Wednesday, November 7, 2012

డిసెంబర్‌కల్లా 51కి రూపాయి

ఇటీవలి కాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ మళ్లీ పతనబాట పట్టినప్పటికీ... డిసెంబర్ చివరికల్లా 51 స్థాయికి పుంజుకునే అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్(బీఓఎఫ్‌ఏ) ఒక నివేదికలో పేర్కొంది. భారత్ వద్దనున్న అధిక ఫారెక్స్ నిల్వలు రూపాయి విలువ రికవరీకి కీలకం కానుందని తెలిపింది. అయితే, రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) జోక్యం చేసుకోనంతవరకూ... 50 స్థాయికి మించి బలపడటం సాధ్యంకాకపోవచ్చని కూడా నివేదిక అభిప్రాయపడింది.


ప్రస్తుతం రూపాయి మారకం విలువ రెండు నెలల కనిష్ట స్థాయిలో 54.70 వద్ద కదలాడుతున్న సంగతి తెలిసిందే. 2008 మధ్యకాలం నుంచి ఆర్‌బీఐ విక్రయించిన 65 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలను తిరిగి చేజిక్కించుకుంటే తప్ప... డాలరుతో రూపాయి మారకం 50 పైకి ఎగబాకే అవకాశాల్లేవనేది బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా. గతేడాది ఆగస్టు నుంచి భారీగా పడిపోవడం, తిరిగి అంతేవేగంగా పుంజుకోవడం... ఇలా రూపాయి తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్న సంగతి తెలిసిందే. 2011 సెప్టెంబర్ నుంచి చూస్తే... 18.5 శాతం పతనమైంది. బ్రెజిల్ కరెన్సీ తర్వాత అత్యంత దారుణంగా క్షీణించింది రూపాయే కావడం గమనార్హం.