Thursday, November 29, 2012

అమలు లోకి రానున్న " ప్రాపర్టీ టైటిల్ సర్టిఫికేషన్ సిస్టమ్ "

కష్టపడి.. చెమటోడ్చి.. రూపాయి రూపాయి కూడబెట్టి మీరు భూమి కొనుక్కున్నారు. లక్షలు పోసి కొనుక్కున్న భూమికి వేలు ఖర్చు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ ఆనందం కొన్ని రోజులు కూడా మిగలకుండానే.. ఎవరో వస్తారు. ఆ భూమి తమదంటారు. అప్పటికే తాము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెబుతారు. అదే ఆస్తిపై డాక్యుమెంట్లు కూడా తెచ్చే అవకాశం ఉంది. భూ వివాదం కోర్టుకెక్కుతుంది. ఏళ్లతరబడి నానుతుంది. మరి దీనికి పరిష్కారం..?
ఆక్రమణలతోపాటు ఒకే భూమికి రెండు మూడుసార్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్న ప్రబుద్ధులతో కొనుగోలుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. మీ పేరిట రిజిస్టర్ అయిన భూమి, ఆస్తులకు ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం ఓ ఒప్పందంగానే పేర్కొంటోంది తప్ప దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఎవరు హక్కుదారో!? ఎవరు అసలు వ్యక్తో ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. ముక్కుపిండి స్టాంపు డ్యూటీని వసూలు చేసుకుంటున్నా.. ‘ఈ భూమి మీదే’ అని ఇప్పటి వరకు ప్రభుత్వం సర్టిఫై చేయడం లేదు. ఫలితంగా.. రోజు రోజుకూ భూ వివాదాలూ పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే, ఆస్తులకు గ్యారెంటీ కల్పించే హక్కు కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. పట్టణాల్లో ఈ హక్కు కల్పించడం అత్యవసరమని కూడా కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది నుంచే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సమాయత్తమైంది. అదే.. ‘ప్రాపర్టీ టైటిల్ సర్టిఫికేషన్ సిస్టమ్’! ఈ పథకం కింద మీ ఆస్తులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. దీంతో, భవిష్యత్తులో భూ తగాదాలు, ఆక్రమణలు తగ్గుముఖం పట్టనున్నాయి.
‘ప్రాపర్టీ టైటిల్ సర్టిఫికేషన్ సిస్టమ్’ను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తేనుంది. ఇందులో భాగంగా, సదరు ఆస్తి ఎవరిదనే విషయాన్ని గుర్తించి, రిజిస్ట్రేషన్ సమయంలోనే ప్రభుత్వం సొంతదారుకు ప్రాపర్టీ వెరిఫికేషన్ సర్టిఫికెట్‌ను ఇస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్‌యూఆర్ఎం) సంస్కరణల్లో భాగంగా ఉన్న ఈ నిబంధనను అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని సూచించే అవకాశం ఉంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఖాస్రా/ఖాటాని, గిర్‌ద్వారీ విధానం పట్టణాల్లో లేకపోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.
ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం ‘గ్యారంటీ ల్యాండ్ టైటిల్’ స్కీంను ప్రవేశపెట్టింది. ఇలాంటి పథకమే కొన్ని ఇతర దేశాల్లో కూడా అమల్లో ఉంది. వాస్తవానికి, దేశ రాజధాని ఢిల్లీలో ప్రాపర్టీ టైటిలింగ్ సిస్టమ్ సరిగా లేనందున ప్రాపర్టీ మార్కెట్ లో అంతరం ఏర్పడిందని 2002లోనే ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ గుర్తించింది. దీనిపై ఒక కమిటీని నియమించి విదేశాలతోపాటు దేశంలో పలు చోట్ల అమల్లో ఉన్న టైటిలింగ్ విధానాలను అధ్యయనం చేసింది. అనేక సదస్సులు కూడా నిర్వహించింది.
ఈ నేపథ్యంలో, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు తయారు చేస్తున్న ప్రత్యేక బిల్లు కోసం డ్రాఫ్ట్ కమిటీని కూడా గతంలోనే నియమించింది. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత, తప్పుడు సాక్ష్యాలు సమర్పించిన వారికి శిక్షలు కూడా భారీగానే ఉండనున్నాయి. రూ.2 లక్షల వరకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

ఇవీ ప్రయోజనాలు:

ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎవరి ఆస్తి ఎవరిదో ప్రభుత్వమే పక్కాగా చెబుతుంది. ప్రభుత్వమే ఇచ్చే టైటిల్ సర్టిఫికేషన్‌తో ఇదే ఆస్తిపై ఇతరులు వివాదాలకు దిగడం, కోర్టులకు వెళ్లడాన్ని అరికట్టవచ్చు. భూ వివాదాలు, ఆక్రమణలు తగ్గిపోతాయి. నకిలీ డాక్యుమెంట్‌లకు చెక్ పడుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు సులువవుతుంది. రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత పక్కాగా అమలు చేయవచ్చు. క్రయ, విక్రయ లావాదేవీలు వేగంగా, సులభతరం కావడంతో పాటు భద్రత కూడా ఉంటుంది. ఆస్తి సొంతదారు ఎవరో స్పష్టంగా ఉంటున్నందున పన్నుల వసూలు పెరుగుతుంది   
Courtesy- Andhrajyothy.