Tuesday, November 20, 2012

రెపో, రివర్స్ రెపో, CRR, SLR అంటే ఏంటి....?

రెపో రేటు అంటే ఏంటి....?
ప్రైవేట్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర రుణం తీసుకుంటాయి.. దీనికి ప్రైవేట్ బ్యాంక్ లు చెల్లించే వడ్డీని రెపో రేట్ అంటారు... రెపో రేటు పెంచడమంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకున్న రుణాల వడ్డీ రేటు పెంచడమన్న మాట.. దీంతో వడ్డీ భారం పెరగడంతో ప్రైవేట్ బ్యాంక్ లు... రిజర్వ్ బ్యాంక్ వద్ద రుణం తీసుకోక పోగా బకాయిలను తీర్చే ప్రయత్నం చేస్తాయి.. దీనికోసం తమ ఖాతాదారుల నుంచి వసూళ్లు మొదలు పెడతాయి.. ఫలితంగా సమాజంలో ఉన్న ద్రవ్యం రిజర్వ్ బ్యాంక్ ఖజానాకు చేరుతుంది..

రివర్స్ రెపో రేటు అంటే ఏంటి?

ప్రైవేటు బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు వద్ద కొంత ధనాన్ని డిపాజిట్ చేస్తాయి. ఈ ధనానికి ఆర్.బి.ఐ కొంత వడ్డీ చెల్లిస్తుంది. దీన్నే రివర్స్ రెపో అంటారు. ఈ రేటు కూడా కూడా పెంచడంతో.. ప్రైవేట్ బ్యాంకులు తమ వద్దనున్న నిల్వలను ఆర్.బి.ఐ లో డిపాజిట్ చేసి అధిక వడ్డీ పొందే ప్రయత్నం చేస్తాయి. దీనికోసం కూడా ఖాతా దారుల వద్ద నుంచి డబ్బు వసూలు చేసే అవకాశం ఉంది.. ఈ

CRR, SLR అర్దం ఏమిటీ..?


సాధారణంగా ఎవరైతే మనీకి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారో వారు క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచుటరీ లిక్విడిటీ రేషియోల గురించి వినే ఉంటారు. ఈ రెండు పదాలను అప్పుడప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానాన్ని ప్రతిపాదించేటప్పుడు వాడుతూ ఉంటుంది. ఇప్పడు ఈ రెండింటి గురించి తెలుసుకుందాం.

క్యాష్ రిజర్వ్ రేషియో (CRR): బ్యాంకులు కొంత రేషియో సొమ్ముని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచుతాయన్నమాట. ఇలా ఉంచడం ద్వారా బ్యాంకు పరపతి సురక్షితమవ్వడమే కాకుండా, బ్యాంకుల నుంచి అధిక డబ్బు బయటకు హరించబడకుండా మౌలికంగా కాపాడబడుతుంది. ఉదాహారణకు మీరు బ్యాంకులో రూ 100ను డిపాజిట్ చేశారని అనుకుందాం. మీరు దాచిన రూ 100 మొత్తాన్ని బ్యాంకు రుణ మంజూరులకు లేదా పెట్టుబడిలకు ఉపయోగించదు. ఇందులో కొంత మొత్తాన్ని క్యాష్ రూపంలో ఉంచి, మిగిలిన భాగాన్ని పెట్టుబడికి లేదా రుణ మంజూరికి ఉపయోగిస్తుంది. బ్యాంక్ ఉంచిన ఆ తక్కువ రేషియోని క్యాష్ రిజర్వ్ రేషియో అని పిలుస్తారు.

బ్యాంకు తన డిపాజిట్‌ను రూ 100 పెంచి, క్యాష్ రిజర్వ్ రేషియోని 9 శాతంగా ఉంచినట్లేతే, రూ 9 రూపాయలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచి, మిగిలిన రూ 91లను పెట్టుబడి లేదా రుణ మంజూరులకు ఉపయోగిస్తుంది. ఎక్కువ క్యాష్ రిజర్వ్ రేషియో గనుక ఉన్నట్లేతే బ్యాంకులు తక్కువ డబ్బుని పెట్టుబడి లేదా రుణ మంజూరుకి ఉపయోగిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణం అరికట్టేందుకు మరియు మార్కెట్లో అధిక లిక్విడిటీ నియంత్రించడానికి ఈ సాధనాన్ని ఉపయోగిస్తుంది.

స్టాచుటరీ లిక్విడిటీ రేషియో (SLR): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపేనా డబ్బుని ఉంచడం ఒక విధానమైతే, ప్రతి వ్యాపార రోజు చివరిలో బ్యాంకులు నికర డిమాండ్ ఆధారంగా బంగారం, నగదు, ప్రభుత్వ పత్రాలు రూపంలో, ఆమోదం పొందిన ఇతర సెక్యూరిటీలను తమ వద్ద కొనసాగించడం ఎంతైనా అవసరం. ఈ తక్కువ పర్సంటేజిని స్టాచుటరీ లిక్విడిటీ రేషియో అంటారు.

ఉదాహారణకు మీరు బ్యాంకులో రూ 100ను డిపాజిట్ చేశారని అనుకుందాం. క్యాష్ రిజర్వ్ నిష్పత్తి 9 శాతం కాగా, స్టాచుటరీ లిక్విడిటీ నిష్పత్తి 11 శాతం ఐతే బ్యాంకులు పెట్టుబడి నిమిత్తం 100-9-11= రూ 80/- మాత్రమే ఉపయోగిస్తుంది.

(తెలుగు వన్ఇండియా)