

ప్యాసింజర్ కార్లతోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్-రెక్సాట్ ధరను రూ.92,000 మేర తగ్గించింది. వాణిజ్య వాహన ధరలను కూడా సవరించింది. రకాన్ని బట్టి కార్ల ధర తగ్గింపు ఉందని ఫియట్ పేర్కొంది. ఈ కంపెనీ పుంటో, లీనియా మోడళ్లను దేశంలో విక్రయిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ పోలో ధర రూ.18,000 నుంచి రూ.31,000 వరకూ, వెంటో ధర రూ.14,500-27,000, జెట్టా ధర రూ.38,000-51,000 వరకూ దిగివచ్చాయి. ధరల తగ్గింపు కార్ల గిరాకీని పెంచగలదని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, అమ్మకాలు) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. తన కార్ల ధరలను 6 శాతం వరకూ తగ్గిస్తున్నట్లు ఇప్పటికే నిస్సాన్ ప్రకటించింది. మైక్రా యాక్టివ్, మైక్రా, సన్నీ, ఎవాలియా, టెర్రానో, టెన్నా మోడళ్లపై ఈ కంపెనీ ధరలు తగ్గించింది.
టీవీఎస్ మోటార్స్: ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల కలిగిన ప్రయోజనం మొత్తాన్ని కొనుగోలుదారులకే బదిలీ చేస్తున్నట్లు టీవీఎస్ మోటార్స్ ప్రకటించింది. ఈ మేరకు మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను బుధవారం నుంచి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ద్విచక్ర వాహన ధరలను సవరించాయి.