Monday, November 5, 2012

బంగారం హ్యాట్రిక్... వరుసగా మూడేళ్లలో స్టాక్ మార్కెట్‌కన్నా మంచి రాబడులు

  బంగారం హ్యాట్రిక్
వరుసగా మూడేళ్లలో స్టాక్ మార్కెట్‌కన్నా మంచి రాబడులు


న్యూఢిల్లీ , నవంబర్ 4 : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఏ రోజున కరిగిపోతుందో, ఏ రోజున పెరుగుతుందో కచ్చితంగా చెప్పడం కష్టమే. ఒక రోజున కోటీశ్వరుడిగా ఉన్న ఇన్వెస్టరు మరో రోజున బికారిగా మారి రోడ్డుపై పడిన తరుణాలు స్టాక్ మార్కెట్లో సర్వసాధారణం. కానీ బంగారాన్ని నమ్ముకున్న వారికి ఇలాంటి పరిస్థితి ఉండదు. ఎంతో కొంత ధర తగ్గినా నష్టం పెద్దగా ఉండదు. అయితే గణాంకాలను చూస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల కన్నా బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారి సంపదే విపరీతంగా పెరిగిపోయింది. గడచిన మూడేళ్లకాలంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ ఇన్వెస్టర్లను కుబేరులుగా మార్చాయి. వరుస లాభాలు తెచ్చిన పసిడి ఇన్వెస్టర్లు హ్యాట్రిక్ కొట్టేలా చేశాయి.

ఈ దీపావళికి కూడా బంగారం ఇంకా పెరుగుతుందన్న అంచనాలున్నాయి. గత ఏడాది దీపావళితో పోల్చితే బంగారంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంపద 15 శాతం పెరిగింది. ఇది స్టాక్ మార్కెట్ పెట్టుబడులకన్నా ఎక్కువే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా పొందిన మాదిరిగా 8.5 శాతం రాబడిని పొందగలిగారు. గత దీపావళి సీజన్‌లో 26,700 రూపాయలున్న పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 30,700 రూపాయల స్థాయిలో ఉంది. అప్పుడు 10 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడదని 11.50 లక్షల రూపాయలకు పెరిగేది. వచ్చే దీపావళి వరకు ధర పెరిగితే రాబడి ఇంకా వృద్ధి చెందుతుంది.

ఈ దీపావళికి బంగారం ధర 32,000 రూపాయలకు ఎగబాకే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. నవంబర్ 12న దంతేరస్, 13న దీపావళి ఉన్న నేపథ్యంలో అమ్మకాలు జోరందుకుంటాయని అంటున్నారు. స్టాక్ మార్కెట్ విషయానికొస్తే.. గత దీపావళప్పుడు సెన్సెక్స్ 17300 పాయింట్ల స్థాయిలో ఉంది.

గత శుక్రవారంనాడు సెన్సెక్స్ 18755 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్లో 10 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పుడది 10.85 లక్షల రూపాయలయి ఉండేది. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లను అదుకున్నది బంగారమే. 2007, 2008 దీపావళికి ఇన్వెస్టర్ల సంపదంతా కరిగిపోయింది. కానీ 2009లో స్టాక్ మార్కెట్ మంచి లాభాలను తెచ్చి పెట్టింది.

దంతేరస్ అమ్మకాల్లో 40 శాతం వృద్ధి!

బంగారం ధరలు అధిక స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ ధరలు డిమాండ్‌ను ఎంత మాత్రం ప్రభావితం చేయబోవని అంటున్నారు బంగారం వ్యాపారులు. దంతేరస్‌ను దృష్టిలో ఉంచుకుని వారు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దంతేరస్‌ను హిందువులు శుభ దినంగా భావిస్తారు. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే సిరిసంపదలు కలిసివస్తాయని విశ్వసిస్తారు. కాబట్టి ధర ఎంత ఉన్నా ఈ రోజున వినియోగదారులు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తారని వ్యాపారులు అంటున్నారు.

ఫలితంగా దంతేరస్ అమ్మకాలు 35-40 శాతం వృద్ధి చెందే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. దీపావళి తరువాత వచ్చే పెళ్లిళ్ల సీజన్‌లో అమ్మకాలు ఇంకా జోరందుకుంటాయని గీతాంజలి గ్రూప్ చైర్మన్ ఎండి మెహుల్ చోక్రి తెలిపారు. ధరలు అధిక స్థాయిలో ఉన్నందు వల్ల కస్టమర్ల ధోరణి కూడా మారుతోందని ఆయన అంటున్నారు. తక్కువ బరువున్న ఆభరణాలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని, దీని వల్ల వారిపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.

ఇక బంగారు నాణాలకు గిరాకీ బాగా పుంజుకుందని, ఏడాది కాలంలో వీటికి డిమాండ్ 35-40 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. బంగారం ధరలు పెరగడం వల్ల తక్కువ బరువు ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని మరో నగల వ్యాపారి తెలిపారు. వచ్చే పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొంత మంది కస్టమర్లు ఇప్పటి నుంచే కొనుగోళ్లు జరుపుతున్నారని చెప్పారు. పండగల సీజన్‌లో అమ్మకాలు బాగా పెరుగుతాయి. ఇదే సమయంలో ధరలు కూడా పెరగడానికి ఆస్కారం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి డైరెక్టర్ (ఇన్వెస్ట్‌మెంట్) అమ్రేష్ ఆచార్య తెలిపారు.

ఇటీవలి కాలంలో బంగారం ధరలు దిగిరావడం మొదలైంది. ఇదే ధోరణి కొనసాగినా, ప్రస్తుత స్థాయిలోనే ధర ఉన్నా డిమాండ్ విపరీతంగా ఉండే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ఇక బంగారం అమ్మకాలు కేవలం జువెలరీ దుకాణాలకే పరిమితం కావడం లేదు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా పసిడి నాణాలను విక్రయిస్తున్నారు. గత ఏడాది 125 కిలోల బంగారు నాణాలను బ్యాంకులు విక్రయించినట్టు కోటక్ మహీంద్రా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ కపూర్ తెలిపారు. ఈ ఏడాదిలో కనీసం 20 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. పండగల సీజన్‌లో బంగారం ధర 35,500-31,000 రూపాయల స్థాయిలో ఉండవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ హెడ్ (కమోటిడీస్) నవీన్ మాథుర్ అంచనా వేస్తున్నారు.

25 రోజులు వజ్రాల యూనిట్లకు సెలవు
గుజరాత్‌లోని వజ్రాల కటింగ్, పాలిషింగ్ యూనిట్లు 20 నుంచి 25 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. సాధారణంగా ఈ సీజన్‌లో పరిశ్రమలకు సెలవులుంటాయని సూరత్ డైమండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలిపారు. సోమవారంనుంచి నాలుగు వేలకు పైగా డైమండ్ యూనిట్లలో పనులు జరగవు.

డిసెంబర్ 1వ తేదీ నుంచి మళ్లీ యూనిట్లు ప్రారంభం అవుతాయి. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం. గుజరాత్‌లోని వజ్రాల పరిశ్రమ ప్రపంచ ప్రాసెస్డ్ డైమండ్స్‌లో 72 శాతం వాటాను కలిగి ఉంది. భారత ఎగుమతుల్లో 80 శాతం ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇక్కడ సుమారు 6,547 డైమండ్ ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. వీటి ద్వారా దాదాపు ఏడు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

Courtesy: Andhra Jyothy