Tuesday, February 25, 2014

జోరుగా మిర్చి ఎగుమతులు

విదేశాల్లో మంచి గిరాకీ
పాత నిల్వలకూ రెక్కలు
శీతల గిడ్డంగులన్నీ ఖాళీ
సీజన్ మొదట్లోనే మంచి ధరలు

( ఈనాడు )
మిర్చి సీజన్ మొదలైంది. కొత్త పంట మార్కెట్లకు వస్తోంది. సీజన్ ఆరంభంలోనే మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. అటు చైనాలో, ఇటు మధ్యప్రదేశ్‌లోనూ పంట దెబ్బతినడం వల్ల దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ విపణిలోనూ మన మిర్చికి గిరాకీ బాగా పెరిగింది. ఎగుమతులు జోరుగా సాగడంతో రాష్ట్రంలోని శీతల గిడ్డంగుల్లో ఉన్న నిల్వలన్నీ అయిపోయాయి. ఏటా ఫిబ్రవరి నెలలో పాత సరుకే 25-30 లక్షల బస్తాలు ఉండేది. కానీ ఈసారి 4-5 లక్షల బస్తాలకు మించి పాత సరకు మిగల్లేదు. కొత్త పంట పైనే అందరూ ఆధారపడుతుండడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. విదేశాల్లో గిరాకీ ఎక్కువగా ఉండే బాడిగి రకానికి గుంటూరు మార్కెట్‌లో క్వింటాలుకు రూ.9000-9500 వరకు ధర లభిస్తోంది. ఈసారి మన దగ్గరా పంట ఆలస్యమవడం, ఉత్పత్తి తగ్గడం వల్ల ఇకపై కూడా ధరలు నిలకడగా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తరిగిపోయిన నిల్వలు
జనవరి-ఫిబ్రవరి నుంచి మార్కెట్లకు కొత్త మిర్చి రావడం మొదలవుతుంది. రైతులు పంటను నేరుగా తెచ్చి మార్కెట్ యార్డులో విక్రయించడంతో పాటు, కొంత సరకు శీతల గిడ్డంగుల్లో దాచుకుంటారు. రైతుల నుంచి సరకు కొనుగోలు చేసిన వ్యాపారులు కూడా గిడ్డంగుల్లో దాచిపెడతారు. గుంటూరులో సుమారు 120 శీతల గిడ్డంగులు ఉండగా వాటిలో మిర్చి ఉంచేవే ఎక్కువ. శీతల గిడ్డంగుల్లో ఉంచిన సరకు ఏడాది పొడవునా యార్డుకువస్తుంది. ఏటా సుమారు కోటి బస్తాల (ఒక్కో బస్తా సగటున 45 కిలోలు) మిర్చి శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తారు. ఏడాది పొడవునా విక్రయించగా ఫిబ్రవరి నెల వచ్చేసరికి ఇంకా 25-30 లక్షల బస్తాల సరకు ఉంటుంది. కొత్త సరకుతో పాటు, ఇది కూడా యార్డుకు వస్తుంది. కానీ ఈసారి అకాల వర్షాలు, తెగుళ్లు వంటి కారణాల వల్ల మన దగ్గర పంట 20-25 రోజులు ఆలస్యమైంది. మరోపక్క ఎగుమతులు వూపు మీద ఉండటంతో ఎగుమతిదారులు దొరికిన సరకు కనిపించినట్లు కొనేశారు. ప్రస్తుతం మలేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలకు మిర్చి ఎక్కువగా వెళుతోంది. మలేషియాలో బాడిగి, 273 రకాలకు, బంగ్లాదేశ్‌లో తేజ, శ్రీలంకలో 334 రకాలకు గిరాకీ ఎక్కువగా ఉన్నట్లు గుంటూరుకు చెందిన మిర్చి ఎగుమతిదారు దినేష్ తెలిపారు. ఈ గిరాకీ వల్ల శీతల గిడ్డంగుల్లో ఉన్న సరకు మొత్తం వెళ్లిపోయింది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద గిడ్డంగుల్లో 5-6 లక్షల బస్తాలు ఉంటే, దానిలో 4 లక్షలకు పైగా గుంటూరులోనే ఉంది. అది కూడా నాణ్యత లేకపోవడం, ఎగుమతులకు పనికిరాకపోవడం, బ్యాంకు రుణాల వివాదాల్లోఉండటం వంటి కారణాల వల్ల మిగిలిపోయిందే తప్ప, గిరాకీ లేక కాదని దినేష్ విశ్లేషించారు.

దెబ్బతిన్న ఎంపీ పంట
మిర్చి సాగులో మనకు మధ్యప్రదేశ్ ప్రధాన పోటీదారుగా తయారైంది. ప్రస్తుతం అక్కడ ఏటా 50-60 లక్షల బస్తాల పంట వస్తోంది. దీపావళి సమయంలో అక్కడ పంట మార్కెట్‌కి రావడం మొదలవుతుంది. వెంటనే మన పంటపై ప్రభావం పడుతుంది. ఈసారి అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మిర్చి పంట దెబ్బతింది. 35-40 లక్షల బస్తాలకు మించి పంట రాలేదు. మరోపక్క చైనాలో కూడా పంట దెబ్బతింది. చైనా తమ పంట దెబ్బతిన్నప్పుడు సహజంగానే భారత్‌పై ఆధారపడుతుంది. ఈ పరిణామాల వల్ల మన రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. ఈసారి మన దగ్గర కూడా దిగుబడులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏటా కోటిన్నర బస్తాల వరకు మిర్చి ఉత్పత్తి జరుగుతుంది. ఈ సారి ఇది తగ్గుతుందని కోటి బస్తాలు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమయానికి గుంటూరు మిర్చియార్డుకి రోజూ సుమారు లక్ష బస్తాల మిర్చిరావాలి. పాత సరుకు లేకపోవడం, దిగుబడులు దగ్గడం వల్ల ప్రస్తుతం 50-60 వేల బస్తాలే వస్తున్నాయి. ఈ కారణాల వల్ల ధరలు స్థిరంగా కొనసాగుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం తేజ రకానికి క్వింటాలుకు రూ.7500-8000, 341 రకానికి రూ.7500-8200, 275 రకానికి క్వింటాలుకి రూ.6500-7200, బాడిగి రకానికి రూ.9000-9500, 334 రకానికి రూ.6000-6800 వరకు ధర లభిస్తోంది. పంట ముమ్మరంగా వచ్చినప్పుడు 10 శాతం ధరలు తగ్గినా మళ్లీ పుంజుకుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.