Thursday, February 20, 2014

తగ్గుతున్న ఎస్‌ఎమ్మెస్‌ల ప్రాభవం

న్యూఢిల్లీ: మన దగ్గరకి కాస్త ఆలస్యంగా 1998 ప్రాంతంలో వచ్చినప్పటికీ.. ఎస్‌ఎమ్మెస్‌లు దాదాపు 20 ఏళ్లుగా చలామణీలో ఉన్నాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం దాకా టెలికం ఆపరేటర్లకు వచ్చే ఆదాయంలో సుమారు 10% వాటా ఎస్‌ఎమ్మెస్‌ల నుంచే ఉండేది. కానీ, ప్రస్తుతంఇది 5-6%కి తగ్గిపోయింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌కి వచ్చిన ఆదాయంలో మెసేజింగ్, విలువ ఆధారిత సర్వీసుల ద్వారా 8.2% దాకా వాటా ఉంది. కానీ ఇది జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి వచ్చే సరికి 6.7%కి తగ్గిపోయింది.

వొడాఫోన్ విషయానికొస్తే.. క్రితం ఏడాది ప్రథమార్ధంతో పోలిస్తే  2013-14 ప్రథమార్ధంలో మెసేజింగ్ సేవల ఆదాయం ఏకంగా 7% తగ్గింది. అటు ఐడియా పరిస్థితి కూడా అలాగే ఉంది. క్రితం క్వార్టర్‌తో పోలిస్తే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో డేటాయేతర సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం 1.4% క్షీణించింది. ఈ నేపథ్యంలో వచ్చే కొన్నేళ్లలో ఎస్‌ఎమ్మెస్‌ల ద్వారా వచ్చే ఆదాయం 45-50% దాకా పడిపోవచ్చని అంచనాలు ఉన్నట్లు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీవోఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ తెలిపారు. మొబైల్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సంస్థ ‘ఓవమ్’ అధ్యయనం ప్రకారం 2011లో ఎస్‌ఎమ్మెస్‌ల వృద్ధి రేటు 14 % ఉండగా.. 2013లో 8%కి పడిపోయింది. 2015 చివరి నాటికి మరింత తగ్గగలవని అంచనా.

 పెరుగుతున్న డేటా సేవలు..
 తగ్గుతున్న ఎస్‌ఎమ్మెస్‌ల ఆదాయాలను భర్తీ చేసుకునేందుకు టెలికం కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషల్లో ఎస్‌ఎమ్మెస్‌ల సేవలను ప్రవేశపెడుతున్నాయి. డేటా సేవల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతోందని మ్యాథ్యూస్ తెలిపారు. టెల్కోల ఆదాయ గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2013-14 ద్వితీయ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ మొత్తం మొబైల్ ఆదాయాల్లో డేటా సర్వీసుల ద్వారా వచ్చేది 5.2% నుంచి 9.2%కి పెరిగింది.

 2013-14 ప్రథమార్ధంలో వొడాఫోన్  డేటా ఆదాయం (బ్రౌజింగ్ మినహా) ఏకంగా 45.9% ఎగిసింది. అధ్యయనం ప్రకారం వాట్స్‌యాప్, బ్లాక్‌బెర్రీ మెసెంజర్ (బీబీఎం), వుయ్‌చాట్ లాంటి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్ కోసం ఈ డేటా వినియోగం ఎక్కువగా ఉంటోంది. 2016-17 నాటికి డేటా సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 34 శాతం పెరిగి 35 కోట్లకు చేరగలదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 3జీ సర్వీసులు ఇంకాస్త ప్రాచుర్యంలోకి వస్తే డేటా సేవల ద్వారా టెల్కోల ఆదాయాలు మరింతగా పెరగగలవని భావిస్తున్నాయి.