Friday, February 14, 2014

పర్సు జారి గల్లంతయ్యిందే (Feb 14 Valentines Day Special)

ఫిబ్రవరి 14.. ప్రేమికులకే కాదు.. కంపెనీలకూ పండుగ రోజే. తన 'స్వీట్ హార్ట్' కోసం ప్రేమికులు కొనే బహుమతులు.. కంపెనీలకు కాసులు కురిపిస్తాయి. అందుకే ఇది ప్రేమికుల 'పర్సు జారి గల్లంతయ్యే రోజు.. కంపెనీలకు లాభాలు పంచే రోజు.. మరి ఈసారి వేలంటైన్స్ డే (ప్రేమికుల రోజు)కు ఏయే కంపెనీలు ఎలాంటి ఆఫర్లతో ప్రేమికులను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయో తెలుసుకుందామా..!
వేలంటైన్స్ డే నాడు పుష్పగుచ్ఛాలు, చాకొలెట్ బాక్సులు, మొబైల్ ఫోన్లు, గడియారాలు, దుస్తులు, బంగారు ఆభరణాల కొనుగోలుతో పాటు.. కలసి రెస్టారెంట్లకు వెళ్లేందుకు యువతీయువకులు ప్రాధాన్యం ఇస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విక్రయ సంస్థలతో పాటు రెస్టారెంట్లు కూడా పలు పథకాలు ప్రకటించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, జబాంగ్ వంటి ఆన్‌లైన్ సంస్థలు ఆయా ఉత్పత్తులపై ఆఫర్లు అందిస్తున్నాయి. రూ.41,000 విలువైన ఐఫోన్ 5సి మోడల్‌ను రూ.37,000కే విక్రయిస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. ఇక విమాన ప్రయాణంతో ముందుకొచ్చింది స్పైస్‌జెట్.
బిగ్ సి: యువతీ యువకులు ఒకరికి మరొకరు కానుకగా ఇచ్చుకునేందుకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నట్లు బిగ్ సి డైరెక్టర్ పవన్ వెల్లడించారు. డ్యూయల్‌సిమ్, టచ్, స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఈ ప్రత్యేక ఆఫర్‌లో ఉన్నాయి. రెండు ఫోన్ల కొనుగోలుపై రూ.700-1,800 వరకు ఆఫర్ ఉంటుంది. రూ.10,000కు మించిన సోనీ ఎరిక్‌సన్ ఫోన్లు, రూ.15,000కు మించిన శామ్‌సంగ్ ఫోన్లు, రూ.22,000కు మించిన ఐఫోన్లను వడ్డీ లేని సులభ వాయిదాల్లో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కూడా బిగ్ సి కల్పిస్తోంది. ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు. ఆదివారం వరకు ఈ ఆఫర్లు అమలులో ఉంటాయి.

యూనివర్‌సెల్: సిటీబ్యాంకు క్రెడిట్ కార్డుదారులకు 10% రాయితీతో పాటు స్మార్ట్‌ఫోన్లపై పలు ఆఫర్లు ఇస్తోంది.

లాట్: రూ.5,000-50,000 వరకు విలువైన స్మార్ట్ ఫోన్లను మార్చుకుని, కొత్తవి కొనుగోలు చేయాలనుకునే వారికి అవకాశం. పాత స్మార్ట్ ఫోన్ తీసుకుని వస్తే 50% విలువ ఇస్తామని, వెంటనే మార్చుకుని కొత్తది కొనుగోలు చేసుకోవచ్చు.

వాచీలపై 20-40 శాతం: వాచీలపై 20-40% వరకు రాయితీని టైటాన్ ప్రకటించింది.

స్పైస్‌జెట్: ఈ నెల 28 లోపు దేశీయంగా స్పైస్‌జెట్ విమానాల్లో ప్రయాణించిన వారు లక్కీ డ్రాలో మరో దేశీయ ప్రయాణానికి ఉచితంగా టికెట్టును గెలుపొందే అవకాశం కల్పిస్తున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. ఇలా లక్ష టికెట్లు అందచేస్తామని తెలిపింది. డ్రాలో విజేతల వివరాలను మార్చి 7న తమ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని పేర్కొంది.

హోటళ్లలో: హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లలో ప్రేమికులు, దంపతులు ప్రత్యేక విందుకు హాజరు కావచ్చు. పార్క్ హయత్, ట్రిడెంట్ హోటల్, గోల్కొండ హోటల్, ఎల్లా హోటల్స్‌తో పాటు జీవీకే వన్ మాల్‌లోని హార్డ్‌రాక్ కేఫ్, బార్బెక్యు నేషన్ రెస్టారెంట్లు ఈ ఏర్పాట్లు చేస్తున్నాయి.

