Tuesday, February 25, 2014

స్మార్ట్‌ఫోన్లకు రూపాయే దిక్కు

భారత్ వంటి దేశాల్లో వాటికి భారీ గిరాకీ
సై అంటున్న దిగ్గజ సంస్థలు
వియత్నాంలో అధికోత్పత్తి దిశగా కదులుతున్న శామ్‌సంగ్


స్మార్ట్‌ఫోన్ల విక్రయాలకు భారత్, ఆఫ్రికా వంటి ప్రవర్ధమాన దేశాలు పెద్ద దిక్కుగా మారాయి. అయితే రూ.7,500 లోపు ధరతో ఉండే ఫోన్లకే గిరాకీ ఎక్కువగా ఉంది. ఫీచర్ ఫోన్ల నుంచి కొనుగోలుదార్లను స్మార్ట్ ఫోన్లకు మళ్లించాలంటే, ఆకర్షణీయ ఫీచర్లతో పాటు ఆ తరహా ఫోన్లను తక్కువ ధరలలో అందించాల్సిందే. ఇందుకోసమే దిగ్గజ సంస్థలు చైనా కన్నా నిర్వహణ వ్యయం తక్కువగా ఉండే దేశాలపై దృష్టి సారించాయి. శామ్‌సంగ్ వియత్నాంలో ఉత్పత్తి అధికం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఏటా 25 కోట్ల వరకు సెల్‌ఫోన్ల దిగుమతి చేసుకుంటున్న భారత్ ఈ తరహా అవకాశాన్ని తాను కూడా అందిపుచ్చుకొంటే విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున ఆదా చేసుకోవడం సాధ్యపడవచ్చు.


దేశంలోకి గత ఏడాది 21 కోట్లకు పైగా చౌక సెల్‌ఫోన్లు దిగుమతి అయ్యాయి. ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు వీటికి అదనం. చైనా, తైవాన్ వంటి దేశాల్లో సెల్‌ఫోన్ల తయారీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఎగుమతి చేసినందుకు ప్రభుత్వం సుంకాల రూపేణా ఆర్థిక ప్రయోజనం కల్పిస్తోంది. అందుకే ఆపిల్, శామ్‌సంగ్ సహా అత్యధిక సెల్‌ఫోన్ తయారీ సంస్థలు చైనాలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. అమెరికా, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు చైనాలోనూ స్మార్ట్‌ఫోన్ల వినియోగం అధికమై, విక్రయాల్లో వృద్ధి నెమ్మదించింది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పెరిగేందుకు భారత్ వంటి ప్రవర్థమాన దేశాలపై ఆధారపడుతున్నారు. వెచ్చించే ప్రతి రూపాయికి తగిన విలువ ఆశించడం ప్రవర్ధమాన దేశాల ప్రజల నైజం. ఈ సంగతిని గ్రహించిన సంస్థలు తక్కువ ధరల్లో మెరుగైన స్మార్ట్‌ఫోన్లు అందించేందుకు కృషి చేస్తున్నాయి. చైనాతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువగా ఉన్న వియత్నాం, ఇండొనేషియా వంటి దేశాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రయత్నాలు ఆరంభించాయి.

సగం విక్రయాలు అక్కడే: గత ఏడాది ప్రపంచం మొత్తం మీద 100 కోట్ల స్మార్ట్‌ఫోన్లు విక్రయమైతే, ఇందులో 50 కోట్ల అమ్మకాలు భారత్, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, లాటిన్ అమెరికా, మధ్య- తూర్పు ఐరోపా వంటి ప్రాంతాల్లోనే జరిగాయి. 35.10 కోట్ల స్మార్ట్‌ఫోన్లు చైనా నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. గత మూడేళ్లలో చైనాలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం మూడు రెట్లు పెరిగి, మొత్తం విక్రయాల్లో వీటి వాటా 80 శాతానికి చేరింది. ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా వంటి దేశాల మాదిరే చైనాలోనూ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో వృద్ధి మందగించినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 66 కోట్ల ఫీచర్ ఫోన్లే విక్రయమైతే, వీటిల్లో అత్యధికం వర్ధమాన దేశాలకే వెళ్లాయి. అన్ని దేశాల కన్నా భారత్‌కు అధికంగా 21.23 కోట్ల ఫీచర్‌ఫోన్లు సరఫరా అయ్యాయి.

స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు అంతంతే: ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన సెల్‌ఫోన్లలో 50 శాతం 100 డాలర్ల (సుమారు రూ.6,200)లోపువే. ఇందులోనూ మూడింట రెండు వంతులు 50 డాలర్ల (రూ.3,100) లోపువే. దేశంలో ఐఫోన్ వంటి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో అధిక వృద్ధి లేదు. అయితే చౌక స్మార్ట్‌ఫోన్లకు అత్యధిక గిరాకీ లభిస్తోంది. 2013లో దేశంలోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో 50 శాతానికి పైగా 120 డాలర్ల (సుమారు రూ.7,400లోపు) లోపు విలువైనవే అని ఐడీసీ ఆసియా పసిఫిక్ సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు కిరణ్్‌జీత్ కౌర్ చెబుతున్నారు.

ఇండొనేషియా, వియత్నాంలపై పడ్డ కళ్లు
శామ్‌సంగ్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు వివిధ దేశాల్లోని సంస్థలకు సెల్‌ఫోన్లను కాంట్రాక్టు పద్ధతిలో తయారు చేసి ఇచ్చే చైనాకు చెందిన దిగ్గజ సంస్థ హాన్‌హాయ్ కూడా చౌకగా స్మార్ట్‌ఫోన్లు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనా కన్నా నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండే వియత్నాంలో ఉత్పత్తి పెంచడంపై శామ్‌సంగ్ దృష్టిసారించింది. ఇండొనేషియాలో తయారీ యూనిట్ నెలకొల్పుతున్నట్లు హాన్‌హాయ్ వెల్లడించింది. 2020 నాటికి దేశం దిగుమతి చేసుకునే ముడిచమురు విలువ కన్నా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులే అధికంగా ఉంటాయన్నది మన కేంద్రప్రభుత్వ అంచనాగా ఉంది. ఇప్పటికే రూ.40,000 కోట్ల స్థాయి దాటిన సెల్‌ఫోన్ల తయారీ యూనిట్లను దేశంలోకి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తే, దేశానికి భారీఎత్తున విదేశీ మారక ద్రవ్యం ఆదా చేసుకోవచ్చంటున్నారు.