లు అందులో 6-7 శాతం వాటాను దక్కించుకుంటున్నాయి. ఇవి తమ సర్వీసులను విస్తరిస్తున్న కొద్దీ టెల్కోల ఆదాయానికి మరింత గండిపడుతూనే ఉంటుందని దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మాజీ సీఈవో సంజయ్ కపూర్ పేర్కొన్నారు.
ఈ దాడిని ఎదుర్కోవడానికి టెలికం కంపెనీలు మల్లగుల్లాలు పడుతుండగానే తాము వాయిస్ కాల్స్‌ని కూడా ప్రవేశపెట్టబోతున్నామంటూ వాట్స్‌యాప్ సహవ్యవస్థాపకుడు జాన్ కూమ్ బాంబు పేల్చారు. ఇప్పటికే ఒకదానితో మరొకటి పోటీపడి కాల్‌చార్జీలను తగ్గించుకుంటూ పోయిన టెల్కోలకు ఇది ఊహించని ఎదురుదెబ్బే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 45 కోట్లకు మందికి పైగా యూజర్లు ప్రస్తుతం వాట్స్ యాప్‌ను వాడుతున్నారు. వచ్చే కొన్నేళ్లలో ఈ సంఖ్య 100 కోట్లకు చేరుతుందనేది నిపుణుల అంచనా. ప్రస్తుత యూజర్లందరూ పెయిడ్ యూజర్లుగా మారితే కేవలం మెసేజింగ్ సర్వీసులతోనే (ఏడాదికి ఒక డాలర్) వాట్స్‌యాప్‌కి వార్షికంగా రూ.3,000 కోట్ల పైచిలుకు ఆదాయం వస్తుందని అంచనా. ఇక వంద కోట్ల మంది యూజర్లు ఇటు మెసేజింగ్, కాల్ సర్వీసులను వాడటం మొదలుపెడితే అనేక రెట్లు ఆదాయం వస్తుంది. టెల్కోలకు కూడా డేటా వాడకం రూపంలో కొంత ఆదాయం వచ్చినా.. వాటి సర్వీసులను వాట్స్‌యాప్ ఎగరేసుకుపోవడం వల్ల ఆ ప్రభావం మిగతా ఆదాయాలపై తీవ్రంగానే ఉంటుంది.
ఇప్పటికిప్పుడు కాకపోయినా కొన్నాళ్లు పోయాక ఈ ప్రభావం టెలికం సంస్థల ఆదాయంపై తీవ్రంగా పడుతుందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీకి చెందిన జైదీప్ ఘోష్ అభిప్రాయపడ్డారు. స్మార్ట్‌ఫోన్లు ఇంకా పూర్తి స్థాయిలో మెజార్టీ ప్రజల చేతుల్లోకి చేరలేదు కనుక, ఇంటర్నెట్ సేవలు మారుమూల గ్రామాల్లో విస్తృతంగా లేవు కాబట్టి ప్రస్తుతానికి ఈ ప్రభావం తక్కువగానే ఉంటుందన్నారు.
వాట్స్‌యాప్‌కి సానుకూలాంశాలు..
స్కైపీ వంటి యాప్స్‌తో పోలిస్తే వాట్స్‌యాప్‌కి అనేక అనుకూలాంశాలున్నాయని సైబర్ మీడియా ఎడిటోరియల్ అడ్వైజర్ ప్రశాంతో రాయ్ చెప్పారు. ప్రత్యేకంగా పీసీతో పని ఉండదు. వాట్స్‌యాప్‌ను ఉపయోగించడం చాలా సులువు. వీటికితోడు యూజర్ల సంఖ్య భారీ స్థాయిలో ఉండటం దానికి లాభిస్తుందని తెలిపారాయన. పైగా ఇతర యాప్స్‌తో పోల్చినప్పుడు వాట్స్‌యాప్ ఆడియో, వీడియో మెసేజిల్లో మరింత స్పష్టత ఉంటుందని తెలియజేశారు. కొంగొత్త సేవలను విస్తరించేందుకు సానుకూలాంశాలు ఉన్నందునే ఫేస్‌బుక్ భారీ మొత్తం వెచ్చించి వాట్స్‌యాప్‌ని కొనుగోలు చేసిందనేది సంజయ్ కపూర్ అభిప్రాయం. మొబైల్ కామర్స్‌లోనూ ఇది చొచ్చుకుపోయే అవకాశముందన్నారు.
ఈజీ సేవల వాట్స్‌యాప్..