రిలయన్స్ జువెల్స్, జోయాలుక్కాస్ ప్రత్యేక పథకాలను ప్రకటించాయి.
విదేశాల నుంచి ఆర్డర్ల వెల్లువ
భారత్ నుంచి అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లిన వారు చాలామంది ప్రేమికుల రోజుకు వారు ఆయా దేశాల నుంచి ఇక్కడి తమ సన్నిహితులకు బహుమతులు పంపుతుంటారు. ఈ ఏడాది భారత్ మొత్తం మీద 50,000 వరకు ఆర్డర్లు వస్తాయని ఆన్‌లైన్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇందులోనూ సింహభాగం అమెరికా నుంచే ఉంటాయని సమాచారం. దేశం మొత్తానికీ వచ్చేవాటిలో 50 శాతం వరకు ఆంధ్రప్రదేశ్‌కే ఉంటాయని యూఎస్2ఏపీడాట్‌కామ్ ఎండీ శ్రీధర్ చెప్పారు. గత ఏడాది సగటు ఆర్డరు 43 డాలర్లుండగా, ఈసారి డాలర్ విలువ 10 శాతం పెరిగినప్పటికీసగటు ఆర్డరు విలువ 45 డాలర్లుగా (సుమారు రూ.2,800) ఉందన్నారు.
అసోచామ్ అధ్యయనం చెబుతున్న
ఆశ్చర్యకరమైన నిజాలు..
చి గత ఏడాదితో పోలిస్తే ఈసారి 'ప్రేమ ఖరీదు' పెరగొచ్చు. 2013లో వేలంటైన్స్ డే వేళ దాదాపు రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రేమికులు ఈ ఏడాది రూ.18,000 కోట్ల వరకు వెచ్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
చి ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ, హాస్పిటాలిటీ తదితర రంగాలతో పాటు ప్రముఖ కార్పొరేట్ సంస్థలో అధిక వేతనం అందుకుంటున్న ఉద్యోగులు భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది.

చి అధిక వేతన ఉద్యోగులు రూ.1000-50,000 వరకు వెచ్చించవచ్చు. విద్యార్థులైతే రూ.500-10,000 వరకు ఖర్చు పెట్టొచ్చని అంచనా.

చి ప్రేమికుల రోజున మరింత అందంగా కన్పించేందుకు 75 శాతం మంది తమ వ్యక్తిగత సౌందర్యం కోసం రూ.500-10,000 వరకు వెచ్చించడం ఆశ్చర్యమే కదూ!

చి రిటైల్ విక్రయ కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, ఎంపీ3 ప్లేయర్లు, ఐపాడ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, వస్త్రాలు ఆదాయం తెచ్చిపెట్టనుండగా.. ఆన్‌లైన్ విక్రయ సంస్థలకు పూలు, గ్రీటింగ్ కార్డులు, చాకొలెట్లు, బొమ్మలు, ఆభరణాల ద్వారా ఆదాయం రానుంది.

చి 'తమ వాళ్ల'తో కలసి రాత్రిపూట హోటల్‌కు భోజనానికి వెళ్లాలని 65% మంది అనుకుంటూండగా.. తనను డిన్నర్‌కు తీసుకెళ్తే బాగుండునని 49% మంది కోరుకుంటున్నారు. తమ ప్రేమను తెలిజేస్తూ చాకొలేట్లు ఇవ్వాలని 38 శాతం మంది భావిస్తూండగా, పువ్వులు ఇవ్వాలని 37% మంది భావిస్తున్నారు. తన ప్రియుడు/ప్రియురాలు నుంచి చాకొలేట్లు బహుమతిగా వస్తే బాగుంటుందని 30% మంది, పువ్వులు వస్తే సంతోషమని 20% మంది ఎదురుచూస్తున్నారు.

చి గ్రీటింగ్‌లు ఇవ్వాలనుకునేవారు 8% మంది అయితే.. గ్రీటింగ్ కార్డులు రావాలని ఎదురుచూస్తున్నవారు 15 శాతం మంది. 7% మంది ఎలక్ట్రానిక్ ఉత్పత్తులవైపు మొగ్గు చూపుతూ ఉండగా.. 20 శాతం మంది అలాంటివే రావాలని కోరుకుంటున్నారు.

చి వేలంటైన్స్ డే కొనుగోళ్లలో గుర్‌గావ్, నోయిడా, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, గోవా, పుణెల్లో చదువుతున్న/ఉద్యోగం చేస్తున్న వారి వాటా 75 శాతం ఉంది.

చి ప్రేమికుల రోజున కానుకల కోసం 65 శాతం మంది పురుషులు వెచ్చిస్తుండగా.. మహిళలు 35 శాతం మంది మాత్రమే ఖర్చు పెడుతున్నారు.