Friday, November 9, 2012

కింగ్‌ఫిషర్.. అకౌంటింగ్ స్కామ్?

క్యూ2లో రూ. 754 కోట్ల నికర నష్టం; 61% అప్
అకౌంటింగ్‌పై కంపెనీ ఆడిటర్ల సందేహాలు...
సరైన ప్రమాణాలు పాటిస్తే... నష్టం రూ.1,032 కోట్ల వరకూ ఉండేదని నివేదిక


ముంబై: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లోనూ ‘సత్యం’ తరహా అకౌంటింగ్ మోసాలు జరుగుతున్నాయా? కంపెనీ ఆడిటర్ల సందేహాలు చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. సాధారణంగా ఆమోదనీయమైన అకౌంటింగ్ ప్రమాణాలను గనుక కింగ్‌ఫిషర్ పాటించి ఉంటే... క్యూ2 నష్టం మరింత భారీగా రూ.1,032 కోట్లుగా ఉండేదని(కంపెనీ ప్రకటించింది రూ.754 కోట్లు) ఫలితాలపై సమర్పించిన సమీక్షా నివేదికలో ఆడిటర్లు పేర్కొన్నారు. దీంతో ఖాతాల్లో అవకతవకలు జరిగిఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో లాభాలను పెంచిచూపితే... కింగ్‌ఫిషర్‌లో నష్టాలను తగ్గించి చూపుతున్నారన్న వాదనలు తెరపైకి వస్తుండటం గమనార్హం.

23 క్వార్టర్లు... నాన్‌స్టాప్ నష్టాలు...

ఇప్పటికే పీకల్లోతు అప్పులు, లెసైన్స్ సస్పెన్షన్‌తో మూలన కూర్చున్న కింగ్‌ఫిషర్... మరింత నష్టాల ఊబిలోకి కూరుకుపోతోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్, క్యూ2)లో కంపెనీ నికర నష్టం 61% ఎగబాకి రూ.754 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నష్టం రూ.469 కోట్లు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన ఈ నష్టజాతక ఎయిర్‌లైన్స్... వరుసగా... 23వ క్వార్టర్‌లోనూ నష్టాలను చవిచూడటం గమనార్హం. వెరసి సెప్టెంబర్ చివరి నాటికి కంపెనీ మొత్తం నష్టాలు దాదాపు 9,000 కోట్లకు పేరుకుపోయాయి. కంపెనీ క్యూ2 ఆదాయం కూడా ఏకంగా 87 శాతం పడిపోయి రూ.200 కోట్లుగా మాత్రమే నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,553 కోట్లు. 2006లో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఒక్కసారి మాత్రమే కంపెనీ రూ.9.6 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అయితే, ఇప్పటిదాకా పూర్తి ఏడాదికి ఎన్నడూ లాభాలను నమోదు చేయకపోవడం గమనార్హం.

పునరుద్ధరణకు కసరత్తు...
కార్యకలాపాలకు ఆటంకం, భారీ రుణ భారం, అధిక పన్ను చెల్లింపులు, నిర్వహణ-పునర్‌వ్యవస్థీకరణ వ్యయాలు వంటివన్నీ నష్టాలు మరింత పెరిగిపోయేలా చేస్తున్నాయని కింగ్‌ఫిషర్ పేర్కొంది. కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు వీలుగా సమగ్ర ప్రణాళికపై కసరత్తు చేస్తున్నామని కూడా తెలిపింది. బ్యాంకర్లు, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్‌ఏవియేషన్(డీజీసీఏ)కు తమ పునరుద్ధరణ ప్రణాళికను సమర్పిస్తామని, త్వరలోనే కార్యకలాపాలను పునఃప్రారంభించగలమని కూడా కంపెనీ పేర్కొంది. కాగా, సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించడానికి కింగ్‌ఫిషర్‌కు నిర్దిష్ట గడువేమీ నిర్దేశించలేదని డీజీసీఏ చీఫ్ అరుణ్ మిశ్రా గురువారం హైదరాబాద్‌లో చెప్పారు. త్వరలో ప్రణాళికను ఇస్తామని కంపెనీ చెప్పిందని, సంబంధిత ప్రతిపాదనల్లోని అంశాలన్నీ పరిశీలించాకే లెసైన్స్ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరోపక్క, రూ.7,000 కోట్లకు పైగానే రుణాలిచ్చిన బ్యాంకులు కూడా ప్రమోటర్లు మూలధనాన్ని సమకూరిస్తేనే విమానాలు నడిచేపరిస్థితి ఉందని, తాజాగా మరిన్ని రుణాలిచ్చే సమస్యేలేదని తేల్చిచెప్పాయి కూడా.

డైజియోకు యునెటైడ్ స్పిరిట్స్‌లో వాటా ?
యునెటైడ్ స్పిరిట్స్‌లో వాటా విక్రయానికి ప్రపంచ లిక్కర్ తయారీ దిగ్గజం డయాజియోతో విజయ్‌మాల్యా నేతృత్వంలోని యూబీ గ్రూప్ ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యునెటైడ్ స్పిరిట్స్‌లో ఎంత పరిమాణంలో వాటా విక్రయాలు జరుగుతున్నాయి, దీని విలువ ఎంత వంటి అంశాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు వచ్చిన వార్తలపై స్పందించడానికి యూబీ గ్రూప్ ప్రతినిధి నిరాకరించారు. అయితే 51 శాతం వాటా అమ్మకాలకు అవగాహన కుదిరిందని, ఈ డీల్ విలువ 1-2 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండవచ్చని తెలుస్తోంది.