ఇన్‌స్టంట్ మెసేజింగ్ సేవలకు సంబంధించి ఇదో అప్లికేషన్(యాప్). దీనిద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులు చాలా సులువుగా టెక్స్ట్, వాయిస్ మెసేజ్‌లతో పాటు వీడియోలు, ఫొటోలు ఏవైనా సరే వేరొకరికి లేదా గ్రూపునకు పంపొచ్చు.
వేరొకరు పంపిన వీడియోలు, ఫోటోలు, మెసేజ్‌లు ఇతరులతో షేర్ చేసుకోవచ్చు కూడా.
దీనికి టెలిఫోన్ ఆపరేటర్ల నుంచి ఎలాంటి చార్జీలు ఉండవు. స్మార్ట్, ఫీచర్ ఫోన్లు అన్నింటిలోనూ (గూగుల్ ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ ఓఎస్, యాపిల్ ఐఓఎస్; నోకియా ఆశా, విండోస్ ఫోన్ ఇతరత్రా) ఈ యాప్ అందుబాటులో ఉంది.
ప్రపంచంలో ఏ మూలనుంచైనా ఈ యాప్‌ను ఉపయోగించొచ్చు. ఫోన్ లేదా ట్యాబ్‌లో కేవలం ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు. యూజర్ల మొబైల్ నంబర్ల ఆధారంగా ఇది అనుసంధానం అవుతుంది.
డౌన్‌లోడ్ చేసుకున్న తొలి ఏడాది పాటు ఈ యాప్‌ను ఉచితంగానే వాడుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ఏడాదికి ఒక డాలరు (దాదాపు రూ.62) చొప్పున ఫీజు చెల్లించాలని వాట్స్‌యాప్ చెబుతోంది.
ప్రసుత్తం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా యూజర్లు వాట్స్‌యాప్‌ను వినియోగిస్తున్నారు. రోజుకు 10 లక్షల మంది కొత్త యూజర్లు జతవుతున్నట్లు అంచనా. అంతేకాదు వాట్స్‌యాప్ యూజర్లలో 70 శాతం మంది యాక్టివ్‌గా (రోజులో కనీసం ఒకసారైనా వాడేవారు) ఉంటున్నారు.
స్వల్పకాలంలోనే వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 100 కోట్ల మైలురాయిని అధిగమించగలదని అంచనా.
రోజుకు 50 కోట్లకు పైగా ఫోటోలు, 1,000 కోట్లకు పైగా మెసేజ్‌లు దీనిద్వారా షేర్ అవుతున్నట్లు అంచనా.
టెల్కోల వ్యూహాలు..
కన్సల్టెన్సీ సంస్థ ఓవమ్ అంచనాల ప్రకారం కస్టమర్లు డేటా నెట్‌వర్క్ ద్వారా వాయిస్ కాల్స్‌ని వాడటం మొదలుపెడితే 2018 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా టెల్కోల ఆదాయాల్లో 386 బిలియన్ డాలర్ల మేర గండిపడుతుంది. ప్రస్తుతం టెల్కోల ఆదాయంలో సగటున 85 శాతం వాటా వాయిస్ కాల్స్‌దే ఉంటోంది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీవోఐపీ) రూపంలో ఇప్పటికే ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇది వచ్చినప్పుడు కూడా దేశీయంగా వీఎస్‌ఎన్‌ఎల్ ఆదాయం 40-50 శాతం పడిపోయింది.
వీవోఐపీతో దేశీయంగా వీఎస్‌ఎన్‌ఎల్, అటు అమెరికాలో ఏటీఅండ్‌టీ వంటి దిగ్గజాలు పోరాడినప్పటికీ... వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే, ఇప్పటికే టెలికం స్పెక్ట్రం, లెసైన్సులు, నెట్‌వర్క్ ఏర్పాటు కోసం వేల కోట్లు కుమ్మరించిన టెల్కోలు వాట్స్‌యాప్ దాడిని చూస్తూ ఊరుకోకపోవచ్చు. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవి నియంత్రణ సంస్థను ఆశ్రయించవచ్చు. ఆపరేటర్ల ఆందోళనలపై కూడా తాము దృష్టిపెడతామని ఈ మధ్యే టెలికం శాఖ కూడా హామీ ఇచ్చింది. ఏది ఏమైనా... ఇప్పటిదాకా ఏదో రకంగా లాగించిన టెలికం కంపెనీలు ఇప్పటికైనా పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి సత్వర చర్యలకు దిగాలని, లేదంటే కష్టమేనని కపూర్ వ్యాఖ్యానించారు.