రెండో రోజే ముగింపు...
బిడ్‌ల విలువ రూ. 9,407 కోట్లే...
ప్రభుత్వ లక్ష్యం రూ.40 వేల కోట్లు
దేశవ్యాప్త స్పెక్ట్రం బిడ్డింగ్‌కు టెల్కోలు దూరం
వొడాఫోన్‌కు 14 సర్కిళ్లలో స్పెక్ట్రం
వీడియోకాన్‌కు 6, ఐడియా చేతికి 8 సర్కిళ్లు...
టెలినార్‌కు 6 సర్కిళ్లలో స్పెక్ట్రం...
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం వేలం ప్రభుత్వ ఆశలపై నీల్లుచల్లింది. భారీగా
నిధులొస్తాయని భావించిన కేంద్రానికి టెల్కోల నుంచి గట్టి షాక్ తగిలింది.

ఈ-వేలం
రెండో రోజైన బుధవారంనాడే ముగిసింది. ముగింపు నాటికి రూ.9,407 కోట్ల
విలువైన బిడ్‌లు మాత్రమే వచ్చాయి. 2జీ వేలం ఎంతగా ఫ్లాప్ అయిందనేదానికి ఇదే
నిదర్శనం. జీఎస్‌ఎం స్పెక్ట్రం ద్వారా రూ.28,000 కోట్లు, సీడీఎంఏ వేలంను
కూడా కలిపితే మొత్తం 2జీ వేలం ద్వారా రూ.40,000 కోట్ల ఆదాయాన్ని కేంద్ర
ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్త స్పెక్ట్రం
లెసైన్స్ కోసం టెలికం ఆపరేటర్ల నుంచి ఒక్క బిడ్ కూడా లేకపోవడం మరో
ప్రధానాంశం.
సోమవారం(12న) వేలం ప్రారంభమైన తొలిరోజు రూ.9,225 కోట్ల విలువైన బిడ్‌లు రావడం తెలిసిందే.
కాగా, బిడ్డింగ్ ముగిసినట్లు ప్రకటించిన టెలికం మంత్రి కపిల్ సిబల్...
గతంలో 2జీ కేటాయింపుల కారణంగా ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు నష్టం
వాటిల్లినట్లు కాగ్ పేర్కొన్న అంచనాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
‘వాస్తవాలేమిటో ఇప్పుడు ప్రజలకు స్పష్టమైంది. 3జీ వేలం ధర ప్రకారం ప్రస్తుత
2జీ స్పెక్ట్రంకు రూ. లక్ష కోట్లు రావాలి. అయితే, రూ.9,407 కోట్లే
వచ్చాయి. దీనిబట్టి మార్కెట్ పరిస్థితేంటో తేలిపోయింది’ అని పరోక్షంగా
కాగ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కయిందన్న
ఆరోపణలను సిబల్ కొట్టిపారేశారు.
వొడాఫోన్ జోరు... ప్రాథమిక
సమాచారం ప్రకారం... జీఎస్‌ఎం 2జీ వేలంలో వొడాఫోన్ 14 సర్కిళ్లలో అదనపు
స్పెక్ట్రంను దక్కించుకొని టాప్‌లో నిలిచింది. వీడియోకాన్‌కు 6, ఐడియాలు 7
సర్కిళ్లలో స్పెక్ట్రంను దక్కించుకున్నాయి. ఇక నార్వే టెలికం దిగ్గజం
టెలినార్ ఆంధ్ర ప్రదేశ్‌తో సహా 6 సర్కిళ్లలో స్పెక్ట్రం లెసైన్స్‌ను కైవసం
చేసుకుంది. ఎయిర్‌టెల్ మాత్రం ఒక్క సర్కిల్(అసోం)లో మాత్రమే అదనపు
స్పెక్ట్రం లెసైన్స్‌ను దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 2జీ లెసైన్స్(ఒక్కో
సర్కిల్‌లో 5 మెగాహెర్ట్జ్) కోసం ప్రభుత్వం నిర్ణయించిన రూ.14,000 కోట్ల
ప్రారంభ(బేస్) ధర చాలా ఎక్కువని, వేలానికి స్పందన కరువయ్యేందుకు ఇదే
కారణమని జీఎస్‌ఎం ఆపరేటర్ల సంఘం(సీఓఏఐ) పేర్కొంది. కాగా, 2010లో జరిగిన
3జీ స్పెక్ట్రం వేలం దాదాపు 35 రోజుల పాటు హోరాహోరీగా కొనసాగింది.
అంతేకాకుండా ప్రభుత్వ అంచనాలను మించి దాదాపు రూ.67,719 కోట్ల బంపర్ ఆదాయం
ఖజానాకు సమకూరింది కూడా.
‘సుప్రీం’ రద్దు ఎఫెక్ట్...
