Wednesday, February 5, 2014

వాహన ప్రదర్శన నేటి నుంచే (5 ఫిబ్రవరి-2014)

(5 ఫిబ్రవరి-2014)
న్యూఢిల్లీ: భారత వాహన ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఆ పండుగకు తెరతీయనుంది. ఈ రంగం గత రెండేళ్లుగా డీలా పడ్డ సమయంలో తిరిగి గిరాకీని పెంచేందుకు.. కొనుగోలు దార్లను ఆకర్షించేందుకు ఇదో మంచి వేదికగా కంపెనీలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి 11 వరకూ జరిగే ఈ ప్రదర్శనలో తొలి రెండు రోజులు మీడియా ప్రతినిధులకు కేటాయించారు. 7 నుంచి సాధారణ ప్రజలను అనుమతిస్తారు. అంతక్రితంలా కాకుండా ఈ సారి 12వ ఆటో ఎక్స్‌పో రెండు భాగాలుగా విడదీశారు. గ్రేటర్ నోయిడాలో వాహన ప్రదర్శనను; ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో వాహన విడిభాగాల ప్రదర్శనను నిర్వహించనున్నారు.

మొత్తం మీద 70 కొత్త వాహనాలు ఈ ప్రదర్శనలో మెరవనున్నాయి. ఇందులో 26 అంతర్జాతీయ మోడళ్లు కావడం విశేషం. అంతక్రితం ప్రదర్శనలో నిర్వహణపై ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజాలు 'ఇది తమాషా కాదు' అన్న విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ సారి నిర్వాహకులు మరింత పకడ్బందీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారన్న అంచనాలున్నాయి. భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), భారత వాహన విడిభాగాల తయారీ సంఘం(ఏసీఎమ్ఏ)లు నిర్వహణలో పాలుపంచుకుంటున్న విషయం తెలిసిందే.