Friday, February 14, 2014

పైచేయి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లదే

ముగిసిన స్పెక్ట్రమ్ వేలం
ప్రభుత్వానికి రూ.61,162 కోట్లు
లక్ష్యాన్ని మించి నిధులు 

రేడియో తరంగాల వేలానికి టెలికాం కంపెనీల నుంచి విశేష స్పందన లభించింది. 10 రోజుల పాటు కంపెనీల మధ్య పోటాపోటీగా జరిగిన స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ గురువారం ముగిసింది. ప్రభుత్వ లక్ష్యాన్ని మించి ఖజానాకు రూ.61,162 కోట్లు సమకూరాయి. ఢిల్లీ, ముంబయి, ఇతర నగరాల్లో కీలకమైన స్పెక్ట్రమ్‌ను వొడాఫోన్ గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్‌లు దక్కించుకున్నాయి. 900 మెగాహెర్ట్జ్, 1,800 మెగా హెర్ట్జ్ (ఎంహెచ్‌జెడ్) బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం వేలం వేసింది. ఈ రెండు బ్యాండ్ల రేడియో తరంగాలను సొంతం చేసుకోవడానికి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తహతహలాడినప్పటికీ 18 సర్కిళ్లలో 1800 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌నే ఎంచుకుంది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలలో వొడాఫోన్‌కు ఉన్న లైసెన్స్ గడువు ఈ ఏడాది నవంబరుతో ముగుస్తుంది. దీంతో కార్యకలాపాలను కొనసాగించాలంటే.. ఎంత ధరైనా చెల్లించి స్పెక్ట్రమ్‌ను పొందాల్సిన అవసరం కంపెనీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ మూడు మహానగరాల్లో 900 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్, 11 సర్కిళ్లలో 2జీ 1800 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను పొందడానికి రూ.19,600 కోట్లు వెచ్చించి బిడ్లు దాఖలు చేసింది. ఢిల్లీ, కోల్‌కతాలలో ఎయిర్‌టెల్ లైసెన్సుల గడువు కూడా నవంబరుతో ముగుస్తుంది. ఈ రెండు మహానగరాలతోపాటు ముంబయిలో కూడా 900 మెగా హెర్ట్జ్ రేడియోతరంగాలను ఎయిర్‌టెల్ సొంతం చేసుకుంది. 15 సర్కిళ్లలో 1800 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను పొందింది. ఇందుకు రూ.18,530 కోట్లు వెచ్చించింది. 1800 ఎంహెచ్‌జెడ్ రేడియో తరంగాలను వినియోగించి దేశ వ్యాప్తంగా 4జీ సేవలందించనున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. ఢిల్లీలో ఐడియా కూడా 900 మెగాహెర్ట్జ్ రేడియో తరంగాలను సంపాదించింది.
2013-14లో రూ.18,296 కోట్లు 
వేలం పూర్తి కావడం సంతోషం కలిగిస్తోందని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. ప్రభుత్వానికి మొత్తం రూ.61,162.22 కోట్లు లభిస్తాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే వేలం విజయవంతమైనట్లేనని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి కనీసం రూ.18,296.36 కోట్లు లభిస్తాయి.భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ జియో ఇన్ఫోకాం సహా 8 టెలికాం వేలంలో పాల్గొన్నాయని, 68 విడతల్లో వేలం జరిగిందని తెలిపారు. 1800 మెగా హెర్ట్జ్ విభాగంలో దాదాపు 78 శాతం బ్లాక్‌లకు బిడ్లు దాఖలయ్యాయి. 900 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో మొత్తం (100 శాతం) బ్లాకుల్లో బిడ్లు వేశారు. 1800 మెగా హర్ట్జ్ (ఎంహెచ్‌జెడ్) స్పెక్ట్రమ్ బిడ్డింగ్ మొత్తం కనీస విలువను మించింది. ఈ రేడియో తరంగాల్లో దాదాపు 385 మెగాహెర్ట్జ్‌ని ప్రభుత్వం పక్కన పెట్టింది. 900 ఎంహెచ్‌జెడ్‌లో 46 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు వేలం వేయలేదు. 900 ఎంహెచ్‌జెడ్ రేడియో తరంగాలకు రూ.37,572.60 కోట్ల బిడ్లు లభించాయని, 1,800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు రూ.23,589.62 కోట్ల విలువైన బిడ్లు లభించాయని టెలికాం కార్యదర్శి ఎం.ఎఫ్. ఫరూకీ తెలిపారు. మొత్తం స్పెక్ట్రమ్ కనీస ధరను ప్రభుత్వం రూ.47,933.40 కోట్లుగా నిర్ణయించింది. 1,800 ఎంహెచ్‌జెడ్ రేడియో తరంగాలకు ముందుగా (అప్ ఫ్రంట్) 33 శాతం మొత్తాన్ని చెల్లించడానికి కంపెనీలు అంగీకరించాయి. 900 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు ఇది 25 శాతం ఉంది.