సుప్రీంకోర్టు 2జీ స్కామ్‌పై విచారణలో భాగంగా... 2008లో అప్పటి టెలికం
మంత్రి ఎ.రాజా హయాంలో ఇచ్చిన 9 కంపెనీలకు చెందిన 122 లెసైన్స్‌లను రద్దు
చేయడం(22 సర్కిళ్లలో) తెలిసిందే. దీంతో ప్రభుత్వం తాజాగా వేలాన్ని
నిర్వహించింది. 2001 నాటి ధరకు ముందొచ్చినవారికి ముందు ప్రాతిపదికన
స్పెక్ట్రంను కట్టబెట్టడంవల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం
వాటిల్లినట్లు 2010లో కాగ్ లెక్కతేల్చడంతో 2జీ కుంభకోణం వెలుగుచూసింది. 3జీ
వేలం బిడ్డింగ్ ధరల ఆధారంగా కాగ్ ఈ అంచనాలు వేసింది. తాజా వేలానికి
దేశవ్యాప్తంగా జీఎస్‌ఎం బ్యాండ్‌లో స్పెక్ట్రం వేలం బేస్ ధరను ప్రభుత్వం
రూ.14,000 కోట్లుగా నిర్ణయించింది. గతంలో కేటాయించిన రూ.1,658 కోట్లతో
పోలిస్తే ఇది 7 రెట్లు ఎక్కువ. కాగా, సుప్రీం తీర్పుతో లెసైన్స్‌లు
కోల్పోయిన 8 కంపెనీల్లో మూడు(ఐడియా, వీడియోకాన్, టెలినార్) మాత్రమే తాజాగా
లెసైన్స్‌ల కోసం పోటీలో నిలిచాయి.
వీటితో పాటు పాత టెల్కోలైన
భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ కూడా వేలంలో పాల్గొన్నాయి. అయితే, ఒక్కో
సర్కిల్‌లో ఈ రెండు కంపెనీలు గరిష్టంగా 2 బ్లాక్‌లకే బిడ్ చేసుకునే అవకాశం
కల్పించారు. మరోపక్క, సీడీఎంఏ స్పెక్ట్రం వేలం నుంచి టాటా టెలీ,
వీడియోకాన్‌లు వైదొలగడంతో ఇక దీనికి బిడ్డర్లే లేకుండా పోయారు. మరోపక్క,
జీఎస్‌ఎం స్పెక్ట్రం ప్రారంభ ధర కంటే సీడీఎంఏ స్పెక్ట్రం రేటును 1.3 రెట్లు
అధికంగా కేంద్రం నిర్ణయించడంతో కంపెనీలేవీ బిడ్డింగ్‌కు ముందుకురాలేదు.
దీంతో ఇక 2జీ సీడీఎంఏ స్పెక్ట్రం వేలం దాదాపు లేనట్టే. దీని ప్రకారం
రూ.40,000 కోట్ల మొత్తం ఆదాయ లక్ష్యాన్ని అందుకోవడంలో కేంద్రం అత్యంత
ఘోరంగా చతికిలపడినట్లయింది. ద్రవ్యలోటును 5.3 శాతానికి కట్టడి చేయాలన్న
కేంద్రం లక్ష్యం... స్పెక్ట్రం వేలం వైఫల్యం కారణంగా సాధ్యం కాకపోవచ్చని
పరిశీలకులు అంటున్నారు.
ఖజానాకు వచ్చేది నిల్...! 2008లో
స్పెక్ట్రం లెసైన్స్‌లు పొందిన కంపెనీలు సుప్రీం తీర్పుతో వాటిని కోల్పోయిన
కారణంగా... వాటికి లెసైన్స్ ఫీజును వెనక్కి ఇచ్చేయనున్నట్లు కేంద్రం
ఇదివరకే ప్రకటించింది. లేదంటే ఇప్పుడు తాజా వేలంలో పాల్గొనే వాటికి
బిడ్డింగ్‌లో గెలిచిన ధరమేరకు సర్దుబాటు చేస్తామని కూడా చెప్పింది. వేలంలో
రూ.10,000 కోట్లకు లోపే రావడంతో... లెసైన్స్ ఫీజును ఇందులోంచి తీసేస్తే
ఖజానాకు నికరంగా సమకూరిందేమీ లేనట్టే లెక్క. దేశవ్యాప్త స్పెక్ట్రంకు
నిర్ణయించిన రూ.14,000 కోట్ల బేస్ ధరలో 40 శాతం వాటా మెట్రో నగరాలైన
ఢిల్లీ, ముంబైలదే. దీంతో ఈ రెండు సర్కిళ్లకు ఒక్క కంపెనీ కూడా బిడ్డింగ్
చేయకపోవడం గమనార్హం. ఇక చాలా వరకూ సర్కిళ్లలో బేస్ ధరకు కాస్త అటూఇటూగానే
బిడ్డింగ్ జరిగినట్లు పరిశ్రమ సమాచారం.